15, జనవరి 2015, గురువారం

సంక్రాతి గంగిరెద్దుల వాళ్ళని దయతో ఆదరించండి







తే. రంగురంగుల బొంతల గంగిరెద్దు
ముంగిళుల ముందు విన్యాసములను చేయు
పండువిది వచ్చె తోచిన పగిది రూక
లిచ్చి పంపుడీ మనసార మెచ్చి మీరు

తే. చెప్పులైనను నోచరు జీర్ణవస్త్ర
ధారులీ మేళగాండ్రు మీ దయకు పాత్రు
లాదరించుడు మనసార నయ్యలార
అమ్మలార సురవిటపి కొమ్మలార

ఉ. వండిన పిండివంటలను వారికి పెట్టుడు మానుడమ్మ ఆ
యెండిన డొక్కలం గనియొ కించుక బువ్వననుగ్రహించరే
పండువగాదె వారికిని భవ్యమనస్కులు పాతదైననుం
కండువ నయ్యగారి దయగా నిడరే పరమాత్మ మెచ్చగన్

కం. ఈ యేడు వచ్చినారని

పై యేటికి వత్తురనుచు భావింపగ రాద
న్యాయంబుగ నేటేటికి
మాయంబగుచుండి రనెడు మాట దలచుడీ

కం. వీరికి తిండిలేదు మరి వీరల బిడ్డలు పాపలందరున్
నోరు వచింపలేని గతి నుందురు ముద్దకు నోచకుందురున్
వారిని చేరదీయగను వారికి బళ్ళను విద్యనేర్పగన్
కోరవుగా ప్రభుత్వములు కొంచెపువారల పెత్తనంబులన్

కం. అయగారని యమ్మాయని
నయమున ప్రార్థించి మ్రొక్కినారని యైనన్
దయచూపుడు మీరైనను
జయమిచ్చును మీరు చూపు జాలియె మీకున్