1, జనవరి 2015, గురువారం

అందుకే ఇది శుభవత్సరం కావాలి







వస్తూనే ఉంటాయి సంవత్సరాలు
వస్తూపోతుంటాయి కష్టసుఖాలు 


ఊరంతా వాడంతా గడబిడ తప్ప
ఊడిపడిందేమీ లేదు నిన్నటిరాత్రి

ఋతుచక్రంలో మార్పేదీ రాలేదు
కొత్త ఋతువు రాక కనబడలేదు

జన్మలో శివరాత్రిజాగరణ చేయని
ఈ జనం రాత్రంతా నిదురమాని
ఎంత ఎదురుచూసారో అర్థరాత్రి
నూత్నహూణవత్సరం రాక కోసం

ప్రతిసారీ పోయినేడు పీడాకారమే
ప్రతిసారీ ఈరోజు కెదురుచూడ్డమే

ఈసారైనా కోరిన శుభపరంపరలు
కొత్తసంవత్సరం కొసరి వడ్డించేనా

ఈసారైనా కాసిని శాంతిసౌఖ్యాల్ని
కొత్తసంవత్సరం కొసరి వడ్డించేనా

రాజకీయరణాంగణంగా మారిన
తెలుగింటిప్రాగణంలో నే కోరిన
శాంతివనం మొలకెత్తి పూచేనా

సకల రాజకీయశనిగ్రహసాహస్రిపై
ఇకనైనా కాలపు కొరడా ఎగిరేనా

ఈసారైనా ఈ ఎదురుచూపులు
ఫలించేనా కాలం కరుణించేనా
మరోసారి ఎదురుచూడ మనేనా

కోటి ఆశలతో ఎదురుచూడటం
అలవాటైపోయిన నరప్రపంచం
ప్రతిసంవత్సరానికి ఆశాజ్యోతుల
కాంతిపుంజాల కళకళల మధ్య
స్వాగితించటం చక్కని రివాజు

శుభకామన మాకు తీరని మోజు
కాదని ఈసారైనా కాలం చెప్పాలి
అందుకే ఇది శుభవత్సరం కావాలి