26, నవంబర్ 2014, బుధవారం

పల్లెప్రపంచంలో తెలుగు భాష పైన ప్రశ్న - నా అభిప్రాయాలు

ఈ రోజున పల్లెప్రపంచం పోర్టల్ బ్లాగులో  వచ్చిన ప్రశ్న  అర్ధం కావడమా!? భాషా ప్రావీణ్యమా!? ఏది ముఖ్యం!? వాడుక భాషవల్ల గ్రాంధికానికి సమస్యలు వస్తున్నాయా!? అనేదానికి  రెండువ్యాఖ్యలను మధ్యాహ్నం స్ప్వల్పవ్యవధిలో ఉంచాను. ఆ పిదప మరికొంత చర్చ జరిగింది. నా సమాధానంగా క్రొత్తవ్యాఖ్య సుదీర్ఘం కావటంతో మొత్తం వ్యాఖ్యలు మూడింటినీ ఇక్కడ ఒక టపాగా చదువరుల సౌకర్యార్థం ఉంచాను.

మొదటి వ్యాఖ్య

ఇది రాజకీయసంబంధిత చర్చకాదన్న అవగాహనతో వ్రాస్తున్నాను. 

"ఇంగ్లీష్‌లో 26 అక్షరాలుంటే మనకు 56 అవసరమా? " అన్నది సరైన ప్రశ్న కాదని నా అభిప్రాయం. భాషలను కొన్ని విధాలుగా వర్గీకరించారు. అది భాషాశాస్త్రం. దాని గురించి కొంత అవగాహన ఉన్నప్పుడు దానికి సంబంధించిన చర్చ బాగుంటుంది - ముఖ్యంగా అవగాహన ఉన్నవారి మధ్యనే అది పరిమితమైనప్పుడు. ఎన్ని అక్షరలున్నాయీ? ఎంత తక్కువ అక్షరాలుంటే అంత గొప్ప భాషా వంటి పశ్నలు అశాస్త్రీయం.

వివిధ భాషావ్యాకరణాల మధ్య విచారణకూడా భాషాశాస్త్రపరమైనదే.

తెలుగు వ్యాకరణం అన్నది కావ్యాలకు ప్రశస్తి సంప్రదాయకవిత్వమూ బాగా ఉన్నరోజుల్లో భాషాస్వరూపానికి సంబంధించిన లక్షణాలను వివరించేదిగా ఉంది. వ్యావహారిక భాషకు సరైన వ్యాకరణం లేదు. ఒకటో రెండో అలాంటి ప్రయత్నాలు ఉన్నా వాటికి అంత ప్రశస్తి రాలేదు. వ్యావహారిక భాష అనేది వివిధ ప్రాంతాల్లో వివిధంగా ఉంటుంది కాబట్టి ఒక వ్యాకరణమూ, ఒక పదజలమూ సహాయంతో నిర్వచించటం కష్టంగా ఉంది. ఇప్పుడు వాడుతున్న భాషను శిష్టవ్యావహారికం అనేవారు నిన్నటిదాకా. ఉన్న ఫణంగా దీని విస్తారంగా అన్నిప్రాంతాలకూ అన్వయింపజేయటం కూడ కొన్ని వివాదాలకు దారితీయవచ్చును. ఇది కొంచెం క్లిష్టమైన పరిస్థితి.

పాఠ్యగ్రంధాల్లో రశ్మ్యుద్గారత అనే పదం చూసి అసలు ఎందరికి ఇది నోరు తిరుగుతుందా అని నాడే మా బోంట్లకు అనుమానం వచ్చింది. ఇలాంటి వింతమాటలు ఇబ్బంది కలిగించాయన్నది వాస్తవం. ఇప్పుడు సెల్ ఫోన్ అన్నదానికి చరవాణి అన్న మాట చాలా మందే వాడుతున్నారు. అది కొందరికి నవ్వు కలిగించవచ్చును. ఆలోచించండి - తమిళులు బస్సు అన్న దానికీ తమిళ పదం తయారు చేసుకుని వాడుతున్నారట. మనకి మన తెలుగుమీదే చులకన భావం కాబట్టి ఇంగ్లీయు పదాలే బాగుంటాయి. అన్నం అనటానికి బదులు రైస్ అనటం అందంగా ఉండే జాతి మనది.

కొత్తపదాలు బాగున్నా మన తెలుగుదనం లోపించిన తెలుగువారికి కృత్రిమంగానే తోస్తాయి. ఏనుగు అంటే మా తమ్ముడి కూతురికి అర్థం కాలేదు. ఎలిఫెంట్ అని చెప్పాక, మరి ఏనుగంటావేం? అని అడిగింది! అమ్మా అనటమే మనకు నచ్చని తరాలలో తెలుగు అన్నదే కృత్రిమంగా ఉన్న రోజుల్లో ఉన్నాం మనం.

తెలుగు పదాలు అజంతాలు, అచ్చులతో పూర్తయే పొట్టిపదాలు చాలావరకు. సంస్కృతంలో ధాతుజన్యమైన పదాలు ఒకదానితో ఒకటి అతుకు పెట్టి ఏకసమాసం చేయటానికి వీలుగా ఉంటాయి. భాషా లక్షణాలలో బేధమే కారణం.

తెలుగుపదనిర్మాణంలో లోపాలేమీ లేవు. లేని బాగులు మనం చేయలేము. భాష లక్షణం ఎలా ఉంటుందో చెప్పాను కదా తెలుగులో. అందువలన ఒకటికంటే హెచ్చు పదాలను కలిపి చెప్పవలసి వస్తే ఏకపదం చేయటం సంస్కృరంలోనే సుళువు కాబట్టే కొత్తపదాల సృష్టికి సంస్కృతం ఉపయోగిస్తోంది. 

భాషను ముందుకు తీసుకొని పోయేది జనమే. ప్రభుత్వాలు కానేకాదు. ముందు తెలుగువారం తెలుగులో మాట్లాడటం సిగ్గు అనుకోవటం భేషజం వదిలించుకోవాలి. కొత్తతరాలవారికి తెలుగు ఎవరూ నేర్పనిదే ఎలా వస్తుంది? ఇంటా బయట గొప్పకోసం ఇంగ్లీషు. ఇంట్లో అమ్మా నాన్నా కూడా తెలుగువారై ఎక్కడి పిల్లలకు తెలుగు పట్టుబడుతుందో అన్న భయంతో, ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటూ ఉంటే, ఇంక పిల్లతరాలకు తెలుగు పరాయి భాషకాదా? కావుకావు మనలేని కాకి ఉంటుందా అన్నాడు జంఘాలశాస్త్రి సాక్షివ్యాసాలలో. తెలుగులో మాట్లాడినందుకు పిల్లలను శిక్షించే బడులే కాదు తల్లిదండ్రుల్నీ చూసాను నేను.

ముందు జనానికి తెలుగులో మాట్లాడటం తప్పు కాదు తప్పనిసరి ఐన బాధ్యత అని అవగాహన కల్పించవలసి ఉంది. అది జరిగితే, క్రమంగా మంచి మార్పులు అవే వస్తాయి.

రెండవవ్యాఖ్య

"ముందు ఇంగ్లీష్ కన్నా మాదే గొప్ప అన్న అహంభావం వదిలెయ్యాలి." అన్నారు ఒకరు.
వినదగు నెవ్వరు చెప్పిన అన్నారు. కాబట్టి ఈ మాటా ఆలకించటమైనది.

ప్రస్తుతం సమస్య "మాతృభాషకన్నా ఇంగ్లీషు గొప్పభాష అన్న భ్రమ కారణంగా ఇబ్బడిముబ్బడి అవుతున్న ఇబ్బందులు". మా అమ్మ మంచిది అనుకోవటం ఎన్నడూ అహంకారం కాదు. మా అమ్మకంటే ప్రక్కింటి వాళ్ళమ్మే గొప్పది అని అనుకోవటం మంచి సంస్కారం కూడా కాదు. ఆవలి వారి అమ్మకన్నా మా అమ్మ ఎక్కువ చరువుకొనక పోయినా, ఎక్కువ అందంగా లేకపోయినా, ఎక్కువ ముసలిది ఐనా, రోగిష్టిది ఐనా, మంచి మాటతీరు లేనిది ఐనా, సామాజికంగా గుర్తింపు లేనిది ఐనా, .... ఇంకా సవాలక్ష కారణాలున్నా, మా అమ్మ మంచిది అని అందరూ అనుకుంటారు. బయటివారు పోలికలు తీసుకొని వచ్చి, అలా మా అమ్మ మంచిది అనుకోవటం అహంకారం అంటే అది వారి అమాయకత్వమా, అజ్ఞానమా, దురుసుతనమా, మరొకటా అన్నది ఎవరికి వారు వేరువేరుగా అనుకున్నా, అలా అనటాన్ని హర్షించలేరు.

ఈ మధ్య కొందరు భాషను ఒక పనిముట్టు అని ప్రచారం చేస్తున్నారు. నాకు తెలిసి భాష అమ్మే!

మూడవ వ్యాఖ్య

కొన్ని కొన్ని విషయాలు ప్రస్తావించటానికి ఈ వ్యాఖ్య పరిమితం. వాదం కోసం వాదాన్ని పెంచటం ఈ వ్యాఖ్య ఉద్దేశం కాదు.

1.   యూనికోండ్ తెలుగులో ఉన్న అక్షరాలన్నింటినీ ముద్రించుకొనే సౌకర్యం కలిగిస్తుంది.

2. ఎక్కువ ప్రచారంలో కనిపింఅని అక్షరాలు తీసివేయటం అంటూ ఆలోచించకండి దయచేసి. పాత పత్రాలను ఎక్కించేటప్పుడు అవి అవసరం అవుతాయి.

3.  అచ్చులన్నీ వ్రాయవచ్చును. ఋ ౠ ఌ ౡ అనే వాటితో సహా.

4.  హల్లులన్నీ వ్రాయవచ్చును ౘ ౙ అనే దంత్యాలతో సహా.

5.  రూపాయ గుర్తు కూడా అందుబాటులో ఉంది.

6.  ఐతే మీకు అందుబాటులో ఉన్న ఉపకరణాలు అన్ని అక్షరాలను సమకూర్చలేకపోవచ్చును. 

7.  లేదా మీ ఆపరేటింగ్ సిస్టమ్ తగిన యూనికోడ్ వెర్షన్‍ను అందించక పోవచ్చును.

8.  'భాష అనేది ఒక టూల్ మాత్రమే' అన్న భావన నాకు నచ్చదని ముందే మనవిచేసాను.  అన్నిభాషలలోను మహనీయులు జ్ఞానబోద చేసారు.  కాని అన్నిభాషలనుండీ మనం నేరుగా స్వీకరించలేము, ఇతరులు భాషాంతరీకరణం చేస్తేకాని. భాష ఒక జ్ఞానవాహిని. మాతృస్వరూపిణి.  పుట్టాక కొన్నాళ్ళు పాలిచ్చే టూల్ అమ్మ అనుకోవటం నా ఊహకు అందదు. అలాగే పరస్పర భావవినిమయానికే కాక జ్ఞాననిక్షేపణకూ భాష అనేది ఒక అనంతనిధి. కాబట్టి అటువంటి భాష ఒకటూల్ మాత్రమే అన్న భావన సబుబుకా దనుకుంటాను.

9. తెలుగుపదాల సంఖ్యను పెంచటానికి తాపత్రయం మంచిదే. అంతకన్నా ముందు తెలుగులో ఉన్న పదసంపద బాగా తెలుసుకోవాలు తెలుగుభాషపై అంత మక్కువ ఉన్నవారు.

10.  తెలుగుకు 56 అక్షరాలు ఎక్కువే అనుకునే వారితో నాకు వాదించను. కాని, మరొకసారి విన్నవించే ప్రయత్నం చేస్తాను. చీనీ‌భాషలో వేలాది పదచిత్రరూపాలు నేర్చుకోవలసి ఉంటుంది. జపనీస్ భాషలోనూ అంతే. కాని వారు అలాగే తమతమ భాషలను అంతర్జాతీయభాషలుగా తీర్చిదిద్దుకున్నారు. మనం మనకు అక్షరాలు ఎక్కువైపోవటం వలన తెలుగు అంతర్జాతీయ భాష కాలేకపోయిందన్నట్లుగా బాధపడుతున్నట్లు మాట్లాడుతున్నాం, ఒక పక్కన తెలుగులో పెదవి విప్పటమే నామోషీగా ప్రవర్తిస్తూ. ఇంగ్లీషులో Q అనే అక్షరం లేకపోతే కొంపేమీ మునిగిపోదు. కాని ఇంగ్లీషు తెలిసినవారూ, ఇంగీషు మాతృభాషగా ఉన్నవారూ ఎంతమంది ఈ అక్షరం అనవసరం అని భాషలోంచి తీసెయ్యండి అని అరుస్తున్నారు? 

11.  తెలుగులో కాని సంస్కృతంలో కాని ఒకేవిధంగా పలికే అక్షరాలు పునరావృతంగా లేనే లేవు. ఊష్మాలనబడే శ, ష, స, హ లను ఈ రోజుల్లో తెలుగు సరిగా తెలియని తరం సరిగ్గా ఉఛ్ఛరించకపోతే ఆ తప్పు భాషదా? శ ను ష లాగా పలకటం శుధ్ధతప్పు! తెలుగులో ఒకే రకం పలుకుబడి ఉన్న అక్షరాలూ అంటూ ఒక రాగం వినిపిస్తున్నవారు, ఇంగీషులో J, Z అనేవి సాదృశాక్షరాలుకావంటారా? Z ఎందుకన్న అనుమానం రావటం లేదా మీకు?

12.  సంస్కృతానికి ఉన్న సుళువులు తెలుగులో దించలేము. ఏ భాష వ్యక్తిత్వం ఆ భాషదే. మూలస్వరూపాన్ని మార్చటం కుదరదు. చిన్నయసూరిగారు కాని మరొక వయ్యాకరణి కాని వ్యాకరణం వ్రాసాకనే భాష అలా ప్రవర్తించటం జరగదు.  భాష ఎలా ప్రవర్తిస్తోందో దానిని సూత్రబధ్ధం చేయటమే వ్యాకరణం. ఉదా। వాడు + ఎక్కడ => వాడెక్కడ. అందరూ కలిపే అంటారు కదా? వ్యాకరణమూ అదే చెబుతుంది.

13.  ఏ భాషలోంచి ఐనా మరొక భాషలోకి తర్జుమా చేస్తే నూటికి నూరుపాళ్ళూ అలాగే ఉండదు. ఏ భాష పలుకుబడి దానిది. ఇంగీషు వాడు make hay while the Sun shines అంటే దానిని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని వ్రాయాలి మన నుడికారం కోసం. అలాగే అందరూ బియ్యాన్నే వండుతారు అన్నం కోసం, కాని అన్నవండాం అంటాం కాని బియ్యం వండాం అనం.

14.  ఒక భాష ప్రపంచభాష కావటానికి కారణాలు ఒకటి కంటే ఎక్కువగానే ఉంటాయి. నామావశిష్టం ఐపోయిన హీబ్రూ భాషని ఇజ్రాయిల్ కొన్ని దశాబ్దాల్లోనే అంతర్జాతీయస్థాయికి చేర్చింది. అంతా ఆ భాష మాట్లాడే వారి సంకల్పధృఢత్వంలో ఉంది.

15.  తెలుగుతోసహా  ఏ భాషలోనూ పదాలనూ పండితులు కనిపెట్టి ప్రజల్ని వాడమని ఒత్తిడి చేయలేదు. ముందు ప్రజావినియోగంలో నుండే పదాలు పండితవినియోగం లోనికి వస్తాయి. వాటికి వారు పరిణతి, విస్తృతి కల్పిస్తారు. ప్రజల్లో నుంది వచ్చిన పదాలకు కొత్తకూర్పులూ పండితులు వ్యాప్తి చేస్తారు.

ఈ సందర్భంలో ఇంతకంటే ఎక్కువగా వ్రాయవలసిన అవసరం పడదనే భావిస్తున్నాను.