20, నవంబర్ 2014, గురువారం

వ్యాఖ్యారంగ విమర్శనం - వ్యాసాలకు ఆహ్వానం!

వ్యాఖ్యారంగ విలోకనం అని లోగడ వ్రాసిన టపాకు ఇది కొనసాగింపుగా కొంచెం విస్తృతపరిధిలో చర్చ. ఈ సందర్భంగా మనం కొన్ని అవసరమైన ప్రశ్నలను గుర్తించి వాటికి సమాధానాలను అన్వేషిద్దాం. ఉదాహరణకు ఈ‌ క్రింద ఇచ్చిన ప్రశ్నలు చూడండి.

  • వ్యాఖ్యల ప్రయోజనం ఏమిటి?
  • వ్యాఖ్యలను వర్గీకరించటం ఎలా?
  • వ్యాఖ్యలు కాని వ్యాఖ్యలు ఉంటాయా? ఎలా?
  • వ్యాఖ్యల అవసరం బ్లాగర్లకు ఎంత మేరకు ఉంది?
  • వ్యాఖ్యల వాసి - రాశి తెలుగు బ్లాగుల విషయంలో ఎలా ఉంది?
  • వ్యాఖ్యలను వ్రాసే విషయంలో చదువరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
  • వ్యాఖ్యలకు వచ్చే ప్రతిస్పందనలను చదువరులు గమనించవలసిన అవసరం ఉందా?
  • వ్యాఖ్యలకు వచ్చే ప్రతిస్పందనలను చదువరులు గమనిస్తూ‌ఉంటం ఎలా?
  • వ్యాఖ్యలను ప్రకటించే విషయంలో బ్లాగర్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
  • వ్యాఖ్యలను చదివే విషయంలో చదువరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
  • వ్యాఖ్యలను ప్రదర్శించటంలో అగ్రగేటర్లు ఎటువంటి పధ్ధతులు పాటించవచ్చును?

నిజానికి ఈ‌ప్రశ్నలను చుడుతూ‌నేనే ఒక టపా కట్టి ప్రచురించాలని భావించాను. కాని ఆలోచించగా నాకు మరొక చక్కని మార్గం గోచరించింది.

ఈ సందర్భంగా బ్లాగర్లూ, వ్యాఖ్యాతలూ తమ అభిప్రాయాలతో ముందుకు వస్తే వాటిని ప్రచురించటమే నాకు తట్టిన ఆ చక్కని మార్గం. ఇది బాగుంటుందని నాకు అనిపించింది సరే, ఎలా అమలు చేయాలీ అనే విషయంలొ ఒక స్పష్టమైన విధివిదానాలు రూపొందించి మరీ ముందుకు వెళ్ళటం మంచిది అన్న సంగతి కూడా ఆలోచించి చెబుతున్నాను.


  1. ముఖ్యాంశం తెలుగు బ్లాగులూ - వ్యాఖ్యలూ‌ అన్నది. ఇతర అంశాల గురించి అభిప్రాయాలు వ్రాయవద్దు.
  2. పైన ఇచ్చినవి నమూనా ప్రశ్నలు మాత్రమే. మీరు వ్రాసే వ్యాసానికి శీర్షికను మీరే నిర్ణయించుకోండి.
  3. వ్యాసానికి ఇంత నిడివిలో ఉండాలీ అన్న నియమం ఏమీ‌ లేదు. వ్యాసకర్తలే ఆలోచించుకొని, వ్రాయాలి తగిన నిడివితో.
  4. వ్యాసాన్ని వ్యావహారికమైన తెలుగులోనే వ్రాసితీరాలి.  సందర్భోచితంగా అతిమితంగా ఇతరభాషాపదాలూ వాక్యాలూ సరే.
  5. వ్యాసంలో అవసరమైన మార్పులూ చేర్పులూ చేయవలసి రావచ్చు.  అవి భాషావ్యాకరణదోషాలూ, చర్వతచర్వణాలూ వగైరా తొలగించేందుకూ, ఇతరులకు అభ్యంతరకరం అనిపించే అవకాశాలు పరిహరించేందుకూ, మరింత మెరుగైన వాక్యనిర్మాణాదుల అవకాశాలు వినియోగించుకొందుకూ వగైరా మాత్రమే. వ్యాసవిషయంలో మౌలికమైన మార్పులు కోరటం జరగదు. 
  6. వచ్చిన ప్రతి వ్యాసమూ ప్రచురణకు అంగీకరించబడక పోవచ్చును. అంగీకరించిన వ్యాసాలే ప్రచురించబడతాయి.
  7. ప్రచురణకు యథాతధంగా స్వీకరించకపోయినా వాటిలోని భాగాల్ని వాడుతూ సమగ్రంగా ఒకటి రెండు ఇతరవ్యాసాలు అనే పేరుతో ప్రస్తావించి ప్రకటించవచ్చును.
  8. ప్రతి వ్యాసమూ s y a m a l i y a m A T g m a i l D O T c o m అనే ఈ-మెయిల్‌కు పంపవలసి ఉంటుంది. వాసాన్ని జతపరచి పంపవచ్చును లేదా ఈ-మెయిల్‌లో‌ నేరుగా తెలుగులో టైపు చేసి పంపవచ్చును.
  9. వ్యాసంతో పాటుగా ఇష్టముంటే ఫోటో, సెల్-ఫోన్ నెంబరు కూడా ఇవ్వవచ్చును.
  10. వ్యాసంతో పాటు వ్యాసకర్త ఈ-మెయిల్ చిరునామా, ఫోన్ నెంబరు, ఫోటోలు ఏవైనా ప్రచురించబడతాయి. ఏ సమాచారమైనా ప్రచురించవద్దనుకుంటే మీ వ్యాసంతో పంపుతున్న ఈ-మెయిలో చెప్పండి.
  11. ఈ వ్యాసాలు ప్రకటించినప్పుడు వాటిపై వ్యాఖ్యలు ఈ బ్లాగులో అంగీకరించబడవు. అన్ని వ్యాఖ్యలనూ వ్యాసం లింక్ ఉదహరిస్తూ నేరుగా ఈ s y a m a l i y a m A T g m a i l D O T c o m అనే ఈ-మెయిల్‌కు పంపవలసి ఉంటుంది.  
  12. ఏ వ్యాసం పైన ఐనా, వచ్చిన వ్యాఖ్యలను రచయితకు పంపి వారి స్పందనలతో ప్రకటించటం జరుగుతుంది. ఐతే రచయిత స్పందించిన వ్యాఖ్యలూ వాటికి రచయిత జవాబులూ మాత్రమే ప్రచురించబడతాయి. ఇక సదరు వ్యాసంపై  క్రొత్త వ్యాఖ్యలూ, కొనసాగింపు వ్యాఖ్యలూ అనుమతించబడవు.
  13. వ్యాసానికి సంబంధించిన అన్ని పరిణామాలూ వ్యాసకర్తవే. ఈ బ్లాగుకు సంబంధం లేదు.
  14. ప్రచురించబడిన వ్యాసాన్ని వ్యాసకర్తలు తమతమ బ్లాగుల్లో పునః ప్రచురణ చేసుకోవచ్చును.  
    ఐతే ఈ వ్యాసాల ప్రకటనా, అభిప్రాయాల క్రోడీకరణా పూర్తయి ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేవరకూ దయచేసి అలా తమ తమ బ్లాగుల్లో ప్రకటించకుండా ఉండవలసిందిగా విజ్ఞప్తి. లేని పక్షంలో వ్యాఖ్యలను క్రోడీకరించటం ఒక ప్రహసనం ఐపోతుంది.
    -  లేదా  -
    వ్యాసకర్తలు తమతమ బ్లాగుల్లో ప్రచురించుకొని ఆ టపాకు వ్యాఖ్యలను నిషేధించాలి. వ్యాఖ్యలను వ్యాసం యొక్క లింకుతో‌పాటుగా  s y a m a l i y a m A T g m a i l D O T c o m అనే ఈ-మెయిల్‌కు పంపవలసి ఉంటుంది అని సూచన ఇవ్వాలి.
  15. తిరస్కరించబడిన వ్యాసాన్ని వ్యాసకర్తలు తమతమ బ్లాగుల్లో పునః ప్రచురణ చేసుకోవచ్చును.
  16. వ్యాసకర్తలు తమవ్యాసాన్ని ముందే తామే ప్రచురించుకుని వ్యాఖ్యలనూ స్వీకరించే పక్షంలో వ్యాసాన్ని ఉపసంహరించటం తప్పనిసరి అవుతున్నది.

ఈ‌ ప్రతిపాదనపైన చదువరులు తమ స్పందన తెలియజేయండి.