16, నవంబర్ 2014, ఆదివారం

ఒక తప్పనిసరి నిర్ణయం.






కొన్ని కారణాలవలన ఇకమీద ప్రజ బ్లాగుకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను.

ప్రప్రథమకారణం ప్రజబ్లాగులో చర్చలు నడుస్తున్న తీరుపట్ల అసంతృప్తి. అలోచించగా ఈ‌ బ్లాగులో చర్చలు పోట్లాటల్లాగా నడుస్తున్నాయని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. దీనితో అందరూ ఏకీభవించాలని లేదు. ముఖ్యంగా ఆ చర్చల్లో కొందరు వాదన కోసం వాదన అన్న ధోరణిలో అనంతానంతంగా ఖండనమండనలు చేస్తూ మిగిలినవారి అభిప్రాయాలేవన్నా ఉంటే వాటిని చదువరులు అక్షరాలా వెదుకుకొని చూడవలసిన పరిస్థితిని కల్పించారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరు అసంతృప్తి వెలుబుచ్చినా ఆ వాదనా లోలురు శాంతించే అవకాశాలేమీ‌ లేవు నాకు తెలిసినంతవరకు. నేనేమీ ప్రజబ్లాగు ఎలా నడవాలీ నడవకూడదూ‌ అని నిర్ణయించేందుకు అర్హతకాని, అధికారం‌కాని ఉన్నవాడిని కాను. నాకు అటువంటి పనుల జొలికి పోయేందుకు తీరికా ఓపికా కూడా లేవు. ఐతే, ఆ బ్లాగులో ఇకమీద ఏదైనా చర్చలో పాల్గొనాలా మానాలా అన్న విషయం నిర్ణయించుకునే విషయంలో నా స్వేఛ్ఛనాదే అని నా నమ్మకం.

ఇక రెండవకారణం. ప్రజబ్లాగులో చర్చల్లో నేను వ్యాఖ్యలు ఉంచటం వలన నా ప్రతిష్ట పెరిగేదేమీ ఉండదన్న సంగతి నాకు కూడా బాగానే తెలుసును కాని, ఆ ప్రతిష్ట కాస్తా, ఏ మాత్రం చెప్పుకోదగ్గది ఉన్నా అది మసకబారుతోందన్న సంగతి ఈ రోజున ఒక వేరే బ్లాగుటపానీ (దాన్ని ఇక్కడ చూడండి) దానికి వచ్చిన వ్యాఖ్యల్లో నా ప్రసక్తి తీసుకొని వచ్చి అక్కడ చేయబడిన వ్యాఖ్యల్నీ గమనిస్తే నాకు బాగా అర్థమైనది. ఇదేమంతగా సంతోషించదగిన విషయం కాదు కదా!

అఖరుదీ‌ మూడవదీ ఐన కారణం. నాకు ప్రస్తుతం ఏవిధమైన చర్చల్లోనూ‌ పాల్గొందుకు పెద్దగా తీరిక లేదు. ప్రజలో కాని ఊరుకోలేక ఏదైనా ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చితే దానికి అనంతంగా వివరణ ఇచ్చుకుంటూ పోవలసిన పరిస్థితి. అపైన ఆనుషంగికంగా రకరకాల ప్రశ్నలను ఎదుర్కొని తరచూ‌ నన్ను నేను డిఫెండ్ చేసుకోవలసిన పరిస్థితి. అంత తీరిక లేని పరిస్థితిలో అడుసు త్రొక్కనేల కాలు కడగనేల అన్నట్లు అనంతరం విచారించటం బదులుగా, ప్రజలో చర్చలకు దూరంగా ఉండటమే సముచితం అని నిర్ణయించుకున్నాను.

ఈ నా నిర్ణయం వలన ఎవరికీ అసౌకర్యం ఉండదనే నా భావన.