16, నవంబర్ 2014, ఆదివారం

ఒక తప్పనిసరి నిర్ణయం.


కొన్ని కారణాలవలన ఇకమీద ప్రజ బ్లాగుకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను.

ప్రప్రథమకారణం ప్రజబ్లాగులో చర్చలు నడుస్తున్న తీరుపట్ల అసంతృప్తి. అలోచించగా ఈ‌ బ్లాగులో చర్చలు పోట్లాటల్లాగా నడుస్తున్నాయని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. దీనితో అందరూ ఏకీభవించాలని లేదు. ముఖ్యంగా ఆ చర్చల్లో కొందరు వాదన కోసం వాదన అన్న ధోరణిలో అనంతానంతంగా ఖండనమండనలు చేస్తూ మిగిలినవారి అభిప్రాయాలేవన్నా ఉంటే వాటిని చదువరులు అక్షరాలా వెదుకుకొని చూడవలసిన పరిస్థితిని కల్పించారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరు అసంతృప్తి వెలుబుచ్చినా ఆ వాదనా లోలురు శాంతించే అవకాశాలేమీ‌ లేవు నాకు తెలిసినంతవరకు. నేనేమీ ప్రజబ్లాగు ఎలా నడవాలీ నడవకూడదూ‌ అని నిర్ణయించేందుకు అర్హతకాని, అధికారం‌కాని ఉన్నవాడిని కాను. నాకు అటువంటి పనుల జొలికి పోయేందుకు తీరికా ఓపికా కూడా లేవు. ఐతే, ఆ బ్లాగులో ఇకమీద ఏదైనా చర్చలో పాల్గొనాలా మానాలా అన్న విషయం నిర్ణయించుకునే విషయంలో నా స్వేఛ్ఛనాదే అని నా నమ్మకం.

ఇక రెండవకారణం. ప్రజబ్లాగులో చర్చల్లో నేను వ్యాఖ్యలు ఉంచటం వలన నా ప్రతిష్ట పెరిగేదేమీ ఉండదన్న సంగతి నాకు కూడా బాగానే తెలుసును కాని, ఆ ప్రతిష్ట కాస్తా, ఏ మాత్రం చెప్పుకోదగ్గది ఉన్నా అది మసకబారుతోందన్న సంగతి ఈ రోజున ఒక వేరే బ్లాగుటపానీ (దాన్ని ఇక్కడ చూడండి) దానికి వచ్చిన వ్యాఖ్యల్లో నా ప్రసక్తి తీసుకొని వచ్చి అక్కడ చేయబడిన వ్యాఖ్యల్నీ గమనిస్తే నాకు బాగా అర్థమైనది. ఇదేమంతగా సంతోషించదగిన విషయం కాదు కదా!

అఖరుదీ‌ మూడవదీ ఐన కారణం. నాకు ప్రస్తుతం ఏవిధమైన చర్చల్లోనూ‌ పాల్గొందుకు పెద్దగా తీరిక లేదు. ప్రజలో కాని ఊరుకోలేక ఏదైనా ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చితే దానికి అనంతంగా వివరణ ఇచ్చుకుంటూ పోవలసిన పరిస్థితి. అపైన ఆనుషంగికంగా రకరకాల ప్రశ్నలను ఎదుర్కొని తరచూ‌ నన్ను నేను డిఫెండ్ చేసుకోవలసిన పరిస్థితి. అంత తీరిక లేని పరిస్థితిలో అడుసు త్రొక్కనేల కాలు కడగనేల అన్నట్లు అనంతరం విచారించటం బదులుగా, ప్రజలో చర్చలకు దూరంగా ఉండటమే సముచితం అని నిర్ణయించుకున్నాను.

ఈ నా నిర్ణయం వలన ఎవరికీ అసౌకర్యం ఉండదనే నా భావన.
14 వ్యాఖ్యలు:

 1. మంచి నిర్ణయం .. హర్షణీయం ...
  మీనుంచి మరిన్ని ఆధ్యాత్మిక ధార్మిక వివేదనలను కోరుకుంటూ
  శుభం భూయోత్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ధన్యవాదాలండీ. అలా ప్రయత్నిస్తాను తప్పకుండా.

   తొలగించు
 2. మీలాగే ఆ ప్రజ బ్లాగు నిర్వాహకులు కూడా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాను

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ప్రజబ్లాగువారు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం. అసలు ఈ‌ రాజకీయచర్చలు కొంతవాతావరణకాలుష్యం సృష్టించటం లేదా పెంచటం మినహా సిధ్ధింపజేస్తున్న ప్రయోజనం‌ నాకు పెద్దగా ఏమీ కనిపించటం లేదు. అసలు ఉద్దేశం బహుశః చర్చలద్వారా అవగాహనను పెంచటం ఐతే తద్విలోమంగా ద్వంద్వయుధ్ధాలు జరుగుతున్నాయి. సరే లెండి. అవన్నీ చర్విత చర్వణం చేసుకోవటం అనవసరం.

   తొలగించు
 3. అనవసరమయిన సలహా అనుకోకపోతే నా అభిప్రాయం:

  1. చర్చలు ఎప్పుడయినా వివాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. అంచేత చర్చిండం మానేయలేము కదా. వ్యక్తిగత దూషణ/పూర్తిగా అసంబద్ద ప్రేలాపన కానంత వరకు ఫరవా లేదని అనుకోవడం ఉత్తమం. కాదంటే బ్లాగు యజమానికి నచ్చిన (తానా అంటే తందానా అనే) వ్యాఖ్యలను మాత్రమె ప్రచురించే వారు కూడా ఉంటారు ఇది మీకు నాకు కూడా సరిపోదు.

  2. బ్లాగులలో ప్రతిస్పందన (నాకు తెలియచేయి) ఆప్షన్ వాడుకుంటే ప్రతివ్యాఖ్యలను ట్రాక్ చేసుకోవొచ్చు. అంతోటి దానికి వేరే బ్లాగులను విమర్శించడం సబబా?

  3. ఎవరయినా వ్యాఖ్యలలో సొంత అభిప్రాయాలే రాస్తారు. రాసే ముందు ఇతరుల స్పందనను తద్వారా వచ్చే comment-war ఊహించుకోవడం మరీ కష్టం కాదు. వాటికి సిద్దపడే వ్యాఖలు రాయాలి తప్ప top-of-the head impulsive spontaneity ప్రదర్శిస్తే consistency ఉండదు.

  మీ నిర్ణయం మీ ఇష్టం, మార్చుకోమని నేను అడగను. మనం తప్పు చేయనప్పుడు మధన పడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం పంచుకోవడానికే ఈ వ్యాఖ్య.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జైగారూ మీ విపులస్పందనకు ధన్యవాదాలు.

   చర్చలో భిన్నాభిప్రాయాలు సహజం. ద్వందయుధ్ధాలు మాత్రం పరిహరణీయం అవశ్యం. ఆలోచనాపూర్వకమైన స్పందనలూ ప్రతిస్పందనలు చర్చలో భాగాలైతే మంచిదే. నా వరకూ నేను పరిదులు అతిక్రమించి వ్రాయకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను ఎప్పుడూ.

   కామెంట్ల ట్రాకింగ్ సదుపాయం అన్ని బ్లాగుల్లోనూ‌ ఉంటుందో లేదో తెలీదు.

   తొలగించు
  2. బ్లాగర్ ఆధారిత బ్లాగులలో వ్యాఖ్య బాక్సు కింద మూడు బటన్లు (publish, preview & notify) ఉంటాయి. వర్డు ప్రెస్ ఆధారిత బ్లాగులలో కామెంటు బాక్సు కింద పేరు, ఈమెయిలు, వెబ్ వివరాల తరువాత కుడి వైపు పోస్ట్ కామెంట్ బటన్, ఎడమ వైపు రెండు (new mails & new comments) నోటిఫై చెక్ బాక్సులు ఉంటాయి. I guess this covers 90%+ of blogs.

   తొలగించు
  3. జై గారూ, మీతో పూర్తిగా యేకీభవిస్తున్నాను.కొండల రావు గారు అభిప్రాయం అడిగారు.శ్యామలీయం మాస్టారూ,అక్కడ నా పేరు కూడా ప్రస్తావన కొచ్చింది.అదీ చూశాను.ప్రమాదో ధీమతా మపి?!

   తొలగించు
  4. హరిబాబుగారూ, మీ వ్యాఖ్య నాకు అర్థంకాలేదండీ.

   తొలగించు
  5. యెంతటి వాళ్ళ కయినా తప్పులు సహజం.సరి దిద్దుకుని మళ్ళీ తప్పులుచేయకుండా వుంతే సరిపోతుంది.ఇంత చిన్న విషయానికి వేరే బ్లాగరు తన మానసిక వేదనని వెళ్ళబుచ్చితే మీరు ప్రజలో చర్చలకి దూరంగా వుండటం భావ్యం కాదని నా అభిప్రాయం!వేరొకరి బ్లాగులోని విషయాన్ని యెర్రరంగులో చూపించి విమర్సించాదం ద్వారా సహ బ్లాగరు పట్ల వుండాల్సిన కనీస మర్యాదని అతిక్రమించారు అవీఇవీ అన్నీ బ్లాగరు.దానికి మీరు ప్రజలో జరిగే చర్చహ్కు దూరంగా వుందాలా?!

   తొలగించు
  6. హరిబాబుగారూ, మీ సహృదయానికి నమస్సుమాంజలులు.

   నాకు రాజకీయాలపట్ల ఆసక్తి లేదు. కాబట్టి సహజంగానే రాజకీయచర్చల పట్లకూడా చెప్పుకోదగ్గ అసక్తి లేదు.

   అడపాదడపా నేను ఈ శ్యామలీయం బ్లాగులో రాజకీయవిషయాలమీద వ్రాసినా అవి నా సాధనకు ఇబ్బంది కలిగించనంతవరకే. చర్చలపేరిట రణరంగాలవంటి వాటికి దూరంగా ఉండటమే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. మిగిలిన కారణాలు ఈ టపాలో ముందే తెలియజేసాను.

   ఒక వేళ నేను రాజకీయచర్చల్లో పాల్గొన్నా అక్కడ అనటం పడటం అనేవే తప్ప నాకు అవగాహన ఐనంతవరకూ విషయానికి కట్టుబడి శాఖాచంక్రమణాలూ, దురావేశాలూ లేకుండా జరిగే సరైన వాదనలు కరవుగా ఉన్నాయి.

   కొందరు చక్కగా వాదించినా కొందరు చర్చను తమ పిడి వాదాలతో అనవసరంగా రచ్చరచ్చ చేస్తున్నారు. అక్కడ మిగతా వారి మాట వినబడటమే కష్టసాధ్యంగా ఉంది.

   కొందరు తరచుగా నా మాటలకు రంగులద్దటమూ, వాటికి బయటనుండి కొందరు భూతద్దాలు పట్టుకొని గోడసినిమాలు వేయటమూ జరగటం చూసి, ఇక లాభం లేదనే విరమించుకున్నాను.

   తొలగించు
 4. చాలా మంచి నిర్ణయం స్యామలీయం గారు. ప్రజా బ్లాగ్ హాక్ చెయ్యబడ్డది . వైరస్ తో నిండి పోయింది. కాని ఇది కొండలరావుగారికి చర్చల్లా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోబడ్డవి . కొండలరావుగారికి ఇబ్బందిలేకుండా , అక్కడికి వచ్చే వ్యాఖ్యాతల్ని మాత్రం రెగ్యులేట్ చేస్తున్నాయి ఈ వైరస్ రక రకాల పేర్లతో. ఆయన ఏం చేసినా ఇది మారదు , విసుగొచ్చి బ్లాగడం (బ్లాగు నడపడం) మానేస్తే తప్ప .

  అదొకటి ఉందని మర్చిపోవడం ఉత్తమం

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మౌళిగారు,

   మీ అభిప్రాయం మీది. నా భిప్రాయం ప్రకారం, కొండలరావుగారి 'ప్రజ' బ్లాగులో కాదు లోపం ఉన్నది. కొందరు వ్యాఖ్యాతల వ్యవహారశైలితో ఉన్నదా లోపం. మరికొందరు బ్లాగర్లు 'ప్రజ'ను అనవసరంగా లక్ష్యం చేసుకొని అనవసరమైన విమర్శలు కుప్పించటమూ అంత సమంజసంగా కనిపించలేదు నాకు. ఈ విషయంపై చర్వితచర్వణంగా చర్చించి ప్రయోజనం లేదు కాబట్టి వదిలేద్దాం.

   తొలగించు
 5. @కొండలరావుగారి 'ప్రజ' బ్లాగులో కాదు లోపం ఉన్నది.

  blog lonu, blogger lonu yE lOpam lEdandee, yevari parimitulu abhiprAyAlu vAllaki untAyi. alage kondalaravu gaaru. thank you

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.