14, నవంబర్ 2014, శుక్రవారం

వివేచన - 24. పూవులు చేసే పాదపూజ.వరమనోహరవర్ణభాసితంబులు పూల
బాలలు చేయనీ పాదపూజ

మధురసుధాబిందుమానితంబులు పూల
బాలలు చేయనీ పాదపూజ

అపురూపసుపరీమళాన్వితంబులు  పూల
బాలలు చేయనీ పాదపూజ

సుందరంబులు చాల సుకుమారములు పూల
బాలలు చేయనీ పాదపూజ

పరవశించుచు నీ నామస్మరణపూర్వ
కంబుగా వచ్చి నినుజేరి సంబరమున
పాదపూజల నీ పూలబాల లెల్ల
జేసికొన నీయవే దయచేసి నీవు3 వ్యాఖ్యలు:

 1. దైవసాన్నిధ్యముం గోరి తన్మయతను
  పూలబాలలు చేసెడు పాదపూజ
  మృదుమధురభావములఁ జెప్పు మేటి! తాడి
  గడప శ్యామలరావు! సత్కవివతంస!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శంకరార్యులవారి పద్యపూర్వకాభినందనలకు ధన్యవాదశతములు.

  ఈ పద్యంలో ఉన్న ఒక చిన్న విశేషం మీరు గమనించే ఉంటారు. అందరు పాఠకులకూ సులభంగా బోధపదకపోవచ్చును కాబట్టి వారి సౌకర్యార్థం నేనే ఈ విశేషాన్ని కొద్దిగా వాచ్యం చేస్తున్నాను.

  శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే ఈ ఐదింటినీ పంచతన్మాత్రలు అని పిలుస్తారు. ఈ‌ తన్మాత్రలనుండి పంచమహాభూతాలు ఏర్పడుతున్నాయి. శబ్దతన్మాత్ర నుండి ఆకాశము, స్పర్శతన్మాత్ర నుండి వాయువు, రూపతన్మాత్ర నుండి తేజము, రసతన్మాత్ర నుండి జలము, గంధతన్మాత్ర నుండి భూమి ఏర్పడుతున్నాయి. ఈ పంచభూతాలనుండే సమస్త ప్రపంచమూ ఏర్పడుతోంది. అసలు ప్రపంచం అన్నమాటకు పంచీకరణం వలన చేయబడినది అని అర్థం. పూవులలో‌ పై పద్యంలో ఈ పంచతన్మాత్రలనూ రూపించి చెప్పటం జరిగింది. పుష్పము భగవంతుని చేరుట యనగా పంచభూతములు తమకు మూలమైన పంచతన్మాత్రల ద్వారా భగవత్సాన్నిధ్యాన్ని అపేక్షించటం అని నిరూపణము. ఈ‌ పంచభూతములే జీవికి దేహకారణములు కాబట్టి, తన్మూలంగా పుష్పము అనే ఒక సంకేతముతో, జీవుడు భగవంతునికి ఆత్మసమర్పణము చేసికొనుట ఇక్కడ ప్రస్తావించబడింది.

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.