3, నవంబర్ 2014, సోమవారం

సౌందర్యలహరి - 23 త్వయా హృత్వా వామం ...మొదటి శ్లోకంవెనుకటి భాగంతదుపరి శ్లోకం

23

త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో రపరమపి శంకే హృత మభూత్
యదేతత్త్వద్రూపం సకల మరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాలమకుటమ్

లోకంలో శివసాయుజ్యం అన్న మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది.

ఈ శ్లోకంలో శ్రీశంకరులు శ్రీదేవీసాయుజ్యం అంతకంటే గొప్పదీ అని చెబుతున్నారు!

అమ్మవారు శివుడిలో అర్థభాగం అన్న సంగతి తెలిసిందే. అందుకే శివుడిని అర్థనారీశ్వరుడు అని కూడా అంటాం .

ఈ సంగతిని ఆచార్యులు కొంచెం గడుసుగా ప్రస్తావిస్తున్నారు త్వయా హృత్వా వామం అని అంటూ.  త్వయా అంటే నీ చేత హృత్వా అనగా సంగ్రహించబడినదమ్మా వామం అంటే శివుని ఎడమవైపు అర్థశరీరం  అని చెబుతున్నారు.

అందులో ఏమి విశేషం ఉందీ అనవచ్చును. అక్కడి నుండే మొదలవుతున్నది అచార్యులవారి గడుసుదనం. చూడండి.

అలా అయ్యవారి ఎడమవైపు అర్థశరీరభాగాన్ని  ఆక్రమించుకున్న అమ్మకు తృప్తి కలగలేదుట. అందుకే ఆవిడను ఈ శ్లోకంలో అపరితృప్తేన మనసా అన్నారు.అసంతృప్తిగానే ఉందిట ఆవిడ మనస్సుకు. అందుకని ఆవిడ ఒక పని చేసిందీ అని శంకరులకు ఒక అనుమానం వచ్చిందట,  ఏమిటండీ ఆపని అంటే చెబుతున్నారు.

శంభోః అపరమ్‌ అపి శరీరార్థం హృతమ్‌ అభూత్ శంకే అంటున్నారు చూడండి. అంటే శంభుని యొక్క అపరం అంటే మిగిలిన రెండవవైపు శరీరార్థం అనగా అర్థశరీరాన్ని కూడా హృతం అభూత్ అనగా అపహరించబడి ఉంది అని శంక కలిగిందీ అంటున్నారు!

అంటే అమ్మకు అయ్యవారి ఎడమశరీరాన్ని స్వంతం చేసుకున్నా తృప్తి కలగక ఆయన కుడివైపు శరీరాన్ని కూడా స్వంతం చేసుకుందీ అన్న అనుమానం వస్తోందీ అంటున్నారు ఆచార్యులవారు.

అలా ఎందు కనుకుంటున్నారూ అని మనకు సందేహం వస్తుంది కదా!  దానికి వివరణ ఇస్తున్నారు. యత్ అంటే, ఎందుకనగా అని మొదలు పెడుతున్నారు వివరణను.

ఏతత్ రూపం సకలం అరుణాభం అనగా అమ్మా ఏ రూపమైతే నాకు మనస్సులో గోచరం అవుతోందో అది అంతా అరుణంగా అంటే ఎఱ్ఱగా ఉంది.

సరే నీ రూపం ఎఱ్ఱగా ఉంటుంది, నాకు తెలుసును. అరుణాం కరుణాతరంగితాక్షీం అని నుతిస్తూ ఉంటాను కదా. 

కానీ నాకు నీ రూపం త్రినయనమ్‌ అన్నట్లు అంటే మూడు కళ్ళతో ఉన్నట్లు కనిపిస్తోంది! మరి మూడుకళ్ళవాడు శివయ్య కదా? సరే మీ ఇద్దరికీ‌ కలిపి అర్థనారీశ్వర రూపం అనుకుందాం.

మరి అమ్మా, కుచాభ్యామ్‌ ఆనమ్రమ్‌ అన్నట్లు కూడా నీ రూపం కనిపిస్తోందే. అంటే నీ రూపం కుచములు రెండింటి బరువుతోనూ కొద్దిగా ముందుకు వంగినట్లు ఉంది.  మరి అర్థనారీశ్వర రూపంలో అలా ఎలా కనబడుతుందీ?

అదీ కాక, నాకు నీ‌రూపం  కుటిలశశి చూడాల మకుటమ్‌ అన్నట్లుగా కూడా కనబడుతోంది. కుటిలశశి అంటే చంద్రవంక. చూడాలము అంటే శిరస్సు. మకుటం అంటే తెలిసినదే కిరీటం అని. అంటే అమ్మా, నీ శిరస్సున చంద్రవంక అనేది కిరీటంలా ప్రకాశిస్తూ‌ కనబడుతున్నది అని అంటున్నారు. మరి చంద్రవంక ఉన్నవాడు శివుడు కదా.

నాకు నీ రూపం సకలం అరుణాభం అంటే అంతా ఎఱ్ఱగా కనిపిస్తోంది,   అర్థనారీశ్వర రూపం అనుకుందామంటే శివుడు తెలుపు గదా.  పార్వతీ పతి తెల్పు పాలసంద్రము తెల్పు అని అంటారు. శివుడి భాగం తెల్లగానూ నీ భాగం మాత్రమే ఎఱ్ఱగానూ‌ కనబడాలి కదా అలాగైతే.

అంతా ఎఱుపేను. నీ‌ స్వనద్వయమూ కలిగిఉంది రూపం. శివుడి చంద్రవంకా మూడు కళ్ళు ఉన్నా కూడా మొత్తంగా ఎఱుప్పుతప్ప తెలుపు కనరాదు సుమా.

అందు చేత ఆ శివభాగమైన కుడి అర్థభాగాన్నీ కూడా అమ్మా నీవే ఆక్రమించుకున్నావన్న అనుమానం కలుగుతోంది.

ఇదీ శ్రీశంకరులు అమ్మను దర్శించిన విధం ఈ శ్లోకంలో.

కొన్ని కౌల సిధ్ధాంతాలలో అంతా శక్తితత్త్వమే.  శివతత్త్వం అందులో అంతర్భూతం. అంతే కాని, విడిగా శివతత్త్వాన్ని చెప్పకూడదు.

ఆమ్మ యొక్క అరుణిమ ఆవిడ దివ్యశక్తికి ప్రతీక. కిరీటం సర్వసృష్టికీ ఆమె సామ్రాజ్ఞిత్వానికి ప్రతీక. శిరస్సున చంద్రవంక ఆమె ఆనందస్వరూప మరియు అమృతస్వరూప అన్నదానికి సంకేతం.  త్రినేత్రాలూ త్రికాలాలకు ప్రతీకలు. స్తనమండలప్రశస్తి సకలజీవులకు ఆమెయే పోషకురాలన్న భావనకు ప్రతీక. సమిష్టిగా శ్రీమాత విరాడ్రూపం ఇక్కడ చెప్పబడింది.

ప్రతిదినమూ మూడువేల సార్లు చొప్పున మప్పది రోజులు పారాయణం. నైవేద్యం క్ష్రీరాన్నం. ఫలం అపదలనుండి నివృత్తి.  ముముక్షువులకు జ్ఞానప్రాప్తి.

6 వ్యాఖ్యలు:

 1. తెలుగులో స్పెల్లింగ్ తప్పులు దొర్లుతున్నాయి. కాస్త చూసుకోగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అవునండీ. ఉదయం సరిజేసాను. చాలానే ఉన్నాయి అక్షరదోషాలు.

   తొలగించు
 2. తెలుగు కి స్పెల్లింగ్ ఎక్కడుందండీ ??

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మన వ్రాతల్లోనే ఉందండీ. సరే నండీ, స్పెల్లింగ్ అనకుండా అక్షరక్రమం అందాం.

   తొలగించు
 3. తెలుగులో స్పెల్లింగ్ ...... :)) ఉండదు కదా?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అవునండి. ఈ ఇంగ్లీషు చదువులు వచ్చేదాకా అందరమూ హాయిగా మంచినీళ్ళు త్రాగేవాళ్ళం. ఇప్పుడు అందరమూ వాటర్ తాగుతున్నాం. అన్నం మానేసి రైస్ తింటున్నాం. ః)

   ఒకప్పుడు వర్ణక్రమం అనేవాళ్ళం ఇప్పుడు స్పెల్లింగ్ అంటున్నాం. కాలోదురతిక్రమణీయః

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.