11, అక్టోబర్ 2014, శనివారం

సౌందర్యలహరిని లేదా అసలు ఈ శ్యామలీయం బ్లాగును ఎందరు చదువుతున్నారు?

"మనందర్నీ ఇలా చివర్లో సశేషంలో వదిలేసి అసలు ఎంతమంది నా బ్లాగు చదువుతున్నారు అని టెస్ట్ చేయడం ఈయనకో సరదా!" అని మిత్రులు ఒకరు నిన్ననే వ్యాఖ్యానించారు. నిజానికి నేను ఇలాంటి పరిశీలన అంటూ ఎన్నడూ చేయలేదు కాని ఒక కారణం కల్పించుకొని ఈ‌ రోజున సౌందర్యలహరి వ్యాఖ్యానశ్రేణిపైన ఆ 'టెస్ట్" ముచ్చట కాస్తా కానిచ్చాను.


టపా పేరు తేదీ చదువరులు స్పందనలు చదువరులు/రోజులు
సౌందర్యలహరి - 1 25/9 114 3 114/16 = 7.1
సౌందర్యలహరి - 2 26/9 89 1 89/15 = 5.9
సౌందర్యలహరి - 3 27/9 63 1 63/14 = 4.5
సౌందర్యలహరి - 4 28/9 44 1 44/13 = 3.4
సౌందర్యలహరి - 5 29/9 67 2 67/12 = 5.6
సౌందర్యలహరి - 6 30/9 73 3 73/11 = 6.6
సౌందర్యలహరి - 7 1/10 71 2 71/10 = 7.1
సౌందర్యలహరి - 8 1/10 54 1 54/10 = 5.4
సౌందర్యలహరి - 9 3/10 61 1 61/8 = 7.6
సౌందర్యలహరి - 10 4/10 50 1 50/7 = 7.1
సౌందర్యలహరి - 11 5/10 50 2 50/6 = 8.3
సౌందర్యలహరి - 12 6/10 40 0 40/5 = 8
సౌందర్యలహరి - 13 7/10 54 0 54/4 = 13.5
సౌందర్యలహరి - 14 8/10 48 2 48/3 = 16
సౌందర్యలహరి - 14+ 9/10 33 1 33/2 = 16.5
సౌందర్యలహరి - 15 10/10 35 0 25/1 = 25
సౌందర్యలహరి - 15+ 10/10 17 0 17/1 = 17


ఇప్పటికి వచ్చిన టపాల సంఖ్య 17.
ఇప్పటికి వీటిన చదివిన వారి మొత్తం సంఖ్య 963.
అంటే సగటున రోజుకు 60 మంది చదివారన్న మాట.
ఈ‌ చదువరుల సంఖ్య దినదినమూ‌ కృష్ణపక్షచంద్రకళలాగా సన్నబడుతూ వస్తోందనీ గ్రహించవచ్చును.  అంటే కొత్తగా చదివే వారంటూ వస్తున్నట్లు లేదు ఈ‌ శీర్షికకు అన్నదీ పై పట్టీలో స్ఫుటంగా తెలుస్తున్నది కూడా.

దీనిని బట్టి  అర్థమయ్యే మరొకసంగతి ఏమిటంటే ఆట్టే మంది చదవని టపాలు వరసగా వ్రాసుకుపోతున్నవాడు ఐతే లెక్కలు రాని వాడైనా అయ్యుండాలి లేదా ఆ లెక్కలను పట్టించుకోని వాడైనా అయ్యుండాలి.  ఎలాగూ ఈ సౌందర్యలహరి యొక్క నూఱుశ్లోకాలకూ వ్యాఖ్యను రచించటం తథ్యం అన్నసంగతి ఇప్పటికే ఒకటికి రెండుమార్లు ఈ‌బ్లాగులో నేను చెప్పటం జరిగిందని విజ్ఞులైన చదువరులు గమనించే ఉంటారు.  ఈ‌ నా నిర్ణయంలో ఏ మార్పూ ఉండదు కూడా.

నిజానికి ఇలాంటి "టెస్ట్" అనేది ఏమీ ఎప్పుడూ చేయనవసరం లేకుండానే, నాకు బాగా ముందు నుండి స్పష్టంగా తెలిసిన సంగతే నేను వ్రాసే బాపతు టపాలకు పెద్దగా చదువరులు రారన్నది. అలాగని నా పంథా మార్చుని వ్రాసే ఉద్దేశమూ లేదు నాకు. నా టపాలలో రకరకాల ప్రక్రియలూ ప్రయోగాలూ అప్పుడప్పుడు కనిపిస్తున్నాయంటే అవి ఉద్దేశపూర్వకంగా నేను తెలిసి చేస్తున్నవీ, వివిధప్రక్రియలకు సంబంధించినవీ కావచ్చును. అంతే కాని చదువరులను ఆకట్టేసుకోవాలని నేను చేసే ప్రయత్నం మాత్రం కానేకాదు.   అలాంటి ఉద్దేశం ఉంటే నా బ్లాగు తీరుతెన్నులు మొదటి నుండీ వేరుగానే ఉండేవి.

ఈ బ్లాగును 25 ఆగస్టు 2011 గురువారం నాడు మొదలు పెట్టి ఇప్పటికి ఈ‌ టపాతో‌ కలిపి 550 టపాలు ప్రకటించటం‌ జరిగింది.  గత 549 టపాలకు గాను వచ్చిన మొత్తం వ్యాఖ్యలు 1350.  వీటిలో నా ప్రతిస్పందనలు 385 పోను ఇతరులు చేసిన వ్యాఖ్యలు 965 - వేయి కన్నా తక్కువే. అదీ 1143రోజుల కాలంలో 549 టపాలకు వచ్చిన స్పందనల పరిస్థితి ఈ బ్లాగుకు. అంతే కాక మొత్త సందర్శకుల సంఖ్య ఇప్పటికి కేవలం 53,477 మాత్రమే కూడా.

అనేక టపాలకు చదువరుల సంఖ్యలు రెండంకెల సంఖ్యలే.  పదుల్లోపు చదువరులే ఉన్న టపాలూ బాగానే ఉన్నాయి. నా ప్రవృత్తికి విరుధ్ధంగా అరుదుగానే ఐనా రాజకీయవిషయాలమీద వ్రాసినటపాలవంటి వాటికి మాత్రం అమాంతంగా వందల్లో చదువరులు వచ్చిన సందర్భాలు బోలెడు.

ఈ అంకెల వ్యవహారాన్ని నేను పట్టించుకున్నది లేదు.  ఐనా, "టెస్ట్" చెస్తే పరిస్థితి ఇంత బాగా ఉంటుందని నాకు తెలియక పోతే కదా ప్రత్యేకించి "టెస్ట్" చేసి చూసుకుందుకు?

ఇటువంటి స్పందన మధ్య ఎంతమంది నిరుత్సాహ పడకుండా బ్లాగును నడుపుకుంటూ పోయే వారో నాకైతే తెలియదు. నాకు మాత్రం ఈ విషయంలో ఏమీ అంచనాలూ లేవు పట్టింపులూ లేవు.  అందుచేత ఈ‌ బ్లాగు నడుస్తూనే ఉంటుంది భగవత్కృప ఉన్నన్నాళ్ళూ. 

అదీ సంగతి.

4 వ్యాఖ్యలు:

 1. ఈ బ్లాగు నడుస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఎంతమంది చదువుతున్నారు అన్నది మనం పట్టించుకోకపోవటం మంచిది, అలాంటివాటి జోలికి పోతే ఒక్కోసారి నిరుత్సాహం ఎదురవుతుంది. ఇప్పుడు మీ బ్లాగు చదవకపోవచ్చు. ముందుముందు ఎవరికైనా అవసరం వచ్చి ఏ ఒక్కరు వెతుక్కున్నా ఆ టపాకు సార్థకత చేకూరినట్టే. అయినా మంచి టపాలకి ఈనాడు ప్రోత్సాహం లేనిమాట వాస్తవం. ఎంతసేపు ఎక్కడ ఒకరినొకరు దూషించుకోవచ్చు అనే మెంటాలిటీ తోనే బ్లాగులు వెతికి చదువుతున్నారు అని అనిపిస్తుంది ఒక్కోసారి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మిత్రులు శ్యామలరావు గారు,

  పలుకా దారుణాఖండల శస్త్ర తుల్యము
  మనమా వెన్న నవనీత సమానము...

  ఇది బహు ముఖ ప్రజ్ఞాశాలులలో కనపడేది. మీ టపాలకి వ్యాఖ్య రాయడానికి భయపడతామంటే... అనుమానం లేదు. నిర్దుష్టంగా ఉండే వాని మీద, తెలియనివాని మీద వ్యాఖ్య చేయలేరు.

  సులభా పురుషా రాజన్ సతతః ప్రియవాదినః

  ఏదో వాగేసేను మన్నించండి. వ్యాఖ్య కూడా సరిగా రాయలేని అల్పులం.

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.