11, అక్టోబర్ 2014, శనివారం

స్వర్గంలో ముని - 2


ముని ఆలోచనలో పడ్డాడు.

ఇంద్రుడు మూడు లోకాలకీ రాజు. అంటే స్వర్గానికే కాదు ఈ‌ భూలోకానికీ రాజే, అదేదో పాతాళం అంటారే దానికీ రాజే. వరాలివ్వగల మహానుభావుడే.  కాని తనక్కావలసిన వరం ఇవ్వటం ఈయన చేతిలో ఉంటుందని అనిపించటం లేదు.

అలాగని కోరుకో వరం అన్నప్పుడు వద్దు పో అనటం తిరస్కారంగా ఉంటుంది. ఒక మామూలు రాజు దగ్గరే తిరస్కారం గిరస్కారం చేస్తే తోలు వలుస్తారు. అలాంటిది ఏకంగా త్రిలోకేశ్వరుడినే తిరస్కరించటం అంటే దాన్ని మించిన తిరస్కారం ఉంటుందా? అంత కన్నా ప్రమాదం మాత్రం మరొకటి ఉంటుందా? అందునా ఈ దేవతలున్నారే వీళ్ళు ఎంత మంచివాళ్ళో అంత చెడ్డవాళ్ళని కూదా అనుకోవచ్చును. ఐతే వరాలలిస్తారు లేకపోతే అంతే సుళువుగా శాపాలూ ఇచ్చేస్తారు.

ఇప్పుడు ఈ‌యన్ని ఏదో ఒకటి అడక్క తప్పదు.  అలా అడగటం కూడా ఆట్టే మంచిదీ కాదు.  ఇంత తపస్సూ చేసి, ఇప్పుడు ఈయన ఇచ్చిన వరంతో తృప్తి చెందాలా?  తృప్తి మాట దేవుడేరుగు.  ముందు తపస్సు కాస్తా ముగిసిపోయినట్లే లెక్కకు వస్తుంది.  ఏదో దిక్కుమాలిన వరం పుచ్చేసుకుని మళ్ళా తపస్సు మెదలు పెట్టాలి.

ఇలా సాగిపోతోంది ముని ఆలోచనాస్రవంతి.

కొంచెం సేపు చూసి, ఇంద్రుడే అన్నాడు, ఏమిటి అలోచిస్తున్నావు. ఏమి కోరుకోవాలో తోచటం లేదా? కోరుకో మరి, సరైన వరమే కోరుకోవాలి సుమా అన్నాదు సరైన అన్నది వత్తి పలుకుతూ.   ఈయనకి ఇలా నొక్కివక్కాణించటం సరదా కూడా ఉందే అన్న విషయం పట్టించుకొనే స్థితిలో లేడు ముని. ఐనా ఇంద్రుడు తొందర పెట్టేస్తున్నాడు. కొంపదీసి తన మౌనాలోచానాకార్యక్రమం కూడా అవినయం అనుకోడు కదా. అలాగైతే వరానికి బదులు ఏదో శాపం విసిరేసి చక్కాపోగలడు కూడా.

నోరు పెకలించుకొని, ఇంద్రదేవా, ఏమడగాలా అన్నది కొంచెం సందిగ్ధంగా ఉండి అలోచిస్తున్నాను, నాక్కొంచెం సమయం ఇవ్వండి దయచేసి అని ఒక నమస్కారం కూడా జోడించాడు.

దానికేం, అలోచించుకో అనేసి ఇంద్రుడు చుట్టూ చూసాడు.  ఏమయ్యా కాళ్ళుపీకేలా నిలబడటమేనా కాస్త నన్ను కూర్చోమనేది ఏమన్నా ఉందా అన్నాడు కొంచెం హాస్యంగా.

ముని అయ్యయ్యో ఎంతమాట ఎంతమాట అనేసి గాభరాగా అటూ ఇటూ పరుగెత్తి ఒక కుర్చీలాంటిది తెచ్చి వేసాడు.

దాని అవతారం చూస్తే ఇంద్రుడికి నిలబడ్డమే మంచిదనిపించింది. సరేలే, ఊరికే అన్నాను.  మా దేవతలకు మీ లాగా కాళ్ళుపీకటాలూ‌ కళ్ళులాగటాలూ లాంటి రోగాలేం ఉండవు. నీ క్కావలిస్తే  బారెడు ప్రొద్దెక్కేదాకా ఆలోచించుకో. అదిసరే, నీకో సంగతి తెలుసునా?  మీ భూమిమీద మీకొక సంవత్సరం ఐతే కాని మాకు దేవలోకంలో ఒక రోజు పూర్తికాదు. నువ్వు ఝాముసేపు ఆలోచించుకున్నా అది మా దేవతలకు కొన్ని నిముషాలే అవుతాయి.  ఆలోచించుకో అలోచించుకో అన్నాడు కులాసాగా.

ఈ‌ ఇంద్రుడేదో తనని ఆటపట్టిస్తున్నాడని మునికి అనుమానం వచ్చింది.  కాని గట్టిగా ఆ విషయం మీద ఆలోచించినా ఈ మహానుభావుడు పసిగట్టేస్తాడే ఖర్మ అనుకొని ఊరుకున్నాడు.

ఐనా ఇన్ని తెలిసిన దేవేంద్రుడికి తాను మనస్సులో ఏ కోరిక పెట్టుకొని తపస్సు చేస్తున్నదీ తెలియదా?  తప్పకుండా తెలిసే ఉంటుంది. తన నోటనే వినాలని బడాయి పోతున్నాడు.   వేరే ఏమడిగినా నీ అసలు కోరిక దాచి మరీ ఇది అడిగావే అనగలడు కదా నిలదీసి.
ఉన్నది ఉన్నట్లు చెప్పటం తప్ప వేరే దారి లేదు. ఈ అలోచన రాగానే ముని మనస్సు తేలికపడింది.  నోరు తెరిచాడు.

మహా ప్రభో నా మనస్సులో ఉన్న మాట చెబుతున్నాను.  అదేమిటన్నది మీకెలాగూ తెలిసే ఉంటుంది కదా,  ఐనా మీరు కోరుకో మనటం మీ ఔదార్యం. ధైర్యం చేసి అడగటం నా విధి అన్నాడు

ఇంద్రుడికి ఏమనిపించిందో కాని, విషయం చెప్పవయ్యా, ఈ డొంకతిరుగుడేమిటి నాన్సెస్న్ అన్నాడు.

మునికి మతిపోయినట్లయ్యింది. ఈయనకు ఇంగ్లీషుకూడా వచ్చా అని అమాయకంగా హాశ్చర్యపోయాడు.

అద్బుతం అద్భుతం ఇంద్రదేవా మహాత్మా మీకు ఇంగ్లీషుకూడా వచ్చా అని పైకే అనేసాడు.

ఏం‌ ఎందుకు రాకూడదూ వచ్చులే అన్నాడు ఇంద్రుడు విసుగ్గా.

అయ్యా దేవతలు సంస్కృతం కదా మాట్లాడుతారూ అన్నాడు ముని లా పాయింట్ లాగుతున్నట్లు ముఖం పెట్టి.

హౌ ఇన్నోసెంట్ యూ ఆర్!  ఏమయ్యా మాకు సంస్కృతం తప్ప మరేదీ రాదని మీ పురాణాల్లో కాని ఎవరైనా వ్రాసారా?  అదిసరే,  ఇంతదాకా నేను నీతో తెలుగులో మాట్లాడటం లేదా?  భలే అమాయకుడివి దొరికావే.

అంటే మీకు అన్నిభాషలూ వస్తాయన్న మాట.

ఓరి నీ అసాధ్యం కూలా. ఇంకా అనుమానుమేనా నీకు, అన్ని భాషలూ వస్తాయి దేవతలకు. సరేనా?  అదిసరే, కోరే దేమన్నా ఉందా? లేదా? కోరుకో సరైన కోరిక అన్నాడు ఇంద్రుడు.

ధైర్యం తెచ్చుకుని, సరైనదో కాదో నాకు తెలియదు ప్రభూ. సరైనదే అనుకుంటాను బహుశః.  ఈ తపస్సును నేను మోక్షం కోసం చేసాను మరి, అది అనుగ్రహించండి.  మహాప్రసాదం అన్నాడు ముని.

ఇంద్రుడు వెంటనే ఇందాక తాను కూర్చుందుకు ముఖమాట పడ్డ ఆ కుర్చీలోనే కూలబడ్డాడు.

*        *        *        *        *