9, అక్టోబర్ 2014, గురువారం

సౌందర్యలహరి - 14 (కొనసాగింపు)


(కొనసాగింపు)

పాఠకులు గమనించే ఉంటారు.  శ్రీశంకరులు విరచించిన సౌందర్యలహరీ స్తోత్రాన్ని గురించి శ్రీవిద్యా సంబంధమైన సాంకేతిక విషయాల ప్రసక్తి లేకుండా వ్యాఖ్యానించటమూ అవన్నీ పరిహరించి అతిసూక్ష్మంగా చెప్పినా శ్లోకాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవటమూ అసాధ్యం ఐన విషయాలు. అందు చేత సాంకేతిక విషయాలను వీలైనంత సరళంగా లఘువుగా చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను. అవసరం పడిన చోట్ల అదనపు వివరాలు జోడించటం తప్పని సరి కాబట్టి ఇక్కడ కొంచెం లఘువుగా కొన్ని కొన్ని సాంకేతిక విషయాలను ముచ్చటిస్తాను.

తరచుగా షట్చక్రాలని (ఆరు చక్రాలు) ప్రస్తావిస్తున్నాము.  వీటిని గురించి మరికొంచెం తెలుసుకోవటం ప్రయోజనకారిగా ఉంటుంది చదువరులకు.

చక్రం అనేది ఒక పారిభాషికపదం అంటే ఆంగ్లలో టెక్నికల్ టర్మ్‌ అన్నమాట.  ఇలా చక్రం అని చెప్పినంత మాత్రన ఏ చక్రమైనా నిజంగా గుండ్రటి బిళ్ళ ఆకారంలో అంచున వాడియైన పళ్ళతో ఉంటుంది అనుకోకూడదు.  ఉదాహరణకు ఆజ్ఞాచక్రం రెండు ఆకుల రెమ్మ వంటిది. అన్నట్లు శ్రీచక్రం అనేది బయటికి ఒక నాలుగు గుమ్మాల ప్రహారీ గోడతో కూడిన దీర్ఘ చతురస్రం ఆకారంలో ఉన్న కట్టడంలా కనిపిస్తున్నది కదా. ఇలా చక్రం అనేది ఆకార సూచకం కాదు అన్నది మొదట గ్రహించవలసిన విషయం.

మరొక ముఖ్య విషయం ఉంది. ఈ చక్రాలుగా చెప్పబడ్డవి ఏవీ కూడా శరీరంలో నిజంగా కళ్ళకి కనబడే వస్తువులు కావు.  ఇవి కేవలం శక్తి కేంద్రాలు అన్నమాట.  వాస్తవజగత్తులో కూడా అనేక శక్తిస్వరూపాలను చూస్తున్నాం.  వాటిని అవి చూపే ప్రభావాల ఆధారంగానే గుర్తిస్తున్నాం కాని అవేవీ కళ్ళకు కనబడే రూపాలతో ఉండవు కదా.  పూర్వం సద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు ఇలా షట్చక్రాలను గురించి చెబుతుంటే విన్న ఒక వ్యక్తి ఇంటికి పోయి భార్యను ముక్కముక్కలుగా నరికి వెదికి ఆ చక్రాలేవీ కనబడకపోయే సరికి ఘొల్లుమన్నాడట.

మానవశరీరంలో ఈ ఆరు చక్రాల స్థానాలను గురించి ఇలా చెబుతారు. ఈ శ్లోకం ప్రకారం చక్రాల స్థానాలను చెబుతూ వాటి తత్త్వాలనూ, మరికొన్ని విశేషాంశాలనూ జోడించి చెబుతాను.మూలాధారం గుదస్థానం స్వాధిష్ఠానంతు మేహనం
నాభిస్తు మణిపూరాఖ్యం  హృదయం చాబ్జ మనాహతం
తాలుమూలం విశుధ్ధాఖ్యం ఆజ్ఞాంచ నిటలాంబుజం
సహస్రారం బహ్మరంధ్రం ఇత్యాగమ విదో విదుః

మూలాధారచక్రం యొక్క స్థానం అసనం. మనిషి కూర్చుంటే శరీరం నేలకు ఆనే ప్రదేశం.  పంచభూతాల్లో ఒకటైన భూమి దీని యొక్క తత్త్వం.  ఇక్కడ ఉండే అమ్మవారి పేరు సాకిని. 

స్వాధిష్ఠానచక్రం యొక్క స్థానం మర్మావయవాలు ఉండే చోటు. పంచభూతాల్లో ఒకటైన అగ్ని దీని యొక్క తత్త్వం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు కాకిని.

మణిపూరక చక్రం యొక్క స్థానం నాభి. అంటే బొడ్డు.  పంచభూతాల్లో ఒకటైన జలం దీని యొక్క తత్త్వం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు లాకిని.

అనాహత చక్రం యొక్క స్థానం హృదయం.  పంచభూతాల్లో ఒకటైన వాయువు దీని యొక్క తత్త్వం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు కాకిని.

విశుధ్ధ చక్రం ఉండే చోటు కంఠం.  పంచభూతాల్లో ఒకటైన ఆకాశం దీని యొక్క తత్త్వం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు డాకిని.

ఆజ్ఞా చక్రం ఉండే చోటు నుదురు. అక్కడ ఉండే కనుబొమ్మలు  రెండింటి మధ్యస్థానం.  పంచభూతాల సమాహారంగా ఏర్పడే మనస్సు దీని యొక్క తత్త్వం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు హాకిని.

ఈ  ఆరు చక్రాలకే షట్-చక్రాలు అని పేరు. ఈ ఆరు చక్రాలలో ఉండే తత్త్వాలు పంచభూతాలూ, మనస్సూ అనేవి మొత్తం ఆరు.  

ఈ ఆరు చక్రాల కన్నా  ఉన్నతమైనది సహస్రార చక్రం. ఈ సహస్రార చక్రం యొక్క స్థానం  బ్రహ్మరంధ్రం.  ఇది నడినెత్తి ప్రాంతం.   ఇక్కడ ఉండే అమ్మవారి పేరు యాకిని.

సాకిని మొదలైన అమ్మవారి మూర్తులన్నీ అక్కడ ఉండే శక్తులకు సాంకేతిక నామాలన్నమాట గ్రహించాలి.

ముందు ముందు సౌందర్యలహరీ శ్లోకాల్లో ఈ చక్రాల ప్రసక్తులు వాటిపైన శ్లోకాలు వచ్చినప్పుడు మరిన్ని వివరాల జోలికి పోవచ్చును.  ప్రస్తుతానికి ఇంత చాలు. 

ప్రస్తుతం మనం చదువుకుంటున్న పదునాల్గవ శ్లోకంలో ఈ చక్రాలలో ప్రకాశించే కిరణా లను గురించి వివరించారు. అన్ని చక్రాలలోని కిరణాల మొత్తం సంఖ్య 360 అవుతోందనీ గమనించాం మనం. ఈ 360 అనేది సంవత్సరంలో ఉన్న తిథుల సంఖ్య. అమ్మవారు తిథి మండల రూపిణి కదా.

ఈ అమ్మవారి కిరణాల ప్రకాశం సాధకుడి దేహాన్ని ప్రకాశింపజేస్తున్నది. అదీ అగ్ని, సూర్య, చంధ్ర ప్రభలతో.  ఇది పిండాండం అనబడే శరీరానికి సంబంధించిన విశేషం.

అలాగే అమ్మవారి కిరణాల ప్రకాశమే కనబడే బ్రహాండాన్ని ప్రకాశింపజేస్తున్నది. పగలు సూర్యుడు, సంధ్యావేళల అగ్ని, రాత్రులలో చంద్రుడు ఈ ప్రకాశాన్ని అందిస్తున్నారు.  తమేవ భాంత మనుభాతి సర్వం తస్యభాసా సర్వ మిదం విభాతి అని శ్రుతి ప్రమాణం (కఠవల్లి)

ఈ కిరణాల పంపకంలో ఒక తమాషా కనిపిస్తుంది. గత టపాలోని పట్టిక చూడండి. సూర్యఖండమూ అగ్నిఖండమూ కలగలసి ఉన్నాయి కదా.  సూర్యకిరణాలు మణిపూరాన్ని వదలి స్వాధిష్ఠానాన్ని ప్రవేశించాయి.  సంప్రదాయంలో సూర్యునిలో అగ్నికి అంతర్భావం అని చెబుతారు. కాబట్టి ఇక్కడ సమజసంగానే ఉందని గ్రహించాలి.

ఈ కిరణాలప్రస్తారంలో ప్రతికిరణానికీ సంప్రదాయంలో పేర్లు ఉన్నాయి.  ఆ పేర్లన్నీ శ్రీవిద్యా ఉపాసకులకు తప్ప మనకి అవసరం లేదు. అలాగే ఆ కిరణాలు అసలు ఏమిటి అన్న వివరాలూ ఉన్నాయి.  అవీ ప్రస్తుతానికి మనకు అవసరం లేదు.  

కాని ఒక్క విషయం మాత్రం చెబుతాను.  గమనించారా? అన్ని చక్రాలకూ కిరణాలు సరిసంఖ్యలో ఉన్నాయి.  దీనికి కారణం మాత్రం ప్రస్తావించుకుందాం. అందులో సగం అమ్మవారి తరపున, మరొక సగం అయ్యవారు సదాశివుడి తరపున చెప్పటం సంప్రదాయం. శక్తి పురస్సంగా పూర్వతంత్రం అనీ శివ పురస్సరంగా ఉత్తర తంత్రం అనీ చెబుతారు.  ఇవన్నీ విద్యా రహస్యాలు. వాటిజోలికి మనం పోవటం లేదు.

ఇలా కిరణాలన్నీ శివశక్తి సమ్మేళనాలు.  నిజానికి వారి కిరణాలు అనంతం, కాని కేవలం 360 మాత్రమే బ్రహ్మాండం అంతా ఏర్పరచి నడిపిస్తున్నాయి. పిండాండం అనేది బ్రహ్మాండం యొక్క ఒక నమూనా మాత్రమే అనీ సంప్రదాయం.

పస్తుతానికి ఈ శ్లోకానికి లఘువ్యాఖ్యను ముగించుకుందాం. ఇలా ఇంకా ఎంతైనా చెప్పవచ్చును కాని గ్రంథ విస్తృతి మంచిది కాదు కదా.

ఈ శ్లోకవ్యాఖ్యను మొత్తంగా అవసరమైతే మరొక కొన్ని సార్లు పఠించి అవగతం చేసుకోండి.
-

1 వ్యాఖ్య:

  1. ఆహా! ఎంత మంద బుద్ధినో ఎఱుకలో కొచ్చింది. ప్రయత్నం మళ్ళీ మళ్ళీ చేస్తాను, అర్ధం చేసుకుతీరతాను.

    ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.