31, అక్టోబర్ 2014, శుక్రవారం

అనంతమైన చదువు కథ

ఎంత చదివినా ఇంకా చదువవలసింది ఎంతో ఉంటుంది.

ఎంత తెలుసుకున్నా తెలియనిదే అనంతంగా ఉంటుంది.

తెలుసుకోవటం అన్నదానికి కాస్త గంభీరమైన మాట జ్ఞానసముపార్జనం.

ఎవరికైనా  తెలుసుకోవటానికి అంతం ఉంటుందా అని ఒక ప్రశ్న రావచ్చును.

ఈ రోజున కొండలరావుగారు ఈ ప్రశ్నను చర్చకు పెట్టారు.

నిజానికి తెలుసుకోవటానికి అంతేమీ ఉండే అవకాశం లేదు.

ఈ మాటను నిరూపించే కథ ఒకటి మహాభారతంలో ఉంది. దాన్ని ఒక సారి చెప్పుకుందాం.

ఒక ఋషికి జ్ఞానసముపార్జనం అంటే అమిత ప్రీతి. ఆయన తన జీవితకాలం అంతా ఎన్నో ఎన్నో విషయాలు చదివి తెలుసుకుంటూ, పెద్దలవద్ధ విని తెలుసుకుంటూ  జ్ఞానసముపార్జనం చేస్తూనే ఉండిపోయాడు.

ఆ ఋషికి అంత్యకాలం సమీపిస్తోంది. మునికేమీ గమనిక లేదు. చదువుకుంటూనే ఉన్నాడు.

స్వయంగా ఇంద్రుడు ప్రత్యక్షం ఐనాడు. ఓ ఋషివరా, చదివింది చాలేమో ఆలోచించుకో, నీ ఆయుఃప్రమాణం పూర్తికావస్తోంది అని హెచ్చరించాడు.

మునికి నిరుత్సాహం కలిగింది. అయ్యో,  ఇంకా చదవవలసింది ఎంతో ఉందే, అప్పుడే ఈ శరీరం పడిపోవటమా అని విచారించాడు.

ఇంద్రుడితో ఈ ముక్కే విన్నవించాడు. ఇంద్రుడు నవ్వి, సరే నయ్యా నీకు మరొక జీవితకాలం అయుఃప్రమాణం ఇస్తున్నాను, చదువుకో చదువుకో అని వెళ్ళి పోయాడు.

ఆ అయువూ తీరిపోవచ్చింది. మళ్ళీ ఇంద్రుడు వచ్చి హెచ్చరించటమూ జరిగింది.  ఋషికి ఇంకా చదువుకోవాలని ఉన్నది. మరొక సారి ఇంద్రుడు దయతో మరొక జీవితకాలాన్ని అనుగ్రహించాడు.

ఇలా మరలా మరలా జరుగుతూనే ఉన్నది. ఋషి కోరటమూ. ఇంద్రుడు వరం పొడిగించటమూ, మరలా ముని చదువులో మునిగితేలుతూ ఉండటమూ.

చివరికి ఇంద్రుడు ఇక లాభం లేదనుకున్నాడు.ఓ ఋషివరా, ఎంతకాలం ఇలా చదవా లనుకుంటున్నావో చెప్పవయ్యా అని నిలదీసాడు.

అంతా చదవాలి నేను అన్నాడు ఋషి.

అంతా అంటే అన్నాడు ఇంద్రుడు.

ఇంక తెలుసుకోవటానికి ఏమీ మిగిలి ఉండకూడదు. సమస్తమైన వేద విజ్ఞానమూ నాకు తెలియాలి అన్నాడు ముని.

అన్నట్లు వేదం అంటే తెలుసుకో దగినది అని అర్థం.

ఇంద్రుడు నవ్వాడు.జ్ఞానం సంపూర్ణంగా సంపాదించేదాకా చదవాలనే నా కోరిక అని ఋషి పునరుద్ఘాటించాడు.

ఇతడికి ఎలా చెప్పాలా అని ఇంద్రుడు కొంచెం యోచన చేసాడు.

ఓ ఋషిశ్రేష్ఠా నీకు దివ్యదృష్టిని అనుగ్రహిస్తున్నాను. అద్భుతమైన వేదరాశిని నీవు ఆ దృష్టి సహాయంతో వీక్షించు అన్నాడు.

ఒక అంతూ పొంతూ లేకుండా అఖండమైన దివ్యస్వరూపంతో దర్శనం ఇచ్చిన ఆ వేదరాశిని చూసి మునికి పరమానందమూ పరమాశ్చర్యమూ కలిగాయి. అది అనేక మహోన్నత శిఖరాలతో అలరారుతున్న పర్వతశ్రేణుల్లా ఉందనిపిస్తోంది. ఎటు చూసినా అది మరింత మరింతగా విస్తరించి  ఉంది.

ఆ అబ్బురపాటునుండి మెల్లగా తేరుకున్న తరువాత, చిరునవ్వుతో తననే తిలకిస్తున్న ఇంద్రుని కేసి తిరిగి ఒక ప్రశ్న వేసాడు ఋషి.

ఎంత గొప్పదర్శనం కలిగింది! మహాత్మా, ఇందులో నేను ఇప్పటిదాకా తెలుసుకున్నది ఎంత ఉన్నదీ దయచేసి చెప్పండి అన్నాడు.

శ్రీశచీపురరందర ఋషి అనుగ్రహపూర్వకంగా చూసి, వేదరాశిలోనుండి అక్కడక్కడా కొన్నికొన్ని పత్రాలను సేకరించాడు.

ఒక గుప్పెడు పత్రాలను తీసి ఋషికి చూపి, ఇదేనయ్యా ఇంతవరకూ ఇన్ని ఆయుర్ధాయాల అధ్యయనంతో నీవు గ్రహించిన వేదవిజ్ఞానం అని వెల్లడించాడు.

ఋషి అవాక్కైపోయాడు చాలా సేపు.

తరువాత ఇంద్రుడితో అన్నాడు, ప్రభూ, మీరు దయతో ఇచ్చిన ఆయుర్దాయాలు చాలును. ఈ అనంత వేదరాశి కేవలం భగవంతుడి స్వరూపం. ఆయనకు తప్ప ఇతరులకు తెలియనసాధ్యం అని అర్థం అయ్యింది. మీ కృపతో దానిని కొంతగా తెలుసుకున్నాను. ఇంక చదవటానికి లేదు తెలియటానికి ఏమీ మిగలలేదు అనేదాకా పోదామనుకోవటం అజ్ఞానం అని అర్థమయ్యింది. ఈ శరీరం ఇంక పడిపోవలసి ఉంటే అలాగే కానివ్వండి అన్నాడు.

ఋషిని అభినందించి వెళ్ళిపోయాడు ఇంద్రుడు.

మిగిలిన ఆయువును భగవచ్ఛింతనకు వెచ్చించటానికి నిశ్చయించుకున్నాడు ఋషి.


30, అక్టోబర్ 2014, గురువారం

శ్రీశైలజలవివాదంపై వనం వారి వ్యాసానికి తెలుగుసేత.

ముందుమాట


శ్రీ వనం‌ జ్వాలానరసింహారావుగారు 27న వ్రాసిన ఆంగ్లవ్యాసానికి ఇది తెలుగుసేత.

నిజానికి జ్వాలాగారే తెలుగులో ఈ‌ పనికూడా చేయవచ్చును.  ఆంగ్లంలో వ్రాయటానికి వారి కారణాలు వారివి. ఆంగ్లంతో ఇబ్బంది ఉన్న తెలుగుపాఠకుల కోసం దీన్ని యథామాతృకానువాదం చేసి ఇక్కడ ఉంచుతున్నాను.

మూలవ్యాసం: 

Decency not at the cost of State

తెలుగు అనువాదం

ఇది ఆంధ్రప్రదేశప్రభుత్వ ప్రజాసంబంధాల సలహాదారు పరకాల ప్రభాకర్ గారి అయాచితమైన నిరాధారమైన అందునా వారు తెలంగాణా ప్రభుత్వ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుగారిని నిందిస్తూ చేసినదీ ఐన ప్రకటనకు సంబంధించినది. ఆంధ్రప్రదేశ ప్రభుత్వానికి శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు సంబంధించిన జీవో 69, 107లను గౌరవించటంలో ఉన్న నిబధ్ధతను విమర్శించుతూ ఔచిత్యానికి సంబధించిన అన్ని హద్దులనూ కేసీఆర్ గారు మీరారని ప్రభాకర్‌గారు ఆరోపించారు. ఆయన తెలంగాణా ప్రభుత్వం ఆ జీవోలను అతిక్రమించిందని కూడా నిరాధారమైన నిందలు వేసారు.

కాని శీశైలం ప్రాజెక్టు కేవలం విద్యుదుత్పాదన కోసమనే రూపకల్పన చేయబడిన అందుకోసమనే నిర్మించబడిన సంగతీ, అంతే కాక, అసలు ఈ‌ ప్రాజెక్టు పేరే శ్రీశైలం జలవిద్యుదుత్పాక ప్రాజెక్టు అన్నది ఈ‌ విషయాన్ని విస్పష్టం చేస్తున్న సంగతీ‌, అంధ్రప్రదేశ పౌరసంబంధాల సలహాదారుగారు మరచిపోయారు. జీవో 69,107ల తరువాత వాటికి అదనంగా వచ్చిన జీవో 233 అప్పటి అంద్రప్రదేశ్ లోని సీమాంద్రప్రాంతం యొక్క స్వార్థప్రయోజనాలను పరిరక్షించటానికీ, తెలంగాణాకు అపారనష్టం కలిగించటానికీ ఉద్దేశించినది. తెలంగాణా రాష్ట్రం యొక్క, ముఖ్యంగా అందులోని ప్రజల యొక్క ప్రయోజనాల పరిరక్షణను పణంగా పెట్టి హుందాగా ఉండటం‌ కుదరదని ఒక పౌరసంబంధాల నిపుణుడిగా అయన తెలుసుకోవలసి ఉంది.

శ్రీశైలాన్ని కేవలం విద్యుత్తుకోసమైన ప్రాజెక్టుగా చూడాలా, కేవలం సాగు-త్రాగునీటి ప్రాజెక్టుగానే చూడాలా అన్నది నేడు వివాదంగా మారింది. ఎప్పుడో 1960లో, దేశం యొక్క విద్యుదవసరాలను తీర్చుకుందుకుగాని అప్పటి ప్రణాళికాసంఘం, శ్రీశైలంతో సహా దేశమంతా అనేక చోట్ల జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం గురించి అలోచించింది. ఈ‌ శ్రీశైలం ప్రాజెక్టు రూపకల్పనలొ ఎడమ కాలువక్రింద 900మెగావాట్లు, కుడి కాలువ క్రింద 770మె.వా విద్యుదుత్పత్తి లక్ష్యంగా చేసుకున్నారు. అందుచేత ఈ ప్రాజెక్టు కేవలం జలవిద్యుత్తు కోసమే. దీనిని బట్టి, ఈ‌ ప్రాజెక్టు రూపకల్పనలో, ఇందులో ఒక్క నీటిబొట్టు కూడా వేరే లక్ష్యాలకోసం ఉద్దేశించలేదని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టు 1981లో విద్యుదుత్పత్తిని మొదలు పెట్టింది. అందుకోసం జలాశయంనుండి వినియోగించబడిన నీళ్ళు అంతిమంగా నాగార్జునసాగర్ జలాశయం చేరుతాయి కాబట్టి నీరు వృధాగా పోవటం జరగదు. ఈ‌విధంగా శ్రీశైలం ప్రాజెక్టు కృష్ణాజలాలకు ఒక బేలెన్సింగ్ జలాశయంగా ఉపయోగంలోకి వచ్చింది. ఈ సం. 2014 జూన్ 2 నుండి తెలంగాణా రాష్ట్రం ఉనికిలోనికి వచ్చి, అప్పటినుండి మొదలు, ముందటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విధానాల కారణంగా కష్టాలు ఎదుర్కుంటూ ఉంది నేటికీ. ఈ శ్రీశైలం జలాల విషయంలోనూ జలవిద్యుదుత్పాదన విషయంలోనూ అమితశ్రధ్ధతో లోతుగా విశ్లేషణ చేయవలసి ఉంది. సముద్రంలో పెద్దపెద్ద మంచు దిబ్బలు తేలుతూ‌కనిపిస్తాయి కాని పైకి కనిపించేవి వాటి పరిమాణంలో అతిచిన్న ఉపరితలాలే - లోపల కొండలంత ఉంటాయి కాని. ఇప్పుడు బయటపడ్డ విషయం, ఈ శ్రీశైల జలవిద్యుత్తు ప్రాజెక్టు సంగతి అనేది కూడా, అనాదిగా తెలంగాణా ప్రాంతప్రజలకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించిన పైకి పేలిన అటువంటి వ్యవహారమే.

తెలంగాణాలో ఉన్న దారుణమైన విద్యుత్తు కొరతకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో ఇంతకు ముందువరకూ నడిచిన కాంగ్రెసు, టీడీపీ పార్టీలవారి లోపభూయిష్టమైన విధానాలే‌ కారణమని ఒక ప్రాథమికపాఠశాల విద్యార్థి కూడా అర్థం చేసుకోగలడు. తెలంగాణారాష్ట్రంలో విద్యుత్తు రంగానికి సంబంధించిన ఈ పరిస్థితికి ఆ రెండు పార్టీలదే‌ పూర్తి బాధ్యత. గత ఇరవై సంవత్సరాలలోనూ‌ఈ రెండు పార్టీల పాలకులూ తెలంగాణాలో ఒక్కటంటే ఒక్క మెగావాట్ విద్యుత్తును కూడా అదనంగా ఉత్పత్తి చేసిన పాపానపోలేదు. ఈ‌ నేపద్యంలో ఆవిర్భవించింది తెలంగాణారాష్ట్రం.

తెలంగాణాప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నింఛి నప్పటికీ, రాష్ట్రంలో ఇంకా విధ్యుత్తుకు కొఱత ఉంది. సమయానికి రైతులకు నిరంతరాయంగా విద్యుత్తు అందించకపోతే, అది కూడా పంటలు వేసే సమయంలో ఐనప్పుడు రైతులమీద ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతిమంగా అది తిండిగింజల కొఱతకు కారణం అవుతుంది. తెలంగాణా రాష్ట్రంలో సగటు విద్యుదవసరం 6,800 మె.వా ఉంది. నికరమైన ఉత్పత్తి, కేంద్రం ఇచ్చే వాటాలు కలిసి కేవలం 4,500 మె.వా ఉంది. లోటున భర్తీచేసుకుందుకు తెలంగాణా రోజువారీగా 760మె.వా కొనిగోలు చేస్తోంది. ఐనా సరే ఇంకా కొఱత ఉంది. తెలంగాణాకు అందుబాటులో ఉన్న జలవిద్యుత్తు 1000 మె.వా. ఇందులో 700 నుంది 800 మె.వా శ్రీశైలం నుండే వస్తుంది. అందుచేత తెలంగాణాకు ఇది అత్యంత ముఖ్య మైనది.

శ్రీశ్లైలం జలాశయంలో నీటిమట్టం తగ్గిపోతోందని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. సాగు నీటికీ, త్రాగు నీటికి ప్రాథాన్యతను ఇవ్వాలని కూడా ఆ ప్రభుత్వం వాదిస్తోంది. ఇది నిరాధారమైన వాదన. లభ్యంగా ఉన్న జలాల్లో త్రాగు సాగులకు ప్రాథాన్యత ఇవ్వాలన్నది నిజమే కావచ్చును. కాని, మనదేశంలో కొన్ని ప్రాజెక్టులు కేవలం విద్యుదుత్పత్తికోసమే నిర్మించబడ్డా యన్నది వాస్తవం. వీటిలో శ్రీశైలం ఒకటి. ఈ శ్రీశైలం కేవలం విద్యుదుత్పత్తి కోసమే రూపకల్పన చేయబడింది. ఈ ప్రాజేక్టు ఆలోచన నుండి నిర్మాణం దాకా ఎక్కడా ఒక్క టిఎమ్‍సీ కూడా వ్యవసాయం కోసం అని కేటాయించలేదు. తరువాత కాలంలో, కృష్ణాకు తరచుగా వరదలు వస్తాయనీ, వరదకారణంగా అదనంగా నీరు పుష్కలంగా లభ్యం అవుతుందనీ ఒక వాదన వచ్చింది. ఈ నీళ్ళను వాడుకుందుకు అప్పటి రాష్ట్రప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుంది. అదనపు నీటి వాడకం హక్కు అనేది తెరమీదకు వచ్చింది. అదనపు నీళ్ళూ వరదనీళ్ళూ అంటూ ఉన్న వాదన ప్రక్కకు బెట్టి క్రమంగా శ్రీశైలం ఒక వ్యవసాయం కోసమైన ప్రాజెక్టుగా చూడటం మొదలయ్యింది. చివరికి ఈ వాదన ఆధారంగనే జలాల పంపకం జరగటం జరుగసాగింది.

శ్రీశైలం నుండి ఇతర ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని నిర్ణయించటం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం 19 టీఎమ్‍సీలు కె.సి.కాలువకు, 15 టీఎమ్‍సీలు తెలుగుగంగకు, అంటే మొత్తం మీద ఆంద్రాకు 34టీఎమ్‍సీలు పోతున్నాయి శ్రీశైలం నుండి. అలాగే 25 టీఎమ్‍సీలు కల్వకుర్తికి, 20టీఎమ్‍సీలు భీమాకు, 22టిఎమ్‍సీలు నెట్టంపాడుకు, 30టిఎమ్‍సీలు SLBCకి తెలంగాణా వాటాగా మొత్తం 97టీఎమ్‍సీలు కేటాయించారు. ఐతే సీమాంధ్రుల పాలనలో తెలంగాణాలో ప్రాజెక్టులు కట్టలేదు.  అందుచేత 97టీఎఎమ్‍సీలు తెలంగాణా వాడుకో లేక పోయింది.  ఉన్నవి 34టీఎమ్‍సీలే ఐనా ఆంద్రాలో మాత్రం పులిచింతల, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ప్రాజెక్టులు కట్టి అక్రమంగా శ్రీశైలం జలాలను తరలించుకు పోయారు. ఈ దోపిడీ ఇంకా నడుస్తూనే ఉంది. తెలంగాణా తనకు హక్కుగా ఉన్న జలాలను వాడుకోలేకపోతోంది. తమకు హక్కు లేని జలాలను ఆంద్రావారు మాత్రం వాడుకుంటున్నారు. ఈ యేడాది కూడా ఆంద్రాప్రభుత్వం అక్రమంగా 60టీఎఎమ్‍సీ జలాలను తరలించుకు పోయారు. తెలంగాణా మాత్రం కనీసం 10టీఎమ్‍సీలు కూడా వ్యవసాయానికి వాడుకోలేక పోయింది. తెలంగాణాకు జలాల నిచ్చే ప్రాజెక్టులు మాత్రం కట్టబడలేదు.

రాష్ట్రవిభజన తరువాత, రెండు రాష్ట్రాలకూ దీనిమీద హక్కు ఉంది కాబట్టి, శ్రీశైలం ఇరురాష్ట్రాలకూ ఉమ్మడి ప్రాజెక్టు అయ్యింది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలూ పరస్పరం ఆవలి వారి హక్కుల్ని గౌరవించాలి. తనకు ఉన్న హక్కు కారణంగా తెలంగాణా శ్రీశైలం ఎడమ కాలువ ద్వారా 900 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలదు. ఇలా తన హక్కును వినియోగించుకునే కమంలో ఎన్నడూ తెలంగాణా తన హద్దుల్ని మీరలేదు. తన కోటాగా కేటా యించబడిన జలాలను గత ప్రభుత్వాలు ఇచ్చిన 69, 107, 233 నంబర్ల జీవోల ప్రకారమే వాడుకుంది. నిజానికి కృష్ణా జలలాలో ట్రిబ్యునల్ వారిచ్చిన కోటా తెలంగాణాకు 261.9 టీఎమ్‍సీ. ఇందులో నికరజలాలు 184.9 కాగా అదనపు వరద నీరు 77టీఎమ్‍సీలు. ఇంతవరకూ తెలంగాణా వాడుకున్నజలాలు మహాఐతే 75.67టీఎమ్‍సీ మాత్రమే . ఉంటాయి. ఇలాగైతే ఖరీఫ్ పంటకు మరొక 26టీఎమ్‍సీల నీళ్ళు కావలసి ఉంటుంది.

జీవో 107 ప్రకారం శ్రీశైలంలో కనీసం 854 అడుగుల మట్టం నిల్వ ఉంచాలి. గతంలో చంద్రబాబు ప్రభుత్వం జీవో 69 ఇస్తూ 834 అడుగులు ఉంటే చాలని నిర్థారించింది. తెలంగాణా ప్రభుత్వం ఈ జీవోలను అతిక్రమించలేదు. ఇప్పుడు కూడా శ్రీశైలంలో 857 అడుగుల నీళ్ళున్నాయి. రోజూ విద్యుదుత్పత్తికి గాను కొన్ని నీళ్ళు ఖర్చు అవుతున్నాయి. ఇందులో తప్పేమీ లేదు. ఆంద్రాప్రభుత్వం మరియు కృష్ణాజలాల నిర్వహణా బోర్డు వారి ప్రకారం వ్యవసాయానికే ప్రాథాన్యత ఇవ్వాలి. సరే, ప్రస్తుతానికి ఈ వాదాన్నే ఒప్పుకుందాం. మరి తెలంగాణా శ్రీశైలం జలాలను ఎందుకు వాడుతోంది? విద్యుత్తు కోసం కదా. ఆ విద్యుత్తు దేనికీ? రైతుల వ్యవసాయ అవసరాల కోసం కాదా? నేరుగా లభ్యజలాలనే వాడుకుందుకు తెలంగాణాలో ప్రాజెక్టులే లేవు. వ్యవసాయానికి గాను ఉన్నవి బోరు బావులే. కరంటు ఉందంటేనే ఆ బావులలోంఛి నీళ్ళు వస్తాయి. ఈ బోరు మోటార్ల వల్ల 500 టీఎమ్‍సీల నీళ్ళు వస్తున్నాయి వ్యవసాయానికి, ఈ పంపుసెట్ల వల్ల 40లక్షల ఎకరాలే సాగులోనికి వస్తున్నప్పటికీ. శ్రీశైలం నుండి కొద్ది పాటి నీళ్ళు మాత్రమే తెలంగాణా తీసుకుంటున్నా వాటిసహాయంతోనే అంతకన్నా అనేక రెట్ల జలసంపదను వ్యవసాయానికి అందించటం జరుగుతోంది.

ఈ నీళ్ళతోనే తెలంగాణా విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. కాబట్టి శ్రీశైలం నుండి తెలంగాణా తీసుకుంటున్న నీళ్ళను వ్యవసాయం కోసమే అని భావించవలసి ఉంటుంది. అందుకని 854 అడుగుల నిబంధనను కూడా తొలగించాలి. ఆంధ్రాప్రభుత్వమూ, కృష్ణాజలాల బోర్డూ కూడా శ్రీశైలం నీటిని వ్యవసాయం కోసం అని చెబుతున్న దానిని తెలంగాణా కూడా బలపరుస్తోంది. తెలంగాణాకు 834అడుగుల వరకూ నీటిని వాడుకుందుకు హక్కు ఉండాలి. ఆంధ్రాప్రభుత్వమూ, కృష్ణాజలాల బోర్డూ వాస్తవిక ధృక్పధంతో ఆలోచించాలి. ఇక్కద మరొక విషయం ఏమిటంటే ఇప్పుడున్న ప్రాజెక్టులూ, వాటికి నీటి కేటాయింపులూ, వాటి నిర్వహణా అన్ని విషయాలూ కూడా సంయుక్ర ఆంధ్రప్రదేశ ప్రభుత్వం చేత నిర్ణయించబడ్డాయి. ఆ పాత ప్రభుత్వాలు తెలంగాణా రైతులగురించి పట్టించుకోకుండా పక్షపాతంతో వ్యవహరించాయి. అన్ని విషయాలనూ సీమాంధ్రకోణంలోంచి మాత్రమే చూడటం జరిగింది. చివరకి హైదరాబాదుకు, తెలంగాణాకూ త్రాగునీరు ఇవ్వటంలో కూడా పక్షపాతం చూపటం జరిగింది. ఈ కారణంగా, తెలంగాణా ప్రభుత్వం కృష్ణాజలాల కేటాయింపులు, వినియోగాల విషయంలో మరొక సారి పరిశీలన చేయవలసిందిగా కృష్ణాజలాల బోర్డుకు విజ్ఞప్తి చేసింది. దానికి వారు కూడా అంగీకరించారు. కేటాయింపుల్లో మార్పులు రాబోతున్నాయి. అంతవరకూ, తెలంగాణా రైతుల పంటల్ని కాపాడేండుకు గాను, శ్రీశైలం జలాలను 834అడుగుల వరకూ వాడుకుందుకు తెలంగాణాకు హక్కు ఉండాలి. ఇలా విద్యుత్తు కోసం తెలంగాణా వాడుకున్న నీటిని తెలంగాణా కోటాలో జమకట్టుకోవచ్చును. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణా రైతులపట్ల ద్వేషం ఉండకూడదు, ఆ ద్వేషంతో వారిని బాధించకూడదు.

శ్రీశైలంలో విద్యుదుత్పాదనను ఆపివేస్తే తెలంగాణాకు 300 మె.వా విద్యుత్తుని ఇస్తానని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదన విడ్డూరంగా ఉంది. ఇది విషయాన్ని తప్పు దారి పట్టించేదిగా ఉంది. ఎందుకంటే, రైతులకు రోజూ ఐదు లేదా ఆరు గంటల పాటు విద్యుత్తుని ఇవ్వాలంటే 800 మె.వా విద్యుత్తు ఉత్పత్తి చేస్తేనే అది సాధ్యపడుతుంది. ఇది వదలుకుని 300 మె.వా తీసుకుందుకు అంగీకరిస్తే, రోజుకు నాలుగు గంటలు ఇవ్వటం కూడా సాధ్యం కాదు. తెలంగాణా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ యొక్క దయా భిక్షం కోరుకోవటం లేదు. అది తన హక్కును నిలబెట్టాలనే కోరుతోంది. తనకు హక్కుగా రావలసిన 54శాతం విద్యుత్తు కోటాను కోరుతోంది. కృష్ణపట్నంతో సహా అన్ని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలలోనూ తనకు ఉన్న న్యాయమైన వాటాను కోరుతోంది.


(గమనిక: ఇది యథామాతృకానువాదం అంటే అనువాదాన్ని సాధ్యమైనంతగా మూలానికి సరిపోలేలాగు చేసాను. సందేహ నివృత్తి అవసరం అనుకున్న చోట్ల మూలాన్ని పరిశీలించగలరు. ఈ అనువాదం పట్ల వనంవారికి అభ్యంతరం ఉంటే, ఈ టపాను తొలగించవలసి ఉంటుంది.)

29, అక్టోబర్ 2014, బుధవారం

సౌందర్యలహరి - 22 భవాని త్వం ....



మొదటి శ్లోకంవెనుకటి భాగంతదుపరి శ్లోకం

22


భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా
మితి స్తోతుం వాంచన్ కథయతి భవాని త్వమితి యః
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం
ముకుందబ్రహ్మేంద్రస్ఫుటముకుటనీరాజితపదామ్


ఈ శ్లోకంలో శ్రీశంకరులు అమ్మను స్మరించటం అనేది ఎంత మహత్తరమైన ఫలితాన్నిస్తుందో తెలియ జేస్తున్నారు.

యః అంటే ఏ భక్తుడైతే భవాని త్వం దాసే, మయి సకరుణా దృష్టిం వితర అని  అనగా అమ్మా భవానీ త్వం అనగా నీకు దాసే అనగా దాసుడను ఐన మయి అంటే నాయందు సకరుణా అనగా కరుణ కలిగి దృష్టిం అనగా కనుచూపును వితర  అంటే ఇవ్వమ్మా అని ఇతి స్తోతుం వాంఛతి ఈ విధంగా ప్రార్థించాలని కోరుకుంటూన్నాడో  అని అటువంటి వాడికి అమ్మ అనుగ్రహం ఎంత విశేషంగా లభిస్తోందో చెనబుతున్నారు.

ఇలా ఒక భక్తుడు అమ్మను ఉద్దేశించి ప్రార్థించటానికి పూనుకున్నాడు. కథయతి భవాని త్వం ఇతి అంటే భవానీ నీవు అని ఇలా తస్న్మై తదైవ అంటే ఆ మాటను అలా పలకటం మొదలు పెట్టగానే గొప్ప భాగ్యాన్ని ప్రసాదిస్తున్నావు అంటున్నారు.  అది ఎటువంటి భాగ్యమో చూడండి శ్రీశంకరులు చెబుతున్నారు.

అమ్మ పాదాలు ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట ముకుట నీరాజితములు.  అంటే అమ్మ పాదాలకు నిత్యం విష్ణువూ, బ్రహ్మ గారూ, ఇంద్రుడూ నమస్కారాలు చేస్తూ ఉంటే వారి స్ఫుట ముకుటములు అంటే వారి నెత్తిన ఉన్న మణి ప్రభలతో వెలిగిపోయే కిరీటాలు కూడా అమ్మ పాదాలకు మణిహారతులు ఇస్తూ ఉంటాయి అని శ్రీ శంకరులు చెబుతున్నారు.

అటువంటి వైభవం కలిగిన అమ్మ పాదాల నిజ సాయుజ్య పదవీం అనగా తన యొక్క పాదాల సాయుజ్యాన్ని ఆ భక్తుడికి దిశతి అనగా అనుగ్రహిస్తున్నదట.

ఇక్కడ ఒక చమత్కారం గమనించండి నిత్యం నమస్కారాదులు చేస్తూ స్తోత్రపాఠాలు చేస్తున్నా బ్రహ్మాదులకు అమ్మ సాయుజ్యం ఇవ్వనే లేదు. కాని అమ్మా నువ్వు అంటూ ఒక భక్తుడు స్తోత్రం చేయబోగానే అతడికి ఏకంగా సాయుజ్యం అనుగ్రహించింది. అదీ అమ్మ యొక్క కరుణావిశేషం.

మరొక ముఖ్యమైన సంగతిని కూడా ఇక్కడ శ్రీశంకరులు తెలియజేసారు. భవాని త్వం అనగానే అమ్మ వేంఠనే సాయుజ్యం ఇచేస్తోంది అని. ఎందుకంటే ఇక్కద భవానిత్త్వం అన్నదానిలో శ్రీశంకరులు తత్త్వమసి అనే మహావాక్యం స్ఫురిస్తోంది అని చెబుతున్నారు.  ఈ  "తత్త్వం అసి" , " అనే మహా వ్యాక్యం యొక్క్ అర్థం నేను నీవే అవుచున్నాను అని అనటం. కాబట్టి భక్తుల కోరిక తీర్చే కరుణామూర్తి ఐన అమ్మ అలాగే నాయనా అని వెంటనే తనతో ఏకత్వాన్ని అనుగ్రహించేస్తోందిట, భక్తుడి ఇలా స్తోత్రం చేయాలని మొదలు పెట్టగనే,

ముక్తి ప్రథానంగా నాలుగు రకాలు, సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అని.  వీనిలో ఒకదానికంటే దానితరువాతది ఉత్తమం అన్నమాట. సాలోక్యం అంటే భగవంతుడు ఉండే లోకం చేరుకోవటం. సామీప్యం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండి సేవచేయగలగటం, సారూప్యం అంటే ఇష్టదైవం రూపాన్ని పొందటం. సాయుజ్యం అంటే ఏకంగా ఇష్టదైవంలో లీనం ఐపోవటం.  ద్వైతులకు ఇష్టమైనది సామీప్య ముక్తి. విశిష్టాద్వైతులకు ప్రీతికరమైనది సారూప్య ముక్తి, అద్వైతులకు సాయుజ్యమే కోరిక.

భాగవతపురాణంలో కూడా అజామీళుడు కేవలం నారాయణా అని నామస్మరణం చేసినంత మాత్రానే ఆయన ముక్తిని అనుగ్రహించాడని కథనం ఉంది కదా. ఇంతకూ అజామీళుడు పిలచినది శ్రీమన్నారాయణమూర్తిని కాక కేవలం తన కుమారుణ్ణే. ఐనా సరే ఆ నామస్మరణమే అతడికి ముక్తిని ఇవ్వగలగింది.  కలౌ స్మరణా న్ముక్తిః అని సూక్తి.

ఈ శ్లోకానికి రోజుకు వేయి సార్లు చొప్పున నలభైఐదు రోజులు పారాయణం. నైవేద్యం తేనె, పాలు, త్రిమధురం, పాయసం. ఫలం ఇహలోకవాంఛాపరులకు సర్వవైభవాలతో జీవితం, ముముక్షువులకు అమ్మ అనుగ్రహంతో సాయుజ్యం.

28, అక్టోబర్ 2014, మంగళవారం

స్వర్గంలో ముని - 5

*        *        *        *        *
సూర్యారావుగారు ఓ నాలుగు కిరణాలు కొంచెం నునువెచ్చగా వడ్డించేసరికి బాహ్యప్రపంచంలోనికి వచ్చాడు ముని.

ఇదంతా కలా! అని ఆశ్చర్యంతో తలమునకలై పోయాడు,

ఎంత మంచి కలా అని అనుకోబోయాడు కాని అంతలోనే ఇదసలు మంచికలేనా లేక పీడకలా అన్న అనుమానమూ వచ్చింది. 

ఎంత చెడ్డా ఇంద్రుడనేవాడు దేవతలందర్లోనూ గొప్పవాడు.  ఆయనంత వాడు కల్లోకి రావటం మంచిదే కదా అని ఒకప్రక్క తృప్తిగా అనిపించింది.

కాని ఈ‌ ఇంద్రుడనే వాడు గొప్ప చిక్కులమారి.  ఏదో వంకపెట్టి అందరి తపస్సులూ చెడగొట్టేస్తూ ఉంటాడు. ఈ విషయం బోలెడు పౌరాణిక కథల్లో చదివాడు తను.  ఇప్పుడా ఇంద్రుడు నీకు పరీక్షపెడుతున్నా కాసుకో అంటే అదేం‌ మంచి కలా?  పైగా ఇంద్రుడెప్పుడూ అప్సరసల్ని పంపించి మునుల మతులు పోగొట్టి వాళ్ళ తపస్సులు తుస్సుమనిపిస్తూ ఉంటాడని ఈ‌ కథలన్నింటిలోనూ ఖరాఖండీగా రాసిపెట్టి ఉంది.  తన కల్లోనూ ఎవరో అమ్మాయిని రప్పించి వీణ్ణి పరీక్షించూ అని చెప్పేసి చక్కాబోయాడు.  అదెవరో అప్సరసే అయ్యుంటుంది.  తన తపస్సు విఫలం చేసిపారెయ్యటమే ఆ పరీక్ష ఉద్దేశం.  అంచేత ఇది తప్పకుండా పీడకలే.

అన్నింటికన్నా ముఖ్యమైనది తెల్లవారగట్ల వచ్చిన కలలు నిజం అవుతాయంటారు.  అందుచేత ఇదేదో‌ కొంపముంచే వ్యవహారాన్ని సూచించే పీడకలే.  ఇంకొంచెం జాగ్రత్తగా మెలుకువతో ఉండి తపస్సు చేయాలి.

ఇలా మెల్లగా మనస్సు దిటవు చేసుకుంటూ లేచి, ఓ‌ తుండుగుడ్డ భుజాన వేసుకొని ఏటికి స్నానానికి బయలుదేరాడు ముని.

గుమ్మందాకా వచ్చినవాడల్లా ఏదో‌ అనుమానం వచ్చినట్లుగా కొంచెంగా వెనక్కి తిరిగి చూసాడు. ప్రక్కగదిలో ఉండవలసిన చెక్క కుర్చీ ఆ గదిలోనే కూలబడి ఉంది.

ఐతే కలకాదా?

అయోమయంలో పడిపోయాడు ముని.  అదే అయోమయావస్థలోనే సరిగ్గా ముందుకి తిరక్కుండానే ఓ అడుగు వేసాడు గుమ్మంలోంచి బయటికి.

లోపలికి వస్తూ‌ ఎదురొచ్చిన శాల్తీని దాదాపు గుధ్ధుకున్నంత పనయింది.  ఐతే అలా గుద్దుకోవటం జరగలేదూ అంటే అది ఆ శాల్తీ‌ యొక్క సమయస్ఫూర్తి తప్ప ముని ప్రజ్ఞ మాత్రం‌ కాదు.

అయ్యయ్యో‌ అయ్యగారూ‌ అనేసి ఆ శాల్తీ చెంగున ప్రక్కకి దూకింది.

కొంచెం సేపు ఏం‌ జరుగుతోందో‌ ఏమీ‌ అర్థం కాలేదు మునికి.

ఎవర్నో గుద్దేసినంత పని జరిగినందుకు మరింత గాభరా పడ్డాడు.

మెల్లగా ఇహలోకంలోనికి వచ్చి గుమ్మం దగ్గర కొంచెం‌ ప్రక్కగా నుంచున్న శాల్తీకేసి చూసాడు.

మతి పోయి నంత పనయింది.

మరోసారి అనుమానంగా వెనుతిరిగి కుర్చీ కేసి చూసాడు.  అది కూలబడే ఉంది.

మరలా ఇటు తిరిగి గుమ్మం ప్రక్కన ఉన్న శాల్తీ‌ కేసి చూసాడు.

ఇంక పోవటానికి మతి ఏమీ‌ మిగిలినట్లు లేదు.

*        *        *        *        *

25, అక్టోబర్ 2014, శనివారం

సౌందర్యలహరి - 21 తటిల్లేఖాతన్వీం.. (కొనసాగింపు)



మొదటి శ్లోకంవెనుకటి భాగంతదుపరి శ్లోకం
తటిల్లేఖా తన్వీం...  అనే శ్లోకంలో ఇంతవరకు మనం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్ అన్న ప్రస్తావనను గూర్చి చర్చించుకున్నాం.  ఆరు కమలాలకు పైనున్న దిగా వర్ణించారు కాబట్టి అది సహస్రారకమలం అన్న భావంలో తీసుకున్నాం.

ఆచార్యులవారు కూడా ఇది సహస్రారం అన్న విషయాన్ని ఈ‌ శ్లోకంలో స్పష్టంగానే చెబుతున్నారు.  మహాపద్మాటవ్యాం నిషణ్ణాం అని అక్కడ ఉన్నది అమ్మ అని. మహాపద్మం అనే అడవి.  వేయి రేకుల పద్మం అనే అర్థంలోనే అచార్యులవారు ఇక్కడ సహస్రారం గురించి చీబుతున్నట్లుగా స్పష్టంగానే ఉందిగా.   మనం ముందు చెప్పుకున్న సహస్రారపద్మంలోని చంద్రమండలస్థానం ఈ‌ పద్మం యొక్క కర్ణిక అంటే మధ్యన ఉండే భాగం. అక్కడ ఆసీనురాలై ఉంటుంది భగవతి అని చెబుతున్నారు.

ఈ సహస్రారపద్మకర్ణికాంతర్గత చంద్రమండలంలో ఉండే సదాఖ్య అనబడే అమ్మయొక్క దివ్యమైన కళ ఎలాటిదంటే, అది తటిల్లేఖా తన్వీం అని చెప్పారు శ్రీశంకరులు.  తటిత్ అంటె మెఱుపు.  తట్టిల్లేఖ అంటే మెఱుపు తీగె. అటువంటి తనువు అనకా ఆకారం కలది అట.  ఇక్కడ రెండు సంగతులు ఉన్నాయి, మొదటిది మెఱుపుతీగలాగా అత్యంత దీర్ఘంగా సన్నగా ఉంటుందనేది. కాగా, రెండవది, మెఱుపు తీగ లాగా కేవలం క్షణకాల్తం మాత్రమే దర్శనభాగ్యం అనుగ్రహించేది అని.

ఈ మెఱుపుతీగ వెలే తృటికాలం దర్శనం ఇచ్చే అమ్మ తపనశశివైశ్వానర మయి అట. తపనుడు అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు. వైశ్వానరుడు అంటే అగ్ని.  ఈ మూడు తేజస్సులూ కలగలసిన ప్రకాశం అని చెబుతున్నారు.  ఇంతకు ముందే చక్రాలను గురించి వివరించుకున్న సందర్భంలో సూర్యచంద్ర అగ్ని ఖండాల ప్రసక్తి వచ్చినప్పుడు షట్చక్రాలనూ ఈ మూడు ఖండాలుగా విడమరచి తెలుసుకున్నాం.  అంటే ఇక్కడ మనం అన్వయించుకోవలసిన సంగతి ఏమిటి?  అమ్మ ఇక్కడ ఆరుచక్రాలయొక్క తత్త్వాలనూ తానే కలిగి, వాటిని అధిగమించి ఏడవదైన సహస్రారంలోని చంద్రమండలంలో ఉన్నది అని.

ఆ భగవతి యొక్క దర్శనం ఎటువంటి వారికి మాత్రమే దొరకగలదో చెప్పటానికి ఆచార్యులవారు మహాంతః  పశ్యంతః మృదితమలమాయేన మనసాః అన్నారు.   ఇక్కడ మలములు అనగా కామము, క్రోధము,లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే అరిషడ్వర్గాలూ, మాయ అని చెప్పబడినవి అస్మితా, అహంకారము, అవిద్యా అనేవి.  వీటిని మృదితము చెసినవారు అనగా తొలగించుకున్న మహాంతః అంటే మహాత్ములైన వారు మాత్రం మనసాః తమతమ అంతఃకరణములలో భగవతి దర్శనం పొందగలరని అంటున్నారు. 

ముందే చెప్పుకున్నాం కదా, ఇక్కడి భగవతీ స్వరూపం అమృతాన్ని ఇస్తుందని.  చంద్రమండలం అమృతస్థానం అని కూడా చెప్పుకున్నాం కదా.  ఇలా అమృతధారలు కురిపించే అమ్మ యొక్క దివ్యప్రకాశాన్ని సర్వాత్మనా అన్ని వికారాలనూ జయించిన మహాత్ములే పొంది ఆనందిస్తున్నారని శ్రీశంకరులు చెబుతున్నారు.

అందుకనే అమ్మయొక్క దర్శనాన్ని పరమాహ్లాదలహరీమ్‌ అని స్పష్టికరిస్తున్నారు.  ఇంతకంటే ఉన్నతమైన ఆనందం లేదు అని చెప్పదగినది ఈ‌ దర్శనం ఇచ్చే ఆనందం.  అమ్మదర్శనం క్షణకాలం కలుగవచ్చును.  కాని అంతులేని ఆనందం యొక్క ప్రవాహం మాత్రం ఆ మహాత్ముల మనస్సులలో స్థిరంగా ఉంటుందని చెప్పటానికి మహాంతః పశ్యంతో దధతి అని అన్నారు. దధతి అనగా స్థిరంగా ధరించి ఉంటున్నారు అని అర్థం.

ఈ శ్లోకానికి రోజూ వేయి సార్లు చొప్పున నలభైఐదురోజులు పారాయణం.  నైవేద్యం తేనె, బెల్లం, అరటిపండ్లు ఫలసిధ్ధి సకల జనామోదము, శత్రుబాధానివారణం.

24, అక్టోబర్ 2014, శుక్రవారం

ఈశ్వరా యింక నీవె రక్షించవలయు







ఈ  గురు వింతవా డా గురు వంతవా
     డన విని పరుగున జనెడు వాడు

ఆ రాయి ధరియించు డీ రాయి ధరించు
     డనెడు జోస్యుల మాట వినెడు వాడు

హరుని విసర్జించి హరిని విసర్జించి
     క్రొత్త దేవుళ్ళను కొలుచు వాడు

విజ్ఞానవాదంబు లజ్ఞాన వాదంబు
     లురు ప్రజ్ఞ వినిపింప నురుకు వాడు

దైవ మిచ్చిన నూఱేండ్లు దారిదప్పి
తిరుగు చున్నాడు తనదైన దివ్యతత్త్వ
మఱయ నీయని మాయచే నార్తు డగుచు
ఈశ్వరా యింక నీవె రక్షించవలయు







సౌందర్యలహరి - 21 తటిల్లేఖాతన్వీం ...




మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం


21

తటిల్లేఖాతన్వీం తపనశశివైశ్వానరమయీం
నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలామ్
మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా
మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీమ్


ఈ శ్లోకంలో శ్రీశంకరులుసూక్ష్మధ్యానం అనే ధ్యానవిశేషానికి సంబంధించిన ప్రక్రియను గురించి చెబుతున్నారు.

అమ్మా భగవతీ, షణ్ణాం‌ అపి ఉపరి కమలానాం అంటే ఆరుచక్రాలకూ పైనున్న సహస్రారకమలంలో ఉన్నటువంటి తవ కలామ్‌ నీ‌యొక్క సదా అనే పేరుకల కళను మహాంతః అనగా మహానుభావులైన యోగీశ్వరులు పశ్యంతః అంటే చూస్తున్నారూ అని చెబుతూ శ్రీశంకరులు ఆ సాదాఖ్య కళావైభవాన్ని మహిమనూ ప్రస్తుతి చేస్తున్నారు.

ఇక్కడ చెప్పబడిన ఆరు చక్రాలగురించి మనం ఇప్పటికే గడచిన శ్లోకాలలో తెలుసుకున్నాం కదా. అవి మూలాధారము, స్వాధిష్ఠానము, మణిపూరకము, అనాహతము, విశుధ్ధము, ఆజ్ఞ అనేవి అని. అంతే‌కాదు అవి మానవశరీరంలో ఉండే ప్రదేశాలను గురించి కూడా ఇప్పటికే ముచ్చటించుకున్నాం.  అలాగే ఆ ఆరు చక్రాలకు పైన శిరస్సులో పైభాగాన సహస్రారం అని ఒక కమలం ఉంటుందని కూడా చదువుకున్నాం. 

ఇక్కడ ఆచార్యులవారు అపి ఉపరి అని అనటంలో ఈ‌ చక్రాలలో ప్రతి రెండు చక్రాలకూ పైన ఒక గ్రంథిచొప్పున ఉండే రుద్ర, విష్ణు, బ్రహ్మగ్రంథులనూ కూడా స్మరించినట్లుగా మనం భావించాలి. ఎందుకంటే సహస్రారం అన్నింటికంటే పైన ఉండేదే కదా.

ఇక్కడ చెప్పబడిన అమ్మ యొక్క కళను సదా అని ఈ శ్లోక వ్యాఖ్యానంలో ఇప్పటికే చెప్పటం జరిగింది. సహస్రారకమలంలో చంద్రుడు ఉంటాడు. ఈ చంద్రుడు నిత్యం పూర్ణచంద్రుడు. కళాతు షోడశో‌భాగః అని చెబుతారు. ఒక కళ అంటే ప్రకాశమానమైన వెలుగులో పదహారవవంతు అని. ఎందుకో మొదట చూదాం. మనకి తెలిసి తిథులు పదిహేను. శుక్లపక్షంలో చంద్రుడు ప్రతిపత్ అంటే‌ పాడ్యమి నుండి పదిహేను రోజులు రోజున కోక కళగా పెరుగుతూ పౌర్ణమాసీ అనగా పున్నమి నాటికి పూర్ణచంద్రుడు అవుతాడు. దానికి విలోమంగా కృష్ణప్రతిపత్ నుండి పదిహేను రోజులపాటు రోజున కొక కళ తరుగుతూ అమావాస్య నాటికి అదృశ్యుడౌతాడు. ఇలా రెండుపక్షాల్లోనూ కూడా పదిహేను కళలు చొప్పున కనిపిస్తున్నాయి. అంటే చంద్రకళలు పదిహేను అన్నమాట.  అటువం టప్పుడు  కళలు పదహారు అన్న సిధ్ధాంతం ఎలా వచ్చింది?

సరే, అమావాస్య నాడు చంద్రుడు కనబడకుండా పోతున్నాడు.  లేకుండా పోతున్నాడా?  ఉండే ఉండాలి కదా?  లేకుండా పోతే, లేని చంద్రుడికి వృధ్ధిని ఎలా చెప్పటం కుదురుతుంది నాటి నుండి? కాబట్టి చంద్రుడు అన్నవాడు ఉన్నాడు. కాని చాలా హీనంగా కనబడేందుకు వీలు లేనంత శోభారహితంగా ఉన్నాడు. అంతే. అందుచేత కళలు పదహారు అన్నారు. మిగిలిన పదిహేను కళలూ‌ వస్తూ పోతూ ఉంటాయి. చంద్రుడు పౌర్ణమి నాడు షోడశకళాప్రపూర్ణుడు. ఆ చంద్రుడే, అమావాస్య నాడు ఆ కనబడని కళ మాత్రమే మిగిలినవాడు.  ఈ పదహారవదీ, నిత్యమూ చంద్రునికి ఉన్నదీ ఐన కళనే సదా అని నిత్య అనీ అంటారు. దీనినే సంప్రదయంలో షోడశీ అనీ ధృవకళ అని కూడా అంటారు.

అమ్మ సహస్రారకమలంలో ఉన్న చంద్రమండలంలో ఉంటుంది.  లలితాసహస్రనామాల్లో చంద్రమండల మధ్యగా అని ఒక నామం ఉంది. ఈ చంద్రుడు పదహారు కళలూ‌ ఉన్న పూర్ణచంద్రుడు. ఈ‌ చంద్రుని యొక్క షోడశీ లేదా సదా కళ సాక్షాత్తూ అమ్మవారి యొక్క స్వరూపమే.

శ్రీ చక్రంలో మధ్యన ఉండేది బిందువు. ఈ బిందువుకు సహస్రారకమలంలో  ఉన్న ఈ‌ చంద్రమండలంతో  సమన్వయం.  ఈ శ్లోకలంలో‌ షణ్ణాం అని ఆరుచక్రాలనూ స్మరించటం జరిగింది కాబట్టి మరికొంత వివరంగా చూదాం. అజ్ఞా చక్రానికి శ్రీచక్రంలో బిందువు మీది త్రికోణంతో సమన్వయం. విశుధ్ధి చక్రమే అష్టకోణచక్రం.  అనాహతచక్రమే అంతర్దశారం.  మణిపూరకం బహిర్దశారం. స్వాధిష్ఠానం చతుర్దశారం. మూలాధారమే శ్రీచక్రం యొక్క భూపురం.  ఇలా మూలాధారాది కమలాలను శ్రీచక్రంతో సమన్వయం చేయటానికే స్థూలచక్రమేళనం అని పేరు.

సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క విషయం గుర్తు చేయవలసి ఉంది.  అగ్ని సూర్య చంద్రాది నామాలు అన్నీ‌ ఈ‌ శ్రీవిద్యలో సాంకేతికపదాలు. శ్రీవిద్యలో బ్రహ్మాండ, పిండాండ, శ్రీచక్రాలకు అబేధం. అందుచేత ఈ‌ పదాలు ఒక్కొక్క సారి నిజమైన బహిఃప్రపంచపు అర్థాల్లో అంటే సూర్యచంద్రులు మనకు ఆకాశంలో కనిపించే వారే కావచ్చును. కాని అన్నిసార్లూ అలాగే అనుకోకూడదు.  ఉదాహరణకు సహస్రారం అమృతత్త్వానికి ప్రతీక. అది సాక్షాత్ పరబ్రహ్మస్థానం కాబట్టి దివ్యప్రకాశం కలది.  ప్రకాశం అంటే వెలుగుచే అమృతాన్ని కురిపించే వాడన్న సామ్యంతో ఇందులో ఉండే తేజోమండలానికి చంద్రమండలం అని సంకేతం. పరమాత్మకు వృధ్ధిక్షయాలు ఉండవు కాబట్టి అక్కడ ఉండే చంద్రతత్త్వంలో సదాకళ చెప్పబడుతుంది. ఇలా గ్రహించాలి. ఈ‌ విషయం గురించి మరికొన్ని సంగతులు ఈ శ్లోకానికి వ్యాఖ్యానం ముగింపులో ప్రస్తావించుకుందాం.

ఈ విధంగా మనం శ్రీశంకరులు ఈ‌ శ్లోకంలో సహస్రార చంద్రమండల మధ్యగత ఐన అమ్మ శ్రీదేవి యొక్క నిత్యకళావైభవాన్ని గురించి చెబుతున్నారని అర్థం చేసుకున్నాక శ్లోకంలో ఏవిధంగా ఆ సదాఖ్యను గురించి వర్ణిస్తున్నారో  తదుపరి టపాలో చూదాం.


22, అక్టోబర్ 2014, బుధవారం

ఇట్టి లోకము నందు పుట్టించినావు







నయవంచకుని మాట నమ్మును లోకంబు

    మంచి చెప్పెడు వాని మందలించు

మందబుధ్ధుల మాట మన్నించు లోకంబు
    బుధ్ధిమంతులను దుర్బుధ్దు లనును

దొంగస్వాముల కడ దోగాడు లోకంబు
    యోగుల జూచి యయోగ్యులనును

కర్కోటకుల కూడిగము సేయు లోకంబు
    మృదులస్వభావుల వెదకి తిట్టు

ఇంతకన్నను చెప్పగా నేల నయ్య
యిట్టి లోకము నందు పుట్టించినావు
దేవుడా యేమి చేయుదు దినదినంబు
గండమై యుండి బ్రతు కగ్నిగుండ మాయె










21, అక్టోబర్ 2014, మంగళవారం

సౌందర్యలహరి - 20 కిరంతీ మంగేభ్యః



మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం

20

కిరంతీ మంగేభ్యః కిరణ నికురంబామృతరసం
హృది త్వా మాధత్తే హిమకర శిలామూర్తిమివ యః .
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాసారసిరయా

ఇది తృతీయ కూట ధ్యానం.

ఇది గారుడం అనే ప్రయోగం గురించిన ప్రస్తావన చేసే శ్లోకం.

ఈ శ్లోకంలో కూడా యః - సః అనే విధానం కనిపిస్తున్నది చూడండి.  గత కొన్ని శ్లోకాల్లోనూ ఇది మనం గమనించవచ్చును.  

ఇక్కడ శ్లోకంలో యః అంటే ఎవడు అనగా ఏ భక్తుడు అని ప్రస్తావన చేసి, అటువంటి భక్తుడు చేసి అటువంటి భక్తుడు చేసే ఆరాధనా విధానాన్ని ప్రస్తావిస్తారు. సః అంటే వాడు అని అర్థం. ఇలా వాడికి అంటూ ప్రస్తావిస్తూ అటువంటి ఆరాధనకు ఫలం  ఏదో దానిని వివరిస్తారు శ్రీశంకరులు.

అమ్మా నువ్వు వర్షంలా కురిపిస్తున్నావమ్మా అంటూ‌ శ్లోకాన్ని ఎత్తుకున్నారు శ్రీశంకరులు.  కిరంతీం అన్నదానికి అర్థం వర్షిస్తున్నావని అర్థం మరి.  అమ్మ వర్షిస్తున్నది ఏమిటో చూడండి.

కిరణ నికురంబం అంటే కాంతికిరణాల పుంజం అని అర్థం.  అది యెక్కడి నుండి వెలువడుతున్నదీ?  కాంతి అన్నాక 
దానికి ఒక మూలస్థానం ఉండాలికదా ఫలాని చోటనుండి కాంతిప్రసరిస్తున్నదీ అనటానికి. అదే, అంగేభ్యః అని చెబుతున్నారు. అంటే అమ్మ దివ్యమంగళవిగ్రహం నుండి అలా కాంతి కిరణాలు పుంజాలు పుంజాలుగా వెలువడుతున్నాయని చెబుతున్నారు.  మరి ఆ కాంతిపుంజాలకు ఒక విశేషం కూడా జోడించి చెబుతున్నారు అమృతరసం అని. అంటే ఇప్పుడు ఈ మొత్తం మొదటిపాదం అంగేభ్యః కిరణనికురుంబామృతరసం కిరంతీ అని అవుతున్నది.  భావం చూస్తే అమ్మయొక్క దివ్యమంగళస్వరూపం నుండి తేజఃపుంజాలు అమృతరసాన్ని వర్షిస్తున్నాయీ అని వచ్చింది.  బాగుంది.

ఆ అమ్మ స్వరూపాన్ని కూడా తరువాతి పాదంలో హిమకరశిలామూర్తి మివ అని స్పష్టంగా అందంగా ఇలా చెబుతున్నారు.   హిమకరుడు అంటే అందరికీ తెలుసుకదా చంద్రుడు అని. హిమకరశిల అంటే చంద్రకాంతశిల అన్న మాట. హిమకరశిలామూర్తి అంటే చంద్రకాంతశిలావిగ్రహం వలె అత్యంత స్వచ్చమైన తెలుపు రంగు కలది.  ఇంకొక విశేషం కూడా ఇక్కడ కనబడుతోంది. చంద్రకాంతశిలలు వెన్నెలలో చెమర్చుతూ ఉంటాయని ప్రతీతి.  అవి ఎంత తెల్లగా ఉంటాయీ అంటే ధవళవర్ణంలో ప్రకాశిస్తూ వెన్నెల కాదూ అవే కాంతిని వెదజల్లుతూ ఉన్నాయా అని పిస్తుంది. చంద్రుడి వెన్నెల అమృతసమానం అని ప్రతీతి కదా. అందుకే చంద్రుడికి  సుధాకరుడు అని కూడా పేరు చాలా ప్రసిధ్దంగానే వినిపిస్తూ ఉంటుంది. అంటే అమ్మ స్వరూపం చంద్రకాంత శిలా ప్రతిమ వలె స్వయంగా కాంతులతో అమృతాన్ని చిలకరిస్తోంది అని ఇక్కడ శ్రీశంకరుల చమత్కారం.

ఇప్పుడు ఆచార్యులవారుఅంటున్నారూ అమ్మా యః త్వాం హృది మాధత్తే అని అటువంటి చంద్రకాంతశిలాసదృశమూర్తివీ అమృతస్యందినివీ ఐన నిన్ను ఎవరైతే తన హృదయంలో చక్కగా నిలుపుకొని ధ్యానం చేస్తున్నాడో అటువంటి వాడికి గొప్ప మహిమ కలుగుతున్నదీ అని.

అది ఎటువంటి మహిమ అన్నదో చిత్తగించండి.

శకుంతాధిప ఇవ సః సర్పాణాం దర్పం‌ శమయతి అని అంటున్నారు.  శకుంతములు అంటే పక్షులు. అధిపుడు అంటే రాజు. పక్షులజాతికి రాజు ఎవరయ్యా అంటే ఇంకెవ్వరు గరుత్మంతుడే. ఈ భక్తుడు గరుత్మంతుడి అంతటి వాడు అవుతాడట! ఏ విషయంలో అంటే పాముల విషయంలో.  అందరికీ తెలుసుకదా గరుడుడికీ సర్పాలకీ ఆగర్భశత్రుత్వం.  దాని గురించి మనం  ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేనంతగా ప్రసిధ్ధమైన కథ అది.  ఆ గరుత్మంతుడి లాగా సః అంటే అతదు, ఆ భక్తుడు,  సర్పాణాం అనగా పాముల యొక్క దర్పం అనగా పొగరును శమయతి అంటే అణగ్గొడతాడు అని.

అందుకే ఇది గారుడప్రయోగం అన్నారు.  ఈ‌ శ్లోకాన్ని శ్రధ్ధగా ఉపాసన చేస్తే పాములూ ఇంకా మిగిలిన సకల విషకీటకాల వలనా ఆ ఉపాసకుడికి ఎన్నడూ భయం ఉండదు.

ఇంకా మరొక విశేషాన్ని కూడా శ్రీశంకరులు చెబుతున్నారు. అటువంటి భక్తుడికి మరొక అద్భుతమైన శక్తీ‌ అబ్బుతుంది అని. ఏమిటంటే దృష్ట్వా జ్వరప్లుష్టాన్  అనగా జ్వరపడ్ద వారిని అతగాడు ఒక చూపు చూస్తే అది, సుదాధారసిరయా సుఖయతి అంటే అమృతాన్ని పిచికారీచేసేదిలాగా ఆ దృష్టి జ్వరపీడితుడిమీద పనిచేసి సుఖయతి అంటే సుఖం కలిగిస్తుందట.  అనగా, అటువంటి ఉపాసకుడి చూపు తగిలితే ఏ దైనా జ్వరంతో బాధపడుతున్నవాళ్ళకు ఆ చూపు అమృతపానం అవుతుందట జ్వరవిముక్తి చేసి సుఖం కలిగిస్తూ.

అదండీ శ్రీశంకరులు చంద్రకాంతశిలలాగా స్వఛ్చమైన తెలుపు చాయలో ఉన్న అమ్మను గుండెల్లో నిలుపుకొని ఉపాసన చేసినవాడికి కలిగే శక్తిగురించి చెప్పిన శ్లోకం.

చతుశ్శతిస్తుతిలో కూడా ఈ విధంగా అమ్మస్వరూపాన్ని అరునెలలు ధ్యానం చేసినవాడు గరుత్మంతుడిలాగా సకల విషాలూ సకలజ్వరాలూ తొలగించగల సమర్థుడు అవుతున్నాడని చెప్పబడింది.

పక్షాంతరంలో నలభైఐదు రోజులు రోజుకు రెండువేల పర్యాయాలు జపించాలని చెప్పబడింది.

నిన్ను బంపిన భగవాను నెన్నకుండ







సూర్యోదయము కన్న సుందరదృశ్యంబు
    సృష్టిలో గలదని చెప్ప గలవె

చంద్రబింబము కన్న చక్కని దొక్కొండు
    సృష్టిలో గలదని చెప్ప గలవె

అమ్మను మించు దయామృతస్యందిని
    సృష్టిలో గలదని చెప్ప గలవె

పువ్వులకును బోసినవ్వులకును సాటి
    సృష్టిలో గలవని చెప్ప గలవె

ఇంత చక్కని భూమికి కొంత కాల
మతిథివై యుండ మిగుల కృపార్దృ డగుచు
నిన్ను బంపిన భగవాను నెన్నకుండ
తరలి పోవగ నున్నావు తప్పు గాదె










20, అక్టోబర్ 2014, సోమవారం

సౌందర్యలహరి - 19 ముఖం బిందుం కృత్వా .... (కొనసాగింపు)



మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం

ఈ ముఖం బిందు కృత్వా అనే శ్లోకం కామరాజ ప్రయోగం అని కూడా అంటారు. 

ఐహికార్థంలో చూస్తే ఈ శ్లోకం యొక్క ప్రయోగానికి ప్రయోజనం స్త్రీవశ్యం. ఐతే అటువంటివి సమయమతంలో ఉద్దిష్టప్రయోజనాలు కావనే తప్పకుండా చెప్పుకోవలసి ఉంది.

శ్రీవిద్యలో రకరకాల విధానాలు ఉన్నాయి కాని ముఖ్యంగా చెప్పుకోవలసినవి రెండు విధానాలు. ఒకటి దక్షిణామ్నాయము లేదా సమయమతం అని వేదసమ్మతమైన విధానం.

రెండవది వామము లేదా వామాచారము అని పిలువబడే విధానం.

ఈ రెండు విధానాల్లోనూ ఉన్న బేధాల్లో ముఖ్యమైనది దృక్కోణం.  సమయమతం కేవలం ఆముష్మిక ప్రయోజనాన్ని ఉద్దేశించినది,  వామాచారం హెచ్చుగా ఐహికప్రయోజనాలసిధ్ధి కొరకు ఆచరించబడేది.

దక్షిణామ్నాయం లేదా సమయమతం కేవల సాత్విక మైన ఆరాధనా విధానం.

వామాచారం భీభత్సమైనది. దానిలో మధ్యమాంసాదులతో పూజలు చెప్పబడుతాయి. ఈ విధానాన్ని అనుసరించే విద్యలు క్షుద్రవిద్యలు. రకరకాల ప్రయోగాలు ఇలాంటివి. ఇందులో మాదనాది ప్రయోగాలూ ఉన్నాయి.  కొన్ని విద్యాసిధ్ధులకోసం బాలజిహ్వాఛ్ఛెదనాది దారుణమైన క్రియలూ, కొన్ని పూజావిధానాల్లో ప్రత్యక్షస్త్రీయోని పూజలూ వగైరా వ్యవహారాలతో ఈ వామాచారం ఘోరంగా ఉంటుంది. వైదికవ్యవహారప్రియులు వీటికి దూరంగా ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే వామాచారం వేదబాహ్యం.

ఈ శ్లోకంలోనూ మరికొన్ని శ్లోకాల్లోనూ ఐహికమైన ఇటువంటి తంత్రప్రయోగాలను శ్రీశంకరులు ప్రస్తావించటం గమనించవచ్చును.

ఐతే  వీటిని ప్రస్తావించటంలో శ్రీ శంకరుల ఉద్దేశం సమయమతానుసారంగా వీటిని నిర్వచించటమే అని నా ఉద్దేశం.

క్లీం అనేది కామరాజబీజం. ఇది సర్వవశీకరణ సమర్థమైనది. దీనిని శ్రీశంకరులు ఈ శ్లోకంలో ప్రస్తుతి చేస్తున్నారు. స్థూలార్థంగా ఆయన చెప్పినది ఈ కామరాజబీజం యొక్క ప్రయోగాన్ని ప్రస్తవించి, ఈ విధంగా అమ్మ అరుణను ఆరాధించిన వారికి ఇష్టస్త్రీలు తక్షణం వశులైపోతారు అని చెప్పటం. ఐతే ఆయనకు ప్రత్యేకమైన శైలిలో ఆయన ఇక్కడ సమయమతాను సారంగా దీన్ని తీర్చిదిద్ధిన విధానం పరిశీలించండి.

మూడులోకాలు అనేదే త్రికోణం అని నిర్వచించారు. ఆ ముల్లోకత్రికోణానికి స్తనస్థానాలు సూర్యచంద్రులు అని చెప్పారు. అంటే ముల్లోకాల యొక్క స్వరూపం కూడ అమ్మ కామకళారూపం అని చెప్పటం తాత్పర్యం.

రుద్రయామళంలో "త్రిలోకీయం తవాంబికే కామరాజకళారూపా జాగర్తి స చరాచరా" అని ఉంది. శృతికూడా

య ఈగ్‍ం శ్రుణోత్యలకగ్‍ం శ్రుణోతి
నహి ప్రవేద సకృతస్య పంథా మితి

అని చెబుతున్నది.  అందుచేత త్రిలోకాలలూ అమ్మ యొక్క సృష్టిరూపమైన కామకళగా భావించటం వేద విహితమే.  దీని అర్థం త్రిలోకాలనూ అమ్మ సంకల్పమే సృష్టిస్తున్నదని చెప్పటం. 

అదృశ్యరూపంగా ఉన్న అమ్మ ముఖ పద్మమూ వాటికి దిగువన సకలజగత్పోషణాదక్షమైన అమ్మస్తనద్వయంగా కనిపించే సూర్యచంద్రులూ అన్న భావనతో భగవతి అరుణను ఉపాసించే విధానం సమయమత సమ్మతం. ఇలా చేసే భక్తులకు మూడులోకాలనూ కూడా సమ్మోహనపరచగల శక్తి ఉంటుంది అని చెప్పటంలో అర్థం త్రిలోకాలలోనూ అమ్మ సంకల్పం సంచరించే విధానం వారికి ప్రసన్నంగా ఉంటుందని చెప్పటమే.  అందుచేత వారికి త్రిలోకాలలోనూ అగోచరమైన తత్త్వం ఏదీ ఉండదు.

ఈ కామరాజబీజం యొక్క దివ్యశక్తిని తెలిపే కథ ఒకటి దేవీ భాగవతంలో ఉన్నది. అది సుదర్శనుడనే రాకుమారుని కథ,

ఈ కథను మనం సూక్ష్మంగా చెప్పుకుంధాం.  రాజ్యంపోయి మున్యాశ్రమాల్లో నివసిస్తున్న ఒక రాణీ కొడుకు ఈ  సుదర్శనుడు. ఎవరో ఏదో సందర్భంలో ఎవరిని గురించో క్లీబుడు అని సంబోధిస్తారు. అప్పటికి సరిగా ఊహ తెలియని ఈ పిల్లవాడు ఆ మాటను క్లీం అని గ్రహించి వినటానికి బాగుండటంతో నిత్యం క్లీం క్లీం అంటూ ఉండే వాడు. పెద్దైనా ఆ ఆలవాటు పోదు. ఆ అమాయకమైన వచో విన్యాసానికే అమ్మవారు ముచ్చటపడి అతడికి పెళ్ళికూతుర్ని చూడటమే కాదు, ఏకంగా పెళ్ళికి వచ్చిన విఘ్నాల్నీ తొలగిస్తుంది. ఆ అమ్మాయి పేరు శశికళ. ఆమెకు కలలో కనిపించి ఫలానా రాజకుమారుడు నా భక్తుడు యోగ్యుడు నీకోసం ఎంపిక చేసానూ అని చెప్పి ఆ పిల్లను ఆదేశిస్తుంది. ఆ శశికళ స్వయంవరాన్ని తిరస్కరించి తండ్రిని ఒప్పించి సుదర్శనుణ్ణి పెళ్ళాడితే మిగతా రాజులతో పెద్ద యుధ్ధం వస్తుంది.  అందులో అమ్మవారే స్వయంగా సింహవాహనంతో విచ్చేసి మరీ సుదర్శనుణ్ణి గెలిపిస్తుంది.

చూసారా కామరాజబీజం యొక్క శక్తిని.  దీనిని వామాచారులు స్త్రీవశ్యానికి వాడటం వేరే సంగతి.   అటువంటి వారికి వచ్చే ఫలసిధ్ధి కేవలం ఐహికం కావటం వల్ల ఆధ్యాత్మిక పురోగతికి ఏమీ పనికి వచ్చేది కాదు కదా.

అమాయకమైన కామరాజబీజోపాసనకే అమ్మవారు వచ్చి అండగా ఉండి తల్లిలా రక్షించింది

అమ్మను జగత్రయత్రికోణ సంస్థితయైన అరుణగా సంభావించి ఉపసిస్తే అది సమయమతం ప్రకారం ఎంత సిధ్దిదమో ఆలోచించుకోండి.

ఈ శ్లోకానికి పారాయణం రోజుకు పన్నెండు వందలసార్లు చొప్పున నలభైఐదు రోజులు. నైవేద్యం పాలు, తేనె, అరటిపండ్లు. ఫలితం మనోవశీకరణం.

మేలుకొను డయ్య యిటు లుంట మేలు గాదు







చదివేరు చదువులు చదివిన చదువుల

    పదిలమౌ సారంబు బట్టలేరు

పలికేరు పలుకులు పలికెడి పలుకులు
    చిలుకు విషాగ్నులు తెలియలేరు

నడిచేరు నడతలు నడిచెడు నడతల
    పొడమెడు చెడుగులు పోల్చలేరు

బ్రతికేరు బ్రతుకులు బ్రతికెడు బ్రతుకుల
    కలిగెడు పతనంబు కాంచలేరు

ఇలకు చనుదెంచి నరులార యెంతసేపు
నేను నేనను భ్రాంతిలో మేను మరచి
పొరలు చున్నారు నూఱేళ్ళు బుధ్ధి మరలి
మేలుకొను డయ్య యిటు లుంట మేలు గాదు









19, అక్టోబర్ 2014, ఆదివారం

స్వర్గంలో ముని - 4

*        *        *        *        *

ఇంద్రదేవుడు చిద్విలాసంగా ఒక చిరునవ్వు విసిరాడు.  చూడు మునీ, నీ అమాయకత్వం చూస్తుంటే అమితాశ్చర్యం కలుగుతోంది. ఏం చదివావా నువ్వు అని జాలి వేస్తోంది అన్నాడు కూడా.

అదేమిటి ప్రభూ, నేను బిఏ చదివానండీ అన్నాడు వినయంగా.

ఇంద్రుడు మరింత జాలిగా చూసాడు. ఎందుకొచ్చిన బిఏ చదువయ్యా, దాని గురించి ఎవరడిగారూ, పాపం వేదవ్యాసనారాయణులవారు ఎన్నో పురాణాలు మీ మనుషులకు అనుగ్రహించారు కదా, నువ్వు అవేవీ కొంచెమైనా చదువలేదా అని నా ఉద్దేశం అని చెప్పాడు.

ముని కొంచెం విచారంగా ముఖం‌ పెట్టాడు. అవేమన్నా మాకు అర్థమయ్యే భాషలో ఉన్నాయాండీ, లేవు కదా,  ఐనా మా బోటి వాళ్ళకూ  అర్థమయ్యేటట్లు కొందరు వాటిని తిరగరాస్తే అవిమాత్రం కొన్ని చదివాననుకోండి ఐనా ఈ మాటెందుకని అడుగుతున్నారండీ అన్నాడు.

అడక్కేం చేసేదీ? పరీక్ష ఇవ్వగానే సరిపోతుందా? అందులో నువ్వు ఉత్తీర్ణత సాధిస్తేనే నీకు లాభం చేకూరేది. అదిసరే,  నువ్వేమిటీ నన్నే సరాసరి మోక్షం అడిగేస్తున్నావూ. అది కావాలంటే శివకేశవుల అనుగ్రహం సంపాదించుకోవాలి సుమా నువ్వు అన్నాడు.

మునికి కొంచెం‌ కోపం వచ్చింది కాని దాన్ని వేంఠనే అణిచేసుకున్నాడు, ఎక్కడ ఇంద్రుడు దాన్ని పసిగడతాడో‌ ఏం ప్రమాదమో అని.

ఐనా ఇంద్రుడు పసిగట్టకుండా ఉంటాడా. ఏమిటయ్యా కొంచెం కోపం వస్తున్నట్లుందే‌ నీకు? అన్నాడు.

ముని కంగారుగా అదేం లేదు ప్రభూ, నాక్కోపం ఏమిటి, ఐనా మీరన్నట్లే నేను శివుడి కోసమే తపస్సు చేస్తున్నాను. అదే చెబుదామనుకుంటున్నాను అంతే అన్నాడు.

నాకు తెలుసులే. అదిసరే, నువ్వు చేస్తున్న తపస్సు ఒక స్థితికి వచ్చింది.  దానికి పరీక్షపెట్టి మరింత తపస్సు చేసేందుకు నీకు అర్హత ఉందో లేదో తేల్చక తప్పదు అన్నాడు చిరుకోపంగా చూస్తూ.

శివుడి కోసం తపస్సు చేసే వాడికీ‌ పరీక్షలా ఇంద్రదేవా అన్నాడు ముని కొంచెం భయంగా.

తప్పదు. నువ్వు ఎవరి కోసం తపస్సు చేసినా అది తపస్సే కదా అన్నాడు ఇంద్రుడు స్థిరంగా.

చిత్తం అన్నాడు ముని కొంచెం నిరాశగా.

నువ్వు నన్ను వరం అడిగావు కదా.  మోక్షమో అని.  అది నీకు నేను ఇవ్వలేను కాని మార్గోపదేశం చేయగలను.  అదైనా నువ్వు పరీక్షలో నెగ్గితేనే అన్నాడు ఇంద్రుడు.

ముని కేమీ బోధ పడ లేదు.  అంటే  అర్థం కాలేదు ప్రభూ అన్నాడు  అయోమయంగా చూస్తూ.

నీ‌ తపస్సు ప్రాథమిక స్థాయిలో ఉంది.  నామజపం చేస్తున్నావు. అది  నీకు  చిత్తశుధ్దిని కొంత వరకూ ప్రసాదించింది.  కాని జ్ఞానప్రకాశం కాలేదు.  నువ్వు పరీక్షలో నెగ్గితే ఇంకా బాగా తపస్సు చేయటం ఎలాగో ఉపదేశిస్తాను అని వివరణ ఇచ్చాడు ఇంద్రుడు.

మునికి సంతోషం కలిగింది.  పోనీలే మోక్షం తాను ఇవ్వలేక పోయినా దాన్ని సాధించేందుకు సహాయం చేస్తా నన్నాడు అదే పదివేలు కదా అనుకొన్నాడు.

పరీక్షకు నేను సిధ్ధం ప్రభూ అన్నాడు ఉత్సాహంగా.

ఇంద్రుడు గమ్మత్తుగా నవ్వి కుటీరం ద్వారం వైపు చేయి ఊపాడు చిన్నగా.

ఒక్క మెఱుపు మెఱిసి నట్లయ్యింది.

గుమ్మంలో ఒక అమ్మాయి.

సమ్మోహనకరమైన చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యింది.

మెల్లగా ఇంద్రుడి వద్దకు వచ్చి నమస్కరించింది.

ఈ మునికి మోక్షం కావాలిట అన్నాడు ఇంద్రుడు నర్మగర్భంగా నవ్వుతూ.

ఆ అమ్మాయి ఆహాఁ అంది.

ఆమాట మోహనరాగమో కళ్యాణీరాగమో ఎందులో ఉందో అనిపించింది బొత్తిగా సంగీత జ్ఞానం లేకపోయినా మన మునికి.

పాపం అమాయకుడు,  కొంచెం గాభరా పెట్టకుండా పరీక్షించు అని హెచ్చరించినట్లుగా చెప్పి, ముని కేసి తిరిగి ఈమె పెట్టే పరీక్షలో నువ్వు నెగ్గాలి సుమా అంటూనే అంతర్థానం చేసాడు ఇంద్రుడు.

ఆ అమ్మాయి విలాసంగా ముని కేసి తిరిగి ఒక చూపు చూసింది.

అతగాడు నిలువు గుడ్లు వేసుకొని ఆమె కేసి చూస్తున్నాడు.

*        *        *        *        *

జరిగినది చాలు నిజతత్త్వ మెఱిగి కొనుము








గ్రంథసంచయమున గల సద్విషయముల
    చదివి నేర్చెడు నంత చదువు లేదు

చదువ జాలిన యంత జదివి నేర్చిన దైన
    మనసున నాటెడు మాట లేదు

మనసుకు నచ్చిన మంచి మాటల నైన
    క్రియలోన జూపు నిర్ణయము లేదు

నిర్ణయించుచు నుండు నీ రీతి యీ లోక
    నీతి నిత్యంబును నిశ్చయముగ

గాలి కటు నిటు నెగిరెడు ధూళికణము
వోలె తిరిగెడు వాడవై నేల మీద
నెంత కాలంబు గడపిన నేమి ఫలము
జరిగినది చాలు నిజతత్త్వ మెఱిగి కొనుము









నినుగూర్చి నిజముగా నీ కేమి తెలియునో







నినుగూర్చి నిజముగా నీ కేమి తెలియునో
    ఈశ్వరు డొక్కడే యెఱుగు గాని

ఎన్నిజన్మము లెత్తి యున్నావొ యెఱుగుదే
    ఈశ్వరు డొక్కడే యెఱుగు గాని

సత్యమసత్యంబు చక్కగా నెఱుగుదే
    ఈశ్వరు డొక్కడే యెఱుగు గాని

ఎన్నడు మోక్షమో యేమైన నెఱుగుదే
    ఈశ్వరు డొక్కడే యెఱుగు గాని

ఇట్లు నీ వేమి యెఱుగక యెంత తడవు
భూమి నటునిటి గ్రుమ్మఱి యేమి ఫలము
నేను నేనను యహమిక మాని హరిని
చింతనము జేసి సద్గతి జెందరాదె






18, అక్టోబర్ 2014, శనివారం

విష్ణుమాయా విలాసం!


ఈ  ప్రజబ్లాగులో ఒక‌ టపా కు హరిబాబు గారి వ్యాఖ్య లో నా అభిప్రాయాన్ని అపేక్షించారు.  అంత వరకూ, బాగానే ఉంది కాని, నా అభిప్రాయమే అక్కడ ఒక వ్యాఖ్యగా ఇమిడేటంత చిన్నగా చెప్పటం సాధ్యపడటం లేదు. అందుచేత దానిని ఈ టపాగా వ్రాస్తున్నాను.

భారతంలో ఉన్న ఒక చిన్న కథను ప్తస్తావిస్తాను ముందుగా, అదీ‌ సూక్ష్మంగానే.  ఒక గురువుగారు తన వద్దకు వచ్చిన శిష్యులలో ఒక పిల్లవాడికి విద్య నేర్పకపోగా అడవులకు పోయి ఆశ్రమపశువులను మేపటమనే పని చెబుతారు. పైగా వాడికి తిండితిప్పల విషయంలోనూ అక్షరాలా లక్షనిబంధనలు పెట్టి దారుణంగా డొక్క మాడ్చుతారు. ఇలా ఎందుకు చేస్తున్నారో గురువు గారు అన్నది ఎవరికీ, చివరికి గురుపత్నికి కూడా బొత్తిగా బోధపడదు. ఒక నాటి సాయంకాలం పశువులు తిరిగి వస్తాయి కాని పిల్లవాడు మాత్రం ఎంతకీ ఆశ్రమానికి తిరిగి రాడు. రాత్రి ప్రొద్దుపోయాక వాడిని వెదుకుతూ‌ గురువుగారే  పోయి పోయి కళ్ళుపోయి ఒకగోతిలో పడిఉన్న ఆ పిల్లావాడిని గుర్తించుతారు. ఏం జరిగిందిరా అంటే గురువుగారూ ఆకలికి తట్టుకోలేక ఏవో‌ ఆకులు నమిలేస్తే‌ నా కళ్ళు పోయాయని చెప్పాడు ఆ అబ్బాయి. అప్పుడు గురువుగారు ఒక మంత్రం ఉపదేశిస్తే దాని సహాయంతో పిల్లవాడికి కళ్ళొస్తాయి వెంటనే.   

ఇంతకూ అసలు విషయం ఇప్పుడు చెప్పేది వినండి. మర్నాడు ఆ పిల్లవాడిని కూర్చుండ బెట్టి నాయనా విద్యోపదేశం ఇదిగో అని వాడి నడినెత్తిన తన అరచేయి ఉంచారు గురువుగారు.  ఆ తరువాత నాయనా, నీకు సకలవేదవేదాంగాలూ నేర్పాను, హాయిగా గురుకులం ఏర్పాటు చేసుకొని శిష్యులతో సుఖంగా ఉండు అని చెబుతారు.

ఒక గురువు సకలవేదవేదాంగసమన్వితమైన విద్యను అదీ సాధారణంగా పిల్లలు అనేక ఏళ్ళు శ్రమించి నేర్చుకొనే విద్యను ఒక్క క్షణంలో అనుగ్రహించారు!

ఇక్కడ గురువు శక్తీ, శిష్యుడి యోగ్యతా అన్నవి  అద్భుతం అని గ్రహించాలి మనం.

అర్జునుడు యోగ్యశిష్యుడు కాబట్టే జగద్గురువు శ్రీకృష్ణపరమాత్మ అతిస్వల్పకాలంలో యోగశాస్త్రమూ, సకలోపనిషత్సారసంగ్రహమూ ఐన ఉపదేశాన్ని అద్భుతంగా స్వల్పకాలంలో ఆ సత్శిష్యుడికి అనుగ్రహించారు.

ఐతే కృష్ణార్జునసంవాదం అంతా రెండు దివ్యాత్మల మధ్య జరిగిన సంవాందం. అది మన మానవ కాలమానానికన్నా సూక్ష్మమైన పరిధిలో జరిగింది.

ఒక్క విషయం ఆలోచించండి.  ఒక శాస్త్రవేత్తకు ఒక ఆలోచన వస్తుంది. అది మనస్సులో మెదలేది తృటికాలంలో.  దాని పరిమాణం అత్యల్పం‌. అవును కదా. కాని ఆ ఆలోచనను మానసికపరిథి నుండి ఆ శాస్త్రవేత్త భౌతికకాలప్రమాణంలో సాటి మానవులకు అందించాలంటే మానవభాషలో వ్యక్తీకరించాలి కదా?  అప్పుడు ఆ వ్యక్తీకరణ అనేది ఒక మాటలోనే, ఒక వాక్యంలోనో కుదురుతుందా? అసాధ్యం కావచ్చు. ఒక్కొక్కసారి ఆ వ్యక్తీకరణ నిడివి ఒక సిధ్ధాంత గ్రంథం కూడా కావచ్చును. ఎవరైనా ఆ గ్రంథం చదివి, ఇదంతా ఒక్క ఆలోచన యొక్క వ్యక్తీకరణ అంటే నమ్మటం కుదరదు అంటారా? అనరు కదా? అనేవాళ్ళకో దండం. అంతే.  వితండవాదం చేస్తే ఎవరూ చెప్పగలిగింది ఉండదు. కాని సంభావ్యత ఏమిటి? అలోచనలను వ్యక్తీకరించటానికి హెచ్చు కాలమూ, పదప్రవాహమూ అవసరమయ్యే విషయం అందరికీ అనుభవైక వేద్యమే అనుకుంటాను.

శ్రీభగవాన్ వేదవ్యాసులవారు కూడా సాక్షాన్నారాయణస్వరూపులు కాబట్టి శ్రీకృష్ణార్జునసంవాదాన్ని కూడా భారతాఖ్యానంలో‌ పొందుపరచి మానవలోకానికి కూడా అందించారు.  ఇక్కడ కూడా అనటం ఎందుకంటే, దానికి ఒక ముఖ్య కారణం ఉంది కాబట్టే.  వ్యాసప్రోక్తమైన భారతం అతి విపులమైనది. మానవులకు దానిని పూర్తిగా పఠించటానికే తమ ఆయుఃప్రమాణాల్లో బహుభాగం వెచ్చించవలసి వస్తుంది. అందుచేత దానిని ఆయనే క్లుప్తీకరించి మానవలోకంలో వ్యాప్తిచేసారు. పూర్ణభారతం దేవలోకప్రచారానికి ఇచ్చారు. ఇదంతా భారతం ఆదిపర్వంలో చెబుతారు.

సరే వ్యాసులవారు మనకు ఇచ్చిన భారతంలో శ్రీకృష్ణార్జునసంవాదాన్ని కూడా పొందుపరిచారు. అది ఏడు వందల శ్లోకాలు.  మరికొద్ది శ్లోకాలూ ఉన్నాయనే వాదమూ ఉంది. దానికి జోలికి మనం పోవటం లేదు. ఇంత పెద్దగా ఏడువందలశ్లోకాలుగా మనకి శ్రీకృష్ణపరమాత్మగారూ ఆయన శిష్యుడు అర్జునుడూ  మానసికంగా సంభాషించుకొన్న విషయాన్ని మానవ భాషలోనికి తెచ్చేసరికి అది ఇన్ని శ్లోకాలయింది.  స్థూలంగా సంగతి ఇదన్నమాట.

ఇందులో‌ ఆశ్చర్య పోవలసింది ఏమీ లేదు.

బెంజీన్ అనే కర్బనరసాయన పదార్థం యొక్క అణునిర్మాణం ఘట్టి చిక్కుగా ఉండేది. ఒక శాస్త్రవేత్త కెక్యూల్ అనే ఆయనకు ఒక కల వచ్చిం దొక నాడు.  ఆ కలలో పాములు కొన్ని ఒకదాని తోకను ఒకటి కరచి పట్టుకొని ఒక వలయంగా ఉన్నట్లు స్ఫురణ కలిగింది. ఆయన ఆ స్ఫూర్తిని బెంజీన్‌కి అన్వయించి దాని అణునిర్మాణం వెల్లడించగలిగాడు. అయన ఆ విషయం మీద వ్రాసిన వ్యాసం ఎన్నో నిర్థారణలో బోలెడు పేజీలుంటుంది. అది ఒక శాస్త్రవేత్త చదివినా అరగంట పడుతుందేమో. ఐతే కెక్కూల్‌కు వచ్చిన కల అరగంటో గంటో నడిచిందా? అలా ఆనలేము కదా? ఒక చిన్న స్పార్క్ వచ్చింది అది చిక్కుముడిని పరిష్కరించింది. ఐతే అచ్చులో అది ఒక వ్యాసం ఐనది.

రేఖాగణితశాస్త్రం అని లెక్కల్లో ఒక విభాగం ఉంది. Analytical geometry అంటారు. దానికి సంబంధించిన ప్రాతిపదికలు కూడా ఒకానొక పెద్దమనిషికి కలలో స్ఫురించినవే అంటారు.

మనక్కూడా కలలు వస్తాయి కదా. ఒక్కొక్క కల భయంకరంగా ఎంతో దీర్ఘమైన కాలం కష్టం పడినట్లుగా అనిపిస్తుంది. కాని నిజానికి కల అంతా కొద్ది సెకనులే నడుస్తుంది! ఇలాంటి అనుభవం దాదాపు అందరకూ సాధారణంగా కలుగుతూనే ఉంటుంది.

అందుచేత మానసికమైన పరిధిలో కాలం వేరు. భౌతికప్రమాణంలో కాలం వేరు.  గురుశిష్యులు మానసిక కాలావధుల్లో సంభాషించుకోవటం శ్రీకృష్ణార్జునసంవాదంలో కీలకాంశం. మీరు ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదివారా? దాని ఆంగ్లమూలం Autobiography of a Yogi అని పరమహంసయోగానంద గారి ఆత్మకథ అది. అందులో కూడా యోగానందగారికి వారి గురువైన యుక్తేశ్వర గిరిగారు మానసిక సందేశాలను పంపిన ఘట్టం ఒకటి వస్తుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే అటువంటి మరికొన్ని సంఘటనలూ ఆ పుస్తకంలో ఉంటాయి.

ఇటువంటివి యోగుల అనుభవాల్లో తరచు ఉండే  సంగతులే. కాని మనబోటి సాధారణమానవులకు అంతుబట్టని మిష్టరీలు. మన ప్రియతమ హేతువాదుల దృష్టుల్లో అభూతకల్పనలూ, అవాస్తవాలూ. ఎవరి నమ్మకాలు వారివి. వాళ్ళతో‌ పేచీలు వద్దు మనకి.

సత్యసాయిబాబా కూడా ఎవరో భక్తుడికి ఏళ్ళ తరబడి నానాక్లేశాలూ అనుభవించవలసిన రాత ఉందని చెప్పారట. ఐతే అతడు ఆ క్లేశాలన్నింటినీ అనుభవించక తప్పలేదు కానీ ఆ పిమ్మట చుసుకుంటే నిజానికి గడచిన కాలం కొద్ది నిముషాలు  మాత్రమే అని తెలిసి విస్తుపోయాడట.

ఒక అందమైన కథ ఉంది. దాని పేరు విష్ణుమాయా విలాసం. రచయిత కంకంటి పాపరాజు. ఒక విష్ణుభక్తుడైన బ్రాహ్మణుడి ఇంటిలో ఆబ్దికం. కాలువకు స్నానానికి వెళ్ళి వస్తానని భార్యతో చెప్పి బయటకు వెళ్ళాడు. దారిలో విష్ణుకథలు స్మరిస్తున్నాడు. సరే, భక్తుడు కదా, కొంచెం పరవశించి ఉన్నాడు కాలువలో మునక వేసే సమయానికి.  ఎందుకు తోచిందో ఒక ఊహ. స్వామీ విష్ణుమూర్తీ, నీ మాయావిలాసం ఒక్కసారి నాకూ చూడాలని ఉందయ్యా, చూపవా అని అడిగాడు.  సరే స్నానం చేసి గట్టుమీదకు రాగానే విష్ణుమాయ సిధ్ధంగా అందమైన అమ్మాయి రూపంలో ప్రత్యక్షం! 

ఈయనకు అక్షరాలా మతిపోయింది.  ఆ అమ్మాయిని నన్ను పెళ్ళి చేసుకో అని వెంటబడ్డాడు. పోవయ్యా బేమ్మడా నేను బోయపిల్లను నాతో పరాచికాలేంటి అని అమ్మాయి కసురుకుంటున్నా సరే ఆమె వెనకాలే బోయగూడానికి వెళ్ళి ఆమె పెద్దలను ఒప్పించి ఆ పిల్లని పెళ్ళాడి వాళ్ళల్లో కలసి పోయాడు. బ్రాహ్మణోత్తముడు ఇప్పుడు బోయవాడు.  సమయం వచ్చింది కాబట్టి ఒక మాట. వాల్మీకి బోయవాడంటారు చాలా మంది. కాదు. ఆయన ప్రచేతసుడు అనే ఒక ముని కొడుకు. ప్రారబ్ధం కారణంగా అతడు ఒక బోయవాడిలాగా బహుకాలం జీవించవలసి వచ్చింది.  అంతే.

కొన్నాళ్ళకు వాళ్ళంతా ఎక్కెడెక్కడో‌ తిరిగారు. పెద్ద కరువొచ్చింది. పెళ్ళామూ, తానూ, పిల్లలూ మలమలా మాడలేక, ఎవరో గోదావరీతీరం సుభిక్షంగా ఉందని చెబితే అక్కడకు పోయాడు సంసారంతో సహా కాళ్ళీడ్చుకుంటూ. ఒక ఊరు చేరారు. పిల్లలూ, పెళ్ళామూ ఆకలో చస్తున్నాం అంటూ కూలబడ్డారు.  ఊరిలోనికి భిక్షానికి వెళ్ళాడు ముందుగా వీళ్ళకింత తిండి సంపాదించి పెట్టాలని. వీధులు తిరిగి ఒక ఇంటిముందు నిలబడి భిక్షకోసం అర్థించాడు.

అమ్మా మా ప్రాంతంలో కరువొస్తే ఇలా వచ్చాం. ఊరి చివర పెద్ద చెట్టుక్రింద నా పెళ్ళాం పిల్లలు కళ్ళల్లో ప్రాణాల్తో ఉన్నారు. కాస్త ముద్ద పెట్టి వాళ్ళ ప్రాణం కాపాడు తల్లీ అని అడిగాడు.

ఆవిడ ఘొల్లున గోల. ఇదేం కర్మం దేవుడా. మీరు ఇప్పుడే ఘడియ క్రితమే కదా స్నానానికి గోదావరికి వెళ్ళారూ? వస్తూనే ఈ పిచ్చిమాట లేమిటండీ. అయ్యో ఏమైంది మీకూ? ఇవతల భోక్తలు వచ్చి కూర్చున్నారూ? అని ఒకటే మొత్తుకోవటం.

సరే ఆవిడ దేవుణ్ణి వేడుకోగా వేడుకోగా ఈయనకు స్పృహ వచ్చింది. తాను తానే! గోదావరికి పోయి స్నానం చేసి వచ్చాడు. కాని లీలగా బోయపిల్లా, దానితో పెళ్ళీ, పిల్లలూ, తాము పన్నెండేళ్ళపాటు దేశాలు పట్టి తిరగటం అంతా బుర్రకు నిజమో కలో తెలియని స్థితి. ఈ గలాభాకి చుట్టూ చేరిన అందరితో ఇలా జరిగిందని కథంతా చెబితే, అంతా ఔరా ఔరా అన్నారు. గోదావరీ తీరం పోయి చూస్తే అక్కడెవరూ లేరు, చెట్టైతే ఉంది కానీ.

అప్పుడు అర్థమైనది. ఇదంతా విష్ణుమాయా విలాసం అని. చూడండి. ఇక్కడ అతగాడికి మాయాప్రపంచంలో పన్నెండేళ్ళు నిఖార్సుగా జరిగాయి. నిజానికి మన లోకంలో నడిచింది ఒకటో రెండో ఘడియలు మాత్రమే.

అలా కాలం అనేది అనేక పరిధుల్లో ఉంటుంది. సమస్తమైన కాలమూ మన భౌతికపరిథిలోనిదే అనుకుంటే కొన్ని చిక్కుముడులు ఎదురౌతాయి. వాటిని విప్పలేం. గడబిడపడి  వాళ్ళ తప్పులూ వీళ్ళ తప్పులూ వెదకటం చేస్తాం సాధారణంగా, మనమే‌ తెలివైన వాళ్ళ మనుకున్నప్పుడు.

అదీ సంగతి.

కాలంబు గడువదే....








కాలంబు గడువదే కాంతామణుల తోడ
      రసికావతంసుడన్ రాణ మెఱయ

సమయంబు గడువదే శాస్త్రచర్చల తోడ
      సొంపారు శుభయశశ్శోభ మెఱయ

రోజులు గడువవే రూకల వేటలో
      ధనరేఖ గలదన్న ఘనత మెఱయ 

ఏండ్లెల్ల గడువవే యితరుల సేవలో
      కడు సమర్థుడటన్న ఖ్యాతి మెఱయ

ఇట్టి మెఱపులు సర్వమున్ వట్టి మెఱపు
లసలు మెఱపన్న హరిభక్తి యగును గాన
వట్టి మెఱపుల కలిమాయ బట్టి గెలిచి
హరిపదంబుల నుండిన తిరము ముక్తి










17, అక్టోబర్ 2014, శుక్రవారం

సౌందర్యలహరి - 19 ముఖం బిందుం కృత్వా ....



మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం

19

ముఖం బిందుం కృత్వా కుచయుగ మధస్తస్య తదధో
హరార్ధం ధ్యాయే ద్యో హరమహిషి తే మన్మథకలామ్
స సద్యః సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు
త్రిలోకీ మప్యాశు భ్రమయతి రవీందు స్తన యుగామ్ 


ఈ శ్లోకంలో శ్రీశంకరులు కామ కళా రూప ధ్యానం అనే ప్రక్రియను గురించి ప్రస్తావిస్తున్నారు.

అమ్మవారిని హే హరమహిషి అని సంబోధిస్తున్నారు. మహిషి శబ్ధం మనకు పరిచయం ఉన్నదే, రాణి అన్న అర్థంతో సహా.  హరుడు అంటే శివుడు కాబట్టి హరమహిషి అంటే శివుని రాణీ అని అమ్మను సంబోధిస్తున్నారని సులభంగానే బోధపడుతున్నది.  

ముఖం బిందుం కృత్వా అంటే శ్రీచక్రంలో మధ్యన బిందువు ఉంది కదా, దానినే స్త్రీయొక్క ముఖంగా భావించి అని అర్థం. ఎవరిముఖంగా అన్న ప్రశ్న వెంటనే వస్తుంది కదా?  ఇక్కడ రెండు సమాధానాలున్నాయి.  మొదటిది ఇది కామరాజ పీఠ ధ్యానం.  ఈ‌ ధ్యానాన్ని ఐహిక మైన కామ్యసిధ్ది కోసం జపించే వారు ఇష్టస్త్రీ ముఖాన్ని బిందువుగా  భావించాలి. రెండవది ఐహిక దృష్టిలేని ఆధ్యాత్మిక సాధకులు అమ్మవారి యొక్క ముఖంగా భావించాలని అర్థం.  ఈ రెండవ తాత్పర్యం మనం‌ తరువాత చర్చిద్దాము. మొదట ఈ‌ శ్లోకం ఎలా మదనసంబధమైన ప్రయోగాన్ని చెబుతున్నదో చూదాం.

కృత్వా కుచయుగ మధస్తస్య అన్నదానికి అన్వయక్రమం అస్య అధః కుచయుగమ్‌ కృత్వా  అని. అంటే ఆ బిందువుక్రిందుగా ఉద్దిష్ట స్త్రీమూర్తి యొక్క కుచయుగం అంటే స్తనాల జంటగా భావించాలి.

అదధో హరార్థం ధ్యాయేత్ అంటే దానికి క్రిందుగా హరార్థం అంటే శివుడిలో సగభాగం ఐన శక్తిని ధ్యానించాలి. శ్రీచక్రభాషలో ఇది త్రికోణం. ఈ త్రికోణాన్ని స్త్రీత్వచిహ్నంగా భావించాలని చెబుతున్నారు.  ఈ విధంగా చేసి

తే మన్మథకలామ్‌ అనగా నీ యొక్క కామరాజబీజమును ఈ చెప్పబడిన స్థానములలో ఉపాసన చేయాలి.  క్లీం అనేది కామరాజబీజం.

ఈ విధంగా కామరాజబీజాన్ని ఉపాసించే విధానం చెప్పి శ్రీశంకరులు ఈ ఉపాసనా ఫలం యొక్క మహిమను గురించి వర్ణిస్తున్నారు.

స సద్యస్సంక్షోభం నయతి వనితా అని అంటే వాడు ఉపాసన ఫలితంగా వెంటనే వనితాసంక్షోభం అనగా స్త్రీహృదయాలను సంక్షోభానికి గురిచేస్తాడు. అంటే ఉపాసన ఫలించిన వెంటనే సాధకుడికి స్రీలను మోహింపచేసే శక్తి యేర్పడుతుంది.  లేదా అతడు ఎవరైనా స్త్రీని ఉద్దేశించి కనుక ఈ కామరాజ బీజాన్ని ఉపాసిస్తే ఆ వనిత ఇతడికి ప్రసన్నురాలవుతుంది.

ఐతే ఆచార్యులవారు ఇలా చెప్పి ఊరుకో లేదు. పైగా, నిజానికి  ఇతి అంటే ఇలా చెప్పటం అతి లఘుః అంటే చాలా చప్పగా చెప్పటం అవుతుందట.

ఎందుకంటే అలాంటి కామరాజబీజాన్ని ఉపాసించిన వాడు

రవీందు స్తనయుగామ్‌ అనగా సూర్య చంద్రులే స్తనస్థానాల్లో ఉన్నట్టి త్రిలోకీ అంటే ఆ స్వర్గ, మర్త్య పాతాళాలతో ఏర్పడే ముల్లోక త్రికోణం ఉందే అపి అనగా దానిని కూడా ఆశుః భ్రమయతి అంటే అలవోకగా తక్షణమే మోహంలో ముంచెత్తగలడు.

అది విషయం.

ఈ  శ్లోకానికి సంబంధించి ఇంకా మనం చెప్పుకోవలసింది ఉంది. అది వచ్చే టపాలో.

ఎంత సంతోషించి ఏమి ఫలము?








విద్యల నార్జించి విత్తంబు లార్జించి
    యెంత సంతోషించి యేమి ఫలము

బంధుమిత్రులు గూడి బ్రహ్మరథము బట్ట
    యెంత సంతోషించి యేమి ఫలము

ఆస్తులార్జన జేసి యాత్మీయులకు నిచ్చి
    యెంత సంతోషించి యేమి ఫలము

అధికార పదముల నధిరోహణము జేసి
    యెంత సంతోషించి యేమి ఫలము

సుంత యైనను పరమార్థ చింతనంబు
జేయకుండిన మనుజుని జీవితంబు
చక్కగా భవమహాంబుధి నొక్క చోట
నెగసి పడినట్టి యలకన్న నెక్కుడగునె











16, అక్టోబర్ 2014, గురువారం

ఎవరైన అడిగిరా!!







ఎవరైన నడిగిరా యెవడ వీ వను మాట
    ఎవ రడిగిన చెప్ప నేమి గలదు

ఎవరైన నడిగిరా యెటనుండి యిట కని
    ఎవ రడిగిన చెప్ప నేమి గలదు

ఎవరైన నడిగిరా యేమి చేసితి వని
    ఎవ రడిగిన చెప్ప నేమి గలదు

ఎవరైన నడిగిరా యెచటి కేగెద వని
    ఎవ రడిగిన చెప్ప నేమి గలదు

ఎఱుక లేనట్టి వాడనై యిట్టు లుంటి
ఎఱుక గలిగిన పుణ్యాత్ము లెవ్వ రేని
నన్ను నాపన్ను గమనించి నయము మీఱ
కరుణ జూపిన తెలివిడి కలుగ వచ్చు









15, అక్టోబర్ 2014, బుధవారం

సౌందర్యలహరి - 18 తనుచ్చాయాభిః ...



మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం

18   

తనుచ్చాయాభిస్తే తరుణతరణిశ్రీసరణిభిః
దివం సర్వాముర్వీమరుణిమనిమగ్నాం స్మరతి యః 
భవంత్యస్య త్రస్యద్వనహరిణశాలీననయనాః
సహోర్వశ్యా వశ్యాః కతి కతి న గీర్వాణగణికాః

శ్రీశంకరులు ఇంతకు ముందు మూడు శ్లోకాల్లో ప్రథమకూటమైన వాగ్భవకూటం యొక్క ధ్యానాన్ని వర్ణించారు. 

ఇప్పుడు రెండవది ఐన కామరాజ కూటాన్ని గురించి చెబుతున్నారు.

తరుణతరణి అన్నమాటకు అర్థం ఉదయసూర్యబింబం అని. తరుణం అంటే యౌవనము అనీ లేతది అనీ అర్థాలు రెండూ ఉన్నాయి. సందర్భాన్ని బట్టి అర్థనిర్ణయం చేసుకోవాలి. ఈ శ్లోకంలో అరుణిమ అనే కాంతి వర్ణం గురించి ప్రస్తావిస్తున్నారు చూడండి. అరుణిమం  అంటే ఎర్రదనం.  సూర్యుడు ఎర్రగా ఉండే సమయాలు రెండే రెండు. ఐతే అటువంటి సూర్యుడు ఉదయభానుడు కావాలి లేదా సాయంకాలం సూర్యుడు కావాలి. సాయంకాలం సూర్యుడు వయస్సు ఉడిగినవాడుగా వర్ణించటానికి బాగుంటుంది కాని వయస్సులో ఉన్న సూర్యుడిగా చెప్పకూడదు కదా? ఇక రెండవది ఐన ఉదయసూర్యబింబాన్ని స్వీకరించాలి మనం. అది అరుణిమం కలిగి ఉంటుంది కదా నిస్సందేహంగా.  అందుచేత ఇక్కడ తరుణతరణి అంటే బాలసూర్యబింబం అన్న మాట.

తరుణతరణి అంటే బాలసూర్యుడి యొక్క శ్రీసరణిభిః అని చెబుతున్నారు కదా. శ్రీ అంటే సౌభాగ్యమూ సంపదా అన్న అర్థాలు సరిపోలుతాయి. అవికలిగిన సరణిభిః అంటే వరుసలు లేదా వెల్లువలు ఏవి కాంతిపుంజాలే కదా.

దీనిని బట్టి తరుణతరణి శ్రీసరనిభిః అన్నదానికి భావం బాలసూర్యుడి ఎర్రని కాంతులవెల్లువ అనే సంపద అని తెల్లమౌతున్నది.  మరి శ్రీశంకరులు దీనిని ఎలా పోల్చుతున్నారూ? అమ్మా తేః తనుఛ్ఛాయాభిః అనగా నీ యొక్క శరీరకాంతి అలా బాలసూర్యకాంతిశ్రీలాగా ఉందీ అని చెబుతున్నారు.

అంటే బాలసూర్యుడు ప్రసరించే అందమైన ఎర్రని కాంతిపుంజాల సంపద భూలోకం అంతా పరచుకొని ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది కదా. ఈ సంగతి అందరికీ ప్రత్యేకించి వివరించనక్కర లేదు కదా.  శ్రీశంకరులు ఈ‌ పోలికను మరికొంచెం దూరం తీసుకొనె వెళుతున్నారు చూడండి. ఆయన ఏమంటున్నా రంటే,

అమ్మ యొక్క ఎర్రని శరీర కాంతి ఏమి చేస్తోందీ అంటే దివం సర్వామ్‌ ఉర్వీమ్‌ అరుణిమ నిమగ్నామ్‌ అంటే దివం అనగా ఆకాశమూ (లేదా స్వర్గలోకమూ) ఉర్వీం అనగా భూలోకమూ అంతా కూడా అరుణిమ అనగా ఎర్రదనంలో నిమగ్నామ్‌ అంటే సముద్రంలో ములిగిపోయినట్లు ములిగిపోయేలా చేస్తోంది అంటున్నారు.

ఈ నీ‌ మనోహరమైన తనుఛ్ఛాయను, ఇలా బాలసూర్యకాంతిలాగా ఎర్రగా లోకాలన్నింటినీ ఒక ఎరుపుసముద్రంలో ముంచేస్తోందే దానిని యః స్మరతి అనగా ఏ సాధకుడు స్మరిస్తున్నాడో వాడు ఎలాంటి ఫలితం పొందుతున్నాడొ చెబుతున్నారు.

గీర్వాణగణికా అని అప్సరసలను ప్రస్తావిస్తున్నారు. గీర్వాణులంటే దేవతలు. గణిక అంటే వేశ్య. దేవవేశ్యలు అప్సరసలే కదా. వాళ్ళు ఎటువంటి వారట?

త్రస్యత్ వనహరిణ అంటే భయడ్డ లేడిపిల్లల వలె శాలీన నయనా అనగా సిగ్గుతో టపటపా కొట్టుకుంటున్న కళ్ళున్న వాళ్ళట.

వాళ్ళంతా కూడా అందులోనూ సహోర్వశ్యాః అని నిష్కర్ష చేసేసారు. ఎవరినీ వదలకుండా. చివరికి ఊర్వశితో సహా అందర్నీ కలేసి సంబోధిస్తూ, కతికతి అంటే అబ్బో వీళ్ళల్లో ఎందరెందరు న వశ్యాః భవతి అటువంటి సాధకుడికి లొంగకుండా ఉంటారూ అంటున్నారు.  అంటే ఇలాంటి సాధకుడికి ఊర్వశి వంటి అప్సరసలైనా లొంగి దాసోహం అంటారూ‌ అని ఆచార్యులవారు చెబుతున్నారు.

ఇక్కడ ఊర్వశిని పనిగట్టుకొని తీసుకొని రావటంలో ఒక గడుసుదనం ఉంది.  అప్సరస లందరిలోనూ అందగత్తె ఊర్వశియే. ఎందుకంటే తపస్సుచేస్తున్న నరనారాయణులను పరీక్షించటానికి అప్సరసలు వస్తుంటే కినిసి నారాయణుడి ఊర్వశిని సృష్టించాడట వాళ్ళందరి కంటే అందగత్తెగా - ఈ అప్సరసల దండు గర్వం అణచటానికి. అమ్మ అరుణిమను ధ్యానించే వాడికి ఊర్వశి కూడా ఊడిగం చేస్తుందీ అని ఆచార్యులవారి చమత్కారం.

అసలు ఈ అప్సరసలంతా దేవతాస్త్రీలు కదా, వాళ్ళకు కనురెప్పపాటే ఉండదు కదా మరేమిటీ వీళ్ళ కళ్ళు ‌టపటపలాడుతాయి బెదరిన లేడి కళ్ళలాగా అన్నారూ అని అనుమానం రావచ్చును. అమ్మ అనుగ్రహం ఉన్నవాడి ముందు ఈ వీరి దేవతాగర్వం అణిగి ఈ సిగ్గూ ఆందోళనా వచ్చేస్తాయీ అని శ్రీశంకరులు సూచిస్తున్నారన్న మాట.

ఈ శ్లోకానికి రోజుకు వేయి సార్లు చొప్పున నలభైరోజులు పారాయణం. నైవేద్యం పాలపాయసము. తాంబూలం. ఫలితం సర్వమనో మోహనతా సిధ్ది.


పగబట్టిన మేక


పగబట్టిన మేక
ఆలు మగలును వారి యందాల సుతుడు
మువ్వురే యైన నిత్యంబు నవ్వులొలకు
చక్క నైనది సంసార మొక్క టుండె
పరగ మేకల మందకాపరులు వారు
హాయిగా నుండ నొక నాటి యర్థరాత్రి
పిల్లవానికి యొడ లేమొ వెచ్చబడెను
తల్లిదండ్రులు మిక్కిలి తల్లడిల్లి
తలచి రే దృష్టిదోషమో‌ తగిలె ననుచు
ముధ్దు బిడ్డడు నే డిట్లు మూల్గుచుండ
కారణం బేమి వీని కే గాలిసోకె
భూతవైద్యుని వద్దకే పోవలయును
గా దలంచిరి భీతులై కళవళపడి
గంటగంటకు బిడ్డని యొంటి మీద
జ్వరము హెచ్చుచు నుండగా చాల బెదరి
గ్రామదేవత గుడివైపు మోము లుంచి
మ్రొక్కుకున్నారు తల్లిరో ప్రోవుమనుచు
భూతవైద్యుండు జూచి విభూది పెట్టె
దడుపు జ్వరమది మరునాడె తగ్గిపోయె
కోడిపుంజును వైద్యుడు కోరినాడు
తల్లిజాతర నొక మేక చెల్లిపోయె
గుఱ్ఱమును బలి యిమ్మని కోర దేమి
ఏనుగును తెచ్చి బలి చేయ మన దదేమి
పులియె కావలె నని కోర దలచ దేమి
బక్కమేకను భుజియించ వలచు తల్లి
అనుచు విలపించి విలపించి యనవరతము
జబ్బుపడి చచ్చె పెంటియు చచ్చు వేళ
తనకు వగదీరు పగదీరు దారి కొరకు
అమ్మ నీరీతి ప్రార్థించె నాత్మ లోన
చచ్చు మేకగ పుట్టుట పిచ్చితనము
అమ్మరో నన్ను పుట్టించు మమ్మ పులిగ
మా తలల వోలె మనుషు లీ జాతరలను
పులుల తలలను తెగవేయబోరు గాదె
నాదు పెనిమిటి మేకను నఱికి జంపి
గంతు లేసిన వీరల యంతు జూతు
వచ్చు జన్మంబు నందు నా కచ్చదీర
వరము నీయవె తల్లి నా పక్ష మగుచు
అటులె యగుగాక యని పల్కె నపుడు తల్లి
పులిగ బుట్టిన మేకకు పూర్వజన్మ
జ్ఞానమును నిల్చె మిగుల నాశ్చర్యముగను
దాని పగదీరుటకు గూడ తరుణమాయె
ఆలుమగలును బిడ్డయు నడవిదారి
నేగు చుండగ పులి గాంచి యెగిరి దూకి
పతిని పడవైచి సంతోష మతిశయించ
చంపబోవుచు నంతలో సతిని జూచె
మగడు చావగ నుండగా మగువ యచట
పెద్దపెట్టున నేడ్చుచు పెద్దపులికి
దండములు పెట్టుచుండె వేరొండు చేయ
గలిగినది లేక కన్నీళ్ళు కారు చుండ
అంతలో పెద్దపులియును నతివ యెడల
జాలి గొని చేసె మనుజభాషణము నిటుల
మేక కైనను పులికైన మీకు నైన
ప్రాణమొక్కటె సృష్టిలో హీనురాల
తొల్లి మీయింటి మేకనౌ యల్లనాడు
మీరు నా జంట మేకను దారుణముగ
కుత్తుకను కోసి బలిజేసి కులికినారు
అమ్మ దయ పులినైతి మీ యంతు జూడ
ఇన్ని నాళ్ళకు చిక్కితి రింక మీరు
ప్రాణముల మీద నాశలు వదలు కొనక
వేరు దారేమి గలదు పాపిష్టి దాన
కోళ్ళ మేకల జంపెడు కుటిల బుధ్ధి
పులిని క్రూరజంతు వటంచు పలుకుదురటె
క్రూరజంతువు మనిషియే కువలయమున
ఆటగా జంతువుల జంపు నల్పులార
మీవి మాత్రమె ప్రాణాలు కావు సుమ్ము
అనుచు కసిదీర నిష్ఠుర మాడి యాడి
సతిపతుల వంక నతి తిరస్కారదృక్కు
లను బరపి పులి వెండియు ననును కొంత
సౌమ్య భాషణముల నిట్లు చాన తోడ
ఆడుదానను బలహీను రాల నగుచు
నప్పు డేడ్చితి చూడగా నిప్పు డీవు
నేడ్చు చున్నావు నా ముందు హీనబలవు
జాలి కలుగును వీనిని జంపబోను
పతిని కోల్పడు నప్పటి బాధ గూర్చి
యెఱుగనే నేను కావున నితని జంపి
నిన్ను బాధించ బుధ్ది రాకున్న దిపుడు
పొండు పొండింక బ్రతుకుడీ బుధ్ధి కలిగి
ఇట్లు వాక్రుచ్చి యా పులి యేగె నెటకొ
పుండరీకంబు చెప్పిన బుధ్ధి నెఱిగి
నాట గోలెను వారెల్ల నయము మీఱ
భూతదయ గల్గి యుండిరి పుడమి మీద


14, అక్టోబర్ 2014, మంగళవారం

సౌందర్యలహరి - 17 (ముగింపు)



మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం




మొదటి భాగం    రెండవ భాగం


ఈ శ్లోకంలో వశిన్యాది అని చెప్పటం వలన  ఎనిమిది మంది వశినీదేవతలనూ‌ వారితో‌ పాటుగా యోగినులనూ కర్షిణులనూ కూడా స్మరించారని చెప్పుకున్నాం కదా. తదుపరి విషయం చూదాం. 

అమ్మ మాతృకావర్ణరూపిణి అని చెబుతూ ఉంటారు కదా.  అంటే పంచాశత్ వర్ణాలే స్వరూపంగా ఉన్నది అని అర్థం.  ఈ వర్ణాలు అంటే అక్షరాలు సంస్కృతంలో ఏభై ఉన్నాయి.  వీటినే ఎనిమిది వర్గాలుగా విభజించి చెబుతారు.

ఆ విభజన అంతా ఒక పట్టిక రూపంలో చూదాం.

వర్గం పేరు అధిష్టాన దేవత వర్ణాలు మొత్తం
1 అకార వర్గం వశిని అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ
ఏ ఐ ఓ  ఔ అం అః
16
2 క వర్గం కామేశ్వరి క ఖ గ ఘ జ్ఞ 5
3 చ వర్గం మోదిని చ చ జ ఝ ఞ 5
4 ట వర్గం విమల ట ఠ డ ఢ ణ 5
5 త వర్గం అరుణ త థ ద ధ న 5
6 ప వర్గం జయిని ప ఫ బ భ మ 5
7 య వర్గం సర్వేశ్వరి య ర ల వ 4
8 శ వర్గం కౌలినీ శ ష స హ ళ 5


ఈ పై పట్టికలో చూపినట్లుగా సంస్కృతంలోని ఏభై వర్ణాలకూ ఇలా వశిన్యాదులు అధిష్ఠానదేవతలుగా ఉన్నారు.  అందుచేత ఇక్కడ వశిన్యాద్యాభ్యాః అని వశిన్యాదులు ఎనిమిది మంది పరంగాను కూడా అన్వయం చేసుకుంటే అన్ని వర్ణమాతృకలూ ఈ‌ వశిన్యాదులే అన్నది కూడా అన్వయంలోనికి తెచ్చుకున్నట్లు అవుతున్నది కదా. 

ఈ ఏబదివర్ణాలలో అ కారం మొదలు ఠ కారం వరకూ ఉన్న వర్ణాల యొక్క రంగు ధూమ్ర వర్ణం. అంటే వెలిబూడిద రంగు.

డ నుండి ఫ వరకు ఉన్న వర్ణాలు శుక్లవర్ణాలు అంటే తెల్లని రంగు కలవి.

బ నుండి ల వరకు అరుణ ఛ్చాయ కలవి అంటే ఎర్రగా ఉండేవి. ళ కారం కూడా ల కారం గానే ఎర్రనిది.

న నుండి స వరకు ఉన్న వర్ణాలు స్వర్ణఛ్ఛాయ కలవి అంటే బంగారు వన్నె కలవి.

హ కారమూ మెఱుపు వంటి రంగు కలది.  క్ష కారం కూడా అలాంటి వన్నె కలదే.

మూడవ ఆవరణం అష్టకోణం. అంటే మధ్యస్థ త్రికోణాన్ని ఆనుకుని ఉన్న ఎనిమిది త్రికోణాల వలయం. దీనికి సర్వరోగహరచక్రం అని పేరు. ఇక్కడ ఉండే దేవతలు ఎనిమందీ‌ ఈ‌ వశిన్యాదులని చదువుకున్నాం కదా.   సుధాబిందువును కలిగి ఉన్న త్రికోణాన్ని ఆనుకుని ఈ‌ అష్టకోణ చక్రం ఉందని మనకి ఇప్పటికే తెలుసు కదా.  అలాగే ఈ‌ అష్టకోణ చక్రం శివ-శక్తి త్రికోణాల మేళనం వలన యేర్పడుతోందనీ మనకు తెలుసును కదా.  దీని వలన సిధ్ధిస్తున్నది ఏమిటంటే ఏబది వర్ణమాతృకలూ శివశక్తి సమ్మేళనం ఆధారంగా కలవి అని.

అలాగే ఈ‌ అష్టకోణ చక్రం ఏ త్రికోణాన్ని ఆనుకుని ఉందో దానిలో ఉన్న వాగ్భవ, పూర్ణగిరి, జాలంధరపీఠాలను గురించికూడా చదువుకున్నాం సూక్షంగా. ఇందులోనివాగ్భవకూటాన్నే ఇక్కడ వర్ణించారన్న మాట. ఈ‌ మూడు కూటాలను అనుకుని కదా వర్ణమాతృకలు ఉన్నదీ?

అందుచేత ఈ వాగ్భవకూటాన్ని వర్ణమాతృకలకు మూలంగా సారస్వత ధ్యానం ఉందని చెబుతున్నారన్న మాట శ్రీశంకరులు.


13, అక్టోబర్ 2014, సోమవారం

స్వర్గంలో ముని - 3

*        *        *        *        *

ఇంద్రుడు ఆ కుర్చీలో కూలబడగానే అది కాస్తా బాధతో కిర్రో మంది.

అది చూసి ఆశ్చర్యపోవటం ముని వంతు అయ్యింది.

ఆయన కాస్తా అలా ఒక్కసారిగా మీదపడగానే ఆ కుర్చీ కూడా ఎందుకు మట్టి కరవలేదా అని ఆశ్చర్యపోయాడా?

వరం అడుగూ, వరం అడుగూ అని సతాయించి తీరా అడగ్గానే ఈ పెద్దమనిషి, తప్పేను లెండి అదే పెద్దవేలుపు గారు, ఎందుకు ఢామ్మని పడ్డాడా అని ఆశ్చర్యపోయాడా?

తాను తన చిరకాల వాంఛ ఐన మోక్షం అడగటంలో‌ తప్పేమిటీ అని అశ్చర్యపోయాడా?

మోక్షం అన్న మాట తన నోట వినగానే ఏదో  వినకూడని మాట విన్నట్లు ఇంద్రుడి ముఖం ఎందుకు రంగులు మారిందా అని ఆశ్చర్యపోయాడా?

ఎందుకు ముని ఆశ్చర్యపోయాడో మనకెందుకు లెండి. ముని అశ్చర్యపోయాడూ అన్నది ముఖ్యం.

అంతకంటే ఇద్దరిలో ఎవరు ముందుగా తేరుకున్నారూ అన్నది ఉంది చూసారూ అది చాలా ముఖ్యం.

ఎంతైనా దేవతాజాతి కాదూ. ఆయనే మొదట తేరుకున్నాడు. ముని కేసి ఓ సారి పరిశీలనగా తేరిపార జూచాడు.

ఈ‌యన పరిశీలిస్తుండగా ముని కూడా తేరుకున్నాడు.

ఇంద్రుడి నిశితదృక్కులు గమనించి కాస్త కళవళ పడ్డాడు.

ఇంద్రుడు ముఖానికి కాస్త చిరునవ్వు పులుముకొని అసలు మోక్షం అంటే ఏమిటో‌ తెలుసునా నీకు మునీ అని అడిగాడు.

ఎందుకు తెలియదు మహాప్రభో తెలిసే అడిగానండి. ఇన్నాళ్ళ నుండి ఆ మోక్షం కోసమే తపస్సు చేస్తున్నాను అన్నాడు.

బాగుంది బాగుంది. ఇంతకీ ఆమోక్షం అంటే ఏమిటో కూడా కాస్త చెప్పు వింటాం అన్నాడు పాకారి.

ఏముంది ప్రభూ. మోక్షం కనక వచ్చేస్తే మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. లేకపోతే ధృవం జన్మ మృతస్యచ అన్నారు కదా అని తనక్కూడా కొంచెం‌ సంస్కృతం వచ్చునూ అన్న సంగతితో సహా వివరించాడు ముని.

మళ్ళీ పుట్టకుండా ఏమై పోతావు మరి? ఇంద్రుడు అనుమానం వెలిబుచ్చాడు.

ఈ‌యనేదో ఉత్తినే వరం ఇవ్వటం ఎందుకూ అని కొంచెం టెస్టింగు చేస్తున్నాడన్నమాట అని ముని అర్థం చేసుకున్నాడు. మరి పని కావాలంటే ఆయనకు నచ్చాలి కదా తనకు అర్హత దండిగా ఉందీ అని. అందుకే వినయంగా చెప్పాడు. అది నాకు తెలియదు ప్రభూ, దేవుడికే తెలియాలీ అని. ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తుంటే జవాబు తెలియని ప్రశ్నలకి తెలియదని నిజాయితీగా ఒప్పేసుకోవాలీ అని మునికి బోలెడు స్వానుభవం ఉన్నట్లుంది. అందుకే జాగ్రత్త పడ్డాడు. ఎదో డబాయించి చెబుతే అసలుకు ఎసరు రావచ్చును.

అదిసరే, ఇంతకీ మోక్షం మీద మీ‌ మనుష్యులకి ఇంత మోహం దేనికీ?  మళ్ళీ మళ్ళీ పుడితేనేం? మీ సొమ్మేం పోతుందీ అన్నాడు ఇంద్రుడు పరీక్షగా అతని ముఖంలోకి చూస్తూ.

ముని బొత్తిగా చదువుకోని వాడని ఇంద్రుడి లెక్కా యేమిటీ? బోలెడు అధ్యాత్మిక గ్రంథాలు చదివాడు. వాటిలో అతగాడికి బొత్తిగా అర్థం కానివే ఎక్కువ అన్నది వేరే విషయం. ఎంతో కొంత తెలుసుకున్నాడు కదా? అది సరిపోయేలా ఉందిక్కడ.

మళ్ళీ మళ్ళీ పుట్టటం అన్నది భవసాగరం అంటారు కదా దేవా. అది అన్ని బాధలకీ మూలం. పుట్టాక మనిషి కడుపు కక్కుర్తి పనులు చేసి పాపమే కదా సంపాదించుకునేదీ, నరకానికి పోయి బాధలు పడేదీను? ఐనా అపైన  మళ్ళా మళ్ళా దేవుడు వాడిని భూమి మీదకు తరిమేదీనూ? అందుకే దేవుణ్ణి పాపాలన్నింటినీ కేన్సిల్ చేసి మోక్షం ఇమ్మని కోరుకుంటాం అని దంచాడు.

ఏం ఎందుకలా? పుణ్యాలు చేసి హాయిగా స్వర్గంలో చేరి ఎంజాయ్ చేయొచ్చునే అన్నాడు ఇంద్రుడు అభ్యంతరం చెబుతూ.

కావచ్చును ప్రభూ. కాని స్వర్గంలో కూడా మీరు మనుష్యులని ఆట్టే కాలం ఉండ నివ్వరుట కదా, అందుకే మోక్షం కావాలి అని మేము తపస్సు చేసేది అన్నాడు విడమరుస్తూ ముని.

మరి ఇన్ని విషయాలు తెలిసిన వాడివి ఎవరిని ఏమడగ వచ్చునో నీకు ఎందుకు తెలియదూ? అన్నాడు ఇంద్రుడు కొంచెం తీవ్రంగా.

మునికి కొంచెం భయం వేసింది. ఇదేంట్రా బాబూ‌ అనుకున్నాడు.

మళ్ళ ఇంద్రుడే కొంచెం సౌమ్యంగా, అసలు నేనీ ప్రశ్నలు నిన్ను ఎందుకు వేస్తున్నానో అదన్నా తెలిసిందా నీకు అన్నాడు.

మోక్షం కోసం నేను నిజంగానే ఆశపడుతున్నానో లేదో అని అడుగుతున్నారు అన్నాడు ముని.

ఇంద్రుడు కొంచెం నీరసంగా, కొంచెం జాలిగా చూసాడు ముని కేసి.

చూడు మునీ, మీ మునులు తపస్సు చేస్తారు. అది సహజం. ఒక ముని తపస్సు పరిపక్వం ఐతేనే దానికి తగిన ప్రతిఫలం లభించేది. కేవలం తపస్సు చేసేసాడని ఏ మునికీ దేవతలు వరాలివ్వరు. ఇవ్వకూడదు. అది నియమం. నీకు తెలుసో తెలియదో నేను కూడా మునినే,  పైగా మును లందరికీ నేనే పరీక్షాధికారిని. నా పరీక్షల్లో నెగ్గిన మునికే చివరకు తపఃఫలం సిధ్ధిస్తుంది. ఒక ముని బ్రహ్మాండంగా తపస్సు చేసాను అనుకుంటాడు. అది ఎంత నిజమో అబధ్ధమో తేల్చవలసింది నేనే. అర్థమయ్యిందా అన్నాడు ఇంద్రుడు.

చిత్తం ప్రభూ అన్నాడు ముని ఆనందంగా.

ఇలా పరీక్షలు పెట్టటానికి సాధారణంగా నేనే స్వయంగా రావటం ఉండదు. ఇప్పుడు మాత్రం నేనే స్వయంగా ఎందుకు వచ్చానో తెలుసా అన్నాడు ఇంద్రుడు.

నిజానికి మునికి అర్థం కాని విషయం అదే. తాను భగవంతుడి కోసం తపస్సు చేస్తున్నాడు. చివరన ఆయన తనకు ప్రత్యక్షం ఐపోయి మోక్షం ఇవ్వాలని. మరి ఈయన ఎందుకు వచ్చినట్లు తగుదునమ్మా అని? అలాగని పైకి అనటం ప్రమాదం. అంతలో గుర్తుకు వచ్చింది ఇలా ఆలోచించటమూ ప్రమాదమే ఖర్మా అని. మనస్సు కాస్తా మరీ హెచ్చుగా అలోచనలు చేసి ఇబ్బందుల్లో పడకుండా ఉండాలని చెప్పి తెలివిగా, పెద్దలు మీ సంకల్పం  నా బోటివాడికి ఎలా తెలుస్తుంది ప్రభూ అన్నాడు. వెంటనే లోపల్లోపల హమ్మయ్య అని కూడా అనుకున్నాడు చిన్నగా.

ఇంద్రుడి ముఖం వికసించింది.  కొంచెం ప్రసన్నంగా మాట్లాడాడు. పూర్వం మునులకి చాలా కఠోరమైన పరీక్షలు పెట్టేవాడిని. ఈ మధ్యన తపస్సు చేసే వాళ్ళే కరవైపోయారు. కలియుగం కదా అందుకని అన్నమాట. ఇన్నాళ్ళకు నువ్వు తపస్సు చేసిన వాడివి ఒకడివి కనబడ్డావు. అందుకని సంతోషించి అనుగ్రహంతో నేనే స్వయంగా వచ్చానన్నమాట. కాని, నీకూ పరీక్ష పెట్టాలి పధ్ధతి ప్రకారం. కాలానికి తగినట్లుగా నీకూ‌ ఏదో తేలికపాటి పరీక్షపెడతాను అది తప్పదు అర్థమయ్యిందా అన్నాడు ఇంద్రుడు జవాబు చెబుతూ.

మునికి గుండెలు పీచుపీచు మన్నాయి. ఏం పరీక్షపెడతాడో‌ బాబోయ్ అనుకున్నాడు. ఈ మాట ఇంద్రుడు కాని గమనించేసాడా అని అనుమానంగా చూసాడు.

ఏమిటి నీ అనుమానం? అడుగు ఫరవాలేదు అన్నాడు ఇంద్రుడు దిలాసాగా.
 
ఆ పరీక్ష తరువాత తప్పకుండా నాకు మోక్షం ఇస్తారుగా ప్రభూ అన్నాడు ముని.

*        *        *        *        *