1, సెప్టెంబర్ 2014, సోమవారం

బాపూరమణీయం

ఆ.వె. రాత ఘనుడు రమణ గీత ఘనుడు బాపు
రాత గీత భువిని రాజ్యమేలె
రాత నిన్న చనెను గీత నేడు చనెను
రాత గీత దివిని రాజ్యమేలు

కం. రావోయీ బాపూ అని
తా వాత్సల్యంబు మీఱ దశరథసుతుడా
కైవల్యము నిచ్చుటకై
రావించుకొనెను రమణను రమ్మన్నట్లులే

ఆ.వె. బాపు రమణ లేని వసుధనే మెచ్చడు
రమణ బాపు లేక రమణ కాడు
రమణ ముందుగానె రాముని చేరగా
బాపు చేరె రామ పాద మిపుడు

శా. ఓ బాపూ భవదీయమైన తను 
వీ యుర్విన్ విసర్జించినన్
నీ బొమ్మల్ తెలుగిళ్లకిచ్చితివి 

పోని మ్మంతియే చాలులే
నీ బంగారు కలంబు చూపగల 

వన్నెల్ చిన్నెలున్ స్వర్గమం
దే బాగొప్పగ నాంధ్రమాత 

యశమున్ హెచ్చింపగా వెల్గుమా


(పై బొమ్మ ఆంధ్రజ్యోతివారి సౌజన్యంతో)

4 వ్యాఖ్యలు:

 1. బాపు రమణల నిష్క్రమణం తో ఒక శకం ముగిసింది. ప్రతి తెలుగువాని గుండె ఒక నిమిషం లయ తప్పింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పరమపదించె నయ్యొ మన 'బాపు ' - మహోన్నత కార్టునిస్టు; చి
  త్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
  పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;
  తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం
  డరయ - తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. పరమపదించె నయ్యొ మన 'బాపు ' - మహోన్నత కార్టునిస్టు; చి
  త్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
  పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;
  తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం
  డరయ - తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.