25, సెప్టెంబర్ 2014, గురువారం

ఒక ఊరి కథ - 6

ఆ మాట చెప్పునపుడు పంచాయతీ నౌకరు గొంతు జీరబోయినది. ఇంత వరకు చెప్పినవాడు కంట నీరు పెట్టుకొని మౌనముగా నుండిపోయెను.

దాదాపొక నిముషము పాటు వృధ్ధమతపెద్ద కూడ మౌనముగా నాతని వంక జూచుచు నూఱకుండెను.  పిదప మెల్లగ ప్రక్కమీది నుండి దిగి లేచి వెళ్ళి గోడపై నున్న యొక బొత్తమును నొక్కెను.  ఒక కుఱ్ఱవాడు లోనికి రాగా వానిని రెండు కాఫీలు తెమ్మని పురమాయించెను.

ఇరువురును మౌనముగ కాఫీలను సేవించిరి.

మతపెద్ద కొంత తటపటాయించి తుదకు పంచాయతీ నౌకరుతో నీ‌ బాధలను  కెలకుచున్నానా, నీకు కష్టముగా నున్న యెడల చెప్పవద్దులే యనెను.

పంచాయతీ‌ నౌకరు చిన్నగ నవ్వి బాధ యన్నది నాలో నొక భాగమై పోయినది.  మీకు చెప్పుట వలన కొంతగ నుపశమించు నెడల చెప్పుటయే మంచిది గద యని మఱల కథలోనికి వచ్చెను.

షాహుకారుగారు తాను మాట యిచ్చినాడే కాని తనఖాపత్రమును మాకు పంపినది లేదు. కారణమేమో తెలియదు.  షాహుకారు కొడుకు కొంచెము బధ్ధకస్తుడు. ఒక వేళ తండ్రి తనచేతి కా పత్రము నిచ్చినను దానిని మా కందించుట మరచెనేమో తెలియదు.  లేదా షాహుకారు గారే‌ ఆ సంగతిని మరచి యుండవచ్చును.  ఒకవేళ, షాహుకారుగారి యింటిలో నెవరైన నడ్డుచెప్పినారేమో.

మతపెద్ద కల్పించుకొని మీ‌యన్నయే మీకు తనకు పత్ర మందిన సంగతి చెప్పుట మరచెనేమో యనెను.

పంచాయతీ నౌకరు నవ్వి తల నడ్డముగా నూచి యది యసంభవము. మా యన్నగా రంతటి ముఖ్యమైన విషయము మాకు చెప్ప మరచునా యని కథ కొనసాగించినాడు.

కొన్ని నెలలకు మా యన్నగారు మిత్రు లిద్దరితో‌ కలసి విహారయాత్రకు బయలుదేరెను. ఆతడు తిరిగి వచ్చుటకు వారము దినములు పట్టు ననగ నన్నాళ్ళును నగ్రహారములో నుందుమని నాయనగారు మా యన్న నొప్పించిరి.

ఇంతలో నెవరో తలుపు తట్టగా పంచాయతీనౌకరు లేచి వెళ్ళి తలుపు తీసినాడు.  ఎదురుగా నొక నూనూగు మీసముల పిల్లవాడు.

వానిని చూడగనే యేమిరా మందుల నింటి వద్ద నందించలేదా యని ప్రశ్నించెను.

మీ‌యింటి వద్దనుండియే వచ్చుట. గురువుగారు, మిమ్ములను తక్షణమే వెంటబెట్టుకొని రమ్మని మీ‌ నాయన గారి యాదేశమని యా పిల్లవాడు వినయముగా పలికినాడు.

పంచాయతీ నౌకరు బయలుదేరుచు మతపెద్దతో మిగిలిన కథ మరియొకసారి చెప్పెదననగా మతపెద్ద దానికేమి గాని నీవీ‌ పిల్లవాని కేమి నేర్పుచున్నావని ప్రశ్నించెను.

పంచాయతీ నౌకరు గుమ్మము దగ్గరకు పోయిన వాడు వెనుదిరిగి జ్యోతిష మని చెప్పి గుమ్మము దాటినాడు.

ఆత డింటికి చేరుసరికి వాని తండ్రిగారు కొంతగా నాందోళితమనస్కులై కనిపించినారు.  సంగతి యేమని ప్రశ్నించగ వారు కొంత కోపముతో నీకా మతాంతరునితో నేమి పని యని ప్రశ్న వేసినారు.

కుమారునకు విషయము బోధపడినది.  నాయనగారి యాందోళనుములో న్యాయమున్నది ఆయనకు నచ్చజెప్పవలెను కద.  కనుక  క్లుప్తముగనైనను వినయముగనే స్పష్టీకరించినాడు.

"నా కాయన తో‌ పని యున్నది"

"మతాంతరుడు నీకు చేసి పెట్టగల పని యేముండును. ఆతడు గాని నిన్ను ప్రలోభపరచునేమో‌ యని కంగారు పడినాను"

"నాయనగారూ, యిది లౌకికమగు వ్యవహారము.  ఆయనకు మన ప్రాంతములో పట్టును పెంచుకొనుట లక్ష్యము.  నా కాయన లక్ష్యమును నిరోధించుటయే లక్ష్యము"

"అట్లైనచో వానితో మంతనములు దేనికి?"

 "వేఱు మతము వాడు.  కాని యోగ్యుడైన పెద్దమనిషి. తన పని తాను చేయు చున్నాడు. అది ఆయన యుద్యోగధర్మము. అది ఆయనకు ప్రీతిపాత్రమైన పని.  నా ధర్మము వేఱు.   నా మతమును సంరక్షించుకొనుటయే నా ధర్మము.  నాకు  స్వధర్మము. మాత్రమే ప్రీతిపాత్రమైనది. అట్లని విమతస్థుడని దూరముంచినచో వారి కార్యక్రమములు నాకెట్లు బోధపడును? అందువలన తగుమాత్రము స్నేహము తప్పులేదు."

"అయినచో నతనిని నమ్మించి మోసగింతువా?"

"మోసములతో పని లేకుండగనే నా కార్యమును నెఱవేర్చుకొనగలను"

"నాయనా యిది ప్రమాదకరమైన విషయము వలె నున్నది.  వారి వద్ద ధనబలమున్నది.  అంగబలమున్నది. మనవద్ద నేమి యున్నది?  వారితో ఢీకొనుట దేనికి?"

"నా మతమును సంరక్షించుకొనుటయే నా కర్త్యవ్యము. అట్లని నేనేమియు నపాయకరమైన పనులకు దిగుట లేదు. మీరు నిశ్ఛింతగ నుండవచ్చును"

"ఏమో, నాకు నమ్మకము లేదు. మీ యన్న యట్లైనాడు.  నీ వేమో మొండిశిఖండివి.  ఇక్కడ మనకే మున్నదని యుండుట? నీ విట్లు లేని పోని గొడవలలో తలదూర్చుట. చూడగా మన మీ యూరు మారుటయే మంచిదేమో యనిపించుచున్నది."

"ఇది నా పూర్వీకులు కట్టిన యూరు. దీనిని భ్రష్టుగానిచ్చుట కోర్వవచ్చునా? కాబట్టి నాకిది తప్పదు.  ఊరు మారిన నేమగును. అక్కడ మరొక సమస్య ఉండవచ్చును. నాకు తగిన బలము నా కున్నది. మీరు చూచుచుండగనే సర్వమును సుఖాంతమగును"