19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఒక ఊరి కథ - 4

కాఫీలు వచ్చినవి. అందరు నావురావురుమని వాటి నమృతప్రాయముగ స్వీకరించిరి. కాలెడు కడుపునకు మండెడు బూడిద యన్నట్లు భోజనముల వేళ మించిపోవు నట్టి సమయములో వేడివేడి కాఫీలకు మాత్రము నోచుకొన్న ట్లైనది. అవమానమును గూర్చి యాలోచించుట దేవు డెఱుగును గాని మొదట యన్నమును గురించి యాలోచించ వలయును కద.  పంచాయతీ నౌకరు నడుగగా వాడు పూటకూటి యిం డ్లేమియును గ్రామమున లేవని చెప్పెను. వలసినచో శివారుగ్రామము నానుకొని యున్న పట్నములో మా షాహుకారిగారి యల్లుని హోటే లున్నదని చెప్పెను. అచ్చటకు పొండని చెప్పెను.  చుట్టుప్రక్కల నొక పట్న మున్నదని వీరికిని తెలియదా, వీరు వచ్చినది యచ్చట బస్సు దిగి యాటోలపైననే కదా. మరల నందరును కాళ్ళీడ్చుకొనుచు మొగసాల వద్దకు పోయి యచ్చట నున్న యాటోల నెక్కిరి. వారితో‌ బాటుగ పంచాయితీ‌నౌకరు గూడ ప్రయాణము చేసెను.  వానికి పట్నములో పని యున్నదట. విశేషమే మనగా వారితో బాటుగ షాహుకారిగారి యల్లుని భోజనశాలలో సహపంక్తి వారితో భోజనమే చేసెను. వారితో కొంత చనవు చేసుకొని మాటలాడుటయు చేసెను.

ఎంగిలిపడి లేచిన పిదప వారు తిరిగి మనుష్యలోకము లోనికి వచ్చినట్లుగా సంతసించిరి. కిం కర్తవ్య మను చర్చ యొకటి వారి మధ్య నడచినది.  రకరకములైన యభిప్రాయములు నడచినవి. కొందరు నాయకుని కుమారు డింతటి ధూర్తు డనుకొన లేదనిరి.  కొందరేమొ వానికి నాయకుని ప్రథమకోపము వచ్చినది కాని మరేమియు లేదనిరి.  కొంద రీ‌ యవినయమును పెద్దలకు నివేదించి యంతు తేల్చవలసినదే యనిరి.  కొందరు మాత్ర మిది యేదో‌ లోతయిన వ్యవహార మనియు తొందరపడరా దనియు భావించిరి.  ఈ‌ యభిప్రాయము లెట్లున్నను రాగల కార్యక్రమము నాటంకములు లేకుండ జరిపించ లేక పోయినచో తమ పరువు మాత్రము చెట్టెక్కుట ఖాయమని యందరును భయపడిరి.  తక్షణము చేయవలసిన దేమి యన్నది మాత్ర మెవ్వరికిని బోధపడలేదు.

అన్ని మాటల మధ్యన మన వృధ్దవ్యక్తి మాత్రము పూర్తిగ నాలోచనా నిమగ్నుడై యుండెను.  పూర్వము తా ననేక పర్యాయము లీ గ్రామమునకు వచ్చియుండగ దివంగత నాయకుడు పరమప్రీతితో నాదరించు చుండెడి వాడై నప్పుడు వాని కుమారుడు తద్వతిరేకముగ వర్తించుటకు కారణ ముండి తీరవలయు నని యా వృధ్దుని లోకానుభవము చెప్పుచున్న దనిన నతిశయోక్తి కాదు. ఈ సర్పంచిని తాను వాడు కుఱ్ఱవానిగ నున్నప్పటినుండి యెఱిగి యుండెను. వాడు తనకు మొన్నమొన్నటి వరకు మిక్కిలి విధేయుడు. ఇప్పు డెదురు తిరిగి నాడు. తా నందరను పట్నములో నుపాహారము లెందుకు నాయకుని యింటి షడ్రసోపేతమైన భోజనమే గలుగునని యెంతగనో‌ యూరించి లాగుకొని వచ్చెను.  తిండి లేక పోవగా నీళ్ళకాఫీ యొకటి ముఖాన కొట్టినా రదియును రెండుగంటల ప్రాంతమున.  దరఖాస్తునకు చిత్తుబుట్టయే శరణాగతి యని తెలియుచునే యున్నది.  మానావమానములు దైవసంకల్పములు.  తనకు పని యగుట ముఖ్యము. కాబట్టి వీరినందరను వెనుకకు బంపి తానొక్కడే నాయకుని పెద్ద కుమారుని తిరిగి దర్శించి మెల్లగా ప్రసన్నును చేసికొన వలయును.  అట్లు కానిచో కార్యము చెడును.  మానహానికి మించి కార్యహానికే వెఱువ వలసినది కదా.  సాయంతనమున చల్లబాటు వేళలో యువనాయకుని దువ్వుట మంచిది.  ఆత డన్నట్లుగా మిగిలిన దండు కేవలము తిండి దండుగ వారు. మరల నందరును కలసి దండెత్తినట్లు పోయినచో నాతనికి కోపము మిక్కుటమగు ప్రమాదమును గలదు.  ఒకవేళ వారితో కలసి కూర్చున్నను వారిలో నెవరైనను గాని యడ్డదిడ్డముగ నొక్క ముక్క మాట్లాడిన చాలదా తన ప్రయత్న మంతయును బూడిదలో పోసిన పన్నీ రగుటకు.

ఇట్లాలోచించి ఆయన మిగిలిన వారికి నచ్చజెప్పి వారిని వెనుకకు పంపి వేసెను. షావుకారుగారి యల్లుని హోటలు ప్రక్కనే యొక వసతిగృహ ముండెను. అందులో‌ నొక గదిని విలుచుకొని విశ్రాంతి తీసుకొన నుపక్రమించగా కొంత తడవునకు పంచాయితీ నౌకరు పిలవని పేరంటమునకు వచ్చి తలుపు తట్టినాడు.

ఇరువురును సంభాషణ లోనికి దిగిరి.  వీని నుండి సంగతి సందర్భములను గూర్చి తెలుసుకొనవలెనని వృధ్ధుడైన యా మతపెద్ద ఆలోచన. వచ్చిన పెద్దమనిషి కార్యకలాపములు కనిపెట్టి యుండవలెనని దాని వలన తనకు ముందుముందు లాభ ముండవచ్చునని నౌకరు మనసులోని యోచన.

మాటలలోనికి దించుటకు మతపెద్ద యొక ప్రశ్నను వేసెను.  ఇందాక మా షాహుకారి గారి యల్లుడంటివే, యేమి కథ యని.

పంచాయతీనౌకరు చిరునవ్వుతో మావూరి వాడే యా షాహుకారు. ఆయన బాగుపడినాడు. మేము చెడితిమి. అంత కన్నను మఱేమియును లేదనెను.

"ఆతడు మిమ్మేమైన మోసము చేసెనాడా"

"మోసము చేసి నట్లైనచో మా షాహుకా రని యెందుకందును.  ఆయన మోసము చేయలేదు.  ఒకవేళ చేసెనేమో‌ నాకు  స్పష్టముగ తెలియదు.  నాకు తెలిసి జరిగిన దంతయు మా స్వయంకృతాపరాధమే."

'జరిగిన దంతయు ననగ నేమి జరిగెను"

"లప్ప పోయి చిప్ప వచ్చెను"

"నా కేమియు బోదపడలేదు"

"చిన్న విషయమే. ఒకప్పుడు ఈ‌ వసతిగృహమున్న స్థలమును, పూటకూళ్ళిల్లున్న స్థలమును కూడ మావే. మరికొంత స్థలమును గలదు.  అంతయును మేము పోగొట్టుకొంటిమి. అంతయును నాయన సంపాదించుకొనినాడు."

"అదెట్లు"

"కాలో దురతిక్రమణీయః. మా బుధ్దులను దొలచిన పురుగు వీటిని విక్రయింప జేసినది. కాలము త్రోసికొని వచ్చినప్పుడు బుధ్దులు పెడదారి పట్టక మానునా? వినాశకాలే విపరీత బుధ్ధిః యని సామెత యున్నది కదా. మా సంగతి యది"

"నీవు సంస్కృతము తెలిసినట్లున్నావే? బ్రాహ్మణుడవా?"

"అవును బ్రాహ్మణుడనే"

"మీ బ్రాహ్మణులకు నింత చిన్నచిన్న యుద్యోగములు చేయుట నామోషీ కాదా"

"బ్రాహ్మణజన్మము లభించుట యెట్లు పూర్వకర్మానుసారమో యట్లే చిప్పచేతికి వచ్చుట కూడ. మధ్య నామోషీ దేనికి? బ్రాహ్మణపుట్టుక పుట్టి నందు కనియా లేక నౌకరీ చిన్న దనియా?"

"ఇంకను బ్రాహ్మణుడవేనా"

"అయ్యా, బ్రాహ్మణత్వము పుట్టుకచేత. నేను జందెమును తెంపి విసరి వేసినను సమాజము నన్ను బ్రాహ్మణు డనియే పిలచును."

మతపెద్ద నవ్వి యొక పాచిక విసరి చూసెను. "మేము నీ‌వు కావలె నను కొన్నచో నీ బ్రాహ్మణత్వమును వదిలించగలము"

"అదేమి మాట. బ్రాహ్మణత్వ మేమైన దయ్యమా మీరు భూతోఛ్ఛాటనము చేయుటకు?"

"నిన్ను బాధించు నది దయ్యము వంటిదే గదా? అది వదలుట మంచిదే కదా? మేము వదలించిన పిమ్మట నీ బ్రాహ్మణ్య మెగిరి పోవలసినదే!"

"ఏమి చిత్రము. మీ‌ మతములో కలసిన వా రనేకులు తమతమ కులనామములను విడువ గలిగిరా కులములను విడువగలిగిరా నేను నా బ్రాహ్మణ్యమును వదల గలుగుటకు?"

"వారు వదలగోరలేదు. దాని కేమి. నీవు వదల దలచినచో నది పెద్ద విషయము కాదు"

"నేను వదల గోరుట లేదు"

"నీకు నీ‌ బ్రాహ్మణ్య మేమి యుపకారము చేసినది?"

"అట్లని అపకారమేమి చేసినది? నా దైన్యము నకు కారణము నా ప్రారబ్ధము. నా బ్రాహ్మణత్వము కాదే."

"కాని మేము మాత్రము నీ కుపకారము చేయగలము.  నీ పేరు మార్చగలము.  నీ యూరు మార్చగలము. నీకు మంచి యుద్యోగము వేయించి జీవనము మార్చగలము. అవి చాలవా"

"చాలవు. నాలో బ్రాహ్మణుని మార్చలేరు కదా? నడమంత్రముగ మతము మారిన వాని యపరాధభావమును వాని పాత దేవుళ్ళు తీర్చలేరు.  వాని కొత్త దేవుడు కూడ తీర్చలేడు.  ఎందుకు వచ్చిన సజీవనరకము?"

పాచిక పాఱినది కాదు.

మతపెద్ద మరల నవ్వుచు నీ‌ బ్రాహ్మణ్యమునే పదిలముగా నుంచుకొనుము దాని కేమి కాని జరిగినకథ చెప్పుమనెను.  నౌకరునకు పాతవిషయములను త్రవ్వి చెప్పుటకు మనసు కాలేదు. కాబట్టి మాట మార్చబోయెను.

"మీరు నా అదృష్టమును మార్చలేరు కాని నేను మీ అధృష్టమును మార్చగలను"

"అవునా. అదెట్లు?"

మధ్యాహ్నము జరిగిన దంతయును నాకు తెలియును.  అట్లెందు కైనదియును తెలియును. మీకు తెలియని సంగతి యే మనగా సర్పంచిగారు నేటి రాత్రి యూరికి పోవుచున్నారు. మీరు వారిని కలువలేరు.

"ఏడ్చి నట్లున్నది. ఈ‌ మాట తొలుతనే చెప్పినచో నేనును మా వారితో వెనుకకు బోయి యుండెడి వాడను కదా!"

"మీ రొకవేళ పోవుదు రేమో యని చూచుచుంటిని. పోవున ట్లున్నచో చెప్పెడు వాడనే"

"నేను సర్పంచి లేనపుడు చెక్కభజన చేయుచు కూర్చున్నచో‌ నీ‌ కేమి లాభము?"

"సర్పంచి గారిని యొప్పించగల వారిని కలసుకొనవ చ్చును కదా?"

"లాభము లేదు. సర్పంచి భార్యమాట వినువా డనుకొనను"

"ఆయన తల్లిగారి మాటను జవదాటడు.  మీరు పోయి యావిడ కాళ్ళమీద పడవలెను"

ఆలోచన బాగుగనే యున్నది కాని కాళ్ళమీద పడుట యని చెప్పి తనను కొంచెముగ నెద్దేవా చేయుట మాత్రము మతపెద్దకు నచ్చలేదు.  చెప్ప దలచిన మాట చెప్పి పంచాయతీ నౌకరు వెడలిపోవుటకు నుద్యుక్తు డాయెను.

మతపెద్దగారికి కథల పిచ్చి యన్న సంగతి బయటపడినది. నీవు నీ కథను దాటవేయ వీలు లేదు. చెప్పితీరవలయు నని బలవంతము చేసెను. వాని కొక తాయిల మిచ్చుటకు సిధ్ధమైనాడు.

"నీవు నాకు నీ కథను చెప్పినచో నీకు నేను తగిన యుపకారము చేయగలను"

"నా మతమును మార్చుటయే గదా మీ చేయు నుపకారము. నా కక్కర లేదు"

"మతము మార్చుకొన బని లేదులే. నీ కుపకారము చేయుటకు నా కారణము నా కున్నది"

"యేమి కారణము"

"నీ కథను నీవు బ్రతిమలాడినను జెప్పవు కాని నా కథను నేను చెప్పవలయునా?"

పంచాయితీ నౌకరు మెత్తబడెను.

"ఊరక నడిగితిని. మీ‌ కథతో నాకు నిమిత్తము లేదు. నా కథను మీకు చెప్పెదను కాని మీ రెవ్వరికిని వెల్లడించరాదు"

పరమానందముగా నంగీకరించి మతపెద్ద కొంచెము ముందుకు జరిగి కూరుచుండెను.

(సశేషం)

9 వ్యాఖ్యలు:

 1. కథ ముందుకు నడపడానికి తగిన ప్రాతిపదికలు బాగానే ఉన్నాయి. కథా బాగుంది. మరీ విశ్వనాథ సత్యనారాయణ గారిలా రాసేశారు, చదవడం కొద్దిగా ఇబ్బంది పడిన మాట నిజం. కథ బాగుంది కనక దాని గురించిన చింత లేదు. మంచి కథ అవుతుందని నా పూర్తి నమ్మకం.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మిత్రులు శర్మగారు, మీ ఆశీర్వాదములు దొఱకి నందులకు ధన్యుడను. కావలయు ననియే పనిగట్టుకొని విశ్వనాథవారి శైలిలో వ్రాయుట జరుగుచున్నది. ఇటువంటి కథను జెప్పుట కటువంటి ధోరణియే తగిన దనిపించుటవలన నట్లు వ్రాయుట జరుగుచున్నది. కథ బాగుగ వచ్చు ననియే భావించుచున్నాను. మిగిలినది దైవానుగ్రహమే చూడవలయును.

   తొలగించు
  2. నేను ఇదివరకు కూడా ఈ శైలిలో ఒక కధ చదివాను.చాలా కాలమైంది, కధ పేరుతో సహా గుర్తుంది.కారణం - యేమిటి ఇప్పుడు ఈ కాలంలో ఆ శైలికి వెళ్ళి రాస్తున్నాడు అనే - కుతూహలం పుట్టించటమే! కానీ ఇలాంటి కధలకి ముగింపు అద్భుతంగా వుండాలి!మీరు ఇప్పటికే ప్లాన్ చేసుకుని వుంటే సరే, లేకపోతే దాని గురించి తప్పనిసరిగా ఆలోచించాలి.యెక్కడ ఆపాలో తెలుసుకోవడంలోనే ఇట్లాంటి కధల్ని యెన్నుకునే రచయిత అసలయిన ప్రజ్ఞ బయట పడుతుంది!

   తొలగించు
  3. హరిబాబుగారు. కథ యొక్క ఆకృతిస్వభావములను గూర్చి ఆలోచించుకొన్న పిదపనే వ్రాయుచున్నాను. ముగింపును గూర్చి కూడ నిర్ణయించుట జరిగినది. ఇది పెద్దకథ.కాబట్టి అంతవరకు వచ్చుటకు కాలము పట్టును.

   తొలగించు
  4. హరిబాబుగారు. మీరు చదివిన యా కథ పేరేమి, యెవరి రచన వంటివి తెలియజేయగలరా? వీలున్నచో దాని లింకును పంపగలరు.

   తొలగించు
  5. పేరు "శీలమా! అది యేమి?". రచయిత పేరు గుర్తు లేదు.చాలా యేళ్లయింది!ఆంధ్రప్రభ వీక్లీలో అనుకుంటాను వచ్చింది.ఆంధ్రజ్యొతి కూడా అప్పుడు పాపులరే మరి, రెంటిలో యేదయినా కావచ్చు.విషయం స్త్రీల మీద జరిగే(జరుగుతూనే వున్న) అత్యాచారాలకి సంబంధించినది. హీరోయిన్ కి మానభంగం జరిగి తను బాధ పడుతుంటే మీ వుంట్లోంచి యేదో శీల వూడిపోయినట్టు కాదు, సిగ్గు పడాల్సింది నువ్వు కాదు అవతలి వాడు అని హీరో చేత చెప్పించటం కొసమెరుపు.మామూలుగా ఇప్పటి భాషలో రాస్తే చాలా మామూలు కధే కానీ ఈ మోడరన్ కాన్సెప్ట్ ని చెప్పటానికి పాత శైలిని వాదేసరికి నాకు కొత్తగా వుండి చదివాను.

   ఆ పత్రికల ఆర్కైవ్స్ లో వెతికితే తప్ప మిగతా వివరాలు దొరకటం కష్టం!నేనూ దాదాపు మర్చే పోయాను, మీరిప్పుడు మళ్ళీ అదే శైలిని యెత్తుకోవడం చూసి నాకూ హఠాత్తుగా గుర్తు కొచ్చింది.

   తొలగించు
 2. హరిబాబుగారూ, మీరు చెప్పిన రచన గురించి సారంగలో ప్రస్తావన చూసాను. అది ఇక్కడ చూడవచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఇన్నేళ్ళకి మళ్ళీ ఆ కధ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోగలిగాను, చాలా బాగుందీ ఫీలింగ్!

   తొలగించు
  2. సంతోషం.
   కాని ఎక్కడైనా ఆ కథ దొఱకిన బాగుండునని వెదకుచున్నాను.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.