11, సెప్టెంబర్ 2014, గురువారం

ఒక ఊరి కథ. - 1

ఇది యొక యూరి కథ.  ఊరనగా విశేషముగా చెప్పుకొన దగినంతటి గొప్ప విస్తీర్ణము గాని జనసంఖ్య గాని గల యూరు కానే కాదు. నిజమున కది విద్యావైద్యాదిసౌకర్యముల కైనను సరిగా నోచుకొనని చిన్న యూరు. మరియు నింత చిన్నదైన యూరిని గూర్చి యొక కథ దేనికని యడుగ వచ్చును. చెప్పుకొన వలసిన కథ యున్నది కనుకనే దానిని గూర్చి చెప్పుట. దేని కని చెప్పుకొన వలయు ననగా విను వారికి దానివలన ప్రయోజనము విశేషముగా నుండుట వలన. ఈ నాటి వారి దృష్టిలో ప్రయోజన మనగా నార్థికమైన ప్రయోజనమో రాజకీయమైన ప్రయోజనమో యగుటయే ప్రయోజనము కాని మిగిలినవి ప్రయోజనములుగా గనుపించుటయే లేదు. పారమార్థికమైన ప్రయోజనమనగా వినువా రొక్కరైనను కనుపించుట దుర్లభముగా నున్నది. కనుక దీనిని చెప్పుకొనట వలన నేర్పడు ప్రయోజనమును గూర్చి ముందుగనే యుపన్యసించుట వట్టి కంఠశోష మాత్రమే యనుట నటు లుంచగా కార్యహాని యని కూడ తెలియవచ్చు చున్నది. 

ఊరి కేముండినను లేకున్నను దాని కొక పేరు మాత్ర ముండక తీరదు కదా. ఈ యూరిపేరు శివపురము. ఈ మధ్య కొందరు దానినే శివాపురమని పలుకుచున్నారు. 

ఈ పేరునకు కూడ రోజులు మూడినట్లుగా వార్తలు పుట్టుచున్నవి. ఇంత చిన్న యూరిలో జన్మించి యున్నత స్థానముల కెగబ్రాకిన రాజకీయనాయకు డొకడు మొన్నమొన్ననే కాలము చేయుట జరిగినది. ఈ నాటి ధోరణుల కనుకూలముగా నీ యూరి పేరును మార్చి యాయన పేరుతో దీని నలంకరించవలె నని పెద్దమనుష్యులు కొందరు వాదములు చేయుట మొదలు పెట్టినారు. వారు చెప్పు ప్రధానమైన కారణమేమనగా నీ యూరికి శివాపురమని పేరున్న నుండవచ్చును కాని యిచ్చట నున్న చిన్న శివాలయమునకు పౌరాణిక ప్రశస్తి కాని చారిత్రక ప్రశస్తి కాని యున్న జాడలు లేవు. కాబట్టి తమ యూరికి పేరు మార్చుటకు నెవ్వరికి గాని యభ్యంతర ముండ నక్కర లేదు. ఈ కారణమును ప్రక్కన బెట్టి యాలోచించువారికి మరియొక కారణము ప్రధానముగా తోచవచ్చును. కాలముచేసిన నాయకుడు కొన్నేళ్ళ క్రిందట సకుటుంబముగా మతమును మార్చుకొనెను. క్రొత్తమతమును వ్యాప్తిచేయుటకు కావచ్చును లేదా తమ సౌకర్యార్థము కావచ్చును తానొక నూతన ప్రార్థనామందిరమును సర్వాంగసుందరముగా నిర్మించెను. ఇది కొందరికి నచ్చలేదు. కాని వారి వద్ద పెద్దగా సొమ్ముకాని పలుకుబడి కాని లేవు కావున నిమ్మకు నీరెత్తినట్లుగా నూరకుండిరి. మరికొందరికి హర్షదాయకమైనది. వారివద్ద సొమ్ములున్నవి. వారికి చుట్టుపక్కల మిక్కిలి పలుకుబడి యున్నది. అందుచేత నీ యూరి పేరు నేడో రేపో మారుట తథ్యమనియే పెద్ద వదంతిగా నున్నది. ఈ సోది యంతయు నెందుకనగా దానికి మన కథతో సంబంధ ముండుట వలన.

చిత్రమేమనగా చనిపోయిన నాయకుడు తన యూరికి చేసిన మేలని యొక్కటి కూడ చెప్పుకొనుటకు లేదు. ఈ మాటను లోలోన గొణుగుకొను వారే కాని బయటకు చెప్పువా రెవరును లేరనియే చెప్పవచ్చును. ఒక గొప్ప నాయకుడు తమ యూరిలో పుట్టుటయే గౌరవమని భావించువారు దండిగా నున్న సమాజములో కాదని వారిని యొప్పించగల ధీరు లెవరుందురు.  

ఈ శషభిషలకు తెఱదించు సంఘటన యొకటి మెన్నమొన్ననే జరిగినది. క్రొత్త ప్రార్థనామందిరము పైభాగ మందు కొలువుదీరిన ఫలకములో గ్రామనామము మార్పు చేయుబడినది. 

ఈ మార్పు నచ్చిన వారికి నచ్చినది. నచ్చని వారి నచ్చలేదు దానికేమి యనుటకు వీలు లేదు. నచ్చని వారిలో ప్రముఖుడు దివంగత నాయకుని పెద్దకుమారుడు. అతడొక పేరు సూచించగా దాని కెవరో కొంత మార్పు చేసి ఫలకమును వ్రాయించి మందిరము పైకెక్కించిరి. అత డగ్గిమీద గుగ్గిలమన్నట్లు లేచెను.


(సశేషం)

6 వ్యాఖ్యలు:

 1. ఎందుకో కవి సామ్రాట్ గారి శైలి జ్ఞాపకం వచ్చింది..... మిమ్ములను పొగడటం లేదు గమనించగలరు.....
  :-)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అయ్యా కిరణకుమారులవారు,

   మీ వ్యాఖ్యకు సంతోషము. మీకు నా యీ రచనయందు విశ్వనాథవారి శైలి గుర్తుకు వచ్చుట మిక్కిలి యానందించ వలసిన సంగతి. మీరు నన్ను పొగడుట లేదని తెలిసి మరింతగా సంతోషించితిని. ఈ వయసున నొకరి పొగడిక కొఱకు నేను వ్రాయవలసిన పనిలేదు. నచ్చిన వారలకు నా వ్రాతలు నచ్చును. నచ్చని వారలకు నచ్చవు. దానికి గాను సంతోషవిచారము లనవసరము కదా. నన్ను పొగడువారి కొక దండము. పొగడని వారికి కూడ మరియొక దండము.

   విశ్వనాథవారి శైలిలో‌ వ్రాయుటలో నెంతవఱకు కృతకృత్యుడ నైతి నన్నది నాకు తెలియదు. పఠితలకు తెలియ వచ్చును. నేటి కాలములో తెనుగున వ్రాసినచో చదువువారు దొఱకుటయే దుర్లభముగా నున్నది. అట్లయ్యు నిది విశ్వనాథవారి రచనాశైలి యని తెలియు వారు తగినంత మంది యంతర్జాలము నున్నారని తెలియుట ముదావహమైన విషయము. నాకు కవిసామ్రాట్టుల శైలియం దభిరుచి మెండగుటచే వారి శైలిలో వ్రాసితిని కాని వారిని యనుకరించి వెక్కిరించుటకు వ్రాసితి నని యెవ్వరును భావించ బని లేదు.

   మీరు కథను పూర్తియగు నందాక చదువగలరని యాశించుచున్నాను. అట్లు చదువుట వలన నుభయులకును లాభమే కలుగును. ఈ శైలిలో‌ నేను వ్రాయుటను గమనించు వారొకరైన నున్నారన్న స్పృహతో మరింత జాగరూకతతో నేను వ్రాయవచ్చును. మీ వంటి విజ్ఞులకు నా శైలీవిషప్రస్తారాదికముల యందు లోపములు గోచరించినచో నా దృష్టికి నవి తెచ్చుటకు నితోధికమైన నవకాశము కలుగును. దైవ మనుగ్రహించినచో మీకీ కథ నచ్చినను నచ్చవచ్చును.

   మీకు నా ధన్యవాదములు.

   తొలగించు
 2. నేను విశ్వనాథ గారి రచనలు కేవలం “పులి ముగ్గు”, కవలలు” తరువాత పేరు గుర్తుకు రావటం లేదు కానీ బహుశా శంకరాచార్యులతో సంబందం వున్న ఏదో రచన గుర్తుకు రావటం లేదు... తరువాత బహుశా జీవుని కోరిక లాంటి శీర్షిక తో వున్న ఒక కథ చదివాను… నాకు ఎందుకో ఈ శైలి అలాగే అనిపించిది. మీరే ఈ బ్లాగ్ ను వేరే ఎవరో రాశారని అనుకోని చదివి చూడండి... బహుశా మీకు కూడా అలాగే అనిపిస్తే నాకు సంతోషం....మీ బ్లాగ్ కూడా మొత్తం చదివాను సార్.... మీరు పెద్దలు... సరస్వతి పుత్రులు... మీ బ్లాగ్ లో లోపాలు వెదికే అర్హత కానీ, జ్ఞానం గాని నాకు లేవు... ప్రజ లో మిమ్మల్ని కామెంట్ చేసింది నేనే... దానికి క్షంతవ్యున్ని... అంతకుముందే వేరే ఎవరో ఏదో బ్లాగ్ లో తెలంగాణ ప్రజలను అనవసరంగా కువిమర్శ చేస్తే తట్టుకుకోలేకపోయాను... మీరు ఇతర బ్లాగ్స్ లో రాసే కామెంట్లు కూడా నేను గమనిస్తూ వుంటాను... వుంటాను సార్.. నమస్కారం.....

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కిరణకుమారులవారూ,ఇది విశ్వనాథవారి శైలి యని మీరు సరిగానే పోల్చుకొన్నందుకు తొలుతనే హర్షము ప్రకటించితిని. నా వ్రాతనే, వేఱొకరు వ్రాసిరనుకొని చదువుట నాకు దుష్కరమైన విషయము. ప్రజలో మీరు నన్ను గూర్చి వ్యాఖ్యానించ వచ్చును దాని కేమి? నేను మీ యందే లోపమునో పాపమునో గాని యెంచి యుండనప్పుడు మీరు క్షమాపణలను చెప్పుట దేని కొఱకు? కువిమర్శలను ఖండించుట సముచితమగ కార్యమని చెప్పక తప్పదు కాని సదరు విమర్శకుని వలె ప్రతివిమర్శకుడును స్వయముగా నౌచితీభంగమునకు పాల్పడరాదు. ఇది యీ విధముగా చెప్పుట సులభమగు విషయమే కాని దాని నాచరణమునకు దెచ్చుట మిక్కిలి కష్టమని భావింపవచ్చును. కావున జాగరూకులై యుండవలెను. ఇది యందరి వలె నాకును బాగుగనే వర్తించునని నా అభిప్రాయము.

   తొలగించు
 3. < రాజకీయనాయకు డొకడు మున్నమొన్ననే కాలము చేయుట జరిగినది >

  మున్నమొన్ననే నా? మొన్నమొన్ననేనా?

  గ్రాంధిక భాష యందు పట్టుబెంచుకొనుటకిట్టి రచనలయవసరమున్నది :))

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కొండలరావగారిది చదివి నందులకు మిక్కిలి సంతోషము. వాఱొక ముద్రారాక్షసమును గూడ గమనించుట ముదావహము. తప్పును సరిజేసితిని. వారనినట్లుగ నిట్టి రచనల యవసరమున్నది గాని వాటికి లభించు నాదరమే సందేహాస్పదము. వ్రాయు వారల చేతిదురద వలన వ్రాయుట జరుగుచుండునే‌ కాని ఇది కాలప్రవాహమున కనుకూలమైన సంగతి కాదు.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.