26, ఆగస్టు 2014, మంగళవారం

రేఫరహిత శివధనుర్భంగము


మున్నుడి:
శ్రీకంది శంకరయ్యగారు తమ శంకరాభరణం  బ్లాగులో ఈ నెల 17న నిషిధ్ధాక్షరి - 5 పేరిట ‘ర’ అనే అక్షరాన్ని ఉపయోగించకుండా శివధనుర్భంగం గురించి మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి అని ఇచ్చారు.  ముందుగా అనుకొనక పోయినా క్రమంగా నాకొక ఉద్దేశం‌ కలిగింది.  శ్రీరామకథాఘట్టాల లోని శివధనుర్భంగం గురించి పూర్తినిడివి ఖండిక ఒకటి, శంకరయ్యగారిచ్చిన నియమం పాటిస్తూ వ్రాస్తే బాగుంటుందని. ఇది పూర్తినిడివి కాబట్టి ఆ పేజీలో ఒక వ్యాఖ్యగా వ్రాయటం కూడా సాధ్యం కాదు.  అందుచేత వీలు చూచుకొని ఇది వ్రాయటానికి ఉపక్రమించాను.  వాల్మీకులవారి శ్రీమద్రామాయణం బాలకాండలో ఈ‌ఘట్టం 66, 67వ సర్గలుగా వస్తుంది. ముందుగా 66వ సర్గను రేఫరహితంగా వ్రాసి పంపితే శంకరయ్యగారు దానిని పరిష్కరించి తమశంకరాభరణం   బ్లాగులో ప్రకటించారు. తదుపరి రెండవభాగాన్నీ అలాగే‌ రేఫరహితంగా  వ్రాసి పంపితే పరిష్కరించి తమ శంకరాభరణం  బ్లాగులో దానిని కూడా ప్రకటించారు. వారికి నా కృతజ్ఞతలు. అక్కడ కవిమిత్రులు పరిశీలించి చెప్పిన సవరణలు కూడా జతపరచి ఇప్పుడు ఈ‌ నా బ్లాగులో కూడా పొందుపరుస్తున్నాను.


ఆదిత్యకులపావనాకృతులైన
బాలకులను గాధివంశపావనుని
చాల సన్మానించి జనక భూపతియు
భగవానుడా నాదు భాగ్యంబు పండి
చనుదెంచితివి నీదు సంకల్పమునకు
లోకంబులన్నియు లొంగి సేమంబు
గలిగి నడచుచునుండు గాధేయ నేడు
నా కేమి యానతి నా బల్క మెచ్చి
మూడు కాలంబుల ముచ్చట లెల్ల
తెలిసిన ముని యిట్లు తీయతీయంగ
నుడివె నీ బిడ్డలు కొడుకు లయోధ్య
నతికుశలత నేలు నట్టి మహాను
భావుడు దినమణి వంశవల్లభుడు
జనహితుండైన దశస్యందనునకు
నీ యొద్ద నున్నట్టి నిస్తులం బైన
శివమహాచాపంపు చెలువంబు జూప
నేనె దెచ్చితి నయ్య నీ సభ కిట్లు
దానిని తిలకించి తమ యింటి కేగ
తలచు బిడ్డల కీవు దాని చూపించ
వలయును మాదగు వాంఛితం బిదియ
యనినంత తమ యాన యనెను  భూపతియు
అటు బల్కి యుత్సాహ మతిశయించగను
పలుక జొచ్చెను మహీపాలు డా పైన
వినవయ్య మునినాథ వినిపింతు నీకు
భవుని చాపము మాకు వచ్చిన విధము
జననాథవంశభూషణు లిది వినుడు
భవుని చాపము మాకు వచ్చిన విధము
అల్లుడు శివునిపై నలిగి దక్షుండు
శివదేవునే వెలి జేసి యజ్ఞంబు
ఘటియింప జూచిన కలుషాత్ము డైన
దక్షుని భయమున దడదడ మనుచు
దేవత లేగిన దేవదేవుండు
శివుడంత కోపించి చేబూని విల్లు
భవునకు భాగంబు పంచక నొకడు
జన్నంబు చేయుట చాల తప్పనక
సమధికోత్సాహులై చన్నట్టి మీదు
తలలెల్ల డుల్లించ తలచితి ననిన
భీతులై దేవత లాతని పాద
పద్మంబులను బట్టి పనవిన జాలి
పడి నిలింపుల గాచి పదపడి యట్టి
పెనువింటి నెలమిని వినుడు మా వంశ
మందొక్క భక్తుని మన్నించి యిచ్చె
నాతడు నిమి చన నైదవవాడు
పదునైదు మందికి పైవాడు నాకు
యజ్ఞదీక్షితుడనై యవనిని దున్న
నాగేటి చాలున నాకు లభించి
నది యయోనిజ సీత యమిత సుశీల
భూలోకలక్ష్మియై పుట్టిన బాల
చాల దయామృతస్వాంత మా సీత
భూజాతయై పుట్టి యీ జనకు నింట
వెలసిన యీ తల్లి విధమెల్ల తెలిసి
మా కన్య నడుగుచు మహినున్న గొప్ప
జననాథు లిటు వచ్చి జనినది నిజము
బలశాలి యగు వాని భాగ్యమీ తన్వి
బలశాలి యెవడన్న పశుపతి వింటి
నెక్కిడ జాలిన చక్కని వాడె
యను నట్టి నా మాట నాలించి వేగ
శివమహాచాపంబు చేబూన బోయి
ఎంత కష్టించియు నించుక యైన
కదలింప సాధ్యంబు కాకున్న కినిసి
జనపతు లంతట జతగూడి మిథిల
పైకెత్తి వచ్చిన వెనుదీయ కేను
యుధ్ధంబు గావించి యుంటి నొక్కేడు
పోవక భూపతుల్ పోటెత్తి యుండ
చేయ వినతులు జేజేలకు నేను
నా బలంబంతట నాల్గింట నుబ్బె
నా పైన దుష్టుల నణచితి నేను
మీ యాన చొప్పున మునివేగి మీకు
చూపింతు నేపైన చాపంబు నిపుడె
ఈ నాడు గాని యీ యినకులేశుండు
పశుపతి చాపంబు పట్టి పై కెత్తి
జతచేయ గలిగెనా చక్కగా గుణము
బలశాలు లందున బలశాలి యితడె
ఈ యయోనిజ సీత నీతని కిచ్చి
చేసెద పెండ్లి జేజేలెల్ల మెచ్చ

అన మెచ్చుకొని మహాముని గాధిసుతుడు

జననాథ యెనలేని ఘనచాప మిపుడు
గనకుండ మనసాగ దనుమాట నిజము
జలజాక్షు నకు దాని సత్వంబు జూడ
సభజూడ తన దైన సత్వంబు జూప
దానిని తెప్పింప దగునయ్య నీకు
నా విని జనకుడా నందంబు చెలగ
దైవదత్తంబైన నావింటి నంత
సభకు తెండని బంపె సమధిక బలుల
ఎనిమిది చుట్టుల పెనుబండి మీద
నిటలాక్షు చాపంబు నెలకొని యున్న
మణిగణాలంకృతమంజూష నపుడు
వేసట నా యైదు వేలమందియును
కొనితెచ్చి నిలుపగా జనకుని యెదుట
కనుగొని యొడయడు మునిమండనునకు
అద్దాని జూపించి అఖిల లోకేశు
పెద్ద చాపం బిదె యిద్దాని నెత్త
మానవనాథుల మాట యెందులకు
యక్షదనుజనాగు లక్షీణబలులు
దేవముఖ్యులకైన దీనిని బూని
వంచి గుణంబును బంధించ నలవె
యుత్కృష్టమగు వింటి నో మహాభాగ
గాధేయ మౌనిపుంగవ యింక దీని
తమ శిష్యులకు జూప దగునయ్య యనగ
కలువకన్నులవాడ ఘననీలవపుష
జలజాప్తఘనకులతిలక బాలేందు
మౌళి తాల్చిన యట్టి మహితచాపంబు
కన్నులపండువుగా కనవయ్య
యని ముని వేడుక నాన తీయగను
వినయాతిశయమున మునినాథునకును
జననాథునకును వందనములు చేసి
గజగమనంబున ఘనమైన విల్లు
శోభించుచుండు మంజూషను గదిసి
నడచిసవ్యంబుగా గడు భక్తి జూపి
ఓ శివచాపమా యుధ్ధతు డగుచు
వచ్చెను వీడని భావింపవలదు
శివుడన్న నాకుండు చిత్తంబు నందు
నిశ్చలంబై యుండు నిజమైన భక్తి
భవునదై యొప్పెడు బాణాసనంబు
పావనములయందు పావనమనుచు
భావించి వచ్చితి భవదీయమైన
తేజంబు నీక్షించ దీనికి నీవు
కోపించకుండగ గొంకెంచకుండ
నా యందు దయచూపి నన్ను నీ చెలిమి
గొననిమ్ము నా చేత గొననిమ్ము నిన్ను
నని చాల వినుతించి వినయంబు వెలయ
గడియలు విడిపించి ఘనమైన పెట్టె
తలుపు నల్లన దీసి తా గాంచెనపుడు
దివ్యశోభల నీను దేవుని విల్లు
ఠీవి నెగడు దేవదేవుని విల్లు
కని దాని ఘనశోభ కమలాక్షు డపుడు
మునిపతి జనపతు లను గని పలికె
కైలాసపతివింటి గంటి మీ వలన
దయతోడ దీనిని తాకు భాగ్యంబు
అనుమతించుడు ధన్యమగు నాదు జన్మ
మా పైన మీ దైన యానతి యున్న
వాంఛింతు గుణము నవశ్యంబు దొడుగ
బాణంబు సంధించు భావంబు గలుగు
పెద్దలు మీ జెప్పు విధము చేసెదను
మీ‌ పాదముల సాక్షి తాపసనాథ
మీ పాదముల సాక్షి మిధిలాధినాథ
యనవిని మునిపతి జనపతు లపుడు
మిక్కిలి ముదమంది చక్కని పలుకు
పలికితి వయ్య నీ తలచిన యట్లు
శివుని చాపంబును చేబూన వయ్య
చక్కగా గుణమును సంధించ వయ్య
జయమస్తు శుభమస్తు జలజాక్ష యనగ
ధనువును వెస డాసి దాని మధ్యమున
జనపతియగు దశస్యందను పెద్ద
కొడుకు చేయిడి పైకి గొబ్బున లేపె
వేల మంది కదుప వీలు కానట్టి
నీలగళుని విల్లు లీలగా నెత్తె
నెత్తుటయే యేమి ఈశాను దివ్య
చాపంబు గుణమున సంధించె వేగ
శింజిని నాపైన చెవిదాక లాగి
దినపతికులమౌళి కనువిందు చేయ
నంతలో వింతగా నంతకాంతకుని
పెనువిల్లు నడిమికి ఫెళ్ళున తునిసె
భూకంపమనునట్లు పుట్టిన ధ్వనికి
విలయమేఘధ్వానవిధమైన ధ్వనికి
మునిపుంగవుండన జనపతి యనగ
దినమణికులమణిదీపకు లనగ
చక్కగ నిలువంగ సభనున్న జనులు
వివశులై తక్షణం బవనిపై బడగ
తెలివిడి జనులకు గలిగెడి దాక
తాళి నృపాలుండు తాపసిం డాసి
ముకుళిత హస్తుడై మోదం బెసంగ
పలుకాడ దొడగెను పదిమంది వినగ
భగవానుడా నాదు భాగ్యంబు పండె
ఈ నాటి కొక జోదు నీశాను వింటి
నెత్తగా జాలిన యెక్కటి మగని
కన్నులపండువుగా చూడ గంటి
ఇనవంశమున నెంత ఘనుడుదయించె
ముక్కంటి పెనువిల్లు  తుక్కాయె నిపుడు
శివుని విల్లెత్త నా శివునకే తగును
శివుడు గా కున్న కేశవునకే తగును
కలనైన నూహింప గా దన్యు డొకడు
లీలగా కొని తన కేల నద్దాని
బేలపోవగ జేసె బెండు విధాన
నన్నట్టి దద్భుత మాయె మహాత్మ
ఇనకులపావను నెలమి సీతమ్మ
తనపతిగా గొని ధన్యయై వెలుగు
జనకుల కులయశంబును చాల నెగయు
ఘనబలశాలికై జనకుని బిడ్డ
వధువని పలికితి పంతంబు నెగ్గె
తమ యాన యగు నేని తద్దయు వేడ్క
నా యయోధ్యాపతి కతివేగముగను
సంగతి తెలుపగా సచివుల నిపుడు
పంపువాడను వివాహంపు వైభవము
నకు బిల్వ నంపెద నా పట్టణమున
అనవిని గాధేయు డమిత సంతుష్టు
డై మిధిలాధీశు నటు చేయ బంచె.


[గమనికః ఈ కృతి రెండుభాగాలుగా శంకరాభరణం బ్లాగులో ఈ మధ్యనే ప్రకటించబడినది.]

మలిపలుకు:
ఇలా రేఫరహితంగా వ్రాయటంలో పెద్ద ఘనకార్యం ఏమీ లేదు. ఒక చిన్న సరదా ప్రయోగం మాత్రమే.  నిరోష్ట్యంగా కావ్యాలకు కావ్యాలే వ్రాసినవారున్నారు. (నిరోష్ఠ్యం అంటే చెప్పాలి. ఓష్ఠము అంటే పెదవి. అక్షరమాలలోని కొన్ని అక్షరాలను పెదవులు కలిపి పలుకుతాం. అవి ప-ఫ-బ-భ-మ అనే పవర్గం. ఇవే ఓష్ఠ్యవర్గం అక్షరాలన్న మాట. ఈ అక్షరాలను వాడకుండా ఒకటో రెండో పద్యాలు చెప్పటం ఒక చిన్నపాటి తమాషా అనుకుంటే, ఏకంగా ఒక కావ్యమే చెప్పటం అతి గొప్ప సర్కస్ ఫీట్ అన్నమాటే.) అందుచేత కేవలం రేఫలు - అంటే రెండు అక్షరాలు - 'ర',  'ఱ'  అనేవి ఎక్కడా వాడకుండా వ్రాయటం అనేది మరీ గొప్ప చెప్పుకోవలసిన విషయం ఏమీ కాదు.

ఐతే,  ఈ క్రమంలోనూ నాకు తగినన్ని కష్టాలు రానే వచ్చాయి.   రామ పదం రాకూడదాయె. విశ్వామిత్రుడు అనకూడదాయె. దశరథుడు అని కూడా అనకూడదు. ధనుర్భంగం అనకూడదన్నది అలా ఉంచి విల్లు కాస్తా 'విఱిగె' అని కూడా అనకూడదు.  శివుడు ఈ వింటిని జనకుడి పూర్వీకుడైన దేవరాతుడు అనే రాజుకు ఇచ్చాడు. సరిసరి ఈయన పేరూ అనకూడదు. రాముడు వింటికి నారిని తొడిగి ఆకర్ణాంతం లాగాడు. ఈ నారి అని కూడా అనరాదు. ఇలాంటి ఈతిబాధలు సవాలక్ష అన్నమాట.  అట్లాగని ఎలాగో అలాగ పూర్తిచేస్తే కాదు. సారస్యం ఏమీ చెడకూడదు. నా సహజశైలికి మరీ దూరంగా వస్తే కృతకంగా తయారైపోతుంది. అది బాగుండదు. నిఘంటువుల్లోని పదాలు వాడితే అదొక కృతకమైన కిట్టింపువ్యవహారం ఐపోతుంది. సులభమైన మాటలే వాడాలని నా అప్రకటిత నియమం.

ఇలా పూర్తిచేయగా, ఈ‌కృతి మొత్తం రెండు సర్గల్లోని 53శ్లోకాలను దాదాపు 190మంజరీద్విపద పాదాల్లోనికి సరళంగానే అనువాదం చేయటం జరిగింది.

ఒక తమాషా విషయం ఏమిటంటే, మనం నాటకాలూ, సినీమాలూ, సీరియళ్ళలో చూస్తున్నట్లుగా రాముడు విల్లు విరవాలని సీతమ్మవారు మనస్సులో కోరుకుంటూ ఏమీ‌ డైలాగులు చెప్పలేదు. ఆ విల్లు కాస్తా విరిచేయగానే గబగబా వచ్చి రాముడి మెళ్ళో దండను వేసెయ్యలేదు. నిజానికి ఆ ఘట్టంలో సీతమ్మ ఆ సభాస్థలంలో లేనేలేదు! నమ్మండి. వాల్మీకంలో ఉన్నదే చెబుతున్నాను. అందులో ఉన్న సంగతే యథాతధంగా నా ద్విపదఖండికలో వ్రాసాను.  కొద్దిగా నా స్వకపోలకల్పితం ఏదైనా ఉంటే అది పాత్రను ఉద్దీపింపచేయటానికి పాత్రోచితంగా ఒకటిరెండు మాటలు తప్ప మరేమీ లేదు. విషయం అంతా వాల్మీకుల వారిదే ఈ‌ ఖండికలో.  

రంగనాథ రామాయణంలో రాముడు శివధనస్సును చూసి
         ఇది చాల చులకన ఇది చాల అలతి
         పొగడిది దీని నా ముందు భూపాల
అంటాడు.  అదంతా కవిగారి అతివేలమైన రామభక్తివిశేషంచేత ఆయన అలా రాముడి నోట పలికించారు. అది అనుచితం అని నాకు ఎప్పటినుండో కించగా ఉన్న మాట వాస్తవం.

మునిపల్లె సుబ్రహ్మణ్యకవి గారి సుప్రసిధ్ధకృతి ఆధ్యాత్మరామాయణం లోని కీర్తనల్లొ ఒకటైన వినవె శౌరి చరితము గౌరి కీర్తనలో కూడా           
            బెండువంటి నిల్లు నడిమికి
            రెండు జేసి  ..........
అని రాముణ్ణి పరశురాములవారు ఆక్షేపించటం చూస్తాం. అది కూడా కవిగారి భక్తిచిశేషం చేతనే కాని అది నిజంగా బెండువంటి విల్లైతే దానిని ఎనిమిదిచక్రాల పెద్దబండిమీద వేసి వేలకొద్దీ మంది ప్రయాసపడుతూ లాగుకొని రావలసిన అగత్యం ఏమీ ఉండదు కదా.

ఎటొచ్చీ, ఈ సందర్భంలో నేను కొంచెం భిన్నంగా రాముడి చేత సముదాచారయుక్తమైన మాటలు పలికించాను రసజ్ఞులకు ఇది నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాగే‌ అక్కడక్కడ నా మాటలు ఒకటి రెండు ఉండవచ్చును అంతే.

ఇది చదివి వాల్మీకంలో శివధనస్సు గురించీ దానిని రాముడు భగ్నంచేయటం గురించీ వాస్తవంగా వాల్మీకంలో ఏమి ఉందో చదువరులు తెలుసుకోవచ్చును. అంటే ఇక్కడ సంస్కృతంలో స్వయంగా చదువుకొనలేని చదువరులు అని నా అభిప్రాయం.

ఇక ఈ‌ ఖండిక యొక్క అందచందాలంటారా? కాకిపిల్ల కాకికి ముద్దు. నాకైతే బాగానే ఉంటుంది మరి. ఏ మాత్రం సరసంగా ఉందో చదువరులే చెప్పాలి.

మీమీ‌ స్పందనలు తెలియజేస్తే సంతోషం.

11 వ్యాఖ్యలు:

 1. రకారం లేకుండా శివధనుర్భంగమనుకుంటున్నా! మా బోట్లకు దీని అందం కూడా మీరే వివరించాలి. చదివి తెలుసుకునే శక్తి లేనివారం, అల్ప ప్రజ్ఞావంతులం.


  ప్రత్యుత్తరంతొలగించు
 2. మిత్రులు శర్మగారికి వందనం. ఈ టపాలో ఇప్పుడు వివరాలు పొందుపరచానండీ
  మీరు అల్పప్రజ్ఞులేమ్మిటీ! అదేదో సినిమాలో రంగారావుగారు అలాగైతే మేము బీదాతిబీదలం అంటారు. మా సంగతి అలాంటిదన్నమాట.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. గురికి బారెడు దూరం లో సరిగానే ఊహించాననమాట. వాల్మీకి వ్రాసిన మూలంలో ధనుర్భంగ సమయంలో విల్లు ముట్టుకునే ముందు గురువు చెబితేనే ముట్టుకున్నాడు. మూలం నుంచి ఒకటపా సాయిస్తే బాగుణ్ణు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శర్మగారూ, అవశ్యం అలాగే చేదామండీ. ఐతే మూలాన్ని చూపుతూ మరలా తెలుగు వ్యాఖ్య చేస్తే అది కాస్తా ఇంచుమించుగా ఈ ద్విపద ఖండిక అవుతుంది. వీలు వెంబడి వాల్మీకంలోనున్న ఈ సందర్భంలోని 66వ,67వ సర్గలను ఒకటపాగా చూపుతాను. నిజానికి మన కళారూపాల్లో ఈ శివధనుర్భంగం కథను చెప్పేటప్పుడు మనవీరావేశాలప్రదర్శనలో ఔచితీభంగం కావటం తరచుగా కనిపించటమే కాదు, ఆ ప్రదర్శనల్లో ఉన్నదే నిజంగా రామాయణకథ అనుకునే పరిస్థితి ఉంది కూడా. ఉదాహరణకు రావణుడు చతికిలపడితే రాముడు వచ్చి ఆయన మీదపడ్డ విల్లుని తన చేతిలోనికి తీసుకోవటం వంటివి. అందుచేత యదార్థంగా ఏమి జరిగినట్లు వాల్మీకి వ్రాసారనేది తెలుసుకోవలసిన అగత్యం తప్పకుండా ఉంది.

   తొలగించు
 4. నిషిద్ధాక్షరి లేదు కనక సరళమైన తెనుగులో సాయించమని నివేదన.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మామయ్య శ్రీప్రసాద్ ఆత్రేయగారి అబిప్రాయం-

  చిరంజీవి శ్యామల రావునకు,
  చాల బాగుంది. ఇలా వ్రాయడం కష్టం. ఆచ్చ తెలుగు లొ కుమారసంభవం వ్రాసేటప్పుడు నా అనుభవ
  రీత్యా, ఏ ఒక్క నియమము పెట్టుకున్నా, రచనలో ఇబ్బంది ఉంటుంది. ఆడుతున్న ఒక చెయ్యి కట్టేసుకుని సముద్రం ఈదడమే కదా!
  సవరణలు, సూచనలుః
  1) "చు వర్ణంబు తోడ దుగ్దకారంబు త కారం బగు."
  ఉదాః నిలుతురు, పిలుతురు, etc.
  "చేతు, కోతు" ఇత్యాదు లసాధువులు.
  క్రియలో చివర, "చుదు" ఉంటే ""తు" అవుతుంది. "యుదు" ఉంటే కాదు.
  2) వ్యవహారికం లో, పాట లో, "బెండు" అయ్యిం దని నా ఉద్దేశ్యం. అసలు అది "పిండు వంటి విల్లు" .
  బొత్తిగా, ఈ 'పిండు' ఏమిటని, ఇంట్లో పాడుకునే ఆడ వాళ్ళు, వీలు, అర్థం, కోసం మార్చా రని మా అమ్మ చెప్పేది, ఆ పాట పాడుతూ! అంతెందుకు, అన్నమాచార్యుల వారి ఆట వెలది చూస్తున్నాముగా, ఎలా తయారయ్యిందో.
  ఆ.వె. చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ,
  బంగారు మొల తాడు, పట్టు దట్టి,
  సందిట తాయెత్తులు, సరి మువ్వ గజ్జెలు
  చిన్ని క్రిష్ణ నిన్ను చేరి కొలుతు--!!!
  ఎన్ని తప్పులున్నాయో చూడు.
  ఇప్పుడు convent లు వచ్చి, ఈ పద్యం "Ba Ba black sheep' గా మారిం దనుకో!!!
  నీ రేఫ నిషిద్ధ మంజరి సులభ సాధ్యం కాదు.

  దేవి భాగవతం parts పంపుతా నీ corrections కి.

  All the best,

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మావయ్యా, ఉద్వాహంబు జేతు అని వ్రాసానొక చోట. ఉద్వాహంబొనర్తు అంటే బాగుంటుంది కాని ఈ కృతిలో రేఫం వాడటం కుదరదు. అందుఏత వేరేగా మార్చాలి. చూదాం.

   తొలగించు
  2. చేసెద పెండ్లి జేజేలెల్ల మెచ్చ
   అని మార్చా నీ పాదాన్ని. దానిని మీకు మెయిల్లో తెలియజేసాను. ఈ‌మార్పుకి మీ మెచ్చుకోలు లభించటమూ ఆనందంగా ఉంది.

   తొలగించు
 6. ఎంతో అందంగా రాశారు. అక్కడక్కడా సోమనాథుని త్రోవ తోక్కినట్టే రమ్యంగా అనిపించింది.

  ఉదాహరణకి:
  బలశాలి యగు వాని భాగ్యమీ తన్వి
  బలశాలి యెవడన్న పశుపతి వింటి

  మీ‌ పాదముల సాక్షి తాపసనాథ
  మీ పాదముల సాక్షి మిధిలాధినాథ

  శివుని విల్లెత్త నా శివునకే తగును
  శివుడు గా కున్న కేశవునకే తగును

  ర అక్షరం రాకుండానే ఇంత చక్కగా రాశారంటే, ఆ నిబంధన లేకుండా ఇంకా అందంగా రాయగలరని అనటంలో అతిశయోక్తి లేదు.

  వేల మందికి కదుప వీలు కానట్టి బదులు "వేలమంది కదుప వీలుకానట్టి" అని ఉంటే గణాలు సరిపోతవి (మొత్తం రచనని నేను గణపరిశీలన చేయలేదని మనవి).

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. స్వామిగారూ ధన్యవాదాలండీ. నా ఈ‌బ్లాగుకు ఆహ్వానం. కవిత్వం వ్రాసేవాడూ గణాలు కొలుచుకుంటూ వ్రాయడు కాబట్టి అప్పుడప్పుడూ ఇలాంటి స్ఖాలిత్యాల బాధ తగులుతూ‌ ఉంటుంది. ముఖ్యంగా దేశి ఛందస్సులలో. నిజానికి దేశిఛందస్సులలో ఇంద్రగణాలప్రసక్తి వచ్చినప్పుడు సహజసుందర మైనవి పంచమాత్రా గణాలే. అందుచేత భ, నల అనే గణాలు ఒక్కోసారి మరో మాత్రతో దూకుతాయి నడకను అనుసరించి. మన లాక్షణికత కోసం వాటిని వెదికి అక్షరాలా నరకటం చేయవలసి వస్తుంది. సర్వలఘసీసం వ్రాయటంలో కొందరు అక్కడక్కడా మొత్తం పంచలఘుగణాలతో వ్రాసారు సీసాన్ని. మీరు చెప్పిన సూచన మేరకు సవరిస్తున్నాను.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.