18, ఆగస్టు 2014, సోమవారం

పూతన - 5. పూతన శ్రీకృష్ణుని జంపయత్నించుట.

ఆ.వె. శిశువు నెట్టులైన జిదుమంగ రాకాసి
వచ్చి నల్లనయ్య వంక జూచి
వీని జంపు టెట్లు వ్రేలెడైనను లేడె
మనసు రాద టంచు మధనపడుచు

ఆ.వె. వీని జంపకుండ వెనుకకు బోరాదు
రాజు మాట మీర రాని దాయె
నిపుడు వీని నులిమి యింటికి బోయి నా
పాపనికి ముఖంబు జూపగలనె

వ. అని విచారించి బాలుని మొగమ్మీక్షించి

మ. పగ లేదోయి కుమార నీ పయిన నావంతైన నట్లయ్యు ని
న్నొగి నే జంపక ప్రోలి కేగుటకు లో నూహింపగా రాదు నా
దగు దోసంబన కంసరాజునకు మే లాశించ నా కర్మ మి
ట్లగు నం చించుక కాన కుండుటయె నయ్యా గోపచూడామణీ

మ. అవునోయీ మరి నేను రాక్షసినె మా కాదిత్యులే గొప్ప శ
త్రువులీ సృష్టిని తొల్త నుండి కనుకన్ దుర్మార్గు లవ్వారు మా
కవలోకింపగ వారి కట్టులనె మే మట్లౌటచే జంపు వా
రవకాశంబులు గల్గు పట్టులను దైత్యాళిన్ సదా దేవతల్


కం. శిశువు లని చంప వెఱువరు
విశదంబుగ హేమకశిపు బిడ్డను దునుమన్
యశ ముడుగ దేవనాథుడు
నిశిచరపతిసతిని బట్టె నేర్పెసగంగన్

కం. ఈ యూరి కెంత దూరం
బా యూ రటు లెన్ని చూడ నన్నిట నగు సు
మ్మా యూరికి నీ యూరును
నాయనపని యొప్పు నాది యనుచిత మగునే

ఆ.వె. శక్ర డెట్లు తలచె శాత్రవ శాబకుం
డల్ప గాత్రుడగుచు నడలు నపుడె
చంపవలయు ననుచు జక్కగా నారీతి
శిశువు వైన నిన్ను జిదుమ వలయు

తే.గీ. అనుచు దేవవిరోధి యైనట్టి కంస
రాజు ననుబంపె నినుజంపి రమ్మటంచు
నీవు శిశురూపమున నున్న దేవదేవు
డవు మహావిష్ణుడవు నాగ డక్కు గలిగి 

వ. అని యిట్లు కఠినంబుగా పలికి మనసు దిటవు పరచుకొని పైటచెరంగునకు శిశుశిరంబును దెచ్చి చనుమొననందించుచు మరల

కం. ఇది  తప్పని యెంచును మరి
యిది యొప్పగు పనియె శత్రుహింస యుచితమే
యదియును రాజాజ్ఞగ నై
నది విహితం బనుచు దలచు నది తప్పెంచున్

16 వ్యాఖ్యలు:

 1. హమ్మయ్యా, మొత్తానికి మళ్ళీ మొదలుపెట్టారా? ఇది ఎప్పట్నుంచో రాయకుండా ఉంచేసినది. తెలంగాణా ఈ రొచ్చూ, ఆ రొచ్చూ మర్చిపోయి మళ్ళీ గాడిలో పడినందుకు సంతోషం. ఇప్పుడు మళ్ళీ ఆపకండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అవునండీ నిజమే. ఇప్పుడు పూర్తిచేస్తాను. బహుశః ఈ‌ రోజే.

   తొలగించు
  2. please see the following story

   http://www.koumudi.net/Monthly/2014/june/index.html

   mu.rA.ri on left pane.

   Please do not delete anything even if you put a new article combining the old ones.

   తొలగించు
  3. మీ ము.రా.రి కథ బాగానే ఉంది నాకైతే. మీరు వీడి పాత్రను అడ్డేసుకుని ఉపరిస్పర్శగా ఆ రాక్షసవథలన్నీ చక్కగా గుర్తు చేసారు. పూతన ఇంకొక్క భాగంతో సమాప్తం అవుతున్నది. అది రేపో ఎల్లుండో ప్రకటిస్తాను. మొత్తం మీద కొంచెం పెద్ద ఖండికే అవుతున్నది. మరొకటి త్వరలో. అన్నింటిలోనూ‌ నా స్వంతపైత్యం ఉండనే ఉంటుంది కాని ఔచితీభంగం కాదు లెండి ఎక్కడా.

   మొత్తం అంతా ఖండిక ఒకే కొత్త టపాలో వచ్చినా, దాని తాలూకు విడి భాగాలు అలాగే ఉంచుతానండి.

   తొలగించు
 2. బాగుంది పూతన ఆత్మావలోకనం

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీకు నచ్చినందుకు సంతోషమండీ.
   ఇటువంటివే మరొకొన్ని పురాణస్త్రీపాత్రలపైన ఖండికలు వ్రాయాలని ఆశిస్తున్నాను. మీ ఆశీర్వాదాలతో అవికూడా త్వరలోనే వ్రాస్తాను.

   ఈ‌ పూతన ఖండిక పూర్తికాగానే మొత్తం అంతా ఒకే టపాగా విడుదల చేయాలనుకుంటున్నాను. ఐతే విడిభాగాల టపాలు తొలగించటం గురించి మీ సలహా, DGగారి సలహా ఆశిస్తున్నాను.

   తొలగించు
  2. మిత్రులు శ్యామలరావు గారు,
   ఆలస్యం అమృతం విషం. మంచి పనికి ఆలస్యమెందుకు? ఎప్పటి దప్పుడు వేయండి. ఆ తరవాత అన్నిటిని కలిపి ఒకటపా చేయండి. పాత టపాలుంటే నష్టమేంటీ? ఇది మా స్వార్ధం సుమా మా కామెంట్లు పోతాయిగా :)

   తొలగించు
  3. అవునండోయ్. పాత టపాలేనా? మరి పాత కామెంట్ల సంగతో. అవీ ముఖ్యమే. మీ సలహా బాగుంది. అలాగే చేస్తాను.

   తొలగించు
 3. చేయి తిరిగిన కవిత్వం . కొత్త రకమైన ఇతివృత్తం. బాగున్నది. రెండు మూడు చోట్ల గణ భంగాలు సరిచేయగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విష్ణునందనులవారూ, సుస్వాగతం. ఈ ఖండిక భాగాలన్నీ సంకలనం చేసేటప్పుడు మరింత పరిష్కరణం చేసి అవసరమైన సవరణలతో ముందుకు తెస్తానండీ. ఇప్పటికే ఈ‌ భాగంలో ఒకటి రెండు పొరపాట్లు సరిచేసాను. మరొకటి నాదృష్టికి వచ్చినది "కవలోకింపగ వారు నట్టుల మహానందంబుగా జంపు వారు" అన్న పాదంలో యతిదోషం ఉంది. ఇంకా సరిచేయలేదు సమయాభావం వలన. ఆఫీసుకు పరిగెత్తేందుకు తయారవ్వాలండి.

   తొలగించు
 4. రవకాశంబులు గల్గు పట్టులను దైత్యాళిన్ చాల క్రూరమ్ముగన్, శిశువుల జంపెదరును , అను తావులలో గణాలను సరిచేయండి. ఇంకా నిశిచరపతి సమసించదు ప్రత్యామ్నాయాన్ని వెదుకగలరు . ఈ ఖండిక మిగిలిన భాగాలు చదువలేదు , సావకాశంగా చదువ వలసిన పద్యాలవలెనే ఉన్నాయి . అక్కడక్కడా పోతన చ్ఛాయలు కూడా కనిపిస్తున్నాయి . మీకు అభినందనలు .

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విష్ణునందనులవారూ, మీ సూచనలను ధన్యవాదాలతో స్వీకరిస్తున్నాను. ఈ రోజు రాత్రి వీటిని వీలు చూచుకొని సరిజేయగలను. మీరు మిగిలిన భాగాలు వీలు వెంబడి పరిశీలించితే నాకు ఎంతో సంతోషం. ఇక పోతనగారికీ నాకును పోలిక చెప్పటం కేవలం మీ అభిమానం. నాకు అటువంటి స్థాయి రావాలంటే ఎన్ని జన్మల తపస్సు అవసరమౌతుందో చెప్ప నలవి కాదు కదా! ఈ కొంచెపు కవిత్వమైనా అదీ శ్రీరామానుగ్రహవిశేషమే అనుకోండి, నా కదే పదివేలు కదా!

   తొలగించు
  2. విష్ణునందనులవారూ,
   అవునోయీ మరి నేను రాక్షసినె ... పద్యంలో మార్పులు చేసాను.
   శిశువుల జంపెదరును అన్న పాదం మార్చానండీ శిశువులని జంప వెఱువరు అని.

   నిశిచరపతి సమసిస్తుందండీ. ఆదిత్యహృదయంలో ఆ మాటను వాడారు కూడా గమనించగలరు.

   అథ రవి రవద న్నిరీక్ష్య రామం
   ముదితమనాః పరమం ప్రహృష్యమాణః.
   నిశిచరపతి సంక్షయం విదిత్వా
   సురగణ మధ్యగతో వచ స్త్వరేతి
   అని. అందుచేత మార్పు అవసరం లేదనుకుంటున్నాను.

   తొలగించు
 5. శ్రీ శ్యామల రావు గారూ , మీరూదహరించిన ఆదిత్య హృదయం ' ఆర్షము ' కనుక యిక మారు మాట లేదు , అయితే ఆర్య ప్రయోగములం దృష్టంబులు (దుష్టంబులు కాదు , అసలు స్వరూపం దృష్టంబులు మాత్రమే ) గ్రాహ్యంబులు , ఆ 'కోటా' లో నిశి అర్హమే ! నిశా , నిశీథః , నిశీథినీత్యాది పద ప్రయోగములు నైఘంటికములు . ' నిశి ' రూపానికి నైఘంటికార్హత లేదు కానీ వైకృతమైన నిసి తెలుగులో భేషుగ్గా ఆ స్థానాన్ని అందుకొన్నది . ఇదంతా ' అకడెమిక్ ఇంట్రెస్ట్ ' కోసమే !

  ఇంతా వివరణ యిచ్చిన తరువాత ఒక చిన్న సూచన - నిశిచరపతి పదం మీద మీకు మక్కువ ఎక్కువగా ఉండి ఉంటే సరే - మహర్షి ప్రయోగాన్ని కాదనే అర్హత మనకు లేదు కాబట్టి పవిత్రమే . అలాంటి ప్రత్యేకాభిమానమేమీ లేకపోతే అక్కడ ఇంకేదైనా ప్రత్యామ్నాయం కూడా ఆలోచించగలరు !

  శిశువులని ' చంప ' వెఱువరు అనండి ' సరళము ' ను వీడి 'పరుషం'గా !

  ఈ ఖండిక మిగిలిన భాగాలెక్కడున్నాయో తెలియడం లేదు , చదవాలని ఆసక్తి అయితే ఉంది !

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. డాక్టరుగారూ, ప్రత్యేకత ఏమీ లేదు కాని ఎందుకో ఆ నిశిచరపతి అన్న పదం వచ్చేసింది. ప్రయోగమూ ఉంది కాబట్టి ఫరవాలేదని అనుకున్నాను. వీలుంటే మార్చుదాం దానికేమి. నిజానికి నిశాచరపతి అన్నది ఎక్కువగా వినికిడికి దగ్గర అనుకుంటాను.

   మిగతా భాగాల పట్టికను రేపు ఇక్కడ ఇస్తానండి. ఈ రోజు పని తెమిలేసరికి ప్రొద్దుపోయింది కదా.

   తొలగించు
 6. పోతన ఖండికలోని పూర్వభాగాల పట్టిక:

  మొదటి భాగం
  రెండవ భాగం
  మూడవ భాగం
  నాల్గవ భాగం

  మిత్రులు వీటిని కూడా పరిశీలించి తగు సూచనలు చేయగలరని ఆశిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.