30, మార్చి 2014, ఆదివారం

జయనామసంవత్సరం ఉగాది పద్యాలు


ఈ రోజున  కొద్ది సేపటి క్రిందట హైదరాబాదులోని (మియాపూర్) శ్రీకృష్ణదేవరాయ సాహితీస్రవంతి వారు నిర్వహించిన జయనామసంవత్సర ఉగాది కవిసమ్మేళనంలో పాల్గొని నేను చదివిన పద్యాలు.



            కం. ఎల్లి యుగాది యనం గవు
            లుల్లంబుల  జేయు నట్టి యూహల రీతుల్
            దెల్లంబుగ నెఱిగిన మీ
            కెల్లరికిని వందనంబు లివె వేనూఱుల్

            మ. మేలగు వాక్చమత్కృతికి మేదిని నేను కవీశ్వరుండనే
            మేలును గూర్చి బల్కుటకు మిక్క్లిలి నీతివిశారదుండనే
            మేలొనరింతు నంచు బరిమీదికి వచ్చి వచింప నేతనే
            చాలనివాడ నయ్యు కడు సాహసినై పలుకాడ వచ్చితిన్

            మ. ఇదిగో యీ జయనామ వత్సరము రానే వచ్చి కూర్చుండె ని
            య్యది యైనం బిసరంత మంచి పని చేయంజాలునో జాలదో
            మది నూహింపగ రాక యున్నది కదా మానేలపై సౌఖ్యసం
            పదలే యిబ్బడిముబ్బడౌనొ ప్రజలన్ బాధించునో యాతనల్

            చం. గ్రహములు తిన్నగా తిరుగు గావుత నింక శుభాస్పదంబులై
            యహరహమున్ వచశ్శరమహానలకీలల రువ్వునట్టి యా
            గ్రహములు జూపు నాయకుల గర్వము లింక నడంగు గాక లో
            కహితము కొల్లగా గలుగు గాక జయంబను వత్సరంబునన్

            కం. అని తర్కించుచు నుండగ
            మనసును పొంగించు నట్టి మంచిశకునముల్
            కనబడినవి  మనప్రజలకు
            మనభాషకు నభ్యుదయము మహి నెసగుననన్

            ఆ.వె.  మావి కొమ్మ బల్కె మధురపుంస్కోకిలా
            గీతికలను తెలుగు జాతి జయము
            గంధవహునితోడ కబురు పంపించెను
            పూల తీవె తెలుగుభూమి జయము

            ఉ. కల్గును మాయు రాజ్యములు కల్గును మాయు సమస్తభోగముల్
            కల్గును మాయు నెయ్యములు కల్గును మాయు విరోధభావముల్
            కల్గును మాయు సృష్టి నుడికారపుసొంపుల తెల్గుభాషకున్
            కల్గును వృధ్ధి తప్పక జగంబున నిత్యవినూత్నశోభలన్

            చం. ఒకటికి రెండు వాకిళుల నుంచి యిదే తెలుగిల్లు నేడు వే
            డుక మరి రెండు రెట్లగుట డోళ్ళ ఘనాఘన ఘోషణంబులన్
            ప్రకటన చేయు స్వాగత మవశ్య ముగాది జయాబ్దలక్ష్మి ర
            మ్మిక జయశీల నీవు పరమేశ్వర దివ్యకృపాపయోధివై

            అను.  ఉగాది నాడు సంతోషం మొగాన పొంగి పొర్లనీ
            దిగంతవ్యాప్తమై శాంతిన్ జగాన నిండి పోవనీ

            స్వస్తి.