25, ఫిబ్రవరి 2014, మంగళవారం

పత్రికల్లో తెలుగుభాష



రమణగారు  రాజకీయనాయకులు దేవుళ్ళూ దెయ్యాల భాషను వాడినా, పత్రికలు తమ రిపోర్టింగ్‌లో అదే భాషని వాడకూడదూ అని రూలింగ్ ఇచ్చారు మొన్నటి తమ కాలక్షేపం వార్తలు టపాలో. చాలా సంతోషం.

పత్రికలు చాలా సంయమనంతో హుందాగా వ్యవహరిస్తూ పుస్తకాలభాషలో వార్తలు ప్రచురించే కాలం ఒకప్పుడు చూసాము. అప్పట్లో రేడియో ఉన్నా అది దాదాపు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం ఒకలబోస్తూ వార్తల్ని పిండి కషాయంచేసి చిక్కని చక్కని భాషలో వినిపించేది.  అపుడు టీవీ అనేది లేదు.

ఇప్పుడు టీవీనిండా వార్తలఛానెళ్ళే. సినిమా ఛానెళ్ళకన్నా ఇవే ఎక్కువసంఖ్యలో ఉన్నాయంటే దానికి కారణం అవి అందిస్తున్న వార్తలా లేదా  సినీమాలని మించి అవి పంచుతున్న వినోదమా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి.

ఒకప్పుడు పత్రికలరిపోర్టింగులో దొరికిపోయిన నేతలంతా 'పత్రికలు తప్పుగా అర్థంచేసుకున్నాయీ' అని సన్నాయి నొక్కులతో తమను తాము సమర్థించుకొనే వారు.  కాని నేడు నాయకమ్మన్యులు ఏమి వాక్రుచ్చుతున్నదీ యథాతధంగా లైవ్ ప్రసారాలు వస్తున్నాయి వార్తాఛానెళ్ళలో.  కాబట్టి ఈ సన్నాయినొక్కులు కాస్త తగ్గాయి. 

ప్రజలు వార్తలకోసమూ, వాటి వివరాలకోసమూ వార్తాఛానెళ్ళమీద ఆధారపడుతున్నారు కాని చద్దన్నం వడ్డించినట్లు వార్తలందించే పత్రికలమీద కానేకాదు నేడు.  లైవ్‌లో ఎటువంటి భాషావిన్యాసాలు మన నాయకులు చేస్తున్నారో వాటినే అలాగే వాటితాలూకు విశ్లేషణలూ అదే భాషలోనే అందించవలసిన కర్మం పత్రికలకు పట్టింది. మడికట్టుకుంటే అవి ఠప్పున చస్తాయి మరి.

నాయకులమనుకునే వారు జుగుప్సాకరమైన భాషప్రయోగించటం పట్ల, జుగుప్సాకరమైన లేదా విద్వేషపూరితమైన భావజాలంతో మాట్లాడటం పట్లా మీరూ నేనూ అందరూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయాలి ముందుగా.  అలా చేస్తున్నామా?   ఆ మధ్యన, 'ఆంధ్రావాళ్ళు బిర్యానీ చేస్తే పేడలా ఉంటుంది' లాంటి  విద్వేషపూరితమైన వ్యాఖ్యచేసిన గొప్పనేతను మనం తప్పుపట్టగలిగామా?  టీవీఛానెళ్ళలోకి వచ్చి 'లుఛ్ఛాలు' వంటి పదప్రయోగాలు చేస్తే మనం అభ్యంతరం ఏమైనా వ్యక్తం చేయగలిగామా? దాదాపు బూతులుతిడుతూ‌ పాటలు కట్టి టీవీల్లో పాడి వినిపిస్తుంటే మనం అభ్యంతరం చెప్పామా?  కొందరు ఈ ధోరణిలో నిజాలు చూసారు, కొందరు ఈ ధోరణిలో వ్యంగ్యం  చూసారు,  కొందరు నిజాయితీతో కూడిన ఆవేశం చూసారు.  ఔచిత్యం ఎక్కడుంది అన్నది మాత్రం ఎవ్వరూ చూడలేదు.  చూసినా పరిస్థితులకు తలవంచి మాట్లాడే సాహసం చేయలేదు.

పత్రికలేం చేస్తున్నాయి?  సమకాలీన రాజకీయ సామాజిక భాషాప్రయోగాల్ని శీర్షికల్లోకి తీసుకువస్తున్నాయి.  ఔచిత్యం భంగం కానంతవరకూ సమంజసమే.  కాని ఔచిత్యం ఏ మాత్రం తప్పినా  తప్పుపట్టటానికి మనం వ్యాసాలు వ్రాయటానికి పూనుకోగలం. అందులో సందేహం లేదు.

రాజకీయనాయకులనూ ఇతర బడా పెద్దమనుషులనూ‌  తప్పుబట్టం. కొరవితో తల గోక్కోవట మెందుకూ అని.  పత్రికలను మాత్రం పుస్తకాలభాష వదలరాదు అని రూలింగులిస్తాం. పత్రికలు ప్రజలపై చర్యలు తీసుకోవు కదా అని.  కాని మనది పక్షపాత ధోరణి కాదా?

ఈ రోజున  పత్రికలు కరపత్రికలస్థాయికి దిగజారిపోవటాకి టివీతోటీ అంతర్జాలంతోటీ‌పోటీయే కాక ఇంకా మరికొన్ని కారణాలుండవచ్చును.  కాని అవన్నీ అస్తిత్వపోరాటం చేస్తున్నాయి. బతికి బట్టకట్టే  ప్రయత్నంలో భాగంగా అవి భాషవిషయంలో రాజీపడవలసి వస్తోందన్నది చాలా విచారించవలసిన విషయం. అవి  చేస్తున్నది సరైన పని కాదని ఒప్పుకుంటూనే వాటిని కొరతవేయటా ప్రయత్నించటానికి బదులు సమాజంలో భాష యొక్క స్థాయిని మన నాయకులు ఇంకా ఇంకా దిగజార్చకుండా ఉండాలంటే ఏమైనా చేయగలమా అని ఆలోచించాలి.

వక్తల భాష హుందాగా ఉంటే టీవీల్లోనూ పత్రికల్లోనూ కూడా వివరాలు హుందాగానే నివేదించబడతాయి.