27, ఫిబ్రవరి 2014, గురువారం

శివలింగ స్తుతి (దండకం)




శ్రీకంఠ సర్వేశ సద్భక్తమందార దేవాధిదేవా
నమస్తే సదా శంభులింగాయ తుభ్యం
నమస్తే సదా దివ్యలింగాయ తుభ్యం
నమస్తే సదా స్వర్ణలింగాయ తుభ్యం
నమస్తే సదా తామ్రలింగాయ తుభ్యం
నమస్తే సదా రౌప్యలింగాయ తుభ్యం
నమస్తే సదా కాఠలింగాయ తుభ్యం
నమస్తే సదా వాయులింగాయ తుభ్యం
నమస్తే సదా వహ్నిలింగాయ తుభ్యం
నమస్తే సదాఽకాశలింగాయ తుభ్యం
నమస్తే సదా భౌమలింగాయ తుభ్యం
నమస్తే సదా నీరలింగాయ తుభ్యం
నమస్తే సదా భూరిలింగాయ తుభ్యం
నమస్తే సదా విశ్వలింగాయ తుభ్యం
నమస్తే సదా సూర్యలింగాయ తుభ్యం
నమస్తే సదా చంద్రలింగాయ తుభ్యం
నమస్తే సదా ప్రాణలింగాయ తుభ్యం
నమస్తే సదా బ్రహ్మలింగాయ తుభ్యం
నమస్తే సదా భావలింగాయ తుభ్యం
నమస్తే సదా వైద్యలింగాయ తుభ్యం
నమస్తే సదా వేదలింగాయ తుభ్యం
నమస్తే సదా శాంతలింగాయ తుభ్యం
నమస్తే సదా రామలింగాయ తుభ్యం
నమస్తే సదా భీమలింగాయ తుభ్యం
నమస్తే సదా సోమలింగాయ తుభ్యం
నమస్తే సదా రుద్రలింగాయ తుభ్యం
నమస్తే సదా భద్రలింగాయ తుభ్యం
నమస్తే సదా కాలలింగాయ తుభ్యం
నమస్తే సదా నాదలింగాయ తుభ్యం
నమస్తే సదా నాగలింగాయ తుభ్యం
నమస్తే సదా యోగలింగాయ తుభ్యం
నమస్తే సదా భోగలింగాయ తుభ్యం
నమస్తే సదా జ్ఞానలింగాయ తుభ్యం
నమస్తే సదా శర్వలింగాయ తుభ్యం
నమస్తే సదా సర్వలింగాయ తుభ్యం
నమస్తే సదా ధర్మలింగాయ తుభ్యం
నమస్తే సదా ధ్యానలింగాయ తుభ్యం
నమస్తే సదా లోకలింగాయ తుభ్యం
నమస్తే సదా తత్త్వలింగాయ తుభ్యం
నమస్తే సదా సత్త్వలింగాయ తుభ్యం
నమస్తే సదా సత్యలింగాయ తుభ్యం
నమస్తే సదా నిత్యలింగాయ తుభ్యం
నమస్తే సదా కోటిలింగాయ తుభ్యం
నమస్తే సదా మోక్షలింగాయ తుభ్యం
నమస్తే సదా శ్వేతలింగాయ తుభ్యం
నమస్తే సదా జైత్రలింగాయ తుభ్యం
నమస్తే సదా స్థూలలింగాయ తుభ్యం
నమస్తే సదా సూక్ష్మలింగాయ తుభ్యం
నమస్తే సదాఽవ్యక్తలింగాయ తుభ్యం
నమస్తే సదా బుధ్ధిలింగాయ తుభ్యం
నమస్తే సదా భూతలింగాయ తుభ్యం

నమస్తే సదా భస్మలింగాయ తుభ్యం
నమస్తే సదా యజ్ఞలింగాయ తుభ్యం
నమస్తే సదా సామలింగాయ తుభ్యం
నమస్తే సదాఽథర్వలింగాయ తుభ్యం
నమస్తే సదాఽనందలింగాయ తుభ్యం
నమస్తేస్తు తన్మాత్రలింగాయ తుభ్యం
నమస్తేస్త్వహంకారలింగాయ తుభ్యం
నమస్తేస్తు వాయూర్ధ్వలింగాయ తుభ్యం
నమస్తేస్తు త్రైగుణ్యలింగాయ తుభ్యం
నమస్తేస్తు సర్వాత్మలింగాయ తుభ్యం
నమస్తేస్తు యజ్ఙాంగలింగాయ తుభ్యం
నమస్తేస్తు విజ్ఞానలింగాయ తుభ్యం
నమస్తేస్తు పాతాళలింగాయ తుభ్యం
నమస్తేస్తు ఖవ్యాప్తలింగాయ తుభ్యం
నమస్తే  నిరాకారలింగాయ తుభ్యం
నమస్తే నమస్తే నమస్తే మహాదేవ
శంభో నమస్తే నమస్తే నమస్తే నమః


[మహాశివరాత్రపర్వదిన సందర్భంగా భక్తకోటికి శుభాకాంక్షలతో]

26, ఫిబ్రవరి 2014, బుధవారం

దొరల తెలంగాణాయేనా అంటున్న మనవు.


ఈ రోజున మనవు బ్లాగు టపా అమర వీరుల త్యాగ పలితం, ధరల తెలంగాణా ! దొరల తెలంగాణా! బాగుంది. ఆలోచనీయమైన విషయాలు స్పృశించారు.

సుమారు 1300 మంది ఆత్మ హత్యలు చేసుకుంటే కాని తెలంగాణాకు విముక్తి లభించలేదు 

ఈ సంఖ్య విషయంలో పెద్ద గందరగోళం ఉంది. మొన్నమొన్నటిదాకా వినిపించిన కొన్ని వందల నుండి నేటి కొన్నివేల వరకూ యీ అమరవీరులసంఖ్యను ఎవరికి తోచిన విధగా వారు నొక్కివక్కాణిస్తున్నారు. ఆ మధ్యన ఒకాయన టీవీలో మాట్లాడుతూ అనేకవేలమంది అన్నాడు.

దివంగతముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిగారి మృతికి సంతాపసూచకంగా కూడా అసంఖ్యాకంగా తెలుగుప్రజానీకం గుండెపగిలి చనిపోయారట. వారినందరినీ ఓదార్చటానికి ఆయన పుత్రరత్నం జగన్మోహనుడు గత రెండేళ్ళనుండీ, ఇంకా ఓదార్పుయాత్రలు చేస్తూనే ఉన్నాడు.  మరో దశాబ్దానికీ అవి పూర్తయ్యే అవకాశం కనిపించటం లేదు.

ఈ రెండు విషయాలూ కలిపి ఎందుకు ముచ్చటించానూ అంటే, ఇలా చనిపోయిన వారు కూడా రాజకీయప్రవారాస్త్రాలుగా మారటం అనే హీనమైన పరిస్థితిపైన ఆక్షేపణతోటే. ఈ రెండు సంధర్భాలలోనూ చనిపోయినవారి సంఖ్య కన్నా ప్రచారం చేయబడుతున్న సంఖ్యను రాజకీయావసరాలకోసమే భూతద్దాల్లోంచి చూపే ప్రయత్నం జరుగుతున్నదని చెప్పటమే నా ఉద్దేశం.

తెలంగాణా ప్రకటించాక ఈ అమరవీరుల కుటుంబాల వారెవ్వరూ "సంబురాల్లో " పాల్గొన్నట్లు మీడియాలో ఎక్కడా కనిపించలేదు .

ఎలా కనిపిస్తారు?  వారి బలిదానాల యొక్క ప్రయోజనం ఉద్యమజ్వాలలను ఎగదోయటమే. ఉద్యమపరిణామానికి వారి సంఖ్య ప్రధానం కాని వారు కాదు.  అందుకే వారిని స్మరించటానికి ఎన్నో ఆర్భాటాలు చేస్తారు కాని వారి కుటుంబాలను నిజంగా ఎవరూ పట్టించుకోరు.  సముచితగౌరవం దక్కాలని ఆయా మృతుల కుటుంబాలవారు కోరుకుంటున్నారో లేదో చెప్పటం‌ కష్టం.  ఒక వేళ ఎవరైన అలా భావించినా విజయోత్సాహవేళల్లో విజేతల నాయకుల ముఖారవిందాలూ పాదారవిందాలూ కొలుపులు అందుకుంటాయి గాని మధ్యలో నలిగిన సామాన్యుల స్మృతులు కావు.  ఇదేమీ‌ వింతవిషయమూ కాదు కొత్తవిషయమూ కాదు.  కృష్ణదేవరాయలు ఫలానా యుధ్ధంలో గొప్పగా విజయం సాధించాడంటామే కాని ఆ విజయం అందించటంకోసం రాలిపోయిన సైనికుల పేర్ల పట్టీని గురించి ఎవరూ మాట్లాడరు కదా.  అంతే.

తెలంగాణాకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసాక ఏ  దళిత నాయకుడిని వెంటపెట్టుకుని సోనియా గాంది గారి దగ్గరకు వెళ్లి "అమ్మా . వీరి  అభ్యదయం కోసమే వీర తెలంగాణా అని చెప్పిన పాపాన పోలేదు

ఇందులో ఆశ్చర్యపోవలసింది ఏమీలేదు. ఒక నాయకడి ప్రక్కన నిలబడి నడవటాని కి ఆనాయకుడికి అత్యంత ఆంతరంగికులు అర్హత కలిగి ఉంటారు కాని ఇతరులు కారు కదా? ఒక దళితనాయకుడిని రేపు కేసీఆర్‌గారు ముఖ్యమంత్రిని చేయవచ్చును. ఆ సందర్భంలో ఆయనను సోనియాకు పరిచయం చేయవచ్చును.  ప్రస్తుతం ఆయన చేసింది, తానూ తన సైన్యాధిపతులూ పోయి చక్రవర్తిని సందర్శనం చేసి విధేయత ప్రకటించటం.  ఆ సందర్భంలో, తాను నియమించబోయే ఒక్ ఉన్నతాధికారిని వెంటబెట్టుకొని వెళ్ళవలసిన అగత్యం లేదు.

నిన్న "దొరబిడ్డ " డిల్లి నుండి హైదరాబాద్ కు వచ్చిన వేళ , బేగంపేట విమానాశ్రయం నుండి దొరబిడ్డ నివాసం వరకు సాగిన కార్ల ర్యాలి చూస్తుంటే పూర్వపు "దొరల తెలంగాణా " వచ్చినట్లే ఉంది కాని , ఎక్కడా అంబేద్కర్ గారు చెప్పిన సామాజిక తెలంగాణా వస్తుందన్న ఆశ లేశమంతైనా కలుగలేదు 

సామాజికతెలంగాణా వంటి వన్నీ వట్టి గారడీ‌ మాటలు. చీటికీ మాటికీ రాజకీయ పక్షులు అంబేద్కర్ పేరెత్తటమూ నిత్యం వాళ్ళు చేసే రాజకీయగారడీలో భాగమే. ఇది ఒక యుధ్ధవిజయం వంటిది తెలంగాణాకు - ఈ‌ మాట వినటానికి సీమాంద్రులకు వంటికికారం రాసినట్లున్నా - అది నిజం. కేసీఆర్ ఒక విజేత. ఒక యుధ్ధవిజేతకు ఎటువంటి స్వాగతం లభిస్తుందో అటువంటి స్వాగతమే ఆయనకూ లభిస్తోంది.  పాంపే విజయం తరువాత జూలియస్ సీజర్‌కు కూడా ఇటువంటి పౌరస్వాగతమే లభించింది. కెసీఆర్ నిజంగా రాజు కానట్లే ఆనాడు సీజర్ కూడా నిజంగా మకుటధారి ఐన రాజు కాడు.

ఇకపోతే ప్రజానాయకులు నిరాడంబరంగా ఉండాలి వంటి పలుకులన్నీ పాతమాటలు. ఈ రోజున మంత్రులబిడ్దల పెళ్ళిళ్ళకు వందలకోట్లు ఖర్చుపెడుతున్నారు. ఒక రాజ్యాధిపతిస్థితిలో ఉన్నవారికి ఇచ్చే స్వాగతం, అదీ విజయోత్సవస్వాగతం ఎంత ఘనంగా ఉండాలీ? పూర్వపు దొరల కాలంలో ఇలా జరిగేది కాని ఇప్పు డేమిటీ అనలేము.  దొరలెప్పుడూ‌దొరలే. ఘనతవహించిన నిజాం నవాబుగారి ప్రస్తుతిలో ఒళ్ళు మరచి ఔచిత్యం అంచులదాకా వెళ్ళిపోయిన నియోనవాబుగారికి సామాన్యంగా ఉండే స్వాగతోత్సవం ఆగ్రహం తెప్పించవచ్చును!

మరి 10 సంవత్సరాలు నుండి కష్టపడుతున్న అయన పార్టీ కార్య కర్తలకు ఏమైనా లబిస్తుందా అంటే అనుమానమే....గులాబీ  దళాలు పోరాడి అధికారం  కాంగ్రెస్ దొరలకు అప్ప చెప్పుడు తప్పా , తెలంగాణలో వచ్చె మార్పు ఏముంది ?

కార్యకర్తలు ఎప్పుడూ విధేయతగల కార్యకర్తలుగానే గౌరవించబడతారు. వీళ్ళు అక్షరాలా చదరంగంలో పావులవంటి వారు. ఏదో సినిమా డైలాగులో అన్నట్లు,  కార్యకర్తలవంటి పావులు ఎదిరిబలంతో పోరాడటానికే పనికి వస్తారు కాని అధికారం పంచుకుందుకు కాదు. ఈ‌ పార్టీ ఆ పార్టీ అని ఏముంది? ఎప్పుడు చూసినా అన్ని పార్టీలలోనూ కార్యకర్తలు కార్యకర్తలుగానె పుడతారు గిడతారు. నాయకులు నాయకుల ఇండ్లనుండే వస్తారు. కార్యకర్తల ఇండ్లనుండి కార్యకర్తలే రావాలి.  అది రూలు. ఇప్పుడు తెరాసా కార్యకర్తలకు వచ్చే మార్పు అంటారా, వాళ్ళ కండువాల డిజైన్ మరియు రంగులు మారతాయి అంతే.  పోరాటం చేయటానికి వారికి ఎప్పూడూ స్వాగతం పలుకుతారు అధినేతలు. పోరాడే హక్కు తప్ప మరేదైనా లభించాలని కార్యకర్తలు కోరుకోవటం అత్యాశక్రింద లెక్కించబడుతుంది.

సిమాంధ్రా  వారికే ప్రత్యెక హోదాలు , ఉచిత పోలవరం ప్రాజెక్టు , బోల్డన్ని రాయితీలతో కూడిన ప్యాకేజీలు , కొత్త రాజదాని ఇలా ఎన్నో సౌకర్యాలు సమకూరి 10 సంవత్సరాలలో దేశంలో ఒక గుర్తింపు స్తాయికి చేరే అవకాశం  ఉంది

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఏమేమి సమకూరినా వాటిలో సింహభాగం కొట్టేయటానికి రాజకీయనాయకులకు సీమాంధ్రలో కొరత ఏమీ లేదు. అసలు సీమాంధ్రకు కేంద్రం ఇచ్చిన వాగ్దానాలకు ఏమి హామీ ఉంది? ఏమీ చట్టబధ్ధత లేని ఈ హామీలు కేవలం సీమాంధ్రలో చెడిన తమ స్థానాన్ని పునర్వికాసం పొందించుకుందుకు కాంగ్రెసు ఆడుతున్న నాటకాలే తప్ప వీటి మరే విలువా ఇవ్వలేం.  కొన్ని దశాబ్దులుగా సీమాంధ్రులు కూడా హైదరాబాదుకు తమ శక్తియుక్తుల్ని ధారబోసారు - కనీసం వారలా భావిస్తున్నారు.  ఇప్పుడు కేవలం దశాబ్దం కాలంలో సీమాంధ్రను బంగారుభూమి చేయటం అనేది ఒక కమ్మటికల కన్నా మరేమీ కాదు.

తెలంగాణా కి హైదరాబాద్ ఆదాయం తప్ప చెప్పుకోవటానికి ఏమి లేదు . ఆ హైదరాబాద్‌లో కూడా సగం మంది పైగా సిమాంధ్రకి చెందిన వారే !

వినండి వినండి మనవు గారి ఉవాచ.  హైదరాబాద్‌లో కూడా సగం మంది పైగా సిమాంధ్రకి చెందిన వారే అంటున్నారు వారు.  మరి కేసీఆర్‌గారు వేదికలెక్కి గర్జించారు కదా హైదరాబాదులో సీమాంధ్రుల సంఖ్య నాలుగైదు లక్షలకు మించదని?

హైదరాబాదునుండే సమైక్యాంధ్రప్రదేశానికి 70%  పైన ఆదాయం వస్తోంది. ఈ సంగతి వెనుక హైదరాబాదు గొప్ప కన్నా మన నాయకమ్మన్యుల తెలివితక్కువ ప్రణాళికలో వారి ప్రణాళికా రాహిత్యమో ప్రస్ఫుటంగా లేదా? ఈ సమైక్యాంధ్రప్రదేశానికి హైదరాబాదు ఒక్కటే నగరమా?  ఇతరనగరాలలో కూడా అభివృధ్ధికి వీరు ఎందుకు ప్రయత్నమే చేయలేదు?  హైదరాబాదు మీద ఏహక్కులేని స్థితి ఒకటి రావటాన్ని అందుకే సీమాంధ్రులు తట్టుకోలేక పోతున్నారు. ఒక్క ఈ‌ నగరం తప్ప వేరే చోట్ల అభివృధ్ధి లేదని నేడు తెలంగాణావారూ వాపోతున్నారు. భేష్. ముందుచూపు లేని ఈ‌ నాయకులు ఇప్పటికైనా కళ్ళుతెరవాలని కోరుకుందాం.

... ఒక్క సారిగా తెల్లారే పాటికి ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు....ఏంతో ఆశగా ఉన్నారు.

ఇలాంటి ఆచరణసాధ్యం కాని ఆశలు రేపి తెలంగాణాలోని అమాయకయువకులను మోసం చేసింది ఎవరూ? ఈ రోజున ఊరేగింపులు చేస్తున్న, చేయించుకుంటున్న వీరవరేణ్యులు కారా?

రెండేళ్ళ క్రిందట జరిగిన, ఒక యధార్థం సంఘటన చెబుతాను. ఒక యువఆటోడ్రైవర్ ఒక ఉద్యోగిని మైండ్‌స్పేస్ లోని ఒక ఆఫీస్ భవనం గేటు దగ్గర దించాడు. ఆటో దిగిన ఉద్యోగితో "మేడమ్‌, రేపు తెలంగాణా వస్తుంది కదా,  మీ ఆంధ్రోళ్ళంతా వెళ్ళిపోయాక ఈ ఆఫీసుల్లో ఉద్యోగాలన్నీ మా కిచ్చేస్తారు కదా" అని అడిగాడు. పాపం, ఆమెకు ఎం చెప్పాలో అర్థం కాలేదు.

 ...దొరల పాలనలో ధరల బారం తో కుంగిపోవడం తప్పా , కొత్తగా వచ్చె లాభాలేంటో ఇంతవరకు తెలంగాణా ప్రజలుకు తెలియదు . 

అనంతకోటి లాభాలు వచ్చి మీదపడిపోతున్నాయని ఇన్నాళ్ళు ఊదరగొడుతున్న ఉద్యమనాయకుల్ని నిలదీసి అడగవలసిన ప్రశ్న యిది.

ఉద్యోగులకు జీతాలివ్వటానికీ డబ్బుల్లేని సీమాంధ్రరాష్ట్రమూ, హైదరాబాదుమీద వచ్చే ఆదాయం తెలంగాణా రాష్ట్రం లో ఏర్పడే కరెంట్ లోటు ను పూడ్చడానికే వినియోగించ వలసిన పరిస్థితిలో తెలంగాణరాష్ట్రమూ రెండూ కష్టాలసుడిగుండంలో చిక్కుకోవటం తప్పని పరిస్థితి. 

జనం మిద ధరల పిడుగులుతో రెండు రాష్ట్రాలూ ఇబ్బందిపడక తప్పదు.  క్రుంగిపోవటం తప్ప కొత్తగా వచ్చే లాభాలేమిటో సీమాంధ్రప్రజలకూ తెలియదు, తెలంగాణాప్రజలకూ తెలియదు.



25, ఫిబ్రవరి 2014, మంగళవారం

నూతన రాష్ట్రం అవసరాలూ - కుల ప్రయోజనాలూ



ఈ‌ విషయం గురించి మొన్న 23వ తారీఖున ప్రత్యెక ఆంధ్ర రాష్ట్రంలో కమ్మవారికి కలిగే ప్రయోజనాలేమిటి? అనే టపాకు వ్యాఖ్యలుగా కొన్ని విషయాలు వ్రాసాను.

అలోచించగా ఈ వ్యాఖ్యలు రెండింటినీ యీ శ్యామలీయం బ్లాగులో ఒక టపా గా ఉంచితే విస్తృతప్రజానీకానికి అంది మరింత ఉపయుక్తంగా ఉంటాయన్న భావన కలిగింది.

ఈ భావనకు బలం చేకూర్చుతూ కొన్ని వార్తలు వస్తున్నాయి.  ముఖ్యంగా కాపు సామాజిక వర్గంపై కాంగ్రెస్ కన్ను వేసి భారతజాతీయ కాంగ్రెసు అనే ఘనత వహించిన లౌకికపార్టీ ఆలోచిస్తోందనీ, శ్రీచిరంజీవిగారిని ముఖ్యమంత్రిని చేయటం జరుగచచ్చనీ వార్తల సారాంశం.  ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చేలా ఆర్డినెన్స్ ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. పనిలో పనిగా ముస్లింలకు కూడా ఐదు శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని చూస్తోంది అనీ ఆ టపాలో పేర్కొనటం జరిగింది. ఇలా మతాలు కులాల ప్రాతిపదికన, -- అన్నట్లు ప్రాంతాల సెంటిమెంట్ల ప్రాతిపదికన కూడా -- జనబాహుళ్యాన్ని ముక్కముక్కలుగా విభజించే ఈ‌ నూటపాతికేళ్ళ చరిత్ర గలిగిన పార్టీగా చెప్పుకొనే యీ భారతజాతీయకాంగ్రెసు పార్టీ మనదేశంలో అతిముఖ్యమైన లౌకికవాద పార్టీగా ప్రజలను గత అరవైఐదేళ్ళుగా తీవ్రాతితీవ్రంగా వంచిస్తూనే ఉంది.

జనం కేవలం వెఱ్ఱిగొఱ్ఱెలు అనే దివ్యమైన కాలనిరూపితమైనదిగా రాజకీయవర్గాలలో భావించబదుతున్న సిధ్దాంతం మేరకు మన ప్రజలు కులాలప్రాతిపదికనా, మతాల ప్రాతిపదికనా, ప్రాంతాలప్రాతిపదికనా ఇంకా దేశక్షేమం తప్ప అనేకానేక నిర్హేతుకమైన సవాలక్షప్రాత్రిపదకలతో ఓట్లపండగ చేసేసుకుంటే అచిరకాలంలోనే భారతదేశం కూడా ముక్కలు చెక్కలు అయ్యే ప్రమాదం‌ పొంచిఉంది.

ఈ రోజునే పులిపై స్వారీ ప్రమాదకరం!  అనే ఒక సరసభారతివారి టపా ఒకటి చదివాను.  అందులోని మాటలు కొన్ని చూడండి: భారతీయులంతా ఒకటే అనే భావాత్మక సమైక్యత లేకపోతే భారతదేశం 1990లో రష్యా విడివడినట్లు చిన్న చిన్న దేశాలుగా విడిపోతుంది. ఇది ఊహాగానం కాదు. చైనావారు స్పష్టంగా తమ వెబ్‌సైట్‌లో ఈమధ్య ఈ అంశాన్ని ప్రచురించారు. "భారత్ 50 చిన్న దేశాలుగా మారుతుంది" అని తేల్చి చెప్పారు.
ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చేలా ఆర్డినెన్స్ ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. పనిలో పనిగా ముస్లింలకు కూడా ఐదు శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని చూస్తుంది. - See more at: http://aviiviannee.blogspot.in/2014/02/blog-post_25.html#sthash.gM3DMXF6.dpuf
ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చేలా ఆర్డినెన్స్ ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. పనిలో పనిగా ముస్లింలకు కూడా ఐదు శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని చూస్తుంది. - See more at: http://aviiviannee.blogspot.in/2014/02/blog-post_25.html#sthash.gM3DMXF6.dpuf
ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చేలా ఆర్డినెన్స్ ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. పనిలో పనిగా ముస్లింలకు కూడా ఐదు శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని చూస్తుంది. - See more at: http://aviiviannee.blogspot.in/2014/02/blog-post_25.html#sthash.gM3DMXF6.dpuf

సరే విషయానికి వద్దాం. ప్రత్యెక ఆంధ్ర రాష్ట్రంలో కమ్మవారికి కలిగే ప్రయోజనాలేమిటి? అనే టపాకు నా మొదటివ్యాఖ్య ఇలా ఉంది:

ఆర్యా,

మీ ఈ వ్యాసంలో విషయాల గురించి నేను వ్యాఖ్యానించటం లేదు.  అంతకంటే ముఖ్యమైన ఒకటి రెండు విసయాలు ప్రస్తావిస్తున్నాను. గమనించండి.

౧. కులం‌ ప్రాతిపదికగా అలోచించటం వలన,  వైషమ్యాలు పెరగటం మినహాయించి ప్రజాబాహుళ్యానికి నేడైనా రేపైనా కలిగే ప్రయోజనం శూన్యం. సంకుచితమైన ఇటువంటీ ఆలోచనాధోరణులకు స్వస్తిచెప్పి,  రాష్ట్రప్రజల సమిష్టిప్రయోజనాల కొరకు చేతనైన కృషి చేయటానికి అందరూ పూనుకోవలసిన అత్యవసర పరిస్థితిని దయచేసి అర్థం చేసుకోవలసింది.

౨. మన ప్రియతమ భారతదేశంలో ప్రజలు అనేకానేక కారణాలవలన తమలో తాము చిలిపితగాదాలలో నిమగ్నులైపోయి నిత్యం తమతమ శక్తియుక్తులన్నీ సాటిభారతీయుల ప్రయోజనాలు కూలద్రోయటం అనే ఏకైకకార్యక్రమంలో నిమగ్నులైపోవటం కారణంగా మనదేశం దుర్భరదాస్యశృంఖలాలలో చిక్కి వేయేండ్లపైచిలుకు కునారిల్లింది.  ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్వతంత్రం‌ కూడా సంపూర్ణమైనది కాదు.  మనలో మనం‌ ఏనాడు ఐకమత్యంతో ఉండి భారతదేశాభివృధ్ధి తప్ప సంకుచితమైన ఇతరలక్ష్యాల వైపు చూడటం వాటికోసం ఆలోచించటం మాని వేసి దేశాన్ని సుభిక్షం చేసుకుంటామో అప్పుడే మనదేశం నిజమైన స్వతంత్రసంసిధ్ధి పొందినది అవుతుంది.  ఈ విషయంలో మీరు ఏకీభవిస్తారని ఆశిస్తున్నాను.

౩. దేశంలో అసంఖ్యాకంగా కులాలున్నాయి. కులవ్యవస్థలేదు లేదు అనుకునే ఇతరమతాలలో సైతం అనేక ఏవేవో నామరూపాలతో కులాలున్నాయి.  బహుశః ఈ దేశంలో మతం మారినవారు తమ కులాన్ని కూడా వెంట బెట్టుకొని వెళ్ళి మరీ ఆయాకులాల్లో వాటిని కొనసాగించారు.  దేశవ్యాప్తంగా ఉన్న వందలాది కులాలు తమతమ వర్గీయుల అభివృధ్ధి అనే హ్రస్వదృష్టిని వదుల్చుకుని భారతీయులంతా ఒకటే అనే దృక్కోణం అలవరచుకోవాలి.  ఇది చెప్పినంత సులభం కాదని తెలుసును.  ఐనా విద్యాగంధం కాస్తకాస్త వ్యాపిస్తున్న ఈ రోజుల్లో సద్భావనలూ వ్యాప్తిచెందాలి కదా!  విద్యావంతులు సాహసించి సంకుచిత కులదృక్పధనిర్మూలనకు కృషిచేస్తే గాని మెల్లమెల్లగా దేశంలో ఐకమత్యం పరిడవిల్లే రోజు రాదు.  దయచేసి ఆలోచించండి.  బ్రాహ్మణసేవాసంఘాలూ, కమ్మఅసోసియేషనులు, క్రిష్టియన్ యూనిటీ అంటూ మనలో మనమే చిన్నచిన్న వృత్తాల్లో మనని మనం ఇముడ్చుకుంటూ నూతుల్లో కప్పల్లా జీవించటమే మోక్షం అనుకుంటే ఈ దేశం‌ మరలా క్రమంగా విదేశాల ప్రత్యక్షపాలనలోకి పోతుంది.  నిర్మొగమాటంగా చెప్పాలంటే ఇప్పటికే మనం ప్రత్యక్షవిదేశీపాలనలోకి వచ్చి దానికి జైకొడుతున్నాం.

మీకు చేతనైన కృషి చేయండి. అర్హులకు సాయం చేయండి.  వాళ్ళు మనకులమా అని ఆలోచించకండి.  మంచి పనులు చేయండి.  మనం చేసే మంచి మన కులం వాళ్ళకోసమే పరిమితం కావాలని ఆలోచించకండి.

ఇంతకంటే చెప్పగలిగినది లేదు.  నమస్కారం.

మీకు ఇలా హితబోధలు చేయటానికి నేనెవణ్ణి అన్న భావన కలిగితె దయచేసి క్షమించండి. 

లోకాస్సమస్తా స్సుఖినో భవంతు.  స్వస్తిరస్తు.


ఇక  ప్రత్యెక ఆంధ్ర రాష్ట్రంలో కమ్మవారికి కలిగే ప్రయోజనాలేమిటి? అనే టపాకు నా  రెండవవ్యాఖ్య ఇలా ఉంది:
 
రవీంధ్రనాధ్‌గారూ,

నా అభిప్రాయాలను తప్పుబట్టనందుకు ధన్యవాదాలు. అందరూ కలసివస్తే కాని సరైనదారిలో అభివృధ్ధి జరగటం కష్టమన్న మీ‌ అభిప్రాయం‌లో తప్పకుండా తార్కికత ఉన్నది.  కాని ఆరంభం అంటూ ఒకటి ఉండాలి కదా.  అది ఉదాత్తంగా కూడా ఉండాలి కదా.  అందుచేత అన్నిరకాల సంకుచిత ధోరణులను మనం నిర్ద్వందంగా తిరస్కరించగల స్థితిని చేరుకుందుకు గాను కృషిచేయాలని నా విజ్ఞప్తి.  ఒకరయ్యేది పదిమందయ్యేది హృదయపూర్వకంగా యీ ధోరణిలో సాగటం మొదలు పెట్టిన తరువాత భగవంతుడి అనుగ్రహంతో మిగిలినవారు కూడా అర్థంచేసుకుని కలసి వస్తారని ఆశించగలం.  అందు చేత మనం యీ‌ కులమతప్రాంతాదుల ప్రాతిపదికన గుంపుకట్టటం అనే అలవాటునుండి ప్రయత్నపూర్వకంగా విరమించుకోవాలి.  నేను ఏదొ కమ్మసంఘం అన్న నిరసనభావంతో చెబుతున్నానని మీరు అనుకోరన్న నమ్మకం నాకుంది.  నేను జన్మతః బ్రాహ్మణుడనైనా నాకు బ్రాహ్మణసంఘాలపేర గుంపుకట్టటం పైన కూడా అంతే ఆక్షేపణ ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఆభిజాత్యం అన్నది దానంత అది చెడ్డలక్షణం కాదు.  కాని అదే సర్వస్వం అన్న పోకడను కలిగి ఉండటమూ దాన్ని జాతీయదృక్పధం కన్న పైన ఉంచాలని ప్రయత్నించటమూ అనేవి జాతి ఉనికికీ దాని అభివృధ్ధికీ చాలా చెఱుపు చేసే విషయాలు.  మాట వరసకు నేటి తెలుగుగడ్డ పరిస్థితినే తీసుకుందాం.  సీమాంధ్రపరిస్థితి అంధకారంగా ఉందని చెప్పవచ్చును.  ఇప్పుడు చీకట్లోంచి యావత్తు సీమాంధ్రనూ ఉధ్ధరించే ఆలోచనలు చేయాలా, మనలో మనం ఏలా మూటలు కట్టుకోవాలా యీ మసకమసక చీకటిలో అని ఏ ముఠాకు ఆ ముఠా అలోచనలు చేయాలా?  దేనిని మనం సమర్థించాలి అన్నది మీరే అలోచించి చూడండి దయచేసి.  ఇక్కడ  నేను ఒక ముఠా అని అన్నది ఒక రాజకీయ పార్టీ కావచ్చును, కులం కావచ్చును, వ్యాపారవర్గం కావచ్చును, సమాజానికి ఒక ఆపద వచ్చినప్పుడు ఎలా స్పందించటం ఉచితం అన్నది విద్యాసంస్కారవాసనలు గల అందరికీ ఎంతో కొంత అవగాహనలో ఉండాలి.  చూదండి అప్పుడే మా నగరంలో రాజధాని పెట్టాలి అంటే మా నగరంలో పెట్టితీరాలీ అని సిగపట్లు మొదలు పెట్టారు.  ఇది సీమాంధ్రను అభివృధ్ధిపథంలో నడిపే లక్షణమేనా?  వీళ్ళా మనకు నాయకులు?  మనని ఈ ఆపత్సమయంలో  ఉధ్ధరించే వారు?  నిర్మొగమాటంగా చెప్పాలంటే, స్వప్రయోజనం తప్ప జాతిప్రయోజనం పట్టని వ్యక్తులూ సంఘాలూ, పార్టీలూ సిధ్ధాంతాలు కాలగమనంలో పాపాన్నీ అపఖ్యాతినీ తప్ప మరేమీ మూటకట్టుకోవటం జరుగదు.  ఒక వరదలో జనం చిక్కుకున్న చోట రక్షణచర్యలకు దిగేవారు మా వాళ్ళను ముందు రక్షించి వీలుంటే మిగతా వారి సంగతి చూడాలని ఆలోచించటం సబబంటారా?  వీలైనంతమందిని ప్రాణాలకు తెగించి రక్షించాలని ముందుకు దూకటం సబబంటారా?  ఇప్పుడు సీమాంధ్రలో ఉన్న అందరి కర్తవ్యమూ ములిగిపోతున్న ఆ ఓడను సురక్షితంగా ఒడ్డుకు చేర్చటం.  ఏమి చేస్తే తమకూ తమవారికీ ఏమి లాభం అని ఆలోచించే వారు ఆ ఓడతో పాటే ములుగుతారు - మిగతావారినీ ముంచుతారు.  సమర్ఘులు కర్తవ్యాన్ని నిష్పాక్షికంగా నిర్వహించకపోతే "దక్షు లెవ్వార లుపేక్ష సేసి రది వారల చేటగు" అని కృష్ణపరమాత్మ చెప్పనే చెప్పాడు.  అధికప్రసంగం చేసానేమో.  ఏదో చాదస్తుణ్ణి. మన్నించగలరు. 


ప్రస్తుత కాలమానపరిస్థితుల గురించి నా అభిప్రాయం ఇక్కడ నిక్షిప్తం చేయటం ద్వారా హెచ్చుమందికి ప్రయోజనం అన్న దృక్పథంతో పై నా వ్యాఖ్యలను ఇలా ఒక టపాగా ఉంచాను.


పత్రికల్లో తెలుగుభాష



రమణగారు  రాజకీయనాయకులు దేవుళ్ళూ దెయ్యాల భాషను వాడినా, పత్రికలు తమ రిపోర్టింగ్‌లో అదే భాషని వాడకూడదూ అని రూలింగ్ ఇచ్చారు మొన్నటి తమ కాలక్షేపం వార్తలు టపాలో. చాలా సంతోషం.

పత్రికలు చాలా సంయమనంతో హుందాగా వ్యవహరిస్తూ పుస్తకాలభాషలో వార్తలు ప్రచురించే కాలం ఒకప్పుడు చూసాము. అప్పట్లో రేడియో ఉన్నా అది దాదాపు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం ఒకలబోస్తూ వార్తల్ని పిండి కషాయంచేసి చిక్కని చక్కని భాషలో వినిపించేది.  అపుడు టీవీ అనేది లేదు.

ఇప్పుడు టీవీనిండా వార్తలఛానెళ్ళే. సినిమా ఛానెళ్ళకన్నా ఇవే ఎక్కువసంఖ్యలో ఉన్నాయంటే దానికి కారణం అవి అందిస్తున్న వార్తలా లేదా  సినీమాలని మించి అవి పంచుతున్న వినోదమా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి.

ఒకప్పుడు పత్రికలరిపోర్టింగులో దొరికిపోయిన నేతలంతా 'పత్రికలు తప్పుగా అర్థంచేసుకున్నాయీ' అని సన్నాయి నొక్కులతో తమను తాము సమర్థించుకొనే వారు.  కాని నేడు నాయకమ్మన్యులు ఏమి వాక్రుచ్చుతున్నదీ యథాతధంగా లైవ్ ప్రసారాలు వస్తున్నాయి వార్తాఛానెళ్ళలో.  కాబట్టి ఈ సన్నాయినొక్కులు కాస్త తగ్గాయి. 

ప్రజలు వార్తలకోసమూ, వాటి వివరాలకోసమూ వార్తాఛానెళ్ళమీద ఆధారపడుతున్నారు కాని చద్దన్నం వడ్డించినట్లు వార్తలందించే పత్రికలమీద కానేకాదు నేడు.  లైవ్‌లో ఎటువంటి భాషావిన్యాసాలు మన నాయకులు చేస్తున్నారో వాటినే అలాగే వాటితాలూకు విశ్లేషణలూ అదే భాషలోనే అందించవలసిన కర్మం పత్రికలకు పట్టింది. మడికట్టుకుంటే అవి ఠప్పున చస్తాయి మరి.

నాయకులమనుకునే వారు జుగుప్సాకరమైన భాషప్రయోగించటం పట్ల, జుగుప్సాకరమైన లేదా విద్వేషపూరితమైన భావజాలంతో మాట్లాడటం పట్లా మీరూ నేనూ అందరూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయాలి ముందుగా.  అలా చేస్తున్నామా?   ఆ మధ్యన, 'ఆంధ్రావాళ్ళు బిర్యానీ చేస్తే పేడలా ఉంటుంది' లాంటి  విద్వేషపూరితమైన వ్యాఖ్యచేసిన గొప్పనేతను మనం తప్పుపట్టగలిగామా?  టీవీఛానెళ్ళలోకి వచ్చి 'లుఛ్ఛాలు' వంటి పదప్రయోగాలు చేస్తే మనం అభ్యంతరం ఏమైనా వ్యక్తం చేయగలిగామా? దాదాపు బూతులుతిడుతూ‌ పాటలు కట్టి టీవీల్లో పాడి వినిపిస్తుంటే మనం అభ్యంతరం చెప్పామా?  కొందరు ఈ ధోరణిలో నిజాలు చూసారు, కొందరు ఈ ధోరణిలో వ్యంగ్యం  చూసారు,  కొందరు నిజాయితీతో కూడిన ఆవేశం చూసారు.  ఔచిత్యం ఎక్కడుంది అన్నది మాత్రం ఎవ్వరూ చూడలేదు.  చూసినా పరిస్థితులకు తలవంచి మాట్లాడే సాహసం చేయలేదు.

పత్రికలేం చేస్తున్నాయి?  సమకాలీన రాజకీయ సామాజిక భాషాప్రయోగాల్ని శీర్షికల్లోకి తీసుకువస్తున్నాయి.  ఔచిత్యం భంగం కానంతవరకూ సమంజసమే.  కాని ఔచిత్యం ఏ మాత్రం తప్పినా  తప్పుపట్టటానికి మనం వ్యాసాలు వ్రాయటానికి పూనుకోగలం. అందులో సందేహం లేదు.

రాజకీయనాయకులనూ ఇతర బడా పెద్దమనుషులనూ‌  తప్పుబట్టం. కొరవితో తల గోక్కోవట మెందుకూ అని.  పత్రికలను మాత్రం పుస్తకాలభాష వదలరాదు అని రూలింగులిస్తాం. పత్రికలు ప్రజలపై చర్యలు తీసుకోవు కదా అని.  కాని మనది పక్షపాత ధోరణి కాదా?

ఈ రోజున  పత్రికలు కరపత్రికలస్థాయికి దిగజారిపోవటాకి టివీతోటీ అంతర్జాలంతోటీ‌పోటీయే కాక ఇంకా మరికొన్ని కారణాలుండవచ్చును.  కాని అవన్నీ అస్తిత్వపోరాటం చేస్తున్నాయి. బతికి బట్టకట్టే  ప్రయత్నంలో భాగంగా అవి భాషవిషయంలో రాజీపడవలసి వస్తోందన్నది చాలా విచారించవలసిన విషయం. అవి  చేస్తున్నది సరైన పని కాదని ఒప్పుకుంటూనే వాటిని కొరతవేయటా ప్రయత్నించటానికి బదులు సమాజంలో భాష యొక్క స్థాయిని మన నాయకులు ఇంకా ఇంకా దిగజార్చకుండా ఉండాలంటే ఏమైనా చేయగలమా అని ఆలోచించాలి.

వక్తల భాష హుందాగా ఉంటే టీవీల్లోనూ పత్రికల్లోనూ కూడా వివరాలు హుందాగానే నివేదించబడతాయి.


ఏమి చేయ మందు వీశ్వరా



ఏమి చేయ మందు వీశ్వరా  ఈ వేదన
లే మిష కలిగించి తీశ్వరా

ఇల్లు రెండు చెక్కలాయె
తల్లి మనసు ముక్కలాయె
ఎల్లెడ పెను చీకటాయె
పిల్లల గతి తెలియదాయె
    ఏమి చేయ మందు వీశ్వరా

ఈ జాతి భవిష్యమెల్ల
రాజకీయ నాయకులే
భోజనము చేయుచుండ
ఈ జన మే మౌదురో
    ఏమి చేయ మందు వీశ్వరా  

 మంచి వాడ వైన నీవు
కొంచెము దయ జూపవాయె
వంచకులను నెట్టి వెలుగు
నించవాయె మా బ్రతుకుల
ఏమి చేయ మందు వీశ్వరా  





23, ఫిబ్రవరి 2014, ఆదివారం

ఇల్లు ముక్కలైన తల్లి యేడ్చును గాని...



కం. శ్రీరామా యిది మేలా
యీ రీతిని ముక్కలైన యీ గడ్డకు  రే
పే రోజున యే కష్టము
లే  రానుండినవి తండ్రి ఇకపై తఱచై

ఆ.వె. కలసి యుండలేక కలహించుకొని మేము
వేరుపడితి మయ్య విశ్వనాథ
ఇల్లు ముక్కలైన తల్లి యేడ్చును గాని
ఎదుటి ఇంటి వార లేడ్వరుగద

తే. అయ్యవారి నట్టిల్లను నట్టు లున్న
దివల సీమాంధ్ర భాగమే యెంచి చూడ
అల తెలంగాణ భాగమందన్న విజయ
మట్టు లుండగ చిక్కులతుట్ట లుండె

ఆ.వె. తెలుగువాడి నన్న దేశంబు నవ్వగా
శిరము వంచుకొనెడు స్థితికి నేడు
చేరుకొంటి మయ్య యేరీతి  నిక ముందు
జరుగ గలదొ శుభము సారసాక్ష

కం. కాలము చేసిన దానిని
మేలని కీడనుచు నెంచి మేమతి భ్రాంతిన్
దూలిద మిది యెల్లను నీ
లీలయె యను నట్టి యెఱుక లేక మహాత్మా


[ నా శ్యామలీయం బ్లాగులో 500వ టపా ఇలా వ్రాయవలసి వస్తుందని అనుకోలేదు.]

22, ఫిబ్రవరి 2014, శనివారం

ఇంతకీ ఎవరేం సాధించారండీ?

ఏదో పెద్ద తుఫాన్ వెలిసినట్లుంది రాజకీయ వాతావరణం.

ఇన్నాళ్ళుగా అహహ సరిగాదు ఇన్నేళ్ళుగా నడిచిన రాజకీయ రగడ తరువాత ఎవరేం సాధించారో అన్న విశ్లేషణ చేసుకుని చూసుకోవలసిన అవసరం ఉంది.

నిజానికి ఆ అవసరం రాజకీయ నాయకులకూ పార్టీలకూ చాలా ముఖ్యమైనది.  సార్వత్రిక ఎన్నికలూ వాటితోబాటుగా రాష్ట్రస్థాయి ఎన్నికలూ చాలా దగ్గరలో ఉన్న ఈ సమయంలో రాజకీయవర్గాలు ఈ విషయంలో ఒక అవగాహనకు రావలసి ఉంది.  వాటి తరపున మనం‌ కష్టపడవలసిన అవసరం‌ ఈషణ్మాత్రమూ లేదు.   కాని, వాటి జీవన్మరణాలకు కారణమైన ఓట్లను అచ్చుగుద్దే ప్రజలం మనమే. కాబట్టి ప్రజలకు సరైన అవగాహన అన్నది ఓట్ల పండుగ సమయమయ్యేది కాకపోయేది చాలా అవసరం‌ కాబట్టి ఈ విశ్లేషణ అనేది మనకు అత్యంత ముఖ్యమైనది కూడా.

ఐతే, ఈ విషయంలో సంపూర్ణమైన పరిజ్ఞానంతో‌ నేను వ్రాయగలగటం అనుమానాస్పదమే.  నేను రాజకీయ విశ్లేషణల విషయంలో కాకలు తీరినవాడిని కాను.  కాని నా బ్లాగులో నా అభిప్రాయాలు గుదిగుచ్చుకుంటే దానిలో ఎవరికీ అభ్యంతరం కనిపించదనే భావిస్తున్నాను.

ఒక్కొక్క రాజకీయపార్టీనీ తీసుకుని దాని పరిస్థితి ఏమిటో చూద్దాం.  ఏ రాజకీయపార్టీ ఐనా ఏ సమయంలో ఏమి చేసినా ఏమి చేయకపోయినా దాని వెనుక రెండే రెండు కారణాలుంటాయి.  మొదటిది తన పార్టీ పరిస్థితిని సంరక్షించుకోవటం లేదా పదిలపరచుకోవటం‌ లేదా మెఱుగుపరచుకోవటం.  రెండవది తనకు ఇబ్బంది కలగని విషయాలలో అనవసరంగా కల్పించుకోకపోవటం.

ప్రత్యేకతెలంగాణా ఉద్యమం ఈ‌ నాటిది కాదు.  ఆంధ్రప్రదేశరాష్ట్రావతరణం సమయానికే తెలంగాణా ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రంలో కలపాలా విడిగా ఉంచాలా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి.  ఈ‌ వ్యాసం ఉద్దేశం ప్రత్యేకతెలంగాణా ఉద్యమం గురించి చర్చించటం కాదు కాబట్టి ఆ విషయం‌ మీద చర్చ చేయటం లేదు ఇక్కడ.  కాని ఉద్యమం పందొమ్మిదివందల అరవై తొమ్మిదిలో ఉవ్వెత్తున పైకెగసింది.  మరలా ముఫై రెండు సంవత్సరాల తరువాత ఉపొంగింది. మధ్యకాలంలో నిద్రాణంగా ఉండటం విశేషం.  అలా ఎందుకు జరిగిందీ అన్నది ఇక్కడ చర్చనీయాంశం కాదు కాబట్టి వదిలేద్దాం. ఇదిగో ఈ నాటికి తెలంగాణారాష్ట్రం ఏర్పడబోతున్నది. ప్రజలకే కాక అన్ని రాజకీయపార్టీలకూ ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాలూ వాటిలో తమ తమ ఉనికీ అన్నది కొత్తగా చర్చనీయాంశం అయ్యింది.

కాంగ్రెసుపార్టీ విషయం మొదట చూద్దాం.  కాంగ్రెసువారు 2004నుండి ఈ విషయంలో చురుగ్గా ఉన్నారు.  తెలంగాణాకు ప్రత్యేకరాష్ట్రం ఇస్తామని వాగ్దానం కూడా చేసారు.  కాని వారు ఆ విషయంలో నానా కంగాళీగాను ప్రవర్తించారు. తమ వాగ్దానాన్ని నెఱవేర్చుకుందుకు ఏ మాత్రం చిత్తశుధ్ధినీ ప్రదర్శించలేదు. అసహ్యం కలిగించే స్థాయిలో‌ నాటకాలాడి తెలంగాణా రాష్ట్రం కోసం ఆశలు పెట్టుకున్న అనేకమందికి తమ ఊగిసలాట ధోరణితో నిరాశానిస్పృహలు కలిగించారు. రకరకాల సాకులు చెబుతూ కాలక్షేపం చేస్తూ పరిస్థితిని బాగా కలగాపులగం చేసారు. రెండు సార్వత్రిక ఎన్నికలలో చేసిన వాగ్దానాన్ని మూడో సార్వత్రిక ఎన్నిక కాస్తా ముక్కుదాకా వచ్చిన సమయంలో హమ్మయ్యా నెఱవేర్చాం అనిపించుకున్నారు. నిజానికి 2009నుండీ ఈ విషయంలో వారు వేసిన కప్పగంతులన్నీ ఈ‌ 2014లో ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతోనే వాయిదాలు వేసే కుట్ర అనే అనుకోవలసి వస్తుంది.   ఐతే వారి పాచిక పారినట్లేనా అన్నది ఆలోచనీయం.  తెలంగాణా ఇచ్చినందుకూ, రాష్ట్రవిభజనలో నిరంకుశంగా వ్యవహరించినందుకూ సీమాంధ్రుల ఆగ్రహం కారణంగా అవశేషాంధ్రప్రదేశం ఎన్నికల్లో నేరుగా గెలిచే పరిస్థితి లేదు.  తెలంగాణాలో కేసీఆర్‌ను ప్రక్కకు తప్పించి గెలిచే పరిస్థితి కూడా ఉండదు. ప్రస్తుతం వారి ఆలోచనాధోరణి జగన్మోహనరెడ్డిని ఎన్నికల అనంతరమూ, కేసీఆర్‌గారిని ఎన్నికల సమయంలో ముందుగానో వెనుకనో అస్మదీయుల్ని చేసుకుని అంతిమంగా ఆంధ్రదేశం తమ గుప్పెటనుండి జారిపోలేదని నిరూపించుకోవా లన్నది.  ఈ విషయంలో వారికి కొంత స్పష్టత ఉన్నదనే భావించాలి. 

తెలుగుదేశం పార్టీ గురించి.  స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి అనుపమానమైన కీర్తిప్రతిష్టల కారణంగా ఏర్పడిన ఆ పార్టీ 2004లో అనూహ్యంగా కాంగ్రెసువారి చేతిలో ఓడినప్పటినుండి క్రమంగా బలహీనపడుతూ వస్తున్నది. హైటెక్ బాబుగారు హైదరాబాదుకు ఎంతో చేసారు. అది కాదన లేని సత్యం.  అదే బాబుగారు మిగతా ఆంధ్రదేశంలోని ఏ పట్టణం అభివృధ్ధినీ పట్టించుకోలేదు. అదీ కాదన లేని సత్యమే. హైటెక్ సిటీ తయారవక ముందటి హైదరాబాదుకూ ఇప్పటి సిటీకీ హస్తిమశకాంతర బేధం ఉంది.  హైదరాబాదుకు హైటెక్ హంగులద్ది దానిని డబ్బులు సంపాదించి పెట్టే కామధేనువుగా మార్చినందుకు బాబుగారిమీద జనానికి మంచి అభిమానమే ఉంది.  2009లో కూడా చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టి ఒక నాటకీయమైన సైంధవపాత్ర పోషించి ఉండకపోతే ఆయనగారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేదన్నది సత్యం.  కాని ఈ రోజున పరిస్థితులు మారాయి.  తన పార్టీని తెలంగణాలో సజీవంగా ఉంచటానికి గాను ఆయన బహుశః అయిష్టంగానే తెలంగాణా ఏర్పాటుకు తెలుగుదేశం అనుకూలమే నని డిక్లరేషన్ ఇచ్చేసాడు 2008లో.  ఇప్పుడు తెలంగాణాకాస్తా ముంగిట్లోకి రాగానే సమన్యాయం అంటూ నొక్కి వక్కాణిస్తూ తెలంగాణాలో ఉన్న ఇమేజ్‌ని పోగొట్టుకున్నాడు. ఇటు సీమాంధ్రులూ చంద్రబాబు ఇచ్చిన లేఖవల్ల కొంపలు ములిగాయని భావించటంలో అటూ చెడింది తెలుగుదేశం.  ఇప్పుడు దాదాపు రెంటికీ చెడిన రేవడి చందం అన్నమాట.  బీజేపీ వారు ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేలా ఉన్నారు కాబట్టి వారిని దువ్వుతూ వారి సాయంతో మరలా పునర్వైభవం దిశగా ఆడుగులు వేసింది తెలుగుదేశం.  కాని బీజేపీ వారికి సీమాంధ్రలో ఓట్లు రాలే అవకాశాలు బాగా తక్కువ. ఈ‌ మధ్యన విభజనఘట్టంలో వారు పోషించిన హాస్యపాత్రతో సీమాంధ్రజనానిని బీజేపీ పట్ల ఏహ్యభావం కలిగింది.  కాంగ్రెసువారు సీమాంధ్రలో దెబ్బతిన్న మాట వాస్తవమే కాని తద్వారా ఏర్పడ్డలోటును జగన్ పార్టీ ఎగరేసుకు పోతోందన్న విషయం తెలుగుదేశానికి చెమట్లు పట్టిస్తున్నాయి. ఇటుతిరిగి జై తెలంగాణా అనలేక,  తెగించి అటుతిరిగి జై సమైక్యాంధ్రా అనలేక ఎదేదో నసిగి నసిగి చంద్రబాబుగారు జనానికి బాగా విసుగు తెప్పించారు.  ఇప్పుడు రెండురాష్ట్రాల్లోనూ‌ ఉనికి చాటుకుని అధికారమూ తెచ్చుకుని జాతీయపార్టీగా తెలుగుదేశం వస్తుందని వారు బడాయి కబుర్లు చెబుతున్నారు. జనానికి  మాత్రం  ఏమాత్రం నమ్మకమూ కలగటం లేదు.  ఆయన తెగించి కేంద్రంతో సీమాంధ్రకోసం పోరాడటానికి సిధ్ధంగా ఉన్నారా జగన్ లాగా?  తెలంగాణా కోసం పనిచేయటానికి సిధ్ధంగా ఉన్నారా కెసీఆర్ కన్న మిన్నగా? రెండూ‌ అబధ్దాలే కదా? మరి తెలుగుదేశానికి ఎవరు ఓటు వేస్తారు?

తెలంగాణారాస్ట్రసమితి గురించి.   2001లో అనుకుంటాను, చంద్రబాబుగారు తనమంత్రివర్గం నుండి కేసీఆర్‌గారిని తప్పించినది.  (అప్పటి నుండి తెలుగుదేశం పార్టీ తిరోగమన దిశగా ప్రయాణిస్తున్నది!)  చంద్రబాబును దెబ్బకొట్టే ప్రతివ్యూహంగా కేసీఆర్‌గారు ప్రత్యేకతెలంగాణా ఉద్యమాన్ని తవ్వి తలకెత్తు కున్నారు. నాకు గుర్తున్నంతవరకూ స్వర్గీయ చెన్నారెడ్డిగారు శ్రీమతి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఉక్కుగనుల శాఖామంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజులకే ఆయన ప్రత్యర్థి వందేమాతరం రామచంద్రరావు గారి తరపున సుప్రీంకోర్టు చెన్నారెడ్డిగారి ఎన్నికను రద్దుచేసింది.  రాజకీయనాయకుడు నిరుద్యోగి ఐతే ఎంతప్రమాదమో అన్నది ఆయన తెలంగాణాప్రజాసమితిని ఏర్పాటు చేసి ప్రత్యేకతెలంగాణా ఉద్యమాన్ని ఎత్తిపట్టుకోవటంతో తెల్లమైంది. దాదాపు అలాగే చంద్రశేఖరరావుగారు కూడా చంద్రబాబుగారి దగ్గర నౌకరీ పోయేసరికి తెలంగాణా ఉద్యమాన్ని బుజానికెత్తుకుని దాన్నే తన భవిష్యత్తుగా మార్చుకున్నారు.  ఆయన నిరంతరపోరాటం చేయటం ఫలితంగానే నేడు తెలంగాణారాష్ట్రం సాకారమైంది.  రాష్ట్రసాధనా క్రమంలో చంద్రశేఖరరావుగారు తన ఉద్యమపార్టీ తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తాననీ ఎఱచూపారు సోనియా & కం. వారికి.  గత జూలై నెలలో ఎట్టకేలకు తెరాసవారు కలలు కంటున్న తెలంగాణారాష్ట్రం ఇవ్వటానికి కాంగ్రెసుపార్టీ నిర్ణయించిందని ప్రకటన చేసిన శ్రీదిగ్విజయ సింగ్, అదే వాక్యం చివరన ఇంక తెరాసవారు మాతో విలీనం అవుతున్నారని ఆశిస్తున్నాను అని కూడా పూర్తిగా నిస్సిగ్గుగా చెప్పేసారు.  సరే, రాష్ట్రం వచ్చిన శుభసందర్భంలొ తెరాసవారిమీద కాంగ్రెసువారు విలీనం కోసం గణనీయమైన వత్తిడి తెస్తారు, తెస్తున్నారు కూడా.  కాని విజ్ఞత దండిగా కల చంద్రశేఖరరావు గారు కాంగ్రెసుమహాసముద్రంలో తెరాసను విలీనం చేసి దాన్ని కాస్తా ఏటిలో పిసికిన చింతపండు చేస్తారా అన్నది ప్రశ్న.  ఇల్లలకగానే పండుగ కాదు కదా? ఇంకా కాంగ్రెసువారి నుండి కొత్త తెలంగాణా రాష్ట్రప్రయోజనాలదృష్ట్యా మరికొంతకాలం విడిగా ఉండి అవసరమైనప్పుడల్లా డిమాండ్లు చేయగల అవకాశాన్ని ఆయన వదులు కుంటే ఎలా? తెలంగాణాగడ్డ మీద ఎంత సోనియమ్మమీద అభిమానం పొంగిపొరలుతున్నా కేసీఆర్‌గారి అభ్యర్థులకే విజయావకాశాలు మెండు.  ముప్పుతిప్పలు పెట్టికాని కాంగ్రెసుపార్టీవారు తెలంగాణాను ఇవ్వలేదన్న సంగతి దాస్తే దాగే విషయం కాదు కదా? అందుచేత జనం మొగ్గు సహజంగానే చంద్రశ్రేఖరరావుగారి వైపే ఉంటుంది.  అది ఆయనకూ బాగా తెలుసు. కాబట్టి విలీనం విషయంలో ఆయనేం చేస్తారో చూడాలి.

భారతీయజనతాపార్టీ అనేది ఒక జాతీయపార్టీ.  ఆ విషయం ప్రతిరోజూ ఏదో‌ఒక సందర్భంగా యావద్దేశానికీ ఆపార్టీ నాయకులు గుర్తుచేస్తూ ఉపన్యసిస్తారు.  ఈ మధ్య మోడీగారు యావద్దేశంలోనూ ప్రజాదరణగల నాయకుడిగా ఎదిగి నిలబడటంతో బీజేపీ వారి ఆత్మవిశ్వాసం ఒకింత దుష్టగర్వం స్థాయిలో కనిపిస్తోంది. ఈ బీజేపీ వారు ఎప్పటినుండో దేశంలో చిన్నరాష్ట్రాల ఏర్పాటుకు తమ సంపూర్ణమైన మద్దతుని ప్రకటించారు. తెలంగాణాకు అనుకూలమని  - చంద్రబాబుగారి లాగా నాలుక మడతవేసుకుని కాక - విస్పష్టంగా ప్రకటించేసారు.  అందుచేత సీమాంధ్రప్రజలు బీజేపీ వారు తమ ప్రియతమ ఆంద్రప్రదేశరాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటానికి బీజేపీవారు  కలిసివస్తారని ఎన్నడూ ఆశించలేదు. సీమాంధ్రప్రయోజనాల్ని పరిరక్షించే కార్యక్రమం కూడా బీజేపీవారు నెత్తినేసుకుంటారని అనుకోలేదు.  అటువంటి మాటలు బీజేపీ వారు పలకటమే కాదు, సీమాంధ్రప్రయోజనాల కోసం పట్టుపట్టటం కూడా చూసి సీమాంధ్రులు ఎంతో సంతోషించి ఆశలు పెంచుకున్నారు.  ఐతే బీజేపీవారు సీమాంధ్రవారి ప్రయోజనాల పరిరక్షణ అంశం గురించి బోలెడు హంగామా చేసి చివరకు దాన్ని పూర్తిగా అపహాస్యం పాలు చేసారు. తెరాసావారే తయారు చేసి కాంగ్రెసు గ్రూప్ ఆఫ్ మోరాన్స్ చేతిలో పెట్టి చట్టసభలకు తెచ్చినట్లు అపఖ్యాతి మూటగట్టుకున్న ఆ  విభజనబిల్లుని చల్లగా అమోదించేసారు. కురుసభలో శకుని పాత్ర వంటి దుష్టపాత్రలో శ్రీమాన్ వెంకయ్యనాయుడుగారు పూర్తిగా లీనమై పోయి నటించేసారు.  ఇప్పుడు కాంగ్రెసువారే కాదు, బీజేపీవారూ సీమాంధ్రవారి దృష్టిలో కచ్చితంగా శత్రువులే.  బీజేపీకి సీమాంధ్రలో ఎప్పుడూ పట్టులేదు.  ఇప్పుడు విరోధం కూడా పెట్టుకున్నారు. అటు తెలంగాణా మీద బంధుప్రేమ కూడా ఒలకపోసి సుష్మాస్వరాజ్‌గారిని తెలంగాణాకు చిన్నమ్మను చేసినా, తెరాస-కాంగ్రెసు-బీజేపీల మధ్య తెలంగాణాలో జరిగే ఎన్నికలపోరులో హీనపక్షం బీజేపీనే అన్నది నిస్సందేహంగా.  మరో పార్టీ తెలుగుదేశం కూడా తెలంగాణాలో పోటీకి దిగుతుంది కాని దానికి పెద్దగా పోటీ ఇచ్చేంతగా ఓట్లు రాలవనే అనుకోవాలి.  చివరికి విభజనబిల్లు సందర్భంగా  బీజేపీవారు చేసిన హడావుడి వాళ్ళను హాస్యగాళ్ళ స్థాయికి దించింది కాని తెలుగునాట ఓట్లకు నోచుకునేందుకు ఏమీ సాయపడ లేదు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ.  ఇది ఒక పిల్లకాంగ్రెసు పార్టీ.  కాదని ఆవేశపడిపోయేవాళ్ళు ఎందరున్నా ఔనని అనుమానించే వాళ్ళు దేశవ్యాప్తంగా అంతకన్న ఎక్కువే.  సీబీఐవారి సహాయంతో సోనీయమ్మగారు అబ్బాయిగార్ని బాగానే దారికి తెచ్చుకున్నారని అనేకులు నమ్ముతున్నారు. ఆర్టికిల్ ౩ సహాయంతో ఆంధ్రప్రదేశ్ విభజన నల్లేరుపై నడక అని పెద్దమ్మగారికి సలహా ఇచ్చిన ఈ పార్టీ తమ స్టాండు మార్చుకుంది.  కారణాలు స్పష్టమే.  ఎంత చేసినా కేసీఆర్‌గారిని దెబ్బకొట్టి తెలంగాణాను స్వాధీనం చేసుకోలేమన్న జ్ఞానోదయం ఒక వంకా, పట్టున్న సీమాంధ్రలో విరోధం పెట్టుకోరాదన్న వివేకోదయం ఒకవంకా జగన్మోహనులను మడమతిప్పేలా చేసాయి.  వీరావేశంతో జగన్ సమైక్యాంధ్రకూ జై అంటూ ఎంత హడావుడిచేసినా, జనం పూర్తిగా ఆయన నిబధ్ధతను నమ్మారని చెప్పలేము.  ఐనా కోస్తాంధ్రలో జగన్ పార్టీకి మంచి పట్టే ఉంది - సాంప్రదాయిక కాంగ్రెసువర్గాల తరపునుండి.  జగన్ - సోనియా పార్టీల మధ్య దేన్ని ఎంచుకోవాలా అన్న మీమాంసలో ఉన్నవారికి నిన్నటి రాష్ట్రవిభజన శంకతీర్చింది.  మన న్యాయవ్యవస్థ గొప్పది.  పది రూపాయల దొంగకు బెయిల్ దొరికే అవకాశం చేతికి రాకుండా అనేకానేక చట్టాలు అడ్డువస్తాయి.  కొన్ని వేల కోట్ల మేర ఆర్థిక నేరారోపణల్లో చిక్కుకున్నవారికి వారు కాస్తా రాజకీయ నాయకులైతే అన్ని ద్వారాలూ ఎప్పుడూ‌ బార్లా  తెరచి ఉండేందుకు న్యాయచట్టాలు ఏమీ అడ్డుపడవు.  అందుచేత ఎంత సందేహాస్పదమైన గతం ఉన్నా అది జగన్మోహనుడు ముఖ్యమంత్రి కావటానికి అడ్డు రావు.  ఓట్లు వేయటానికి జనానికి అభ్యంతరం లేకపోతే ఆయన సీమాంధ్రకు ముఖ్యమంత్రి అయ్యేందుకు ఏమీ ఇబ్బంది ఉండకపోవచ్చును.

నల్లారివారి రాబోయే పార్టీ:  అదింకా నల్లారి వారి ఊహలోనే ఉంది.  అయన గారు అంత సాహసం చేస్తారనుకోను.  ఒకవేళ ఆయన పార్టీ పెట్టినా, ఇంత రగడ చేస్తూ కూడా సోనియాపై  ఈగవాలటానికి వీలులేదన్నట్లు విస్పష్టంగా మాట్లాడిన ఈయనగారు రేపు గెలిచి తన మందీ మార్బలంతో సహా సోనియాకూ జై అంటూ మాతృసంస్థలో విలీనం కాడని ఎవ్వరూ నమ్మరు. ఈ సంగతి గ్రహించే విజ్ఞత ఉన్న ప్రజలు తనకు పెద్దగా ఓట్లు వేయరని ఆయన ఒక కొత్త పార్టీ పెట్టటానికి జంకుతున్నట్లుంది.  కానీ, జగన్ గారి ఓట్లో, బాబుగారి ఓట్లో చీల్చటానికి సోనియమ్మ ఈ‌ నల్లారివారిచేత ఒక పార్టీ పెట్టించుకునే అవకాశాలూ దండిగానే ఉన్నాయి.  వేచిచూడాలి.

చిల్లరపార్టీలు: అంటే కమ్యూనిష్టులూ, లోక్‌సత్తా వగైరాలన్నమాట. బాలెట్ పేపర్లలో అభ్యర్థుల సంఖ్యపెంచటం మించి వీళ్ళు ఊడబొడిచేది ఏమీ లేదు.  అందుచేత వీళ్ళ గురించి చెప్పేందు కేముంటుంది? అక్కడక్కడా ఒకటి రెండు సీట్లు వీళ్ళకు వచ్చినా మిగతా పార్టీలు వీళ్ళ చక్రాల్ని కొనుగోలు చేస్తాయి కాబట్టి ఒరిగేదేమీ ఉండదు.

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

తెలుగువారం ఏం చేయ గలమో ఇప్పుడు!


ఈ రోజున ఒక మంచి బ్లాగు వ్యాసం చదివాను .  తెలుగుజాతి: మనం ఏం చేయగలమో చిన్న వివరణ
దానిపై నా అభిప్రాయాలు ఈ‌క్రింద వ్రాస్తున్నాను. ఇవన్నీ ఒక వ్యాఖ్యద్వారా అక్కడ వ్రాయలేను కాబట్టి.

గాడిలో పడటానికి ఎంతో సమయం పట్టదు:   చాలా సమయమే పడుతుంది నిజానికి. అప్పులన్నీ సీమాంద్రకే ఉదారంగా సంక్రమింపజేసారు.  శూన్యం నుండి స్వర్గం క్షణాల్లో సృష్టించటానికి ఇదేమీ ఇంద్రజాలరంగస్థలం కాదు.  వాస్తవప్రపంచం.


కోస్తా ఆంధ్రా మొత్తం  దిగువ ప్రాంతంలో ఉంది.. అందువల్ల వచ్చే జల వనరుల నాపటం ఎవరి తరం కాదు:  పైవారి దయ తప్పదు. ఎగువను కల డాముల్లో జలసంపద పొంగిపొర్లాకే  సీమాంధ్రకి గుక్కెడు నీళ్ళు. ఈ‌ శతాబ్దమే ప్రపంచప్రజలు జలవనరుల కొరకు తన్నుకుచచ్చే శతాబ్ది అని శాస్త్రజ్ఞులు ఇప్పటికే హెచ్చరికలు ఇచ్చారు. ప్రతి సంవత్సరము ఋతుపవనాలు ఇబ్బడిముబ్బగా కరుణిస్తేనె మనకి లాభం. లేదా కరువుకాటకాలే.


తెలంగాణాలో భూస్వామిక, నైజాం ప్రభువుల నిరంకుశత్వం వల్ల హిందువుల/సామాన్య మానవుల ప్రగతి చాలా మందగించింది:  ఆ ప్రభువుల్నే నాలుకపీకేదాకా పొగడి పొగడి తరించారు తెలంగాణా ఉద్యమ కర్తలూ నాయకులూ‌ ముక్తకంఠంతో. నాయకుల బోధలు తలకెక్కిన తెలగాణావారు , తెలంగాణాలో ప్రగతి కుంబడటానికి మీరు చెప్పిన కారణం ఒప్పుకోరు కద? గతం‌గతః అనటం సులువు . కానీ, తెలంగాణాలో వచ్చే ప్రతి సమస్యకీ  సీమాంధ్రులు నిందలు మోయటం మరికొన్ని దశాబ్దులు తప్పదు.


ఆంధ్రా పారిశ్రామిక వేత్తలను అహ్వానించి పరిశ్రమలను నెలకొల్పటంలో తప్పు లేదు:  ఈ‌ మాటలను కొత్తగా తెలంగాణావాదులూ  వల్లెవేయటం మొదలెట్టారు. సీమాంధ్రలో పుట్టినవారంతా తెలంగాణాద్రోహులే అన్న సూత్రీకరణ అలా ఉంచి, నిజంగా వారిని వీరు నిజంగా పిలవగలరా, వారు నిస్సిగ్గుగా రాగలరా అన్నది ప్రశ్నార్థకం. సీమాంధ్రవారి మొదటి కర్తవ్యం అట్టడుగు నుండి తమ ప్రాంతాన్ని పునర్నింర్మించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉద్యోగులకు జీతాలిచ్చేందుకూ‌ డబ్బులేని పరిస్థితి.  వారిలో డబ్బున్నవారి తాలూకు పరిశ్రమలూ పెట్టుబడులూ ఇప్పటికే తెలంగాణాలో ఉన్నాయి . అంతే కాదు అలా ఉండటం అనేది తెలంగాణా ఇన్నాళ్ళూగా దోచుకోబడటానికి కారణం అన్న సిధ్ధాంతమూ రాష్ట్రవిభజనకు కారణం. ఇప్పుడు తెలంగాణావారు సీమాంధ్రపెట్టుబడిదారులను ఆహ్వానించటం వారు లాభపడటం కోసం.  ఇంకా సీమాంధ్రపెట్టుబడిదారులు తమ సిరులు తెలంగాణాలోని హైదరాబాదు తదితర ప్రాంతాల అభివృధ్ధికే ధారపోసి సీమాంధ్రకు అన్యాయం చేయాలని కాంక్షించటం వాంఛనీయం కానేకాదు.


సౌర విద్యుత్ ను ప్రోత్సహించ గలిగితే కరెంటు కష్టాలు తీరుతాయి: ఈ‌ మాట చాలా నిజం.  ఉభయతెలుగుప్రాంతాల వారే కాక సమస్త భారతదేశమూ ఈ కోణంలో‌ చాల కృషి చేయాలి.


మధ్య తరగతి మామూలు ఉద్యోగికే ఇన్ని ఆలోచనలుంటే మన కలెక్టర్లకు, అధికారులకు ఎన్ని ఆలోచనలుండాలి:  తప్పకుండా మరింత ప్రణాళికా బధ్ధంగా సాంకేతికంగా సమున్నతంగా అలోచించగలిగి ఉండాలి వారన్నది నిస్సందేహం.  కాని గమనించండి. మనదేశంలో అందరు బ్యూరోక్రాట్లకు ఉన్నది ఒకటే డ్యూటీ - రాజకీయ నాయకులకు తందానా అనటం. అలా అనని వారికి నూకల్లేవు.  ఇంకా వారు నిర్మాణాత్మమైన ఆలోచనలు చేయగలిగేది ఎలా. ఒకవేళ అటువంటి ఆలోచనలు చేసినా అవి బయటపెట్టే సాహసం చేయటం ఎలా?


ఒకచోట .. వేరొకచోట....





పరమానందం ఒకచోట
పరమవిషాదం ఒకచోట

గర్వోన్మత్తత ఒకచోట
నిర్వేదం వే రొకచోట

వేకువ విరియుట ఒకచోట
చీకటి ముసురుట ఒకచోట
 
ఆహా ఓహో‌ లొకచోట
హాహాకారా లొకచోట

రాగాలాపన లొకచోట
మూగరోదన లొకచోట

పన్నీటిధార లొకచోట
కన్నీటివాన లొకచోట

మక్కువ తీరుట యొకచోట
దిక్కులు కూలుట యొకచోట

కాలము వలచుట యొకచోట
కాలము కఱచుట యొకచోట

అన్నీ దక్కుట యొకచోట
అన్నీ‌ పోవుట యొకచోట

కాలచక్రము తిరుగుచుండగా
మేలు కీడులు చేయుచుండగా

ఆకులు కొన్ని పైకి చేరును
ఆకులు కొన్ని క్రిందికి జారును

ఏ చేతికిని చిక్కని కాలము నిజముగ పెద్దజాణ
నీచైర్గచ్ఛ త్యుపరి చ సదా చక్రనేమిక్రమేణ

గఛ్ఛతి గఛ్ఛతి గఛ్ఛతి  కాలం చక్రనేమిక్రమేణ
గఛ్ఛతి గఛ్ఛతి గఛ్ఛతి  కాలం చక్రనేమిక్రమేణ 




20, ఫిబ్రవరి 2014, గురువారం

ముచ్చట ముగిసింది గురుడా....




ముచ్చట ముగిసింది గురుడా సీమాంధ్ర
చచ్చీ‌చావని స్థితికి చక్కగ చేరింది
ముచ్చట ముగిసింది గురుడా సీమాంధ్ర
బొచ్చెలోన పెద్ద గచ్చకాయ వేసే
ముచ్చట ముగిసింది గురుడా



19, ఫిబ్రవరి 2014, బుధవారం

బాబోయ్! బాబోయ్! బాబు.



ఇంగ్లీషులో  troubles come in triple  అని ఒక సామెత ఉంది.

ఎమర్జెన్సీ దురాగతం చేసిన ఇందిరాగాంధీ దరిమిలా జరిగిన ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. ఆవిడ సారధ్యం వహించిన కాంగ్రెసు పార్టీ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది.  కాంగ్రెసు పార్టీ 197 సీట్లు కోల్పడి కేవలం 153 సీట్లను మాత్రం సంపాదించుకొని తలదించుకొంది.  అధికారం కైవసం చేసుకున్న జనతాపార్టీకి 295 సీట్లు వచ్చాయి మొత్తం 545 సీట్లలో.   అంత ఘోరపరాజయంలోనూ కేవలం నీలం సంజీవరెడ్డి మినహా 42 సీట్లుకు గాను 41 సీట్లను తెలుగువారు బంగారు పళ్ళెంలో పెట్టి ఇందిరాగాంధీగారి కాంగ్రెసుకు అందించారు ఆంధ్రప్రదేశ్ నుండి. అదీ మన తెలుగువాళ్ళు కాంగ్రెసువారికి ఇచ్చిన విలువా మర్యాదా అన్నవి.

ఇప్పుడా కాంగ్రెసు పార్టీ  తనను నమ్ముకుని అంటకాగుతున్న తెలుగునేలను అధోగతి పాల్జేసింది.  అఫ్ కోర్స్ తెలంగాణా వాదులు మాత్రం తమ నెత్తిన పాలు పోసిందంటారను కోండి.  నిజానికి అటు తెలంగాణాకూ ఇటు సీమాంధ్రకూ కాంగ్రెసువారి నాన్పుడు ధోరణివల్ల తీవ్ర నష్టం జరిగింది.

ఇప్పుడు తెలంగాణాలో సంగతేమో కాని, సీమాంధ్రలో కాంగ్రెసు చతికిలబడింది.  ఆ పార్టీని భూస్థాపితం చేయాలని రంకెలేస్తున్నారు సీమాంధ్రగడ్డమీది జనం.

ఇటు చిన్న రాష్ట్రాలో చిన్నచిన్న రాష్ట్రాలో అంటూ ఖూనీ సారీ కూని రాగాలు తీస్తున్న భారతీయ జనతా పార్టీకి తెలుగునేల మీద ఎప్పుడూ‌ ఆట్టే సీట్లు రాలవు.   గడచిన కొద్ది రోజులుగా సీమాంధ్రకూ న్యాయం చేయాలీ అంటూ ఒక నాలుకతోనూ,  తెలంగాణా బిల్లును కళ్ళకద్దుకుంటామూ అంటూ ఒక నాలుకతోనూ ఒకే సారి జుగల్ బందీ చేస్తూ చిరాకు తెప్పించింది భారతీయజనతాపార్టీ అన్ని వర్గాలకూ. తెలంగాణావాదులు, సీమాంధ్రులు, కేంద్రంలో కర్రపెత్తనం చేస్తున్న కాంగ్రేసు,  ఇతరరాజకీయపార్టీలు అందరికీ వీరి ఆంతర్యం అంతుబట్టి చావలేదు. ఎలా తెల్సిఏడుస్తుందీ - వారికే వారి ఆంతర్యం గురించి స్పష్టత లేనప్పుడూ?  అద్వానీ ఒక మాట, సుష్మా రెండు మూడు రకాలమాటలు, వెంకయ్య ఒక మాట, రాజనాధ్ ఒక మాట, నమో గారి మాట మరొకటి ఇల్లా ఎడ్చారు.  చివరికి సీమాంధ్రను చల్లగా ముంచారు.  లోక్‌సభలో చీకటిభాగోతంలో అధికారపక్షంతో చేతులు పిసుక్కున్నారు.  తమపేరు కాస్త డామేజీ అయిందనుకున్నారో ఏమో, ఇప్పుడు రాజ్యసభలో కొత్తరాగాలు మొదలుపెట్టారు.   విశ్వసనీయత అన్నది ఎంత దరిద్రంగా ఉండాలో అంతకన్నా దరిద్రంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ తీరు.

ఈ రెండు పార్టీలు మన ఖర్మకాలి జాతీయపార్టీలు. అగ్రస్థానంకోసం కుర్చీలాటలో తీరికలేకుండా ఉండి ప్రజలంటే పట్టని పార్టీలు.

సీమాంధ్రాలో ఐతే ఒక చిక్కొచ్చింది.  అటు కాంగ్రేసును భూస్థాపన చేయాలని నిర్ణయించుకున్నారాయె.  ఇటు బీజేపీని చీదరించుకుంటున్నారాయె.  ఇద్దరిలో ఎవరికి వేస్తారూ ఓటూ?  తోడేలుకా గుంటనక్కకా అన్నట్లుంది.

పోనీ ఇద్దరూ వద్దు బాబే ముద్దు అని అనుకుంటారు జనం అని తెలుగుదేశం పార్టీ వారు తెగ కలలు గంటున్నారు.

ఐతే మొన్న అత్యంత అవినీతిపరుడంటూ కాంగ్రెసు తప్ప అన్నిపార్టీలూ,  సాక్షి తప్ప అన్ని పత్రికలూ, వైకాపా కార్యకర్తలు తప్ప తెలుగుజనం ప్రజానీకం అందరూ గగ్గోలుపెడుతున్న జగన్మోహనుడు ఢిల్లీ పోయి రచ్చరచ్చ చేసాడు.  ఏం సాధించాడూ అనకండి.  వేరే వాళ్ళు మాత్రం ఊడబొడిచి సాధించి చచ్చింది మాత్రం ఏమేడ్చింది కనక? జనంలో ఇమేజ్ మాత్రం బాగా పెంచుకున్నాడు. అది చాలదా?

జనానికి కాకపోయినా బాబుగారి తెగులు దెశానికి సారీ తెలుగుదెశం పార్టీకి అది చాలు.  అందుకు ప్రతిక్రియగా వారు ఏమి ఎత్తు ఎత్తాలా అని గుంపుతంపీలు పడుతున్నారు.  ఐతే వారిగోల జనానికి ఇంకా వినోదం పంచకమునుపే,నల్లారివారి రాజీనామా పుణ్యమా అని కాంగ్రేసులో ముఖ్యమంత్రి పదవి అనే కుంటికుర్చీ కోసం తన్నుకోవటం హంగామా మొదలై భలే వినోదం పంచుతోంది మన తెలుగువారికి ఇంత విషాదంలోనూ.

ఎవరికి పుట్టిందో‌తెలియదు ఈ అలోచన.  సాయంత్రం టీవీలోకి వచ్చేసింది  తెలంగాణా టీడీపీ వారు ఒక తీర్మానం చేసిపారేసారు.  దానిప్రకారం ఇకమీదట తెలుగుదెశంపార్టీ అనేది ప్రాంతీయపార్టీ అనే చిన్నటాగ్ వదుల్చుకుని జాతీయపార్టీ అనే పేద్ద ముచ్చటైన అందమైన టాగ్ తగిలించుకుంటుందట.

చచ్చాం బాబోయ్..

ఈ కొత్త అవతారంలో బాబుగారు ముస్తాబై ఎంచేస్తారండీ?

ఉభయతెలుగురాష్ట్రాల్లోనూ చక్రం తిప్పేస్తారు. అధికారం కొట్టేస్తారు. సుహృద్భావం పంచేస్తారు మనం మింగలేనంతగా. అభివృధ్దిని మళ్ళి పరవళ్ళు తొక్కించేస్తారు..

అబ్బో ఎన్ని కలలో!

అలా కొట్టేయకండి మరి!

తెలంగాణా వచ్చేదా చచ్చేదా అని ఈ బాబుగారితో సహా అనేకపార్టీలు అమోదపత్రాలు సమర్పించేసి తరువాత చచ్చినట్లు ప్రజాభీష్టం అంటూ‌ అన్నీ నాలుకలు అనేక మడతలు వేసుకున్నాయా లేదా చివరికి?

ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ?

ఖర్మకాలి (అదే కేవలం తెలుగువారి ఖర్మ మాత్రమే లేండి. అదెప్పుడూ కాలి మాడువాసన వస్తూనే ఉంది, కానీ, ఇప్పుడు మాటవరసకే అన్నాను) ఈ తెలుగుదేశం జాతీయపార్టీవారు ఉభయతెలుగురాష్ట్రాల్లోనూ గద్దెకెక్కేసారే అనుకోండి.

జస్ట్ అనుకోండి.  మాటవరసకేగా,  కొంపేం ములిగిపోదు అనుకున్నంతలో.

ఎడాపెడా అభ్వృధ్ధి చేసిపారెయ్యటానికి అలవాటుపడిపోయిన బాబుగారు మళ్ళీ లంకించుకుని ఎలా అభివృధ్ది చేస్తారయ్యా ఈ తెలుగురాష్ట్రాలనీ అన్నది ఆలోచించుకోండి.

యథాప్రకారం సీమాంధ్రసొమ్మంతా మళ్ళా హైదరాబాదుని తిరిగి అంతర్జాతీయవైభవంలో  అద్వితీయస్థానానికి చేర్చటానికి ఖర్చుపెట్టేస్తారు.  ఈ‌ విషయంలో సీమాంధ్రజనానికి ఆవగింజంతైనా అనుమానం అక్కర్లేదు.

అదే మరి troubles come in triple అంటే.  ఇప్పుడు కాంగీ భాజపాలతో పాటు బాబుగారు మరొక trouble అన్నమాట సీమాంధ్రజనానికి.

తెలంగాణావారు కూడా ఉలిక్కిపడాల్సిన విషయమే.  ఇంతవరకూ తెలంగాణాను దోచిన సీమాంధ్రపార్టీల్లో ఒకటి జాతీయపార్టీ అవతారమెత్తి దోపిడీని నిరాఘాటంగా కొనసాగిస్తుందన్నది వారికి ఠపీమని తట్టే సబబైన అనుమానం. కాదనలేం‌ కదా.  వారింకా తెరాసాకా కాంగీకా దేనికి జై అనాలో పూర్తిగా తేల్చుకున్నారో లేదో పాపం.  ఇప్పుడు బాబుగారి జాతీయదొరవేషం నాటకం ఒకటి వాటికి తోడుగా పోటీలోకి గోదాలోకి దిగుతుందీ‌ అన్నమాట.

బాబుగారు తోలుబొమ్మలాటలో కేతిగాడో జాతీయరాజకీయనాటకంలో‌ కేటుగాడో అన్నది ఎవరికివారే అలోచించుకోవలసిన మాట.  ఎదేమైనా ఆయనగారి ఈ‌ సరికొత్త అవతారప్రకటన మాత్రం గమనార్హమైన విషయం అని గ్రహించాలి.

కాబట్టి ఉభయప్రాంతాల్లోని ప్రజలారా Beware of Babu.  ముఖ్యంగా సీమాంధ్రజనులారా be very carefull.  Babu returns!



18, ఫిబ్రవరి 2014, మంగళవారం

ఇది శోకము, ఒక నాటికి ఇది తీరును ... ఇది తీరును ...




 
ఇది శోకము ఒక నాటికి ఇది తీరును ఇది తీరును
ఇది లోకము ఒకనాటికి ఇది మారును ఇది మారును

ఈ కాలము అది చేయదు ఇదిచేయదు అని ఉండదు
ఏ కొంచెమొ అది నీదని  ఇది నీదని  విధి యెంచదు
నీ‌ కష్టము నీ‌ నష్టము అవి మాత్రమే నీ స్వంతము
పై కొన్నది విధియన్నది నీ ధైర్యమే నీ పెన్నిధి

తనవారలే వడ్డించుచో తానెక్కడ కూర్చుండిన
తన విస్తరి మరి నిండదా?
తనవారలే  పెరవారలై తన మోము చూడక యుండిన
తన గొంతు  తప్పక ఎండదా?
కనికారము విధిచూపక కడపంక్తిలో నీ వుండిన
నిను జూచి లోకము నవ్వదా?
అణగార్చినా ఆ కాలమే ఆ ఈశ్వరకృప యుండిన
అనుకూలమై  నీ కుండదా?

పవలును రేలును వచ్చి పోయెడు భంగిని సుఖములు కష్టములు
భువిపై మనుజుల పలుకరించుచు పోవు టెఱింగుదు రుత్తములు
ఎవరికి తెలియును  ఈ‌నాడైనది ఎవరికి  ఎంతటి మేలగునో
ఎవరికి తెలియును రేపేమగునో ఎవరికి ఎప్పుడు మేలగునో

 


చీకటిలో కారు చీకటిలో ..........




ఈ రోజున తెలుగులోకం చీకట్లో ముంచబడింది.
  కొంతమంది చీకటినే వెలుగు అనుకుంటున్నారు.
అంతా కాలవైపరీత్యం.

 




14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

జగడపాటి



లగడపాటి అనటం కన్నా ఆయనను జగడపాటి అనటమే సముచితంగా ఉంటుందేమో! 

ఏదో ఒకటి లెండి.  విషయం ఆయన ఇంటిపేరు గురించి కాదు.

లగడపాటిని ఉరితీయాలన్న మాటకూడా అన్నారు కొంతమంది.

లగడపాటి లాంటి వారిని అసలు చట్టసభలకు పోటీ చేయటానికి అనర్హులుగా ప్రకటించాలన్న మరింత సబబైన వాదనా వినిపించింది.

లగడపాటి పార్లమెంటు నిండుసభలో చేసిన దుశ్చర్య కారణంగా భారతప్రజాస్వామ్యం పరువుపోయిందనీ వాపోతున్నారు కొందరు.

అన్నట్లు ఈ రోజు మన (అ)మిత్రదేశం ఐన చైనా వారి అమూల్యాభిప్రాయం ఒకటి పత్రికల్లో వచ్చింది.  మన ఘనతవహించిన భారతదేశంలో ఉన్నది అపరిపక్వమైన ప్రజాస్వామ్యం అని వారు భావిస్తున్నారట.  అక్కడికి వారి దేశంలో ఏదో గొప్పగా ప్రజాస్వామ్యం వెలిగిపోతున్నట్లు.  బహుశః ప్రజాస్వామ్యం పరిపక్వస్థితికి చేరుకున్నాక అది పార్టీస్వామ్యం అవుతుందని వారి పార్టీ వారి సిధ్ధాంతగ్రంథంలో ఉందేమో.  నాకైతే తెలియదు.   తియాన్మన్ స్క్వేర్‌లో ఆందోళన చేస్తున్న వేలాదిమంది స్కూలు పిల్లలను ఈ పరిపక్వరాజ్యవ్యవస్థ నల్లుల్ని చంపినట్లు చంపిపారేసింది.   ఆ తరువాత రోజుల్లో ఏదో కాన్ఫరెన్సులో తటస్థపడిన చైనాదేశపు ప్రొఫెసరుగారిని ఈ విషయం గురించి అడిగితే  ఆయన చాలా గాభరాపడిపోయాడు.  చుట్టూ పరిశీలించి చూసి ఎవరూ తనని గమనించటం లేదని నమ్మాక ఒక్క ముక్క అన్నాడు.  "ఈ విషయంలో నేను నోరువిప్పి ఒక్క ముక్క మాట్లాడినా నాకూ నా కుటుంబానికీ నూకలు చెల్లినట్లే."  ఈ‌ మాటలు అనేసి ఆయన వేగంగా అక్కడినుండి జారుకున్నాడు.  సర్లెండి శాఖాచంక్రమణం అవసరమా ఇప్పుడు?  మళ్ళీ జ(ల)గడపాటి గారి దగ్గరకే వద్దాం.

ఇంతకీ ఆయన వాదన ఏమిటీ అంటే, "ఆత్మరక్షణ" కోసం తప్పని సరైన పరిస్థితిలో నిత్యం తనజేబులో ఉండే పెప్పర్ స్ప్రేని బయటకు తీసి ప్రయోగించాడట.  

ఆయన ఆత్మరక్షణకోసమే అలా చేసాడనీ, ఒక్కో సీమాంద్ర నాయకుడికీ నలుగురైదుగురు చొప్పున కట్టడిదారులని దొరతనం వారు బిగించారనీ,  ఆ సందర్భంలో సీమాంధ్ర నాయకులను తన్నేవారిని మాత్రం అడ్డుకోలేదనీ, దరిమిలా మోదుగులను చితగ్గొడుతుంటే అటుదూకి, తప్పని సరైన స్థితి వచ్చేసరికి స్ప్రేని వాడానని ల(జ)గడపాటి వాంగ్మూలం.  నిన్న ఒక ఛానెల్లో ఒకాయన లోక్ సభ వీడియోలు చూస్తే సీమాంధ్రవారిపైన జరిగిన దౌర్జన్యమూ స్ప్రే జల్లిన సంఘటన పూర్వాపరాలు తెలుస్తాయని ఛాలెంజ్ చేసాడు.

అసలు అదును చూసి కెమేరాలు అవుట్ ఆఫ్ ఫోకస్ ఎందుకు చేసారో? ఎవరు చేసారో?  సభలో అసలు ప్రధాని (సోనీయమ్మ) కాని ఆక్టింగ్ ప్రధాని (సింగినాదం సింగు) కాని ఎందుకు లేరో కూడా అని ఆశ్చర్యం కలుగుతుంది.  సభసభ్యుల్నే మార్షల్స్‌లాగా వాడుకోవాలన్న అద్భుతమైన ఆలోచనకు గాని ఆ ఇద్దరు ప్రధానులకూ అభినందనలు తెలియజేయాలి!   ఇంకా నయం, ఇలా స్ప్రే చేసే హడావుడి జరుగుతుందని వాళ్ళిద్దరూ ముందే తెలిసి ఆత్మరక్షణ చేసేసుకున్నారని ఎవరూ అనలేదు వాళ్ళ అదృష్టం కొద్దీ.

ఐనా తెలియక అడుగుతాను.  ఆత్మత్యాగాలకూ సిధ్ధపడి బిల్లుకు అడ్డం నుంచుంటామని భీషణప్రతిజ్ఞలు చేసిన వీరులు ఆత్మరక్షణ చర్యలకు ఎందుకు పూనుకోవాలీ అంట? 

ఒక వేళ చంపేసేరే అనుకోండి.  లగడపాటో జగడపాటో అయన అమరవీరుడు ఐపోయి ఉండేవాడు కదా ఇంచక్కా?  

ఆ దెబ్బతో బిల్లు ఆగిపోయేదేమీ కాదనుకోండి.  ఓ‌ రెండు నిముషాలు మౌనం పాటించి. ఎవరైనా నోరు విప్పే లోగానే బిల్లు పాసయిందని ప్రకటించే వారే.

చంపేస్తే చావాలి కాని తోటి సభ్యుల మానప్రాణాలకు హాని కలిగే విధంగా ప్రవర్తించటం క్షంతవ్యం కాని నేరం.  

ల(జ)గడపాటి తొందరపడ్డారు.  మహా ఐతే నిజంగా మెత్తగా తన్నే వారు.  (పైగా యథాప్రకారం ల(జ)గడపాటి దౌర్జన్యం నశించాలీ అని నినాదాలూ మిన్నుముట్టించే వారు.) ఆ పైన సభనుండి బహిష్కరించే వారు.  అంత మాత్రానికి అదేదో ప్రాణహాని వచ్చేస్తోందని భ్రమించి స్ప్రే చేయటం తప్పా తప్పున్నరా?

అందుచేత ల(జ)గడపాటి పైన సానుభూతి చూపటం సాధ్యం కాదు.




3, ఫిబ్రవరి 2014, సోమవారం

తెలుగుతల్లీ నీకు వందనం



తెలుగుతల్లీ నీకు వందనం ఘనకీర్తి
కలిగి వెలిగే తల్లి కరుణించవే తల్లి
తెలుగుతల్లీ నీకు వందనం

కన్న బిడ్డలు నేడు కాట్లాడుకొంటుంటె
కన్నీళ్ళు పెడుతున్న కళవళ పడుతున్న
తెలుగుతల్లీ‌ నీకు వందనం

కలుముల గడ్డను కొలిమిగా మార్చిన
కలుషబుధ్ధుల జూచి కళవళ పడుతున్న
తెలుగుతల్లీ నీకు వందనం

నిరసించి కొందరు నీకన్న బిడ్డలే
కొరగాని మాటలుకూడ పలికేరమ్మ
తెలుగుతల్లీ నీకు వందనం

పరభాషలను మెచ్చి పరరాజులను మెచ్చి
కరకులాడే వారి గాంచి శోకించేవు
తెలుగుతల్లీ నీకు వందనం

నీది తప్పన్నచో‌ నీది తప్పని శుష్క
వాదాల నీ‌ పేరు పాడుచేసితి మమ్మ
తెలుగుతల్లీ నీకు వందనం

మా లోపములుచూచి లోలోన కుమిలేవు
కాలప్రభావమ్ము కలిగించె దుర్దశ
తెలుగుతల్లీ నీకు వందనం

కూడిరాని బిడ్డ లీడ పోగైరమ్మ
ఓడలు బండ్లాయె నేడు మాతల్లి
తెలుగుతల్లీ నీకు వందనం

ఈ తీరుగా నిన్ను ఇరుకున పెట్టేము
మా తప్పులను నీవు మన్నించ వమ్మ
తెలుగు తల్లీ నీకువందనం
   
కొంచెమై యుండగా కొన్నాళ్ళు గడచి
మంచిరోజులు మనకు మరల రావచ్చు
తెలుగుతల్లీ నీకు వందనం

అన్నదమ్ముల మధ్య అగ్గిరాజేసిన
చిన్నబుధ్ధుల ప్రభ చెరిగిపోవచ్చు
తెలుగుతల్లీ నీకు వందనం

ఇటువంక నీ బిడ్డ లెటువంటి వారొ
అటువంక నీ‌ బిడ్డ లటువంటి వారె
తెలుగుతల్లీ నీకు వందనం

పాలపొంగు నేడు పగులగొట్టే నేల
కాలాంతరంబున కలిసిపోయేనమ్మ
తెలుగుతల్లీ నీకు వందనం