14, జనవరి 2014, మంగళవారం

గవర్నర్ పదవి ఎందుకు?

అసలు మన దేశ రాజకీయవ్యవస్థలో గవర్నర్ అనే పదవి ఎందుకు?

రాజ్యాంగ నిర్మాతలు ఈ గవర్నర్ పదవిని ఎందుకు సృష్టించారో కాని అది ఖచ్చితంగా ఒక రాజకీయపదవి ఐ కూర్చుంది.  ఆ పదవిలో ఉన్న వ్యక్తి చేసే ఏకైక కార్యక్రమం కేంద్రం తరపున వచ్చి కూర్చుని, వారు అడిగినప్పుడు, వారు కోరిన విధంగా నివేదికలు ఇవ్వటం లేదా వారి ఆదేశం ప్రకారం ఇతరవిధాలుగా వ్యవహరించటం మాత్రమే.

ఇతర విధాలుగా వ్యవహరించటం అంటే, కేంద్రం చూసీచూడనట్లు ఉండమంటే ఆ రాష్ట్రపరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉన్నా అంతా సరిగ్గానే ఉన్నట్లు మాట్లాడటమూ, అలాగే రాష్ట్రపరిస్థితిలో ఏమీ కల్లోలాలు లేకపోయినా అదుపు తప్పుతున్న శాంతిభధ్రతలూ వగైరా అంటూ చెప్పటమూ అన్నమాట.

రాష్ట్రప్రభుత్వాలపై కేంద్రం‌ పెత్తనం చేయటానికి తప్ప గవర్నర్ పోష్టుకు వేరే బాధ్యతలు లేవని దివంగత ప్రధాని ఇందిర ప్రగాఢంగా నమ్మిన సిధ్ధాంతం.

గవర్నరర్లు కేంద్రం తరపున తాబేదార్లన్న పరిస్థితి కారణంగానే కేంధ్రంలో పెత్తనం చేసే పార్టీ మారగానే గవర్నర్లు రాజీనామాలు చేయటమూ, అలా చేయని వారిని కొత్త ప్రభుత్వాలు పదవినుండి తప్పించటమూ జరుగుతోంది.

గవర్నర్‌కు కళ్ళుముక్కూ చెవులూ కాళ్ళూ వగైరా అవయవాలు పనిచేయకపోయినా ఫరవాలేదని ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్ హోదాలో వచ్చిన  కే.సీ.అబ్రహాం వంటివారు ఉదాహరణ.

గవర్నర్ కేంద్రం ఆడించే బొమ్మ మాత్రమే అని ఋజువుచేసిన మరో గవర్నర్ రామ్‌లాల్.

ఇలాంటి దుస్థితిలో పడిన గవర్నర్ వ్యవస్థను ఎందుకు రద్దు చేయకూడదు?

ఈ రోజు టివీ స్క్రోలింగ్‌లో చూసాను ఒక వృధ్ధరాజకీయజంబుకానికి ముఖ్యమంత్రి పదవి అక్కర లేదట. గవర్నర్ పదవి కావాలట.

గవర్నర్ పదవి వృత్తిరాజకీయనాయకులకు పునరావాసం కల్పించటానికా రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశించినది?

ఒక రాజ్యాంగరక్షకుడి హోదాలో ఉండిన వ్యక్తి కీలుబొమ్మగా ఆడటం బాగోలేదని ప్రజలు విసుక్కుంటున్నా దొరతనాలు నిస్సిగ్గుగా అదొక పార్టీపదవిలాగ భావించుకుంటున్నాయి.  కొందరు గవర్నర్‌గిరీ వెలగబెట్టాక కూడా ముఖ్యమంత్రి పదవికి మళ్ళారంటే అంతా వృత్తిరాజకీయనాయకుల మయమైపోయిందీ గవర్నర్ పదవి అనే కదా అర్థం?

కనీసం ఒక పని చేయాలి.  గవర్నర్ పదవికి కేంద్రం ఎంపిక వ్యక్తిని పార్లమెంటు మూడింట రెండువంతుల మెజారిటీతో అమోదించాలి.  అలా చేస్తే కనీసం అధికార పార్టీలు ఏకపక్షంగా అస్మదీయులతో గవర్నర్ పోష్టులను భర్తీచేసి కావలసినట్లు ఆడించుకోవటాన్ని నిరోధించేందుకు దారి ఏర్పడుతుంది.  అలాగే గవర్నర్ గిరీ వెలిగించిన వ్యక్తి మున్ముందు కార్యనిర్వాహక పదవులు చేపట్టకుండా చట్టం కూడా చేయాలి.  అంతే‌కాదు, గవర్నర్ పదవికిఎంపికయే వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా ఏ కార్యనిర్వాహక పదవిలోనూ ఉండి ఉండకూడదు మరియు గత ఐదు సంవత్సరాలుగా ఏ రాజకీయపార్టీలోనూ సభ్యుడు కూడా కాకూడదు.

ఏమంటారు?

2 వ్యాఖ్యలు:

  1. 1934 గోల్కొండ కవుల సంచికలో ప్రచురించబడిన తాతాజీ కవిత్వం గురించిన వివరాలు ఈ కింది టపాలో చూడండి. మీరు స్వతహాగా కవులు & మీకు సాహిత్యం గురించి మక్కువ కనుక ఈ విషయంపై ఆసక్తి ఉందనే నమ్మకంతో ఈ వ్యాఖ్య రాస్తున్నాను, అన్యధా భావించవద్దు. మీ బ్లాగులో ప్రచారం చేస్తున్నందుకు క్షమించండి.

    http://jaigottimukkala.blogspot.in/2014/01/tatajis-poem-in-1934-compilation_16.html

    ప్రత్యుత్తరంతొలగించు
  2. చక్కగా తిరుపతి వెంకన్నా, సింహాద్రి అప్పన్నా, శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకోవచ్చుగద మాస్టారు గవర్నర్ కుటుంబ సమేతంగా.. ఎన్నో పండగలు ఉన్నాయి..ఏదో అలా పుణ్యం సంపదిన్చవచ్చుగా..అప్లికేషను ఎమన్నా ఉంటె బాగుణ్ణు..నేను కూడా..

    ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.