6, డిసెంబర్ 2013, శుక్రవారం

తెగతెంపుల నిర్ణయం వెలువడింది.

తే. ఆంధ్రజాతికి దుర్దిన మాయెననగ
విభజనము కోరు వారికి వేడుకనగ
నిర్ణయము వచ్చె తెలుగింట నిప్పుపుట్టె
ముందుముందేమి పుట్టునో యిందువలన

వ. కొందఱ కిది స్వాతంత్యసిధ్ధి యట!

సీ. పూర్ణస్వాతంత్యంబు పొల్పెట్టు లుండునో
      ప్రత్యేకదేశమై వరలు వారొ
సర్వస్వాతంత్యంబు చాడ్పెట్టులుండునో
      భరతదేశంబులో వారు గారొ
అరువదేండ్ల స్వప్న మందురే పెక్కేండ్లు
      విభజనోద్యమమెందు విడిసి యుండె
అమరవీరులు కల రధికులీ యుద్యమ
      రాజకీయమునకే రాలినారు

తే. అనుదినంబును నింద లన్యాయ భాష
ణంబు లివి యెల్ల ధర్మాగ్రహంబు పేర
నిన్ని నాళులు దాయాదు లన్న మిషను
వేలు చూపించి కురిసిరీ వీరు లకట
 
తే. వేరు కాపురములు వీలుగా కుదిరెను
చాలు దాయాదులను మాట సఖ్య మొప్ప
అన్నదమ్ముల మగుటయే యెన్న దగిన
బాంధవంబను తీయని పలుకు పుట్టె
 
తే. రాష్ట్రములు వేరు తెలుగువా రంద రొకటె
యన్న సొంపైన మాట యే మంత పొసగు
తిట్లు కురిపించుటయు చేరదీయుటయును
వారి చిత్తంబు వీరి సౌభ్యాగ్య మగునె
 
ఉ. కాలము చేత సర్వమును గల్గుచు నుండును క్రిందుమీదులన్
కాలము చేయ కొందరధికంబగు మోదము నొంద కొంద రార్తులై
బేలతనంబు బొందుటయు వింత యనంగ రాదు గర్వశోకముల్
కాలము వేఱు భంగి చనగా విపరీతము లౌటయు పుట్టు చుండెడిన్

క. కాలము నీదు స్వరూపము
నీ లీలకు తిరుగు లేదు నీ వేదో పె
న్మేలెంచి చేయుచున్న ద
దే లాగున తెలియ నేర్తు మీశ్వర చెపుమా
 
శా. తౌరక్యాంధ్రము కోరి కొందరు మహాదోషాచరుల్ దీక్షమై
పోరంబోరగ వారి యాశ లవి సంపూర్ణంబుగా దీరు చో
నేరం బేమియు లేని శిక్ష పడి యీ నిర్భాగసీమాంధ్రు లీ
ఘోరం బింక సహించి యుండవలెనా కోదండరామప్రభూ

సీ. కాంగిరేసును వల్లకాటికి పంపక
      ఆంధ్రుల కోపాగ్ని యారు టెట్లు
భాజపామూర్ఖుల పట్టి పల్లార్చక
      ఆంధ్రుల కోపాగ్ని యారు టెట్లు
సీమాంధ్రమంత్రుల చెత్తగా నూడ్వక
      ఆంధ్రుల కోపాగ్ని యారు టెట్లు
సోనియమ్మకు చెప్పుచూపించు నందాక
      ఆంధ్రుల కోపాగ్ని యారు టెట్లు
 
ఆ. తెలుగుజాతిపరువు దిల్లీబజారులో
అమ్ముకొన్న దుష్టు లల్పమతుల
రేపు శోకవహ్ని రూపర జేయక
ఆంధ్రజాతి కోప మణగు టెట్లు

తే. అన్నిటికి నీవు గలవని విన్నవించి
యూర కుందును శ్రీరామ యుచిత మైన
భంగి విభజనవాదుల భంగపరచి
బుధ్ధి చెప్పుము దుడు కారిపోవు నట్లు

2 వ్యాఖ్యలు:

 1. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదే! ఈ రాష్త్ర విభజన ఎందుకు కల్పించబడిందో? ఈ దేశానికి,రాష్ట్రానికి తరతరాల కాంగ్రెస్ పీడ వదిలించడానికో, చేవ చచ్చిన తెలుగుజాతిని మేల్కొలిపి పునరుత్తేజితులను చేయటానికో, మేకవన్నె పులులలాంటి ఈ రాజకీయనాయకుల బండారం బట్టబయలు చేయటానికో ఆ భగవంతునికే ఎరుక.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఓరోరి ఆంధ్రుడా దిగాలు పడకురా, దగ పడ్డావని
  నీ ఘన చరిత్రని, నీ పూర్వికులని గుర్తు చేసుకో,
  నీ మీద పడి బతికిన ఒక పరాన్నభుక్కు వదిలింది,
  పండగ చేసుకో, నీకేం తక్కువరా, నీ శక్తిని మరవకు,
  కష్టం, ధైర్యం, సాహసం, తెలివి నీ సొత్తురా,
  పొయింది నీ సొమరి, సోంబేరి,మత్తు, చాతకాని సమాజం.

  ఐతరేయం నాడే ఉన్న జాతిరా నీది,ఆటవికుల పక్కనే
  కోటలు కట్టావురా,మహాభారతంలో ఉన్నావు,
  అమరావతి నాగ"బు" నీదిరా,భట్టిప్రోలు లిపి మనదిరా,
  ద్రవిడ దేశం పోయి పార్, నీ చరిత్ర గుర్తులు కనపడతాయి,
  కరునాడు హోగి నోడు, నీ పాదముద్రలు ఇంకా పదిలం,
  ఉత్కళం, అమెరికా ఎక్కడికి పొయినా నువ్వున్నావు
  చరిత్రహీనులతొ నీకేం పోలిక,మత్తెక్కిన వాడితోనా సహవాసం?
  "గా"డిదలతోనా,నన్నయ, అన్నయ్యా, ఇంక మేలుకో,

  పల్నాటి పౌరుషం పొదువుకో,బొబ్బిలి పొలికేక వినుకో,
  అల్లూరి తెగువ, ఉయ్యలవాడ సాహసం నీదే,
  విదేశి పిచ్చి "బొచ్చు"కుక్కని తగల్బెట్టి, తరిమికొట్టిన
  "విజయనగరం" మనదేరా,తెలుగు జాతి పౌరుషాన్ని
  రుచి చూపిన అన్న నందమూరి, చిరునవ్వులతొ, తెలుగు పంచె కట్టి
  తెలుగు దెబ్బ మధ్యధరా వరకు కొట్టిన రాజన్న మనవాడేరా,

  ఈ అవకాశం వదలొద్దు,భావి తరాలని మోసం చెయ్యకు,
  ఇంకా నష్టపోవద్దు, మన కష్టం మనకే,మన నీళ్ళు మనకే,
  నీకు కష్టం కొత్త కాదు,నీ నరనరాన వున్నది అదే.
  భయమెందుకు, సాగు ముందుకు.

  (మీద కామెంట్ చదివి ఆవేశంలొ రాసాను,నాకు చాల ఆనందంగా వుంది, తప్పులుంటే క్షమించండి

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.