14, డిసెంబర్ 2013, శనివారం

కరచరణసరోజే కాంతిమన్నేత్రమీనే

కరచరణసరోజే కాంతిమన్నేత్రమీనే
శమముషి భుజవీచివ్యాకులేఽగాధమార్గే
హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం
భవమరుపరిఖిన్నః క్లేశమద్య త్యజామి



ఒకడొకానొక యెడారిలో పడి పోవుచుండెననగా వాని యవస్థ దుర్భరముగా నుండు నని లక్షవాక్యములలో చెప్ప నవుసరము లేదు.  కాళ్ళు బొబ్బలెక్కును కాని నీడ దుర్లభము. ఆకలి దహించును కాని తిండి దుర్లభము.  దప్పికతో నలమటించును కాని నీటి జాడ దుర్లభము.  వీటికి తోడుగా కొన్ని యెండమావులు కనిపించి యాడించును.  వాని యందు కనిపించు నీటికై యాసపడి యట్లే పరువెత్తుకొనుచు పోయి పోయి మరింత దుఃఖమనుభవించును.

ఈ సంసారము కూడ యెడారి వంటిదే.  జీవుల ప్రయాణములో నిచట నటువంటి బాధలే కలుగును. విశ్రాంతి యన్నది లేక ఈ సంసారములో పడి జీవుడు నడచు చుండును.  ఆకలిదప్పులవంటి ఆశామోహములను పొంది వాటిని అందించునట్లు భ్రమింపజేయు ఎండమావులవంటి యింద్రియసుఖములు వెంబడి పరువులెత్తుచు క్లేశములు పొందుటే జీవితములో హెచ్చుభాగమైన కార్యక్రమము కదా.

కాని ఈ సంసారములోని జీవుడు సరిగా నన్వేషించినచో నొక చక్కని కాసారము కనబడును.  అది భగవతుండని పేరు గలది!

ఎంతో అందమైన పద్మములున్నవి దానిలో.  అవి భగవంతుని యొక్క దివ్యమైన కరచరణములే.

ఎంతో చక్కని దివ్యకాంతులీను చేపలు సంచరించునా కాసారములో.  అవి భగవంతుని యొక్క దివ్యకృపాకటాక్షవీక్షణాప్రసార మొనరించు చున్న నేత్రములే సుమా.

ఆ భగవంతుడనే కాసారము లోని జలములు అమృతమే.  అన్ని విధములైన క్లేశములను తొలగించి హాయి గొలుపునా అమృతజలములు.

భక్తునకు భగవంతుని కృపాజలప్రపూర్ణమైన దివ్యకాసారము లభించినది.  అతడు సంతోషముగా ఎలుగెత్తి పలుకుచున్నాడు.

ఈ సంసారమనే ఎడారి బాధ నుండి విముక్తి లభించినది.  
ఇదిగో‌ ఈ‌ క్షణమే దీనిని విడిచిపెట్టున్నాను



స్వేఛ్ఛానువాదం:

తే. కరచరణములు పద్మముల్ కన్నులనగ
నందమై నట్టి చేపలౌ హరిసరసియె
పరమకరుణాంబుపూర్ణమం చరసి యిపుడె
పాడు సంసారమరుభూమి వదలినాడ