13, డిసెంబర్ 2013, శుక్రవారం

ముకుందమాల - 8వ శ్లోకం. చింతయామి హరిరేవ సంతతం

చింతయామి హరిరేవ సంతతం
మందహాసముదితాననాంబుజం
నందగోపతనయం పరాత్పరం
నారదాదిమునిబృందవందితం


శ్రీహరిని చింతన చేయవలెను.  అది శుభప్రదము.  శుభ మనగా మోక్షమనియే యుద్దేశము.   హరిని మాత్రమే చింతచేయవలెను.  అన్యదేవతలను చింతించుట వలన కలుగు ఫలములు స్వల్పములు.  అట్టి దేవతలను చింతించుట వలన ఎంత గొప్ప ఫలము కలిగినను అది మోక్షమునకు సమానము కాదు గదా.  అందుచేతనే,  హరిరేవ సంతతం అని హరిని మాత్రమే ఎల్లప్పుడును నిష్ఠగా చింతించుచున్నానని కవి చెప్పుచున్నాడు.  దైవ చింతనమనగా వీలు చిక్కినప్పుడు కాలక్షేపమునకు చేయదగినది కాదు.  అది నిత్యముగా మనఃపూర్వకముగా చేయవలసినది.  ప్రహ్లాదాదులకు నిద్రలో కూడ హరినామస్మరణము మరుగు కాలేదని గదా ప్రతీతి.  అట్లన్న మాట.  ఎప్పుడు హరిస్మరణము జరుగుచున్నదో అప్పుడు హరియొక్క సుందరాతిసుందరమైన ముఖారవిందమును, అది అనుగ్రహ పూర్వకముగా చిందించుచున్న చిరునవ్వులును మనస్సులో రూపు కట్టవలెను.  ఇట్లు చెప్పుట యెందుకనగా, యాంత్రికముగా నోటితో హరినామమును జపించుట కాక అది మనఃపూర్వకముగా చేయవలసినదిగా చెప్పుటకే.  మరొక విషయమేమనగా అట్టి స్మరణము ప్రేమపూర్వకమైనది.  అట్లైనప్పుడే కదా, హరి యొక్క అందమైన నగుమోము మనస్సులో రూపించుట? ఆ హరి నందగోపునకు దయతో కుమారుడైన వాడు.  ఆయన పరాత్పరుడు.  అయనకు నిజముగా తండ్రి యెవడు?  కాని నందుడు చేసుకొన్న పూర్వపుణ్యప్రభావము చేత, ఆయనకు శ్రీహరి స్వయముగా పుత్రుడై అలరించెను.  అనగా ఆయన అనుగ్రహము ఎంత గొప్పగా ఉదారముగా నుండునో మనము అర్థము చేసుకొన వలసినదే కాని వర్ణించలేనిది. అర్థము చేసుకొని తరించుటకు కూడ పెట్టిపుట్టవలెను.  నారదాదులు అట్టివారు.  వారు శ్రీహరిపట్ల పరమప్రేమతో తరించిరి.  అందుచేత శ్రీహరి వారి హృదయములలో నిత్య నివాసియై యుండును.  ఆ మహాత్ములకు శ్రీహరి స్మరణకీర్తనములు తప్ప వేరు కార్యక్రమములే యుండవు.   సారాంశ మేమనగా, శ్రీహరిని మిక్కిలి ప్రేమతో నిత్యమును స్మరించుచు నా పరాత్పరుని నగుమోమును హృదయకమలమున నిత్యము దర్శించుచు తరించవలె ననుట.


స్వేఛ్ఛానువాదం

ఆ.వె. నందగోపతనయు నారదాదిమునీంద్ర
వంద్యు హాసపూర్ణపద్మముఖుని
పరమపురుషు హరిని భావింతు నేవేళ
చిత్తమందు భక్తి చెలగుచుండ1 వ్యాఖ్య:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.