29, అక్టోబర్ 2013, మంగళవారం

నాన్నగారి పర్యవేక్షణ వలన బతికిపోయాం

మా పాఠశాలకోటా మార్కుల మీద నాన్నగారి పర్యవేక్షణ గురించి వ్రాస్తూ, ఈ మార్కుల విషయంలో కక్షసాధింపుకు నేనూ, నా స్నేహితుడు కన్నబాబూ దాదాపుగా బలి ఐన సంఘటనను ప్రస్తావించాను కదా.  వివరాలు ఇప్పుడు చెబుతాను.

ఈ కన్నబాబు అనే ముద్దుపేరుగల పిల్లవాడి పేరు కందుకూరి వీర వేంకట సత్యనారాయణ.  మా ఇద్దరిదీ మంచి స్నేహం.  ఇద్దరం కలిసి చదువుకుంటూ ఉండేవాళ్ళం తరచుగా వాళ్ళింటి ఔట్‌హౌస్‌లో కూర్చుని.  మాయిద్దరి మైత్రి వెనుక మా తండ్రిగార్ల మైత్రీ బంధం ఉంది మరి.  కన్నబాబు తండ్రి భాస్కరంగారు మా నాన్నగారికి క్లాస్‌మేట్.  భాస్కరంగారు స్టేట్ బ్యాంక్‌లో పనిచేసేవారు.  చాలా మంచి మనిషి మరియు చాలా చాలా  ఖచ్చితంగా వ్యవహరించే మనిషి కూడా.  కాబట్టే ఆయన్ను దూరంగా తనకల్లు బదిలి చేసారని  కొందరు అనేవారు.  అక్కడాయన చాలా కాలం పని చేసారు.   ప్రతివారం కొత్తపేట వచ్చి వెళ్ళేవారు.  కన్నబాబు కూడా స్టేట్ బ్యాంక్ లోనే మంచి పొజిషన్‌లొ రిటైర్ అయ్యాడు ఈ‌ మధ్యనే.  వాళ్ళు హైదరాబాదులోనే ఉంటారు.  మా నాన్నగారి తరం నుండి మాతరం వరకూ మా రెండు కుటుంబాలకూ మంచి మైత్రి ఉంది.   మా కన్నబాబు నా కన్నా చురుకైన విద్యార్థి.  భాస్కరంగారు ప్రతిసంవత్సరమూ కార్తీకపౌర్నమికి లక్షబిల్వార్చన చేసేవారు స్థానిక శివాలయంలో.  ఆయన దయతో నాకూ కొన్ని సార్లు అ బిల్వార్చనలో పాల్గొనే అదృష్టం కలిగింది.   బిల్వార్చన తరువాత వారింట్లో రాత్రి చాలా వైభవంగా సమారాధన జరిగేది.

చిన్నతనం చిన్నతనమే. అమాయకంగా పిల్లలు చేసే పనులు ఒక్కొక్క సారి పెద్దలకు తలవంపులు తెస్తాయి. ఒక్కొక్కసారి అవి పెద్దవాళ్ళ తప్పుల్నీ‌ బయట పెడతాయి.

రావుగారని సోషల్ స్టడీస్ టీచరు.  ఆయన పూర్తిపేరు నాకు గుర్తు ఉంది.  కాని అది ప్రస్తావించాలని అనుకోవటం లేదు.   ఆయన మాకు తొమ్మిదో తరగతిలో అనుకుంటాను పాఠాలు చెప్పేవారు.  ఆయన  మేప్ డ్రాయింగ్ కోసం పుస్తకం‌ డిజైన్ చేసి, వాటి కాపీలు పిల్లలందరికీ ఇవ్వమని మా క్లాసులీడరు బండ్లమూడి నాగేశ్వరరావుగారికి ఇచ్చారు.  ఒక్కో పుస్తకం ఖరీదు మూడు రూపాయలు.

బండ్లమూడి నాగేశ్వరరావు నాకు మంచి మిత్రుడు. చాలా సౌమ్యంగా మాట్లాడేవాడు.  అందరికీ తలలో నాలుకలా ఉండే వాడు. అతడి తమ్ముడూ మా తమ్ముడూ క్లాస్‌మేట్లు.  తరవాతి కాలంలో ఒక విచిత్రమైన విషయం తెలిసి ఆశ్చర్య పోయాం.  నాగేశ్వరరావు తమ్ముడికి కమ్మఫీలింగ్ అని ఒక భావన ఉండేదట.  అంటే కమ్మవారైన తాము కమ్మవారితో తప్ప  స్నేహంగా ఉండటం అనవసరం అన్న భావన అన్నమాట.  నిజమో అబధ్దమో నాకు తెలియదు.  ఒకటి రెండు సార్లు ఆ అబ్బాయితో నేను మాట్లాడినప్పుడు అలాంటి ధోరణి ఏమీ కనిపించలేదు మరి.  వట్టి అనుమానమే కావచ్చును.  ఐతే, ఇలాంటి కమ్మఫీలింగ్ అనే అమాయకపు భావన ఒకటి నిజంగానే కొందరిలో ఉండేది ఆ రోజుల్లో

మళ్ళీ విషయంలోకి వద్దాం.  నాకూ‌ కన్నబాబుకూ ఒక కోతి అలోచన వచ్చింది.  అంత ఖరీదు ఎందుకు  పెట్టటం?  ఆ పుస్తకం ఏదో మనమే కుట్టుకోవచ్చును కదా అని.  ఊళ్ళోనే గౌరీశంకర్ బైండిగ్ వర్క్స్ అనే చిన్న షాపులో చక్కగా అవే మేప్‌లు దొరికాయి.  అదే రకమూ, రంగూ కల కార్డుబోర్డు అట్ట కూడా ఆ బైండింగ్ షాప్ ఎదురుగా ఉండే నాగా అండ్ కో షాపులో దొరకనే దొరికింది సులువుగా.  ఇంకేం‌ కావాలీ?

 మేమూ, మేప్ డ్రాయింగ్ పుస్తకాలు సిధ్ధం చేసుకున్నాం. సోషల్ మేష్టారికి లెక్కకి మేప్ డ్రాయింగ్ పుస్తకాలు సరిపోయాయి అందరూ‌ తీసుకున్నట్లుగా.  కాని బండ్లమూడి ఇచ్చిన పద్దు ప్రకారం ఇంకా ఇద్దరు కొనాలి.  ఎవరూ ఆ కొనని వాళ్ళూ  అనగానే మా పేర్లు సులువుగానే  బయటికి వచ్చాయి.  అంతవరకూ ఒక ఎత్తు.  ఆ పైన జరిగినది మరొక ఎత్తు!

"ఏమిట్రా ఇది?" అని రావుగారు నిలదీసారు మమ్మల్ని.

"మేమే కుట్టుకున్నా మండి"

"ఒక్కో పుస్తకానికి ముప్పావలా మాత్రమే ఐందండీ"

ఈ  మా జవాబులతో పాపం  మాష్టారికి అవమానం జరిగిపోయింది కదా!
నిజానికి ఇలా చేయటం ఆయనకు తలవంపుల వ్యవహారం అవుతుందన్న ఇంగితం మాకు లేనే లేదు!

విషయం మా నాన్నగారి దృష్టికి తీసుకుని వెళ్ళారు మాష్టారు.
ఎలాగో, ప్రధానోపాధ్యాయులు రమణయ్య పంతులుగారి దృష్టికీ వెళ్ళింది వ్యవహారం.
నన్నూ కన్నబాబునీ పిలిచి మా నాన్నగారి సమక్షంలో పంతులుగారు పంచాయితీ పెట్టారు.
భాస్కరంగార్నీ పిలిపించేవారేమో కాని ఆయన తనకల్లులో ఉన్నారనుకుంటా.

పంచాయితీ అంటే,  మా యిద్దర్నీ పిలిచి, జరిగిన సంగతి అంతా పంతులుగారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తరువాత  "సరే,క్లాసులోకి పోండి" అని పంపేసారు. అంతే.

ఎవరూ  మా యిద్దర్నీ ఏమీ అనలేదు!
రావుగారు కాని పంతులుగారు కాని మమ్మల్ని  మరేమీ అనలేదు.
ఎవరూ మమ్మల్ని శిక్షించలేదు.
కాని మిగతా పిల్లలందరికీ తలొక రెండు రూపాయల పావలా చొప్పునా  రావుగారు బండ్లమూడి ద్వారా సొమ్ము వాపసు ఇచ్చేసారు.  అలా ఇచ్చేయమని పంతులుగారి ఆర్డరని తరువాత చాలా కాలానికి తెలిసింది.

ఈ‌సంఘటనతో, మా నాన్నగారు మాత్రం చాలా అసౌకర్యానికి లోనయ్యారు.  అయన నన్ను బాగా చీవాట్లు వేసారు.  పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ టీచర్లతో పోట్లాటకు దిగకూడదని హెచ్చరించారు.

అనంతరకాలంలో ఆనాటి పంచాయితీ విషయం నాన్నగారు నాతో ప్రస్తావిస్తూ, పంతులుగారు "టీచర్లు పాఠశాలలో వ్యాపారకార్యక్రమాలు చేస్తే ఊరుకునేది లేదని" హెచ్చరించారని చెప్పారు.  రావుగారు నామీద కడుపులో కక్షపెట్టుకుంటారేమో నని నాన్నగారు సందేహించారట.  ఆయన ముందు ముందు కాలంలో నాకు క్లాసు టీచరుగా రావచ్చును కదా మరి.  అదీ కాక నాకూ కన్నబాబుకూ కూడా మిగతా మాష్టర్ల దృష్టిలో చెడు అభిప్రాయం వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం.

అనుకున్నట్లే రావుగారు నాకు పాఠశాల విద్య చివరి రెండేళ్ళూ సోషల్ స్టడీస్ చెప్పారు. ఆయన నిర్లక్ష్యంగా పేపర్లు దిద్దుతారనీ, ట్యూషన్ పిల్లలకి మాత్రమే మంచి మార్కులు వేస్తారనీ విద్యార్థిలోకంలో ఒక అభిప్రాయం గట్టిగా వ్యాప్తిలో ఉండేది.  అందుచేత పిల్లలు ఆయనంటే బాగా భయపడేవారు.

పదకొండవతరగతిలో ఆయనకూ నాకూ మళ్ళీ  ముఖాముఖీ తగాదా వచ్చింది. అదీ ఉత్త పుణ్యానికి!

హాఫ్ ఇయర్లీలో అనుకుంటాను, మహ్మద్ బిన్ తుగ్లక్  పరిపాలనను గురించిన ప్రశ్నకు సవిస్తరంగా జవాబు వ్రాస్తూ, అతను తోలు నాణాలూ ముద్రించి చెలామణీ చేసాడని వ్రాసాను.  అ మాట మా టెక్స్ట్ పుస్తకంలో లేని విషయం.  అందుచేత రావుగారు ఎర్రసిరాతో అండర్‌లైన్ చేసి ఆక్షేపించారు. ఆ ప్రశ్నకు నాకు బొటాబొటీ మార్కులు వేసారు.  నేను ప్రశ్నించే స్వభావం‌ ఉన్నవాడిని కాబట్టి నిలబడి అడిగాను. 

ఆయనకు ఆగ్రహం వచ్చి, నా సమాధానాన్ని చదివి క్లాసులో వినిపించి, "వాడు తోలు నాణాలు వేసాడట్రా, వీడు కనిపెట్టాడు" అని ఎద్దేవా చేసారు. ఈ మాట కొమర్రాజు లక్ష్మణరావు పంతులుగారి మహమ్మదీయ మహాయుగం అనే పుస్తకంలో ఉందనీ, అది చదివి నేను జవాబులో వ్రాసాననీ అంటే ఆయన నన్ను ఛాలెంజ్ చేసారు.   మరునాడు నేను ఇంటి నుండి ఆ పుస్తకం తీసుకు వెళ్ళి ఆయనకు చూపించాను.  అయనేమీ సంతోషించలేదు.  మధ్యలో ఈ‌ లక్ష్మణరావెవడూ? పాఠ్యపుస్తకంలో ఉన్నది మాత్రమే  వ్రాయాలి అని తీర్పు చెప్పారు.

అక్కడితో ఆగక , ఆయన ఆ రోజు నుండి నన్ను "తుగ్లక్" అని పిలవటం మొదలు పెట్టారు!  ఆ నిక్‌నేమ్‌  కొంత పాప్యులర్ అయింది కూడా.  చివరికి కొంతమంది స్నేహితులూ సరదాగా అలా పిలిచేవారు నన్ను!  ఇది నాకు చాలా మనస్తాపం కలిగించింది కాని నేను ఎవరికీ చెప్పలేదు.  నాన్నగారికీ  ఎన్నడూ చెప్పలేదు. ఎలా చెప్పాలో తెలియలేదు.

నా స్కూలు చదువు ముగిసి కాలేజీలో చేరాక, నేను డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉండగా కాబోలు నాన్నగారు ఒకరోజున ఈ విషయం నాకు చెప్పారు.  గురువులతో తగాదాలు పెట్టుకోవటం ప్రమాదకరం అని చెప్పటానికి ఈ విషయం ప్రస్తావించారేమో.  బహుశః కాలేజీలో అధ్యాపకులతో నా సంబంధాలు ఎలాగుంటున్నాయో అని ఆయన ఆందోళన కావచ్చును. ఆ సంభాషణలోనే కన్నబాబుకు కూడా సోషల్‌లో స్కూలు తరపున చిన్నమార్కులే వచ్చిన విషయమూ తెలియ వచ్చింది.

పన్నెండో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా పాఠశాలవారి కోటాలో మా ఇద్దరికీ సోషల్ స్టడీస్‌లో వచ్చిన మార్కులు ఒకట్లస్థానంలోనే ఉన్నాయట.  సహజంగానే ఇది స్క్రూటినీ చేసే ఉపాధ్యాయుల ఉపసంఘం దృష్టికి వచ్చింది.  మా ఇద్దరికే కాదు, మరికొందరికీ ఈ సబ్జెక్టులో తక్కువ మార్కులు పడటంతో మొత్తం వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది.  మాకైతే చాలా అన్యాయంగా పడ్దాయి మార్కులు.  అప్పుడు అందరి పేపర్లనీ క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా తమాషా బయటకు వచ్చిందట.  ఓపిగ్గా అంతా  సరిచేసారట.

మా నాన్నగారు నాకూ ఉపాధ్యాయులకూ‌మధ్యన ఉండే సంబంధాల గురించి అంతగా ఆందోళన పడటానికి మరొక చిన్న కారణం ఉంది. నేను ఎనిమిదిలో ఉండగా ఒక రోజున  ఒక ఆరోపణ వచ్చింది నామీద. ఎవరన్నారో, ఎందుకన్నారో తెలియదు. రమణయ్య పంతులుగారిని నేను దూషించి మాట్లాడానని!  మా నాన్నగారు తీవ్రంగా అందోళన చెందారు.  వదలకుండా అ రాత్రి  ఎనిమిది గంటలకు నన్ను వెంట బెట్టుకొని పట్టీ మేష్టారి వద్దకు వెళ్ళారు.  ఆయన ఒక సెకండరీ‌గ్రేడ్ తెలుగు పంతులుగారు పాఠశాలలో.  ఎప్పుడూ‌పట్టీ వేస్తూ ఉండేవారు.  అందుకే ఆయనకా పేరు.  అయనద్వారా నాన్నగారికి యీ వార్త వచ్చిందట మరి.  ఆయన దగ్గరకు పోయి విచారిస్తే, తనకు మరెవరో ఫలానివారు చెప్పారని నీళ్ళు నమిలారు.  నాన్నగారు వదలకుండా తాడంతా లాగి విచారిస్తే అసలు అంతా గాలివార్త అని తేలింది.  ఇలాంటి వార్తలు పుట్టించే వాళ్ళకు పనిలేదేమో.  ఐతే అప్పటి నుండి నాన్నగారు నా యోగక్షేమాలు వెయ్యి కళ్ళతో కనిపెడుతూనే ఉండేవారు.  ఐనా ఒకటి రెండు తగవులు వచ్చి పడనే పడ్డాయి చూసారా?  అందుకు ఆయనకు కొంచెం ఆందోళన అనుకుంటాను.

ఈ కాసిని విషయాలూ పక్కన పెడితే, నా కొత్తపేట చదువు చాలా మంచి స్నేహాలూ, మంచి జ్ఞాపకాలతోనే ముగిసింది.