7, అక్టోబర్ 2013, సోమవారం

శ్రీలలితా సహస్రనామస్తోత్రంలో ఉన్న అమ్మవారి సౌందర్య వర్ణన - 2


62. కామాక్షి
కాంచీపురాధీశ్వరి యొక్క అపూర్వమైన నామము. సాధారణమైన అర్థంలో అమ్మ ఇంపైన కన్నులు కలది అని. సర్వజ్ఞ ఐన దేవి సాక్షిమాత్రురాలిగా ఉంటూ అందరు భక్తులకు వారివారి అభీష్టాలను ప్రసాదిస్తున్నది కాబట్టి, బ్రహ్మగారు అమ్మకు కామాక్షి, కామేశ్వరి అని పేర్లు పెట్టి సంబోధించారని బ్రహ్మాండపురాణం.  విశేషంగా, త్రిమూర్తులను వారివారి కార్యములందు నియోగించు దృష్టి విశేషం కలది, జగత్తు సృష్టియే కామనగా కలది, మన్మథుడే తనకు నేత్రాలుగా ఉన్నది అనే అర్థాలూ కపిస్తున్నాయి.

129. శరచ్చంద్రనిభాననా
శరత్కాలంలో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. శరత్కాలపు చంద్రుడు కూడా అత్యంత స్పష్టమైన బింబంగా గోచరిస్తాడు. అమ్మ ముఖం అలా శరదృతువులోని చంద్రబింబంలా ప్రకాశిస్తోంది.

130. శాతోదరీ
అమ్మ సన్నని నడుము కలది. శాతోదరం అంటే అనేక గుహలు కల హిమవత్పర్వతం అనీ అర్థం ఉండబట్టి శాతోదరుని కూతురి అమ్మ శాతోదరి.

185. నీలచికురా
అమ్మ నల్లని జుట్టు కలది. నల్లని జుట్టు నిత్య యౌవన సంకేతం, సాముద్రికమైన సౌందర్యలక్షణం.

212. మహారూపా
అమ్మ అత్యధ్భుతమైన రూప సంపద కలది అని అర్థం. అమ్మకు మహత్తే రూపంగా ఉందని కూడా అర్థంతో విరాట్ స్వరూపిణీ అమ్మ అని.

241. చారురూపా
అమ్మది అత్యంత సుందరమైన రూపలావణ్యం అని అర్థం.

242. చారుహాసా
అమ్మ చాలా అందమైన చిరునవ్వు కటాక్షం కలది అని అర్థం. దుఃఖం‌యొక్క స్పర్శయే లేని పరమానందం కారణంగా అమ్మది అత్యంత ప్రసన్నమైన చిరునవ్వు అని అర్థం.

243. చారుచంద్రకళాధరా
అమ్మ అందమైన చంద్రకళను ఆభరణంగా ధరించినది. అమ్మ సిగలోని చంద్రకళకు వృధ్ధిక్షయములు లేవు.  అమ్మ ధరించిన చంద్రకళ వృధ్ధిక్షయాలున్న పదునారు కళలలో ఒకటి కాక సాదాఖ్య అనే నిత్యక.  మరొక పక్షంలో అష్టమీచంద్రుడని - ఎందుకంటే ఉభయ పక్షాలలోనూ అష్టమినాటి చంద్రకళ ఒక్క లాగే ఉంటుంది కాబట్టి.  అమ్మ అటువంటి అందమైన చంద్రకళను అలంకరించుకున్నదని అర్థం.

247. పద్మనయనా
అమ్మ నేత్రాలు పద్మముల వంటివి.  పద్మాలు తెల్లని, ఎర్రని రంగుల్లో ఉంటాయి. అమ్మకు సూర్యచంద్రులు నేత్రాలు కాబట్టి రక్త, శ్వేత వర్ణాల పద్మాలతో అమ్మ కళ్ళు ఉన్నాయని చెప్పటం.

248. పద్మరాగసమప్రభా
పద్మరాగములంటే సింహళజన్య మాణిక్యాలు. అమ్మ శరీరఛాయ పద్మరాగణులతో సమానమైన ఎఱ్ఱదనం కలిగి ఉంది.

308. రాజీవలోచనా
రాజీవం అంటే పద్మం, హరిణం, మీనం అని అర్థాలున్నాయి. అమ్మకన్నులు అటువంటివి అని అర్థం.

312. రణత్కింకిణిమేఖలా
అమ్మ ధరించిన మొలనూలు చిరుగంటలు కలిగి ఉండి అవి తల్లి కదలి నప్పుడు ఇంపైన శబ్దంతో మ్రోగుతున్నాయని అర్థం.

314. రాకేందువదనా
అమ్మ ముఖం పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరమైన అనుగ్రహ కాంతి ప్రసారం కలది అని అర్థం.

324. కళ్యాణీ
అమ్మ యొక్క స్వరూపం అత్యంత మంగళప్రదమైనదని అర్థం.

326. కరుణారససాగరా
అమ్మ దయాసముద్రురాలుగా దర్శనం ఇస్తున్నదని అర్థం.

332. వామనయనా
అమ్మ ఆందమైన నేత్రములు కలది. అకర్మ వలన కలిగే ఫలితానికి వామా అని సంజ్ఞగా సంయద్వామా అనే చోట ఛాందోగ్య వివరణ. అటువంటి స్థితిని భక్తులచే పొందించునదిగా అమ్మను తెలియజేసే నామం ఇది.

351. వామకేశీ
అమ్మ సుందరమైన కేశసంపద కలది అని అర్థం. వామకులంటే జనులు. వారికి ఈశుడు శివుడు. ఆయన పత్ని వామకేశీదేవి. జట అనే‌శివతీర్థంలోని స్వామి వామకేశ్వరుడు - తల్లి ఆయన పత్ని అని.

358. తరుణీ 
అమ్మ నిత్య తారుణ్యం (యోవన ప్రాయపు వయస్సు) కలది.

360. తనుమధ్యా
కృశించిన నడుము కలది.

392. శ్రీకంఠార్థశరీరిణీ
శ్రీ అంటే విషం. అది కంఠంలో ఉన్నవాడు శివుడు శ్రీకంఠుడు.  అమ్మ ఆయన అర్థశరీరం పంచుకున్నది.

430. నిత్యయౌవనా
అమ్మ యోవనవికాశం నిత్యం.

432. మదఘూర్ణిత రక్తాక్షీ
మదముచే చలించుచున్న ఎఱ్ఱని కళ్ళు కలది అమ్మ అని సాధారణార్థం. లోకసంబంధమైన విషయాల పట్ల విముఖత కలిగి సంతోషంతో నిండిన హాసలక్షణం కల కళ్ళు అమ్మవి అని విశేషార్థం.

433. మదపాటలగండభూః
మదం అంటే కస్తూరి. పాటలం ఒక పుష్పజాతి. వీటి చేత అమ్మ  చెక్కిళ్ళు చిత్రించబడ్డవి. అలాగే ఆనందాతిరేకంతో కూడిన చెక్కిళ్ళ శోభకలది అమ్మ అని కూడా అర్థం.

434. చందనద్రవదిగ్ధాంగీ
అమ్మ శరీరాని మంచి గంధపు ద్రవం పూసుకొన్నది అని అర్థం.

436. కుశలా
విశ్వకోశం ప్రకారం శలం అంటే చంద్రుడు. కుశలా అంటే నీచమైన చంద్రుడు కలది.  అంటే, చంద్రుడి యొక్క ప్రకాశాన్ని తన దేహ కాంతి శోభ చేత తిరస్కరించి అమ్మ  వైభవం ఉండటం చేత అమ్మ కుశలా అని చెప్పబడుతోంది.

437. కోమలాకారా
అమ్మ సుకుమారమైన అంగవిన్యాసం కలది అని అర్థం. దేవమానవయోనిసంజాతులనే కాక, విశ్వమందలి సమస్తమైన జీవరాసులకు ఆహ్లాదం కలిగించి సమ్మోహింప చేసే మనోహరమైన ప్రభావిలాస పూర్ణమైన ఆకారం కలది అమ్మ అని అర్థం.  ఇది కుశలా నామానికి విస్తరణగా చెప్పవచ్చును.

453. త్రినయనా
చంద్రుడు, సూర్యుడు, అగ్ని అనే రూపములు కల మూడు నేత్రములతో అమ్మ శోభిస్తున్నది అని అర్థం.  సన్మార్గులకు దక్షిణ, ఉత్తర, బ్రహ్మ మార్గములను అనుగ్రహించునది అమ్మ అని విశేషార్థం.  నయనం అంటే జ్ఞానం అనే అర్థం కారణంగా అమ్మ భూత, వర్తమాన, భవిష్యత్తుల యొక్క సంపూర్ణజ్ఞాన స్వరూపం అని కూడా తెలుస్తున్నది. అనగా అమ్మ, అఖండజ్ఞానస్వరూపిణి.

455. మాలినీ
ఏడేళ్ళప్రాయం‌కల కన్యకు మాలినీ అని సంకేతం. అమ్మకు అటువంటి బాలికారూపం ఉన్నదని అర్థం.

459. సుముఖీ
శోభనమైన ముఖం కలది అమ్మ అని అర్థం. జ్ఞాన స్వరూప అవటం వలన అమ్మ ముఖం మిక్కిలి ప్రకాశవంతమైనదని అర్థం.

460. నళినీ
కర, చరణ, ముఖ,  నేత్రాదులన్నీ  కమల రూపాలు అవటం వలన సృష్టిన్యాయంచేత అమ్మకు నళినీ అని వ్యవహారం.

461. సుభ్రూః
అమ్మ  కనుబొమలు మంగళకరమైనవి పరమ శోభావిలాసం కలవి అని అర్థం.

462. శోభనా
అమ్మ నిరతిశయ సౌందర్యరాశి కావున శోభన అని అర్థం.

470. వయోఽవస్థావివర్జితా
అమ్మ సనాతని అవటం వలన బాల్యం,పౌగండం, కిశోరప్రాయం, యౌవనం వంటి వయఃపరిపాకం వలన కలిగే అవస్థావిశేషాలు లేనిది.

476. ఆరక్తవర్ణా
అమ్మ అంతటను రక్తవర్ణం (స్వల్పంగా తెలుపు కలిసిన యెరుపు రంగు) కలిగిన పాటలీపుష్ప సమానమైన దేహకాంతి కలది అని అర్థం.

477. త్రిలోచనా
అమ్మకు మూడు నేత్రములు ఉన్నాయని అర్థం. సూర్యచంద్రాగ్నులు, ఋగ్యజుస్సామవేదములు, త్రికాలములు తల్లి నేత్రములు.

547. బంధురాలకా
అమ్మ దట్టమైన కేశకలాపము కలది. అది ఉన్నతమైన అలలు అలలుగా ఉండి శోభించుచున్నది.

559. తాంబూలపూరితముఖీ
అమ్మ నాగవల్లీ దళక్రముక కర్పూరాది యుక్త తాంబూలపూరితమైన ముఖం కలది అని అర్థం.

560. దాడిమీకుసుమప్రభా
దాడిమీ పుష్పము వలె రక్తవర్ణమైన శరీరకాంతి కలది అమ్మ అని అర్థం.

561. మృగాక్షీ
లేడి కన్నులకు వైశాల్యం, చాంచల్యం, జాగరూకత, సౌందర్యం అనే లక్షణాలు ఉంటాయి. అమ్మ కన్నులు అలా లేడి కన్నుల వలె అందమైనవి, అటువంతి లక్షణాలు కలవి అని అర్థం.

579. మృణాలమృదుదోర్లతా
మృణాళం అంటే తామరతూడు. అది ఎంతో మృదువుగా ఉంటుంది.  అమ్మ భుజాలు అలా తామరతూడుల వలె మృదువుగా ఉంటాయని అర్థం.

601. దరాందోళితదీర్ఘాక్షీ
కొంచెం చంచలంగా ఉన్న దీర్ఘమైన కళ్ళు కలది అమ్మ. విశేషార్థంగా నిజ కటాక్షంచేత భయాన్ని నశింపచేసే దీర్ఘమైన సుందర నయనాలు కలది అమ్మ అని.

602. దరహాసోజ్జ్వలన్ముఖీ
అమ్మ అందమైన చిరునవ్వుతో పరమశోభాయమానమైన ముఖమండలం కలది అని అర్థం.

614. సచామరరమావాణీ సవ్యదక్షిణసేవితా
అనాది కాలంగా లక్ష్మీసరస్వతులు అమ్మవారికి ఇరువైపులా నిలబడి వింజామరలతో సేవిస్తున్నారని అర్థం.

619. పావనాకృతిః
పరమపవిత్రమైన శరీరాకృతి, చరిత్ర, జ్ఞానసంపన్నత కలది అమ్మ అని అర్థం.

621. దివ్యవిగ్రహా

పరమరమణీయమైన దేహసౌష్టవసౌందర్యాదులు కలది అమ్మ అని అర్థం. ఆకాశంలో నిరాధారగా నిలిచి శత్రువులతో‌ అమ్మ పోరాడినదని మార్కండేయపురాణవచనం, ఆ విధంగా దివ్య (ఆకాశ) సంబంధమైన విగ్రహం(‌యుధ్ధం) చేసినది అని విశేషార్థం.

631. దివ్యగంధాఢ్యా
చేతనాచేతనాత్మకమైన పదార్థసమూహ గంధం వలన అమ్మ దివ్యగంధం కలది అని అర్థం. అలాగే, గంధద్వారాం దురాధర్షాం అని శ్రుతి కాబట్టి హరిచందనాది దివ్యపరీమళంతో కూడినది అమ్మ అని.

632. సిందూరతిలకాంచితా
సిందూరం అంటె రక్తచూర్ణం లేదా గోరోజనం -అమ్మ అటు వంటి సిందూరం తిలకంగా ధరించినది అని అర్థం. తిలకం అంటే అలకలు (ముంగురులు) అని కూడా అర్థం కాబట్టి, ముంగురులలో సిందూరం ధరించినదని అర్థం కూడా. సిందూరతిలక అంటే ఆడయేనుగు అనే అర్థం కారణంగా, అమ్మ ఆడయేనుగు వలె మంద గమనం కలది అన్న అర్థం కూడా కలుగుతోంది.

636. గంధర్వ సేవితా
గంధర్వులు దేవగాయక జాతి వారు. వారు అమ్మ తమ సంగీత కళతో సేవిస్తున్నారని అర్థం.

694. సాగరమేఖలా
అమ్మ విరాడ్రూపంలో సముద్రాలే ఆమెకు మొలనూలుగా అమరి ఉన్నాయని అర్థం.

741. రంభాదివందితా
రంభాది అప్సరసలు మహా లావణ్యమూర్తులు. వారంతా అమ్మవారిని నమస్కారాలతో  సేవిస్తున్నారని అర్థం. అమ్మ  సౌందర్యాతిశయం సూచించబడుతోంది అలాగు. అమ్మ దేవతల నృత్యాది సేవలను అందుకుంటోందని అర్థం.

766. జపాపుష్పనిభాకృతిః
జపా (దాసాని) పుష్పంతో సాటివచ్చే ఆకృతి కలది అమ్మ అని అర్థం.

768. ద్యుతిధరా
అమ్మ కాంతిని ధరించునది అని అర్థం. సర్వపదార్థసంచయానికీ అమ్మ అనుగ్రహమే పోషణ అని విశేషార్థం.

809. పాశహస్తా
వామభాగాన క్రింది హస్తంతో అమ్మ పాశం ధరించినది అని అర్థం.

847. తలోదరీ
కరతలం వలె కృశించిన ఉదరం‌ కలది అమ్మ.

861. కాంతార్ధవిగ్రహా
కాంతుడైన పరమశివుడు తనకు అర్థవిగ్రహంగా కలది అమ్మ.

864. కనత్కనకతాటంకా
దేదీప్యమానమైన స్వర్ణకర్ణాభరణములు కలది అమ్మ.

867. ముగ్ధా
సర్వావయవ సౌందర్యం కలది అమ్మ. నిత్యం పదునారేండ్ల ప్రాయం కలది అమ్మ.

893. విష్ణురూపిణీ
విష్ణువుతో అభిన్నమైన రూపసౌందర్యం కలది అమ్మ. విశేషార్థం విష్ణువే ఆమె పురుషరూపంగా కలది.

922. తరుణాదిత్యపాటలా
మధ్యాహ్నకాలంలోని సూర్యమండలం వలె శ్వేతరక్తవర్ణం కలది అమ్మ అని అర్థం.

924. దరస్మేరముఖాంబుజా
చిరునవ్వుతో‌కూడిన శోభాయమానమైన ముఖపద్మం కలది అమ్మ అని అర్థం. కల్పాంతంలో కూడా అమ్మ ముఖం ఇలాగే ఉంటుందని విశేషార్థం.

933. మంగళాకృతిః
అమ్మ పరమమంగళప్రదామైన రూపసంపదకలది అని అర్థం.

936. విశాలాక్షీ
విశాలమైన అనవఛ్ఛిన్నమైన జ్ఞాననేత్రములు కలది, వారాణసీ‌పీఠాభిమాన దేవత అమ్మ.

964. బంధూకకుసుమప్రఖ్యా
బంధూకం అంటే మంకెనపువ్వు.  అటువంటి రక్తవర్ణపు కాంతికల శరీరం కలది అమ్మ అని అర్థం.

969. సువేషాఢ్యా
అతిప్రశస్తమైన శుభప్రదమైన వస్త్రాలంకార మాల్యాదులు ఆభరణాలు ధరించినది అమ్మ అని అర్థం.

972. ఆశోభనా
అనంత సౌందర్యవతి, నిత్యయౌవన అమ్మ అని అర్థం.