3, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఈ దేశం ఎటు పోతోంది?

దురదృష్టవశాత్తు మన ప్రియతమ భారత దేశంలోని వ్యవస్థలు అన్నీ మున్నెన్నడూ‌ లేనంతగా పతనం అంచున దిగులుగా కూర్చున్నట్లు అనిపిస్తోంది.

ఈ దేశంలోని వ్యవస్థలు రాజకీయవ్యవస్థ అనండీ ఆర్థికవ్యవస్థ అనండీ, రక్షణవ్యవస్థ అనండీ, నైతికవ్యవస్థ అనండీ పారిశ్రామికవ్యవస్థ అనండీ అన్నీ కళాకాంతీ కోల్పోయి దయనీయమైన స్థితిలో ఉండటం మనస్సుని కలచి వేస్తుంది.

ఒకప్పుడు మనదేశాన్ని రెండువందల యేళ్ళు ఏలిన తెల్లదొరలు అరవైఏడేళ్ళ క్రిందట చక్కాపోయారు.  వారి పోకడకు మన అహింసాయుత స్వాతంత్ర్యపోరాటం కారణమా లేక రెండవ ప్రపంచయుధ్ధంలో బ్రిటన్ చావు దెబ్బతిని చేతులెత్తేయటమా అన్నది ఇప్పటికీ ఒక చర్చనీయాంశమే.  ఐతే,  ఆభిజాత్యంకల మన భారత జాతీయులం గాంధీగారే పోరాడి స్వాతంత్ర్యం సాధించుకుని వచ్చారని చదువుకుంటాం, బాలల చేత చదివిస్తాం అన్నది నిజం. అప్పట్లో బ్రిటన్ ప్రధానిగా ఉన్న చర్చిల్ మహాశయుడు భారత దేశవాసులకు తమను తాము పరిపాలించుకుందుకు తగిన సమర్థత లేదని వాదించటం ముమ్మాటికీ‌ భారతీయుల్ని అవమానించే ఉద్దేశంతో అన్న మాటలే అన్నది నిర్వివాదాంశం.

కాని ఇన్నేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏం చేస్తున్నాం?  మనని మనం సమర్థంగా పాలించుకోలేమూ, దేశవ్యవస్థల్ని చక్కగా నిర్వహించుకోలేమూ అని ప్రపంచానికి ముక్తకంఠంతో చెబుతున్నట్లుగా ప్రవర్తిస్తున్నాం అని అనుమానం వస్తోంది నాకు.

స్వాతంత్ర్యం సాధించుకున్న కొత్తలో మహాత్మాగాంధీగారు కాంగ్రెసు సంస్థను రాజకీయ పార్టీగా మలచటాన్ని వ్యతిరేకించారని వింటూ ఉంటాం. మరి మన నాయకులకు అప్పటికీ ఇప్పటికీ ఆయన మార్గదర్శకుడూ స్ఫూర్తిప్రదాతా ఐనప్పుడు కాంగ్రెసు సంస్థకు అతిపెద్ద దిక్కు ఆయన ఆయన మాట ఎందుకు చెల్లలేదూ? కాంగ్రెసు సంస్థ కాస్తా, ఒక పెద్ద రాజకీయ పార్టీగా ఎందుకు తయారయిందీ? గాంధీగారి పేరు చెప్పుకునీ, నెహ్రూగారి పరపతి చూపించీ, జాతీయపతాకానికి అతిదగ్గర నమూనాగా పార్టీజండా పెట్టి జనాన్ని ఎందుకు భ్రమపెట్టిందీ కాంగ్రసుపార్టీ?  ఓట్ల కోసం విలువల్ని కొద్దో గొప్పో దిగజార్చటం కాదా? ఒకసారి దిగజారటం మొదలు పెట్టాక దానికి అంతం అంటూ ఉంటుందా?

కాంగ్రెసు పార్టీ తరపున భారత ప్రధానిగ పధ్ధెనిమిదేళ్ళు పాలించిన నెహ్రూగారు ఒకప్పుడు తన సోదరి కృష్ణహతీ సింగ్‌కు కూడా రాజకీయపదవి ఇవ్వాలని యోచించి అందరూ వ్యతిరేకిస్తే వ్యక్తిగతప్రతిష్ట తగ్గుతుందని భావించి ఊరుకున్నారని కథనాలు చదివాను. ఆయన కుమార్తె కావటం మినహా ఇందిరకు ప్రధాని కావటానికి అర్హతలు ఏ అర్హతలు ఉన్నాయో అవి ఎక్కడినుండి ఎలా వచ్చాయో చెప్పండి? కాలం గడచిన కొద్దీ‌ ఇందిర ఒక నియంత అని తేలింది. ఇక ఆవిడ తరువాత ఆవిడ కుటుంబం రాజ్యం చేస్తోంది. రాజీవ్ గాంధీ పైలట్ ఉద్యోగానికి రాజీనామా చేయగానే ఏఐసిసి ప్రధానకార్యదర్శి ఐపోయాడు. ఆ పదవికి ఇంక సీనియర్లు ఎవరూ లేరన్న మాట. ఉన్నా పనికిరారన్న మాట.  ప్రజాస్వామ్యంలో కుటుంబపాలనకు పరోక్షంగా నెహ్రూగారూ, ప్రత్యక్షంగా ఇందిరమ్మా కారణం. ఇదేం ప్రజాస్వామ్యం?

నెహ్రూ తరువాత ఏణ్ణర్థం పాటు లాల్ బహదూర్ శాస్త్రిగారు ప్రధానిగా ఉన్నారు, ఆయన తాష్కెంట్‌లో హఠాన్మరణం చెందేదాకా.  ఆయన మరణం ఒక మిష్టరీ అని నమ్మేవాళ్ళకి కొరతలేదు. నిజానికి శ్రీమతి లలితాశాస్త్రి మాటల్తో పత్రికలలో వచ్చిన కథనాల ప్రకారం, ఆ అనుమానాలకు ఆథారాలు ఉండవచ్చును. శాస్త్రిగారు మచ్చలేని నిజాయితీ ఉన్న వ్యక్తి. అప్పట్లో ఆయన జీవిత చరిత్ర పాఠ్యాంశంగా ఉండేది. శ్రీమతి ఇందిర శాస్త్రిపట్ల చులకన భావం కలిగి ఉండేవారని ఒక అభిప్రాయం ఉంది.  ఆవిడ శాస్త్రిగారికి ఎందుకంత గౌరవం ఇస్తారూ ఆయనేమంత గొప్పవాడూ అని విసుక్కున్న సందర్భం ఒకటి పత్రికలలో చదివాను.

కాంగ్రెసు తరపునే శాస్త్రిగారు ప్రధానిగా చేసారు.  అంతకుముందు కాలంలో ఆయన రైల్వేమంత్రి గానూ చేసారు.బీహార్లో కాబోలు ఒకరైలు ప్రమాదం జరిగినప్పుడు నైతికబాధ్యత వహించి ఆయన రైల్వేమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసారు.

ఈ రోజున ఆర్థికశాస్త్రవేత్తగా పేరుబడ్డ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. ఆయన హయాంలో తొమ్మిదేళ్ళు గడిచాయి. అనేక ఆర్థిక కుంభకోణాలు దేశప్రజలను నివ్వెరపోయేలా చేసాయి కూడా. ఆయన వాటికి ఏమాత్రం‌ బాధ్యతతోనూ స్పందిచిన దాఖలాలు లేవు వేటికీ. బొగ్గుగనుల కుంభకోణం అనే అతిపెద్ద వ్యవహారంలో ఆయన ఆధీనంలో ఉన్న ఆ శాఖకు సంబంధించిన ఫైళ్ళు కాలి బూడిదైపోయాయట - లేదా ఏమై పోయాయో కనబడటం లేదు. మన ఘనత వహించిన ప్రధానిగారి తాజా వ్యాఖ్య చూడండి, నాకేమీ బాధ్యత లేదని అట. ఇదా ప్రధాని కుర్చీలో ఉన్న వ్యక్తి నుంచి ఆశించే బాధ్యతాయుత మైన పదవీ‌ నిర్వహణ?

రక్షణవ్యవస్థలో లోపాల గురించి బహుదీర్ఘకాలంగా ఆరోపణ లున్నాయి. బోఫార్స్ కుంభకోణాన్ని పట్టుకున్నదీ, వెలుగులోకి తెచ్చిందీ స్వీడిష్ రేడియోవాళ్ళు. దాన్ని మన వ్యవస్థ ఎంతా బాగా పరిశోధించిందో మనకందరికీ తెలుసు. నిజాల్ని వేయి నిలువుల గోతిలో పాతారు.

నైతికవ్యవస్థ గురించి ఏం చెప్పి ఏం లాభం?  ఈ రోజున చట్టసభల్లో నేరారోపణలూ, కేసులూ ఉన్నవాళ్ళు చాలా పెద్ద శాతంలో ఉన్నారన్నది పచ్చినిజం. శిక్షలు పడ్డ వాళ్ళూ అప్పీళ్ళు చేసుకుని వాటి విచారణ అతీగతీ లేకుండా చూసుకుంటూ, కేంద్రంలో మంత్రి పదవులు సైతం వెలిగిస్తున్నారు. ఈ వ్యవహారాలకు ఇటివలి సుప్రీంకోర్టు తీర్పు చరమగీతం పాడితే, దొరలంతా నిస్సిగ్గుగా తగినట్లుగా చట్టసవరణకు సిధ్దం అవుతున్నారు. అలాగే సమాచార చట్టం క్రిందికి వస్తాం అని తేలగానే అన్ని రాజకీయ పార్టీలూ అధికార ప్రతిపక్ష పార్టీలన్న తేడా లేకుండా, సమాచార చట్టాన్ని సవరించి బయట పడటానికి సిధ్దంగా ఉన్నారు. చిన్నా చితకా ఎన్నికలలో కూడా కోట్లు ఖర్చు పెట్టే పెద్దమనుషులు ప్రజలకోసం పనిచేస్తారని ఎవరైనా నమ్ముతారా? చట్ట ప్రకారం ఎవరైనా పోటీ చేయచ్చును ఎన్నికల్లో కాని, కోట్లు ఖర్చు పెట్టలేని వాళ్ళు సోదిలోకి కూడా మిగలని తంతులో సామాన్యుడికి చట్టసభకు పోటీ చేసే అవకాశం ఉందా?  వెనుకటి కాలంలో పాఠ్యాంశాల్లో నైతిక ప్రవర్తన గురించిన బోధనకూ స్థానం ఉండేది. ఈ‌ రోజుల్లో రాముడి గురించో కృష్ణుడి గురించో పాఠం ఉంటుందా బడి పుస్తకాల్లో, ఉంటే ఎన్నెన్ని గొడవలౌతాయో!

పారిశ్రామికరంగంలో సంస్కరణల పేర తలుపులు బార్లా తెరిచేస్తున్నాం.  దేశీయ పారిశ్రామిక వేత్తల్లో పెద్ద చేపలకే విదేశాల నుండి పోటీ వచ్చే రోజులు.  చిన్నచిన్న దేశవాళీ పారిశ్రామిక వేత్తల పరిస్థితి అయోమయమే. దేశంలోని కొన్ని పారిశ్రామిక పవర్‌హౌస్‌లు ఎదిగిన క్రమం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నిజాయితీగా ఆలోచించే వాడికి.  అంబానీగారు అక్షరాలా పదివేల రూపాయల అప్పు తీసుకున్నారు స్టేట్‌బ్యాంక్ నుంచి. అచిర కాలం లోనే ఆయన వందలకోట్లకూ, చూస్తుండగానే లక్షల కోట్లకూ పడగలెత్తిన సంస్థలకు అధిపతి అయ్యాడంటే నా దృష్టిలో అది కేవలం మహామాయాజాలమే. నాకు తెలిసిన ఒక వ్యక్తి సైకిల్ మీద చీరలు అవీ‌ తెచ్చి అమ్మే వాడు.  ఉన్నట్లుండి పెద్ద బట్టల షాపు తెరిచాడు. అచిరకాలంలో అది పెద్ద చెయిన్ షాపు అయింది. ఇదంతా చాల కొద్ది కాలంలో‌ ఎలా సాధ్యమైనదో తెలియదు.  ఎక్కడా అవినీతి జరగటం లేదూ అనుకోవటం కళ్ళు మూసుకోవటమే.

న్యాయవ్యవస్థ మీదా ఇందిర కాలంలోనే‌ దాడి మొదలయింది. సీనియారిటీని కాదని ఆవిడ, తనకు అనుకూలంగాఉండే వ్యక్తికి భారతప్రధానన్యాయమూర్తి పదవి కట్టబెట్టారన్నది చాల మంది దృష్టిలో పచ్చి నిజం.

విద్యావ్యవస్థను రాజకీయాలకు ఉపయోగించుకోవటం గాంధీగారి కాలంలోనే మొదలైందీ అనుకోవచ్చు నేమో. ఈ రోజున ప్రతి చిన్న పెద్ద రాజకీయమైన అలజడులకీ విద్యార్థులను రాజకీయులు ముందుకు తోస్తున్నారు. ఎలిమెంటరీ స్కూలు పిల్లల్నీ వదలరు. ఆచార్యులూ, అధ్యాపకులూ కూడా స్వయంగా రాజకీయ పార్టీలతోనూ రాజకీయ ఉద్యమాలతోనూ మమేకం అవుతారు. ఎవరికీ సర్వీస్ రూల్స్ అనేవి వర్తించవని అనుకోవాలి.

వైద్యవ్యవస్థ అనేది ఎంత అవ్యవస్థితంగా ఉందంటే ప్రభుత్వవైద్యశాలలు నాశనం ఐపోయాయి. అందరికీ కార్పొరేట్ వైద్యమూ దాని దోపిడీ తప్ప దిక్కులేదు. ప్రభుత్వ పథకాలు ప్రజల వైద్యం కోసం వచ్చినా వాటి ప్రయోజనం మాత్రం ఎక్కువగా కార్పొరేట్ రంగానికే. కాకపోతే అలాంటి పధకాలు ప్రభుత్వాలూ ప్రకటించవని అందరికీ అనుమానమే!

ఫోర్త్ ఎస్టేట్ అని ప్రశంసించబడే పత్రికా రంగం ఎంతఘోరంగా ఉందో చర్చించటం కూడా అనవసరం. దాదాపు అన్ని పత్రికలూ కేవలం పార్టీ కరపత్రాల స్థాయిలో నడుస్తూ ప్రజల విశ్వాసం దాదాపు కోల్పోయాయి. ఈ‌ మాట ఎలక్ట్రానిక్ మీడియాకూ వర్తిస్తుంది నిర్మొగమాటంగా.

1948లో ప్రచురించబడిన భారతి రజతోత్సవ సంచికలోనే అవినీతికి సంబంధించిన  కథలూ గట్రా ఉన్నాయి. ఈ రోజున ఎటు చూసినా అవినీతి అరాజకత్వం తప్ప ఏమీ కనిపించటం లేదు. చాలా  కాలం  క్రిందటే ఆ  పుస్తకాన్ని నా దగ్గ రనుండి ఎవరో తస్కరించారనుకోండి, అది వేరే విషయం.

ఇక్కడ ఈ‌ టపాలో మనం చేసింది కేవలం కొన్ని కొన్ని రంగాల మీద ఉపరిస్పర్శ మాత్రమే. వివరంగా అన్ని రంగాల గురించీ, అన్ని విషయాల గురించీ చర్చిస్తూ పోతుంటే ఎంత పెద్ద గ్రంథం ఐనా ఆశ్చర్యం లేదు.

ఇలా అన్ని రంగాల్లోనూ దేశవ్యవస్థలు భ్రష్టుపట్టి పోతుంటే మనం అంతా ఏం చేస్తున్నాం?  అసలు మనం ఏం చెయ్యగలం?  ఈ దేశం అసలు ఎటు పోతోంది? ఇవి ఆలోచించ వలసిన విషయాలు.