20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కైకమ్మవరాలు



శ్రీరామచంద్రుని సింహాసనమున
సుప్రతిష్ఠితు జేయు సుముహూర్త మెల్లి
యనుమాట చెప్పుట నానందపడుచు
దశరథభూజాని తన చిన్న భార్య
కైకమ్మ యింటికి గబగబ వచ్చె 
సంతోషపూర్ణుడై యంతఃపురమున
కాలు పెట్టిన రాజు కళవళ పడగ
నిశ్శబ్ద మెల్లడ నెలకొని యుండె
కైకమ్మ యున్నది శోకగృహమున
తల్లడిల్లిన రాజు తన్వితో పలికె
తనువున స్వాస్థ్యంబు తప్పలేదు గద
ఘనవైద్యులున్నారు కష్టంబు వలదు
అనవుడు కైకేయి యాగ్రహ మొల్క
రాజేంద్ర నాకేమి రాయిలా గుంటి
నని బల్కి పెడమోము గొని యుండె నంత
నిర్ఘాంతపడి రాజు నెలతను గాంచి
పొరబాటు జరిగెనా పొలతి నావలన
దిద్దుకొందును తప్పు తెలుపుమా కైక
నా కున్న సర్వంబు నీకిచ్చి నాను
కోపకారణ మేమి కోమలి నీకు
నీ విట్టు లున్నచో నే జూడ లేను
ఏది కోరిక చెప్పు మింతిరో నీవు
అని బల్క కైకమ్మ  యడిగెద కాని
ఇత్తురో  యీయరో యేమి నమ్మకము
యని విన్నవించగ నా భూమిపతియు
నవ్వుచు తప్పక నా మాట మీద
నమ్మక ముంచుము నాతిరో నీవు
కోరవే వరములు కొంచక యిత్తు
ఆడి తప్పని వార మని బల్కినంత
అటు గాదు భూనాధ యడిగిన విత్తు
అని ఆన బెట్టక అడుగరా దనగ
రామునిపై యాన రమణి నీ కోర్కె
చెల్లింతు నది యేమొ చెప్పు వేగిరమె
అన విని కైకమ్మ యవనీశ నాడు
తిమిరధ్వజునితోడ సమరమ్ము నీవు
చేయు నప్పుడు నాదు సాయమ్ము మెచ్చి
ఇచ్చిన వరములు పుచ్చుకొనుటకు
బుధ్ధిపుట్టెను నేడు పొలుపుగా నాకు
దయచేయు డవి చాలు ధర్మప్రతిజ్ఞ
అన విని ధరణీశు డడుగుమా యనిన
ఇత్తునంటివి దీనె కెందరో సాక్షి
ఇలవేల్పు లందరు నిందుకు సాక్షి
దేవత లెల్లరు దీనికి సాక్షి
సూర్యచంద్రులు సాక్షి  క్షోణియే సాక్షి
ఈ‌రాజు వరముల నిత్తు నన్నాడు
ఈయక తప్పుచో నిక పైన నేను
విషమును సేవించి విడుతు ప్రాణముల
అన్నంత దశరధు డంత మాటేల
అడుగుమా వరముల నతివ నీ వనగ
రాజేంద్ర వినవయ్య రాముని బదులు
పట్టంబు గట్టుము భరతున కుర్వి
నవపంచవర్షముల్ కువలయనాధ
పంపుము రాముని వనవాసమునకు
ఈ రెండు వరముల నీయగా వలయు
నీవు సత్యము నందు నిలువగా వలయు
అశనిపాతము లివి యనగ కైకేయి
మాటలు వినవచ్చి మతిపోయి రాజు
బిట్టార్చి యిల వ్రాలి యట్టె మూర్ఛిల్లి
కొంత తడవుకు లేచి కుమతి యిదియేమి
ధర్మవిరుధ్ధంబు తలపోసి నావు
రామునిపై నెంత ప్రేమ చూపెదవు
నేడు వనముల కంప వేడు చున్నావు
రాముడు లేక నా ప్రాణంబు లున్నె
రాముని హింసింప నేమి కారణము
రాముడు లేకున్న రాజ్యమే లేదు
నీ కెవ్వ రీబుధ్ది నేర్పించినారు
తల్లివి తనయుని దండింప రాదు
కోపమ్ము విడువుము కోరు మన్యముల
ధర్మమార్గంబును తప్పకు మన్న
ఏమయ్య ధర్మంబు నెవరు తప్పారు
నీ వల్ల జరిగెను నేడు మోసంబు
కాదని యందువా మేదినీ‌నాథ
ఏమయ్య దశరథా యెంత చేసితివి
ఇటువంటి పనిని నీ‌వెట్లు చేసితివి
మన బిడ్డకే పట్ట మనుచు చెప్పితివి
మా నాన్న కానాడు మాట ఇచ్చితివి
మాట ఇచ్చిన మాట మరచి పోయితివి
చేసిన ప్రతిననే చెరిపి వేసితివి
గంగలో నా యాశ  కలిపి వేశితివి
భరతుని బ్రతుకునే బుగ్గి చేసితివి
ఇనవంశ కీర్తినే యిగుర జేసితివి
ఇంతటి దుష్కార్య మేల చేసితివి
భరతుని దూరంబు పంపివేసితివి
రామున కీ నాడు రాజ్య మిచ్చితివి
కౌసల్యతో నీవు కలసి పోయితివి
కైకేయిపై నీవు కత్తి కట్టితివి
పెద్దభార్యకు చాల ప్రేమ చూపితివి
చిన్నభార్యను నీవు చిన్న బుచ్చితివి
నా వద్ద నెంతగా నటన జూపితివి
కూరిమి జూపించి గొంతు కోసితివి
కౌసల్యకే నన్ను దాసి చేసితివి
ఇటు జేయ భరతుని యెడము జేసితివి
మంత్రిసామంతుల మాట లొప్పితివి
కుమతులతో చేరి కుట్ర పన్నితివి
మొదటి బిడ్డకు నీవు మొగ్గు చూపితివి
ఎఱిగి భరతున  కెంత యెగ్గు చేసితివి
అరివీరభీకర యాడి తప్పితివి
పరమధర్మజ్ఞుడ పాడి తప్పితివి
న్యాయవిశారద మాయ చేసితివి
నీ యింటి యశ మెల్ల మాయ జేసితివి
పట్టాభిషేకంబు ప్రకటించు నపుడు
భరతుని పిలిపించ వైతి వెందులకు
రాముని కిచ్చుచో రాజ్యంబు నీవు
భరతు డడ్డంబని భావించి నావు
భరతుడు రాముని భక్తుడే యన్న
విషయంబు నెఱిగియు వేగిర పడుట
నీ కుయుక్తియె గాదె నిజమెన్ని చూడ
నిక్కంబు రామున కెక్కుడు ప్రేమ
నే జూపియుంటిని నిశ్చయంబుగను
యెఱిగియు నీవు నా కెఱిగింప కుండ
నిశ్చయించితి వయ్య నీ పెద్దకొడుకు
గద్దె కెక్కెడు నట్టి ఘనముహూర్తంబు
నన్ను నమ్మక చేసినావు ద్రోహంబు
ఏ రామచంద్రుని గారాబముగను
పెంచినా నిన్నాళ్ళు ప్రియమార నతడు
నా వద్ద కేతెంచి యీ వార్త జెప్ప
తలపోయనే లేదు కులదీపనుండు
ఈ కుట్రలో వాడు నిమిడి యున్నాడు
చెనటివై వానిని చెడగొట్టినావు
నా బిడ్డ కైనను నాకైన రక్ష
రాముడు పాలించు రాజ్యంబు నందు
దొఱకునా చెప్పుమా దుర్మతీ నీవు
నయవంచనము నా హృదయమును విరిచె
ధర్మపన్నంబులు తడవుట మాని
వేగమే రాముని పిలిపించి నీవు
వనముల కఱుగగా వచియించ వయ్య
భరతుని పిలిపించి పట్టంబు గట్టి
వరములు చెల్లించ వలయు దశరథ
అని కైక గద్దించె నాగ్రహంబునను

వివశుడై భూమీశు డవనిపై గూలి
మూర్ఛిల్లి యుండిన ముదిత కైకమ్మ
ఆతని దీనత కాతుర పడియు
బింకంబు గానుండె జంకు లేకుండ

మానిని యాత్మలో మరి యిట్లు తలచె
దివ్యర్షులార యో‌ దేవత లార
మీ రడగి నట్లుగా మేదినీ‌పతిని
వేధించి వరములు విలుచుకొన్నాను
సింహాసనము వీడి చింతయే లేక
కోదండరాముడై కోరి యీ పృధ్వి
భారంబు తీర్చగా వచ్చిన యట్టి
ఆదిపూరుషు డింక నడవుల కేగి
అందరు దనుజుల నడగించి వచ్చు
లోకంబు కొఱ కిట్లు కైక సేసినది
లోక మెఱుగక యున్న లోకేశు డెఱుగు
ఇక మీద జగమెల్ల నీసడించినను
నా రాము డొక్కడు నన్ను మన్నించు 



19, సెప్టెంబర్ 2013, గురువారం

మహాభారతయుధ్దం గురించి భండారు వారి వ్యాసంలో పొరపాటు అభిప్రాయాలు.

ఈ వ్యాసం భండారు శ్రీనివాస రావు - వార్తా వ్యాఖ్య బ్లాగు లోని గురువారం 19 సెప్టెంబర్ 2013 నాటి మహాభారత యుద్ధం కవుల కల్పనా? అన్న వ్యాసానికి సమాధానంగా వ్రాసినది.   నా వ్యాఖ్యానం పెద్దగా ఉండటం వలన ఆ మహాభారత యుద్ధం కవుల కల్పనా? వ్యాసం క్రింద వ్యాఖ్యాగా జతపరిచేందుకు అనువుగా లేక ఈ బ్లాగులో ప్రచురిస్తున్నాను.  దయచేసి ఈ విషయం గమనించ గలరు. 

భండారు వారి వ్యాసంలోని పంక్తులు ఇలా ఎర్ర రంగులో ఇటాలియన్ స్టైల్‌లో ఉటంకిస్తున్నాను.
భండారు వారి మాటలకు నా వ్యాఖ్యానాన్ని ఇలా నీలి రంగులో పొందు పరుస్తున్నాను.  ఇక విషయం లోనికి వద్దాం.
 
యుద్ధానికి సంబంధించి కానీ, దాని ఫలితానికి సంబంధించి కానీ ఏ ఒక్క ఖచ్చితమయిన  కబురు ఆయా దేశాలకు చేరలేదని స్పష్టమవుతుంది.

అలా అంత ఖచ్చితంగా నిర్ణయం చేయలేము.  వార్తాహరులు, చారులు మొదలైన వాళ్ళతో కూడిన ఉపవ్యవస్థలు వేరేగా ఉంటాయి.  వాళ్ళు యుధ్ధంలో పాల్గొనే వీరులు కాదు. అందుచేత ప్రతిదేశానికి ఆయా రాజ్యాలకు చెందిన ఆయా వ్యవస్థలు సమాచారం ఇస్తాయనే భావించటం సముచితం.


రాజు యుద్ధానికి వెళ్లాడు. తిరిగి రాలేదు. అతడి వెంట వెళ్ళిన సైన్యం అతీగతీ లేకుండా అదృశ్యం అయిపొయింది. పన్నులు వసూలు చేసే వాళ్లు లేరు. అథవా చేసినా  ఆ మొత్తంలోనుంచి కప్పం సొమ్మును చక్రవర్తి ఖజానాకు  దఖలు పరిచే యంత్రాంగం లేదు...దాంతో  హఠాత్తుగా ఈ చిన్న రాజ్యాలకు వూహించని రీతిలో స్వేచ్చ లభిస్తుంది.

ఇదంతా కేవలం తప్పుడు ఊహాగానం.  ఎవరైనా రాజు యుధ్ధానికి వెళ్ళగానే రాజ్యం అరాచకం కాదు. యువరాజు అనే  deputy ఉంటాడు రాజ్యానికి. అదీ కాక, పరమ సందేహాస్పదమైన యుధ్ధాదులకి వెళ్ళే‌ రాజులు వారసుడికి రాజ్యం ఇచ్చి పూర్తిగా వ్యవస్థితం చేసి మరీ కాలు బయట పెడతారు. అదీ కాక సైన్యం మొత్తం దూరదేశానికి యుధ్ధానికి పోవటం రాజనీతి కాదు.  తగినంత మూలసైన్యం ఎప్పుడూ రాజ్యంలోనే ఉండి తీరుతుంది.  ఉదాహరణకు జరాసంధవధ చూడండి.  భీముడితో యుధ్ధం తరువాత తన ఉనికి సంశయం కాబట్టి, తన కొడుకు సహదేవుడికి రాజ్యం అప్పచెప్పి మరీ అతడితో యుధ్ధం చేశాడు జరాసంధుడు.


నాటి  అస్త్ర శస్త్రాల ప్రయోగ ఫలితంగా ఆవిర్భ వించిన మహానలం  తాలూకు  అగోచర శక్తి యావత్ భూమండలాన్ని చుట్టుముట్టి  మనుషుల మనసులను  కలుషితం చేసివుండాలి. 

ఇది కూడా ఊహాగానమే! శస్త్రాలు అనేవి మంత్రసంబంధ ఉన్నవి కాదు - కత్తులూ, శూలాలు వగైరా వంటి ఆ శస్త్రాల వల్ల ఏ మహానలమూ ఉత్పన్నం కావటం అన్న ప్రశ్నే రాదు. పోతే అస్త్రాలు కేవలం మంత్రబలంఅధారంగా ప్రయుక్తం అయ్యే ఆయుధాలు - వాటిలో ఆయుధం కేవలం వాహిక మాత్రమే. రాముడు ఒక దర్భపుల్లకు బ్రహ్మాస్త్రం అనుసంధించి వదిలిన రామాయణఘట్టం ప్రసిధ్ధమే.  ఐతే అస్త్రం అనేది కేవల ఉద్దేశించిన ప్రత్యర్థిని మాత్రమే ఎదుర్కుంటుంది సాధారణంగా. చివరికి బ్రహ్మాస్త్రం ఐనా అంతే.  కాని నారాయణ, పాశుపతాది అస్త్రాలు ప్రత్యేకలక్షణాలు కలవి.  అశ్వత్థామ నారాయణాస్త్రం వేసినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఏమిటంటే దానికి ఎదురుగా ఎవరు ఆయుధంతో కనిపించినా వదలక కేవలం నమస్కరించిన వారినీ, నిరాయుధుల్నీ అది మన్నిస్తుందని.  పాశుపతం లోకసంహారం చేసేందుకు సమర్థం - దానిని అర్జునుడు కేవల ఒక్కసారే కార్యర్థం ప్రయోగించాడు. సారాంశం ఏమిటంటే మహాభారతయుధ్ధంలో సామూహిక హననంకోఎవరూ దివ్యస్త్రాలు ప్రయోగించలేదు కాబట్టి యావత్ భూమండలాన్ని చుట్టుముట్టి  మనుషులను శిక్షించటం అవి చేయటం ప్రసక్తి లేదు.

మహాభారత యుద్దానంతరం కొన్నిలక్షల  సంవత్సరాల వరకు తీవ్రమయిన స్తబ్ధత చోటుచేసుకుంది. దీన్ని చీకటి కాలంగా భావించారని  అనుకోవడానికి  కొన్ని ఆధారాలు వున్నాయి... ప్రాచీన తమిళ సాహిత్యంలో సైతం ఈ చీకటి ఘట్టం గురించిన ప్రస్తావన వుంది. ఆ భాషలో ఈ కాలాన్ని ‘కలపిరార్ కాలం’ అంటారు....దాదాపు యాభయ్ రెండు లక్షల ఏళ్లకు  పైగా ఈ చీకటి యుగం  సాగిందని చెబుతారు.   


ముద్రారాక్షసం కాదు. నిజంగా లక్షలనే వ్రాసారు.  చాలా ఆశ్చర్యకరమైన సంగతి.  ఈ మాట శుధ్ధతప్పు.


ప్రస్తుత కలియుగం  3102 BCE లో ప్రారంభం అయింది.  కలి ప్రారంభానికి 36 సంవత్సరాలకు ముందు మహాభారత యుధ్ధం జరిగింది ద్వాపరయుగాంతంలో.  అంటే మహాభారతయుధ్ధం జరిగి ఇప్పటికి 3102+2013+36 = 5151 సంవత్సరాల కాలం గడిచింది.  అంతే కాని మహాభారత యుధ్ధం జరిగి కొన్ని లక్షల సంవత్సరాలు కాలేదు!

తమిళభాషపై మీకున్న అభిమానం దొడ్డదే కావచ్చు.  కాని, ఆ భాష మాత్రం కొన్ని లక్షల సంవత్సరాల పూర్వం నుండి ఉన్నది కాదు సుమా! అత్యంత ప్రాచీన తమిళసాహిత్యం -300BCE కాలానికి చెందినదిగా భావిస్తున్నారు.  అంతకు రెండువందల సంవత్సరాలకు పూర్వపు శిలాశాసనాలు ఉన్నాయని చెబుతున్నారు.  అంతే కాని తమిళం కొన్ని లక్షల సంవత్సరాల నుండీ ఉన్న భాష కాదు.   ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం నరులు ఉద్భవించి రెండు లక్షల ఏళ్ళు కావచ్చును. అంతే. 

ఆ రోజుల్లో సుదీర్ఘ కాలం యుద్ధంలో పాల్గొనే సైనికులను అనుదినం  ఉల్లాస పరచడానికి నాట్య, నటీనట బృందాలను,  విదూషకులను ఆయా  రాజులు తమ తమ దేశాలనుంచి  వెంటబెట్టుకు వెళ్ళేవాళ్ళు....  ఈ కళాకారుల ప్రాణాలకొచ్చే ముప్పేమీ వుండదు.కానీ యుద్ధానంతరం వీరి పరిస్తితి దయనీయం. తమను తీసుకొచ్చిన రాజులు, వారి సైన్యాలలో ఏ ఒక్కరూ మిగలక పోవడంతో దిక్కులేనివాళ్లు గా మిగిలిపోతారు. వీరికి తమ దేశం దరి చేరడానికి దారీ తెన్నూ తెలియదు. ఆ నాటి యుద్ధనియమాల ప్రకారం ఇలాటివారందరూ గెలిచిన రాజుకు వశమవుతారు.

ఈ మాటలూ సరైనవి కావు.  రాజు చచ్చి, సైన్యమూ దాదాపుగా నశించినంత మత్రాన కళాకారులకు తమ దేశం దరి చేరడానికి దారీ తెన్నూ తెలియని పరిస్థితి ఎందుకు వస్తుంది?  వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి ఎవరూ యుధ్ధప్రాంతానికి తరలించ లేదు కదా?  అదీ కాక, అప్పట్లో ప్రయాణం అంతా భూమార్గం గుండానే కదా? అందరితో పాటు వారు గుర్రాలు, బండ్ల మీద రోజుల తరబడి ప్రయాణం చేసి వచ్చిన వారే కదా? దారి తెలియక పోవటం చిక్కేమిటి తిరిగి పోవటానికి?  

ఆనాటి యుధ్ధనియమాల ప్రకారం హతశేషులైన ఆయుధదారులైన సైనికులూ, రాజపురుషులూ విజేతలకు వశం అవుతారు.  అంతే కాని వార్తాహరులు, కళాకారులు వంటి ఆయుధం చేత పట్టి యుధ్ధం చేయని వాళ్ళను ఏ విజేతా నిర్బంధించే ప్రసక్తి ఉండదు.

అస్త్రాలనేవి మునులను, దేవతలను మెప్పించి వీరులు  సంపాదించుకునేవి.  వాటిని పొందిన వారు యుద్ధంలో మరణించిన తరువాత  ఆ అస్త్రాలన్నీ తిరిగి స్వస్తానాలకు చేరుకుంటాయి.

అస్త్రాలు మంత్రాల రూపంలో ఉండే యుధ్ధసాధనాలు.  మరణించిన వీరుడు ఏ అస్త్రాన్నీ ప్రయోగించ లేడు.  అంతే కాని అస్త్రాలు స్వస్థానానికి పోవటం అనేది ఏమీ ఉండదు.   అనేక అస్త్రాలు ఒకరి కంటె ఎక్కువ మంది వీరులకు స్వాధీనంలో ఉంటాయి.  వారిలో, మరణించిన వారు కాక మిగిలిన వారు ఆయా అస్త్రాల్ని నిక్షేపంగా ప్రయోగించ గలరు.

అస్త్రాలకు కాక వాటికన్న తక్కువ తరగతి మారణాయుధాలు శక్తులు అని పిలువబడేవి ఉన్నాయి.  ఇవి అస్త్రాలకు తక్కువ, శస్త్రాలకు ఎక్కువ అన్నమాట.  శక్తి అంటే అప్పటికే మంత్రపూతమైన శస్త్రం.  సాధారణంగా, దేవతలు మంత్రించి ఇచ్చే ఆయుధాలు అన్న మాట.   అవి ఏ వీరుని కొరకు దేవతలు అనుగ్రహించారో వారికి మాత్రమే పని చేస్తాయి.   ఆ వీరుడు మరణిస్తే ఆ శక్తి కేవలం సామాన్యమైన శస్త్రమే అవుతుంది.  అలాగే శక్తి ఆయుధాలు అన్నీ ఒక్కసారి మాత్రమే పని చేస్తాయి. ఒక శక్తిని, అది పొందిని వీరుడు ఒకసారి ప్రయోగించాక, అది ఐతే శత్రువుని వధిస్తుంది లేదా అది భూపతనం పొంది దానిని ఆవేశించి ఉన్న మంత్రబలం మాయమై నిర్వీర్యం ఐపోతుంది.   రామాయణ యుధ్ధంలో రావణాదులు శక్తి ఆయుధాలు ప్రయోగించారు. భారత కథలో కర్ణుడికి ఇంద్రుడు ఒక శక్తిని ఇచ్చాడు.  ఏ శక్తి ఐనా ఒక్క సారి మాత్రమే వాడటానికి పనికి వస్తుంది.  అంతే కాని అస్త్రాలు స్వస్థానానికి చేరుకోవటం అన్న మాట అవగాహనా రాహిత్యంతో అన్నది.

సుమేరియన్ సంస్కృతిలో వెల్లడయిన మరో విశేషాన్ని మహా భారత యుద్ధం కవుల కల్పన కాదనడానికి  ఆధారంగా కొన్ని వెబ్  సైట్లు  పేర్కొంటున్నాయి.  వేదాలు వేద విజ్ఞానం గురించిన ఒక ఇంగ్లీష్ వెబ్  సైట్ లో ఇచ్చిన వివరాలు ఈ వ్యాసానికి ఆధారం.

సుమేరియన్ సంస్కృతికి భారతయుధ్ధంతో ఎలా ముడివేస్తారు? సుమేరియన్లు భారతదేశంలో వాళ్ళు కాదు కదా?
సుమేరియన్ స్కృతి మెసొపొటామియా  (ప్రస్తుత ఇరాక్) భూభాగానికి చెందినది.   సుమేరియన్ సంస్కృతి ప్రసక్తి అనవసరం.


అదీ కాక వెబ్  సైట్లు  ఇచ్చే సమాచారం ప్రామాణికం అనుకోవటం కష్టం కదా?  ఇలా వెబ్ సైట్లు ఇచ్చే సమాచారం ఆధారంగా రచనలు చేయటం వాటిని జనసామాన్యంలో ప్రచారంలోనికి తేవటానికి పత్రికలలో ప్రచురించటం దుస్సంప్రదాయం.  ఆలాంటి పనుల వలన తప్పుడు సమాచారం ప్రజల్లో వ్యాప్తికి వచ్చే ప్రమాదం చాలా హెచ్చుగా ఉంది.  దానికి మనం విశ్లేషిస్తున్న వ్యాసమే ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.


ముఖ్యంగా భండారు వారి వ్యాసం పేరు మహాభారత యుద్ధం కవుల కల్పనా? అని.  అన్నింటి కంటే ఈ విషయంలో ఎక్కువ ఆశ్చర్యం కలుగుతుంది.  అసలు వ్యాసంలో ఈ ప్రశ్నపై చర్చ జరగనే లేదు.  అది కల్పన కాదు లెండి.  ఆ విషయంలో చర్చించ వలసినది కూడా లేదు.

18, సెప్టెంబర్ 2013, బుధవారం

అక్షరసత్యాల తొందరపాటులో అసత్యాలు.

ఈ క్రింది విపుల వ్యాసం తెలుగుభాషకు పుట్టిల్లు తెలంగాణా అన్న అక్షరసత్యాలు బ్లాగు టపాకు సమాధానంగా, విశదీకరణగా వ్రాస్తున్నాను.  ఇది కేవలం తెలుగుభాషకు సంబంధించిన టపాయే కాని దీనిలో రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవు.

చదువరులు దయచేసి ఒక్క విషయం గమనించాలి.  నాకు అక్షరసత్యాలు బ్లాగు వారిపై ఏమీ‌ కక్షా కార్పణ్యాలు లేవు.  కేవలం  తెలుగుభాషకు పుట్టిల్లు తెలంగాణా అన్న టపాలోని విషయానికి సంబంధించి మాత్రమే ఈ టపా ఉద్దేశించబడింది.

ఇది తెలుగుభాషకు సంబంధించిన విషయం కాబట్టి స్పందిస్తున్నాను కానీ, ఇందులో రాజకీయ కోణం వెతికి నన్ను అల్లరి పెట్టటానికి ప్రయత్నించకండి. ఎవరైన తెలిసో, తెలియకో అలాంటి ఉద్దేశంతో స్పందిస్తే జవాబు వచ్చే అవకాశం దాదాపు శూన్యం అని గ్రహించండి.  అనవసర చర్చలలోకి తెలుగుభాషని ఈడవటానికి ప్రయత్నించవద్దు దయచేసి.

నాదీ అని తెలుగు వాళ్ళంతా గర్వపడే భాష తెలుగుభాష. అందులో తెలంగాణా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళని వెలివెయ్యా లనుకోవటం మంచిది ఆలోచన కాదు. సదరు‌ టపా ఆ పని చేయటం బాధాకరం.

నిజానికి తెలుగుభాష స్వరూపం ఎక్కువగా మారింది ఫలాని చోట అని చెప్పలేం.  వివిధప్రాంతాలలో వివిధ కారణాల వల్ల పరభాషా పదాలు తెలుగులో స్థానం సంపాదించుకున్నాయి.  ఇందులో  తప్పుపట్ట వలసినదీ, బాధపడ వలసినదీ ఏమీ‌లేదు.  తెలుగులో కవులు అన్ని ప్రాంతాలలోనూ ప్రభవించారు. మీరు కొన్ని ప్రాంతాల వాళ్ళే కవులు అని హ్రస్వదృష్టి ప్రదర్శించ కూడదు.  అన్ని ప్రాంతాలలోనూ మాండలిక బేధాలు చిన్న పెద్దాగా ఉన్నా కూడా తెలుగు తేనెవాకయే కాని బాగుండక పోవటం లేదు. స్వచ్చమైన తెలుగు పలుకుబడి తెలంగాణాలోనే ఉంది అని అనుకోవటం కేవలం ప్రాంతీయాభిమానమే. అన్ని ప్రాంతాల్లోనూ తెలుగు స్వఛ్ఛంగా పలికే వారూ ఉన్నారు, తెలుగు మాట్లాడటానికి అవస్థపడే వారూ ఉన్నారు.  దేశకాల పరిస్థితుల ప్రభావం అలాంటిది.   మీరు తెలంగాణా వారు మాత్రమే వాడే స్వఛ్ఛమైన తెలుగు పదాలు అంటూ‌ఇచ్చిన పట్టీ చూదాం:



తెలంగాణా పలుకుబడి? ఇతరప్రాంతాల పలుకుబడి? వివరణ
అంగడి బజారు అంగడి అన్నది అన్ని ప్రాంతాల్లో ఉన్న తెలుగుపదమే సామెత: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో‌శని
అల్లరి [తెలంగాణం]
దుకాణం [కోస్తా; తెలంగాణం; రాయలసీమ]
bazaar: late 16th century: from Italian bazarro, from Turkish, from Persian bāzār 'market'  see dictionary
అమాస అమావాస్య అమావాస్య సంస్కృతపదం.
అమాస : నల్లగొండజిల్లా మాండలిక పదకోశం (రవ్వా శ్రీహరి)
అయ్యా ఆర్యా (సారు) ఆర్యా అనేది సంస్కృతపదం.
సర్ అనే ఇంగ్లీషు మాటకి ప్రాంతీయరూపం‌గా సారు అని వాడేది తెలంగాణాలోనే!
మాస్టారు, టీచరు, మాస్టరు [కళింగ మాండలికం] 
పంతులు, సారు, అయ్యగారు [తెలంగాణ మాండలికం]
అయ్యగారు, అయ్యవోరు, అయ్‌వోరు, అయ్యోరు [రాయలసీమ మాండలికం]
అరుగు(అరగు) వేదిక వేదిక సంస్కృతపదం.   వేదిక అనేది పండిత వ్యవహారంలోంచి సభాస్థలానికి వాదుకపదంగా ప్రచారం లోనికి వచ్చింది
అరుగు (అరగు) అనేది ఆంద్ర్హ, తమిళ, కన్నడ భాషల్లో సమంగా కనిపించే పదం. అన్ని తెలుగు ప్రాంతాల్లోనూ వాడుకలో ఉన్నదే. 
ఆత్రం ఆత్రుత ఆత్రం అనేది తెలుగు, తమిళ, కన్నడాల్లో సమానంగా ఉంది.  తెలుగువారు అన్ని ప్రాంతాల్లోనూ‌ వాడుతున్నారు.
ఆత్రుత అనేది ఆతురత అనే‌ గ్రాంథికపదానికి వ్యావహారిక రూపం.
ఆరతి హారతి (నీరాజనం) హారతి, నీరాజనం సంస్కృతపదాలు.
ఆరతి అనేది హారతికి వికృతి పదం. కోస్తాజిల్లాల్లో ఈ పదం వాడరు నిజమే. 
నిజానికి ఆరతి అనే భ్రష్టరూపం ఉత్తరాది నుండి దిగుమతి పదంలా కనిపిస్తుంది. హిందీలో ఇదే ప్రసిథ్థం.
ఆస ఆశ ఆశ సంస్కృతపదం.
ఆస దానికి వికృతి. తధ్భవపదం. అంతే కాని అచ్చతెలుగుమాట కాదు.
ఆసరా ఆశ్రయం ఆశ్రయం సంస్కృతపదం.
ఆసరా అనేది తెలంగాణాలోనే ఎక్కువగా వాడుతారు.  సకృత్తుగా కోస్తాంధ్రలోనూ వాడుక ఉంది.
ఇంగలం అగ్ని(అగ్గి) అగ్ని సంస్కృతపదం కాగా ఆగ్గి అద్బవరూపం.
ఇంగలం అనేది ఇంగాలో అనే‌ ప్రాకృతభాషా పదం‌యొక్క దేశి రూపం.  అచ్చతెలుగు కాదు.  తెలంగాణాలో వాడుక హెచ్చు. కాని మనుచరిత్రలోనూ ఈ‌ పదం వాడబడింది.
ఈను, కాన్పు, నీల్ళాడు   ప్రసవం ప్రసవం సంస్కృతపదం.
ఈను, కను, కానుపు, నీళ్ళాడు అనే మాటలు తెలుగునాట అన్ని ప్రాంతాల్లోనూ వాడుతారు.
ఉత్తగ పుణ్యం పుణ్యానికి అని ఊరికే దానంగా ఇవ్వటం అనే‌ క్రియకు వ్యవహారంగా ఉన్న ఎత్తిపొడుపు మాట.
ఉత్తినే, ఉత్తిగా అన్న తెలుగు మాటలు అదే అర్థంలో అన్ని ప్రాంతాల్లోనూ‌ వాడుతారు
ఎడ్దోడు మూర్ఖుడు మూర్ఖః అని సంస్కృతం.
ఎడ్డి వాడు, ఎడ్డి మనిషి, ఎడ్డి వెధవ అనీ అని సీమాంధ్రలో వాడుతారు. 
ఎడ్డోడు అన్నది ఎడ్డివాడుకు సంక్షిప్తరూపం.
ఎర్క జ్ఞాపకం జ్ఞాపకం అన్నది సంస్కృతపదం.
ఎరుక అన్న మాట తెలుగునాట ఎల్లెడలా సుపరిచితమే
ఏఱు నది నది సంస్కృతపదం
ఏఱు అన్న తెలుగుమాట అన్ని ప్రాంతాల్లోనూ వాడుతారు.
ఏర్పాటు విభజన విభజన సంస్కృతపదం.  (division)
ఏర్పాటు (arrangement) అన్నది దానికి సరియైన తెలుగుమాట కాదు.
కాని ఏర్పాటు  అనే మాట అన్ని ప్రాంతాల్లోనూ వాడతారు.
ఒప్పుకొను  అంగీకారం అంగీకారం అన్నది సంస్కృత ప్రయోగం 
ఒప్పుకొను అన్నది అంగీకరించు అన్న మాటకు సమానార్థకం.  ఒప్పుకొను అన్న ప్రయోగం తెలుగునాట అన్ని చోట్లా ఉన్నదే.
ఓకర, కక్కు వాంతి ఓకర, వాంతిలు అన్న మాట తెలుగు, తమిళ, కన్నడాల్లో ఒకే అర్థంలో ఉన్నాయు.  కోస్తాలో ఓకర అని వాడటం వినలేదు.
కక్కు అన్న మాట సీమాంధ్రలోనూ వాడుకలో ఉంది.
ఓడు పరాజయం పరాజయం సంస్కృతపదం.  ఓడు అన్నదానికి పరాజయము పొందు అని అర్థం.
ఓడు అన్న మాట తెలుగునాట అన్ని చోట్లా వాడుతారు
ఓపు సహనం సహనం సంస్కృతపదం.   దీనికి తెలుగు మాట ఓపిక అన్నది తెలుగునాట అన్ని చోట్లా వాడుతారు.
ఓపు అన్నదానికి సహనము చూపు అని అర్థం. ఓపు అన్నది నన్నయాదులు ప్రయోగించిన పదమే.

కడుగు  శుభ్రం చేయు శుభ్ర పదం సంస్కృతం.  కడుగు దానికి తెలుగు మాట.
కడుగు అన్న మాటను తెలుగునాట అన్ని చోట్లా వాడుతారు.
కనికరం కరుణ, దయ కరుణ, దయ అన్నవి సంస్కృతపదాలు.
కనికరం కరుణకు సమానార్థకమైన తెలుగుమాటగా తెలుగునాట అన్ని చోట్లా వాడుతారు



ఈ విధంగా ఎన్ని పదాలని విడమరచి చెప్పేది?
అక్షరసత్యాలు టపాలో మరో అరవై పదాలు కాబోలు ఉన్నాయి.
స్థాలీ పులాక న్యాయంగా మొదటి ఇరవై పదాలు కాబోలు విడమరచాను.
నిజానికి అన్ని పదాల సంగతీ విశదం చేయాలనుకున్నాను.
కాని ఈ‌ మాత్రం చాలు అనిపించి ముగిస్తున్నాను.

పై విశదీకరణ చూసిన వారికి అక్షారసత్యాలు టపాలోని తొందరపాటు చక్కగా బోధపడుతుంది.
మరీ ఈ విషయాన్ని ఇంకా సాగదీసి చెప్పవలసిన అగత్యం కనిపించటం లేదు.

ఇది తొందరపాటులో జరిగిన పొరబాటు. ఆ టపా వ్రాసినవారికి నేను దురుద్దేశాలు ఆపాదించదలచుకో లేదు.
నిజానికి ఆ టపాలో,  అసలు తెలుగంటే ఏదో గుర్తెరుగని అంధులను చూసివాడి అజ్ఞానానికి జాలిపడటం కంటే తెలంగాణా వాడేమీ అనలేడు అనే వాక్యం సీమాంధ్రులను ఉద్దేశించినదే కావచ్చునని స్పష్టంగానే ఉన్నా, ఇది అవగాహనాలోపమే కాబట్టి దానికి ఎక్కువ విలువ ఇవ్వనవుసరంలేదని భావిస్తున్నాను.  పై పట్టికలోని వివరణ చూసాక వారు సరిగా అర్థం చేసుకోగలరని నా విశ్వాసం.  వారు వారి వాదానికే‌ కట్టుబడితే నేనేమి పట్టుబట్టను.

దయచేసి ఎవరూ అపార్థం చేసుకో వలదని నా విజ్ఞప్తి. 

త్రికరణశుధ్ధిగ నిన్నే నమ్మితి


త్రికరణశుధ్ధిగ నిన్నే నమ్మితి దీనబాంధవ శరణు

చకితచిత్తుడను నీదు భక్తుడను జనకసుతావర శరణు



ఘనరిపుశోషణ సురగణపోషణ గరుడవాహన శరణు

మునిజనశరణ కరుణాభరణ ముక్తివితరణ శరణు

దినకరకులపావన శ్రితరక్షణ వనజాతేక్షణ శరణు

దనుజవిమర్ధన సుజనజనావన ధర్మోధ్ధరణ శరణు



అనిమిషమిత్ర దశరధపుత్ర అంబుజనేత్ర శరణు

వినుతచరిత్ర శ్యామలగాత్ర విజితామిత్ర శరణు

హనుమత్సేవిత సీతాజీవిత అమరప్రపూజిత శరణు

వనజాసననుత జ్ఞానప్రదాత మునిజనభావిత శరణు



పరమదయాకర పాలితకింకర భక్తవశంకర శరణు

పరమోదార మోహవిదూర పాపవిదార శరణు

తరణికులోత్తమ నరపతిసత్తమ ధర్మవిదుత్తమ శరణు

నిరుపమవిక్రమ రామనృపోత్తమ హరిపురుషోత్తమ శరణు



నా మొఱ్ఱ లాలించవే రామా


నా మొఱ్ఱ లాలించవే రామ నా కష్టముం దీర్చవే
నీ కన్యముం గాననో రామ నా కష్టముందీర్చవే

వేషభాషల మాటు విషపు బుధ్ధుల వారు
దోషాచరణులైన దుష్టాత్ములున్నారు
కఠినచిత్తులు నన్ను కలచు చున్నారు
శఠుల నణచు వాడ శరణంటి శరణంటి   ॥నా మొఱ్ఱ॥

బ్రతికినన్నాళ్ళింక బ్రతుకు వాడను గాను
అతిదుష్టు లైన దుర్మతుల హింస వలన
బ్రతుకున రుచి యెల్ల వట్టి దయ్యేను
చతురాస్యనుత నీవె శరణంటి శరణంటి   ॥నా మొఱ్ఱ॥

నా వాడ నంటివి నమ్మించు కుంటివి
నీ వలన నేనుంటి నిన్ను నమ్మి యుంటి
దుర్వార్యమై నాకు తోచెనీ కష్టంబు
సర్వేశ రక్షించు శరణంటి శరణంటి   ॥నా మొఱ్ఱ॥

17, సెప్టెంబర్ 2013, మంగళవారం

శ్రీరామచంద్రుడి తలనొప్పి


శ్రీరామచంద్రుడు పేరోలగమున
సింహాసనస్థుడై చెన్నొంది యుండి
పెద్ద తడవు దాక తద్దయు శ్రధ్ధ
ఆయవ్యయంబుల నడిగి కన్గొనియె
నగరముఖ్యుల వచనము లాలకించె
మంత్రిసామంతుల మాటలు వినెను
కార్తాంతికులు పలుకాడగా వినెను
సంగీతసాహిత్యసద్గోష్టి జరిపె
విప్రవినోదుల వీక్షించె పంపె
మేటి నట్టువరాండ్ర యాటలు జూచె
చాలించి సభ నిజ సదనంబు చేరె
అనాడు రామయ్య కమితమైనట్టి
అలసట కలిగెను తలనొప్పి వచ్చె
ఎన్నడు నలసట నెఱుగడే రాజు
ఎన్నడు తలనొప్పి నెఱుగడే రాజు
వాడిన మొగముతో వచ్చిన రాజు
వ్రాలెను పడకపై బాధ తాడించ
అంతిపురంబు వా రది గాంచి వేగ
ఉపచారములు చేయ నుద్యుక్తులైరి
స్నానంబు చేసిన శాంతించు నన్న
స్నానమాడెను బాధ శాంతించ లేదు
పరిమళద్రవ్యముల్ పరచిరి గదిని
తలనొప్పి వానితో తగ్గనే లేదు
శొంఠిపట్టున నొప్పి స్రుక్కున టన్న
నుదురంత బిగబట్టె నొప్పి హెచ్చినది
వైద్యులు వచ్చిరి వారి మందునకు
సామ్రాట్టు తలనొప్పి సమసి పోలేదు
కౌసల్య ఇంతలో గబగబ వచ్చి
దృష్టి దోషంబని దిష్టి దీసినది
పుత్రుని తలనొప్పి పోకున్న దాయె
ఇంత లోపల పురోహితు లరుదెంచి
ఇంత విభూతి మంత్రించి యలదిరి
ఎవరేమి చేసినా యినకులేశ్వరుని
తలనొప్పి ఇసుమంత తగ్గనే లేదు
శివపూజలోనున్న సీతమ్మ వారు
పూజలు సాలించి సౌజన్యమూర్తి
దైవగృహంబును తాను వెల్వడిన
అంతలో చెలికత్తె లంద రేతెంచి
అమ్మగారికి స్వామి యుమ్మలికము
తెలియంగ బల్కిన తెఱవ వేవేగ
పరువెత్తి కొనిపోయి పతి బాధ నెఱిగి
ఇంతటి తలనొప్పి యెట్లు వచ్చినది
రావని యెరిగియు రామభక్తులకు
కష్టంబు లన్నవి కలలోన నైన
వ్యగ్రులై యరయుచు వారి సేమంబు
సకల లోకంబుల సంగతు లెల్ల
చిన్నవి పెద్దవి చీకాకు లెల్ల
అరమర లేకుండ నవధరించుచును
కొఱతల నూహించి కొందలపడుచు
సాకేతరాజ్యంపు సమృధ్ధి జూచి
ఓర్వని వారల యుక్తు లెన్నుచును
కవులు గాయకులును గతమెన్ను వారు
మిమ్ము కీర్తించెడు మిషమీద మీకు
అహితంబు లగు నాటి యాపద లెల్ల
దడవుచుండిన విన దప్పక వినుచు
అలయు చున్నా రయ్య జలజాక్ష  మీరు
కావున తలనొప్పి కలిగెగా స్వామి
అని సీత యీ రీతి యంగలార్చుచును
పతి శయ్యపై చేరి పావనమూర్తి
ఫాలంబుపై చేయి పరచి ప్రేముడిని
నిమురుచు తన్వి కన్నీళ్ళు నించినది
సీతాకరస్పర్శ శీతాంశు కిరణ
స్పర్శంబు కంటెను చల్లనై సోకి
జలధరశ్యాముండు గలగల నవ్వె
శ్రీరామచంద్రుడు సేద దీరగను
తృటిలోన తలనొప్పి మటుమాయ మాయె



12, సెప్టెంబర్ 2013, గురువారం

సీతారాముల ఉద్యానవన విహారం



శ్రీరామచంద్రుడు సీతమ్మ తోడ
నందనోద్యానంబునకు సాటివచ్చు
తన పెద్ద తోటలో తద్దయు వేడ్క
విహరించు చుండగా విమలాంతరంగ
విజ్ఞానవతి యిట్లు విన్నవించినది
హరియులచ్చియు నన నమరియున్నాము
అరుదైన దాంపత్య మమరించినట్టి
పరమేశ్వరున కిదే వందనశతము
వచ్చు జన్మంబుల వదలక నన్ను
చేపట్టవే రామభూపాల కూర్మి
అన విని రాముడో అవనిజ వినుము
హరి నేనె శ్రీలక్ష్మి వన నీవె నిజము
ఎఱుగవీ సంగతి తరుణి యటంచు
గడ్డంబు పైకెత్తి ఘనముగా పలికె
అటుమీద నిటుప్రొద్దు నటువ్రాలు దాక
నడువ బుచ్చిరి  కాలినడకను వారు
అంతట సీతమ్మ కడుగులు నొవ్వ
తిరుగుట సాలించి మరలి రిర్వురును
తప్పేమి యని పతి తన భుజములకు
సతి నెత్తుకొని వేడ్క సాగుచుండగను
రాముడలసిన చూచి రమణి సీతమ్మ
అక్కజ పడుచుతా గ్రక్కున నొక్క
చెట్టుపండును చూసి చేజాచి కోసి
శ్రీరామచంద్రుని చేతి కిచ్చినది
వెరగంది సాధ్వితో విభు డిట్లు పలికె
తరుణిరో నీ వెంత తప్పు చేసితివి
వనదేవతకు చెప్ప వైతివే సీత
పండు కోయుట కిది పధ్ధతి కాదు 
చెట్టు నడుగక  నీవు చేయి వేసితివి
పండు కోయుట కిది పధ్ధతి కాదు 
దేవుని తలపక  త్రెంచితి విపుడు
పండు కోయుట కిది పధ్ధతి కాదు 
వనదేవతకు చెప్ప వైతివే సీత
వనభూమి వసియింప బాయు దోషంబు
చెట్టు నడుగక  నీవు చేయి వేసితివి
భూరుహంబుల గొల్వ  తీరు దోషంబు
దేవుని తలపక  త్రెంచితి విపుడు
తాపసవృత్తితో తరుగు దోషంబు
సందెవేళను పండు సాధించి నావు
బతుకుసందె కడుపు పండించు నీకు
కవలపండును కోసి కాన్క చేసితివి
కవలబిడ్డలు నీకు  కలుగుదు రోయి
తొలుత నీ దోషంబు తొలగకుండగను
ఫలమొసంగిన పుణ్య ఫలితంబు రాదు
అనియిట్లు నిజవిభు డాన తీ‌యగను
వనితాశిరోమణి వడవడ వణకె
శ్రీరామ మీయందు చిత్తంబు నిలిపి
జీవించుదాన నీ చిన్న తప్పునకు
విధియించి నారెంత విపరీత శిక్ష
విధి నాకు తాపసి వేషంబు వేసి
తరుమగా కానల తరువుల సేవ
వనదేవతల సేవ మునిజన సేవ
చేయుచు ఘనమైన చింతాభరమున
కాలంబు గడపుట కనవచ్చె నాకు
ప్రభుపాదసేవ దుష్ప్రాప్యమై బ్రతుకు
యోగంబు పట్ట నా యుసురెట్లు నిలచు
నాకేది దారి యని నాతి రోదించె
అంత శ్రీరాముడా యతివను డించె
ఉత్తరీయంబున నువిద కన్నీళ్ళు
మెల్లగా తుడిచి యమ్మేదినీ సుతకు
చిత్తంబు చల్లగా సెలవిచ్చె నిట్లు
సత్యదూరంబుగా జనదు నే నొకట
పరిహాసమున కేని పలికిన పలుకు
క్షీరాబ్ధికన్యవో‌ సీత నీ వనగ
నారాయణుడ నేను నరరూపధరుడ
రావణాదుల జంపి రక్షింప జగము
దేవకార్యంబున దిగివచ్చి నాము
పదివేలు నాపైన పది వందలైన
వత్సరంబులు భూమి వర్తిల్లు నట్లు
సంకల్పమును జేసి చనుదెంచి నాము
కార్యంబు లన్నియు కడదేర వచ్చె
వైకుంఠమున కేగు పధ్ధతి దలచి
నడపించనగు మీది నాటక మెల్ల
అనవిని తన దుఃఖ మంతంబు కాగ
తన్ను దా దెలసిన తన్వంగి విభుని
పాదపద్మము లంటి పలికె నీ రీతి
పద్మసంభవు డేని భవు డేని నీదు
లీలావిహారముల్ లీలగా నైన
తెలియగా లేడయ్య దేవాధిదేవ
అమడల ధరియించి యడవుల కేగి
మునిపల్లె లందుండి  మున్ముందు మీకు

కులదీపనుల నిచ్చి యిల యెల్ల మెచ్చు
విధమున నేను భూవివరంబు సొచ్చి
తొల్లింట చేరెద దురితాపహారి
రామనారాయణ రాజీవనయన
అని ఇట్లు సీతామహాలక్ష్మి బలుకు
నంతలో రవిబింబ మస్తాద్రి చేరె
ఇనకులేశుడు సీతయును నవ్వు లొలుకు
మోముల నిజపురమును చేరు కొనిరి


చిలుకల చదువు



చిలుకల చదివింప వలయు మీరనుచు
చెలికత్తియల తోడ చెప్పె సీతమ్మ
పలుకాడ నేర్పించి చిలుకల దెచ్చి
చిలుకల కొలికికి చెలు లిచ్చినారు

చెలులార చక్కగా చిలుక లన్నిటికి
విలువైన పలుకులే తెలిపి తెచ్చారె
కలభాషిణీ నీవె చిలుకల నడిగి
పలుకుల తీరులు తెలుసుకోవమ్మ

ముదితలారా మంచి ముద్దుమాటలను
చదివించినారలే చక్కగా మీరు
చదివించినది యేమొ సరసీరుహాక్షి
ముదమార అడుగవే ముచ్చట తీరు

ఇంత తొందరలోనె ఈ చిలుకలన్ని
ఎంతెంతె నేర్చెనే యేణాక్షులార
ఇంతిరో చదువుల కేది సారమ్మొ
అంత మాత్రము నేర్పి అర్పించినాము

తిలకించెదము వీని పలుకుల సౌరు
చెలులార యన్నదా సీతమ్మ తల్లి
కులుకుచు చెలులంత శీఘ్రమే యొక్క
చిలకను చేగొని పలుకరించారు

చిలుకవే చిన్నారి చిలుకవే నీవు
విలువైన విద్యనే తెలుసుకున్నావు
పలుకవే ఓ చిలుక బంగారు చిలుక
పలుకులం దొప్పైన పలుకేది యనిరి

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనుచు
నోరార ముద్దుగా నుడివెనా చిలుక
శ్రీరామ యనుమాట చెవుల సోకగనె
శ్రీరామ యని యెల్ల చిలుకలు పలుక

రామభజనమ్ము నాలకించినది
గారాల చిలుకల తీరు మెచ్చినది
ఆ రామసతి ముదమార పల్కినది
మీరు నేర్పిన దెంత మేలైన చదువు

ఆమాట యీమాట యని చెప్పకుండ
నీమమ్ము గా మీరు రామనామమును
ప్రేమతో బోధించి వీని నన్నిటిని
రామచిలుకల జేసి రక్షించినారు

చెలులార ఇక రామచిలుకల పేర

ఇల మీద వీటికి నిలచేను పేరు
కలకంఠులార మీ గడుసుదనమున
చిలుకజాతికి మేలు చేకూరె నిట్లు


10, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఏమో అనుకొంటి!

అక్కడ వాతావరణం చాలా ఉత్సాహభరితంగా ఉంది.
ఎందరో స్త్రీలు.
అందరూ స్త్రీలే.
అందరూ దాదాపు ముఫ్పై సంవత్సరాల ప్రాయంలోని యువతులు.
అందరి ముఖాల్లోనూ ఎంతో సంతోషం.

ఆ పెద్ద తోటలో ఎన్నెన్నో పూపొదరిండ్లు.
వివిధరకాలైన రంగురంగుల పూలగుత్తులతో పరమమనోహరమైన పూదోట అది.
అన్ని పొదరిండ్ల వద్దా అందమైన రంగవల్లులు.
అవి అన్నీ కూడా అత్యంత కళాత్మకంగా తీర్చి దిద్దబడి ఉన్నాయి.
ఆ రంగవల్లికల మధ్యన చక్కగా అలంకరించబడిన రత్నవేదికలు.
ప్రతి వేదిక మీదా స్త్రీజనం.

వారి సౌందర్యాలు వర్ణనాతీతం.
వారు ధరించిన వస్త్రాభరణాల సొగసులూ చెప్పనలవి కాకుండా ఉన్నాయి.

కొన్ని కొన్ని వేదికల మీద స్త్రీలు నృత్యం చేస్తున్నట్లుంది.
కొన్ని కొన్ని వేదికల మీద స్త్రీలు వాద్యగోష్ఠి నెఱపుతున్నట్లుంది.
కొన్ని కొన్ని వేదికల మీద స్త్రీలు పూల మాలలు గుచ్చుతున్నారు.
ఒక వేదిక మీద ఎవరో ఒక మనోజ్ఞమూర్తి.
ఆమె మధురాతిమధురంగా గానం చేస్తున్నది.
ఇంకా అనేక మంది స్త్రీలు హడావుడిగా తిరుగుతున్నారు.
వాళ్ళందరి ముఖాల్లోనూ ఎంతో ఉత్సాహం.

నేను ఎక్కడ ఉన్నదీ‌ నాకు సరిగా తెలియదు.
ఆ అందమైన పూదోట లోపలికి ఎందుకు వెళ్ళానో, ఎలా వెళ్ళానో తెలియదు.
ఎంత అందమైన తోట!
ఎంత తిరిగినా మరింత విశాలంగా కనిపిస్తూ‌ నన్ను ఆశ్చర్య పరచుతున్న పూతోట.
అలా ఆ తోటలో‌ తిరుగుతూ ఉండగా గాలిమోసుకు వచ్చిందా గానమాధుర్యాన్ని.
కాని ఎక్కడో కొంచెం దూరంగా ఉన్న చోటు నుండి వినవస్తున్నది.
కాబట్టి మాటలు వివరంగా తెలియటం లేదు.
ఎవరా అంత అందంగా పాడుతున్నారూ అనిపించింది.
అందుకే గానం వినవచ్చిన దిశగా అన్వేషిస్తూ నడక సాగించాను.
నేను అక్కడికి వెళ్ళే సరికి నా కళ్ళకు కనిపించిన అత్యంత అద్భుతమైన దృశ్యం అది.

అక్కడికి నేను వెళ్ళాక గానం చాలా స్పష్టంగా వినవచ్చింది.
గొతువిప్పి పాడుతున్న ఆమె పాడుతున్న పాటలో నాకు ఈ పాదం వినిపించింది.

ఏమో‌ యనుకొంటి శ్రీరాము డందగాడే!

ఈ పాదాన్నే ఆమె రకరకాలుగా గానం చేస్తున్నది నేను చూచేటప్పటికి. 

ఒక నిముషం పాటు ఆ గానామృతంలో మునిగి ఉన్నాను.
హఠాత్తుగా గానం ఆగింది.

నా ఆనందపారవశ్యాన్ని భంగపరుస్తూ ఒక కోమల స్వరం ఇలా ప్రశ్నించింది.

"ఎవరవయ్యా నువ్వు!
ఇదేమిటీ ఇలా వచ్చావు?
ఇక్కడికి ఎవరూ రాకూడదు!!"

అలా అడుగుతున్న స్త్రీ కంఠంలో ఎంతో ఆశ్చర్యం, చిరుకోపం‌ ధ్వనిస్తున్నాయి.

నాకేమి చెప్పాలో తోచలేదు.
జవాబు తెలిస్తే‌ కదా చెప్పటానికి!

ఆమె నా జవాబు కోసం నా ముఖం లోనికి గుచ్చి గుచ్చి చూచింది.

బిడియపడుతూ ఇలా అన్నాను

"పాట వినబడితే వచ్చాను"

అక్కడ ఇంకా ఎవరో ఉన్నారు, కాని నా దృక్కోణం నుంచి కనిపించటం లేదు.
నాకు ఒక మృదుమధురస్వరం ఏదో మరొకరితో మెల్లగా అంటున్నట్లు వినిపించింది
కొంచెం దూరంగా ఉన్నట్లున్నా రామె.  కాబట్టి సరిగా వినిపించలేదు.
ఇద్దరు స్త్రీలు నన్ను ప్రశ్నిస్తున్న స్త్రీ వద్దకు వచ్చి చెవిలో ఏదో చెప్పారు.
ఆమె తల ఊపింది.

అతిమృదువుగా నాతో అన్నదామె. "ఏ మాత్రం విన్నావు పాటని?"

నేను విన్నదెంత? ఒక్క వాక్యమే. అదే చెప్పాను.
"ఏమో‌ యనుకొంటి శ్రీరాము డందగాడే! అని పాడుతుండగా వచ్చాను." అన్నాను.
"మరేమీ వినలేదా అంతకు ముందు?"
కొంచెం ఆలోచించాను. ఒకటి రెండు మాటలు చూచాయగా వినవచ్చాయి. "కామారి నుతుడు" అని కాబోలు కొంచెం లీలగా వినిపించింది అన్నాను.
ఆమె చిన్నగా నవ్వింది. "అంతేనా?" అన్నది.
నేను తల ఊపాను.

ఆమె ప్రక్కన నిలుచున్న ఇద్దరు స్త్రీలూ కూడా నాకేసి చిరునవ్వుతో చూసారు.

నాతో సంభాషిస్తున్న ఆమె కొంచెం ఖచ్చితంగా ఇలా అంది. 
"ఇక్కడికి రాకూడదు. సరే, ఇంక వెళ్ళిపో"

నేను కొంచెం ఆసక్తిగా అడిగాను, "మరి ఈ‌ పాట?"

అమె నవ్వి, "విన్నది చాలు.  ఆ ఒక్క చివరి వాక్యమూ సరిగానే పూర్తిగా విన్నావు కదా, అది గుర్తు పెట్టుకో. ఫరవాలేదు, గుర్తు ఉంటుందిలే, మననం చేసుకో, ఉపయోగిస్తుంది నీకు. ఇక వెళ్ళు" అన్నది.

అసలు ఎక్కడిదీ ఈ‌ తోట?
ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చానూ?
వీళ్ళంతా ఎవరూ?
నోరు తెరిచి ఏమీ అడిగే అవకాశం రాలేదు.
మెలకువ వచ్చింది.

ఆమె సెలవిచ్చినట్లు "ఏమో‌ యనుకొంటి శ్రీరాము డందగాడే!" అన్న వాక్యాన్ని ఆ మనోహరమైన గానం రూపంలో పదిలంగా గుర్తుపెట్టుకున్నాను.  ఇప్పటికీ అది నా హృదయంలో మెదలుతూనే ఉంది.

తరువాత ఆ స్వప్నవృత్తాతం గురించి ఆలోచిస్తూ ఉండగా శ్రీరామకర్ణామృతం లోని ఈ‌ శ్లోకం గుర్తుకు వచ్చింది.

మార్గే మార్గే శాఖినాం రత్నవేదీ
వేద్యాం వేద్యాం కిన్నరీ‌బృందగీతం
గీతే గీతే మంజులాలాపగోష్ఠీ
గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్కథా రామచంద్ర

[ ప్రతి దారిలోనూ‌ చెట్లక్రింద చక్కని రత్నవేదికలు.  ఆ వేదికలమీద కూర్చుని కిన్నెరస్త్రీల బృందాలు గీతాలాపనలు చేస్తున్నాయి. అన్నీ ఎంతో వినసొంపైన పాటలు. ఓ‌ రామచంద్రప్రభూ, అన్ని పాటల్లోనూ నీ‌ కథామృతమే‌ నయ్యా వినబడుతున్నది.]


ఈ‌ స్వప్నానుభవం మొన్న ఆరవతారీఖు శుక్రవారం‌ నాటి రాత్రి కలిగింది.

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

ఒక విచిత్రానుభవం.

ఈ నెల 5 వ తారీఖు గురువారం.
నాటి రాత్రి ఇంచుమించు పదకొండున్నర సమయంలో ఆ రోజుకు వీడ్కోలు పలికి పడక మంచం మీదకు చేరటం‌ జరిగింది.
రోజూ శయనించే ముందు కొంతసేపు రాములవారిని ధ్యానం చేసుకోవటం‌ అలవాటు.
ఏ రోజున ఎంత సేపు అలా ధ్యానం కొనసాగుతుందీ అన్నది నా చేతిలో లేదు.
ఒక్కొక్క రోజున ఒక గంట సేపు నడుస్తుంది ధ్యానం.
అప్పుడప్పుడు రాత్రంతా కొనసాగటమూ జరుగుతుంది.
ఆ రోజు రాత్రికూడా యథావిధిగానే ధ్యానం చేసుకుంటున్నాను.
చాలా సేపే కొనసాగింది ఆ ధ్యానం.
ఉన్నట్లుండి ఒక్కసారిగా ఒక కుదుపు లాగా వచ్చింది.
ఆ వెంటనే ఎందుకో తెలియని ఆవేశం కలిగింది.
అది కోపం కావటానికి వీలు లేదు.  
కోపానికి ఆధారంగా ఏదన్నా విషయం‌ ఉండాలి కద.
ఆవేశం రాగానే కొంచెం భయం వేసిన మాట వాస్తవం.
ఇంత ఆవేశం ఎందుకో తెలియక పోవటమే భయహేతువు కావచ్చు.
ఒక పక్క ధ్యానం కొనసాగుతూనే ఉంది.
ఆవేశం తీవ్రతా హఠాత్తుగా పెరిగి పోయింది.
ఒళ్ళంతా బహులఘువుగా ఐపోయింది.
గాలిలో తేలుతున్న ఈకలాగా శరీరం కంపించటం స్పష్టంగా అవగాహనకు వచ్చింది.
ఉద్రేకం పట్టలేక నోటినుండి కేకలు బయటికి వచ్చాయి.
కొద్ది నిముషాలు కొనసాగిందీ స్థితి.
క్రమంగా శరీరం యథాస్థితికి వచ్చిందా లఘుత్వం నుండి.
ఆవేశమూ అలాగే‌  క్రమంగా తగ్గి ప్రశాంతమైన మనఃస్థితి కలిగింది.
ఒక గొప్ప తుఫాను వెలసినట్లయింది!
మెల్లగా ఈ‌ ప్రశాంతత కారణంగా కాబోలు ఆనందం కలిగింది.
అపరిమితమైన ఆనందం అది.
ఈ విచిత్రానుభవం కలుగుతున్నంత సేపూ ధ్యానానికి ఏమాత్రం ఆటంకం కలగక పోవటం విచిత్రం.
ఆ స్థితి చాలా సేపు కొనసాగింది.
మెల్లమెల్లగా సాధారణమైన పరిస్థితికి మనస్సు వచ్చింది.
పూర్తిగా ఈ‌ అనుభవం నుండి తేరుకున్నాక, ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది.
ప్రక్కదిగి లైట్ ఆన్ చేసాను.
గోడగడియారం వంక చూసాను.  సమయం రాత్రి గం.1:45ని॥
మంచినీళ్ళు తాగి పడుకున్నాను.
ధ్యానం మరికొద్ది సేపు కొనసాగాక నిద్రపట్టింది.

7, సెప్టెంబర్ 2013, శనివారం

శ్రీవిఘ్నరాజ సరసపదలు



శ్రీవిఘ్నరాజ రావయ్య నీకు చేసెదము మంచి పూజ
సర్వజ్ఞ నిన్ను నమ్మి యున్నాము స్వాగతమ్మో మహాత్మ

చంద్రేంద్రవిష్ణువంద్యప్రభావ సర్వార్తినాశచరణ
సంతోషపూర్ణ సోమార్కఘంట సద్భక్తలోకవరద

ప్రమధగణనాథ  భక్తజనపాల పాపసంతాపనచణ
విఘ్నాంధకారభాస్వంత సకలవిద్యాప్రదాననిపుణ

ఓ వారణాస్య ఓ యేకదంత ఓ శశివిరోధి రావె
ఓ బొజ్జదేవరా సూర్యతేజ ఓ గణపతయ్య రావె

మారేడు పత్రి నెలవంక పత్రి నేరేడు పత్రి దెచ్చి
అశ్వత్థ పత్రి కరవీర పత్రి యని చాల పత్రి దెచ్చి

పత్రంబు లేక వింశతిని తెచ్చి పరమోత్సవముగ నిన్ను
పూజించుకొనగ వేచితిమి శంభుపుత్ర విచ్చేయ వయ్య

కస్తూరి గంధములు దెచ్చి నాము కరివదన వేగ రావె
పూజింప నిన్ను వివిధంబు లైన పూవులును దెచ్చి నాము

జిల్లేడుకాయ లుండ్రాళ్ళు నీకు కొల్లలుగ నిత్తు మయ్య
బెల్లంబు పాలతాలికలు చాల పెట్టెదము గణపతయ్య

ఈ ముద్దపప్పు ఈ మంచి నెయ్యి ఈ గడ్డపెరుగు చూడు
ఇవియెల్ల నీకు నైవేద్యమయ్య ఇక జాగు చేయ కయ్య

ఖర్జూర ద్రాక్ష దానిమ్మ పనస కదళీ ఫలంబు లివిగొ
హాయిగా వచ్చి విందారగించి ఆశీర్వదించ వయ్య

ఆనందపడుచు అమితప్రభావ హారతుల నిచ్చి నిన్ను
 వేనోళ్ళ పొగడు భాగ్యమ్ము కొఱకు వేచితిమి నేడు తండ్రి


6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కొత్త దేశి గేయ ఛందస్సు 'సరసపద' లక్షణాలూ వివరాలూ.

సరసపద అనేది నేను నా సౌకర్యార్థం నిర్మించుకున్నది.  ఇది ఒక కొత్త దేశి ఛందస్సు.  దీని  వివరాలూ విశేషాలూ చర్చించటానికి ఈ టపా వ్రాస్తున్నాను.

సరసపద ఒక కొత్త దేశి ఛందస్సు.  దీనిలో  పంచమాత్రాగణాలూ, సూర్యగణాలూ వాడబడతాయి.

పంచమాత్రాగణాలు ఎలా ఉంటాయో ఈ క్రింది పట్టిక చూసి సులభంగా అర్థం చేసుకోవచ్చును.




గణస్వరూపం
గణం పేరు
ఉదాహరణ
I I I I I
నలల
సరసపద
U I I I
భల
సంతసము
I U I I
జల
అనేకము
I I U I
సల
కలవాణి
I I I U
నగ
పలుకవే
U U I

శ్రీరామ
U I U

చంద్రుడా
I U U

అనంతా


సూర్యగణాలు ఎలా ఉండేది అందరికీ తెలుసు.  ఐనా ఛందస్సుతో తక్కువ పరిచయం ఉన్నవాళ్ళ సౌలభ్యం కోసం అవి కూడా ఒక పట్టిక రూపం లో చూపుతున్నాను.
గణస్వరూపం
గణం పేరు
ఉదాహరణ
I I I

కలువ
U I

భామ

ఇలా మనకు 8 పంచమాత్రాగాణాలూ 2 సూర్యగణాలూ ఉన్నాయి.

వీటి సహాయంతో సరసపద ఛందస్సులో పద్యానికి ప్రతిపాదంలోనూ గణవిభజన ఇలా ఉంటుంది


పం  సూ  పం  సూ  పం  సూ  సూ

పైన పం అన్నది పంచమాత్రాగణానికీ,  సూ అన్నది సూర్యగణానికీ సంకేతాలు.

పం అనే సంకేతతో పైన పాదానికి 3 పంచమాత్రాగణా లున్నాయి.  ప్రతి పంచమాత్రాగణానికీ 5 మాత్రలు చొప్పున మొత్తం ఇవి 15  మాత్రలౌతాయి.

సూ అనే సంకేతంతో పైన పాదానికి 4 సూర్యగణా లున్నాయి.  ప్రతి సూర్యగణానికీ 3 మాత్రల చొప్పున మొత్తం ఇవి 12 మాత్రలౌతాయి.

వెరసి ఈ సరసపద ఛందస్సులో ప్రతి పాదానికి 5 + 3 + 5 + 3 + 5 + 3 + 3 =  27  మాత్రలు.

ఈ సరసపద పద్యానికి రెండే‌ పాదాలు.  ద్విపదల్లా అన్నమాట.
ఈ సరసపద పద్యానికి ప్రాస నియమం లేదు.  కాబట్టి మంజరీ ద్విపదల్లా వ్రాసుకోవచ్చును.

తెలుగు పద్యానికి, అది మార్గి ఛందస్సులో (వృత్తాలు) ఐనా, దేశి ఛందస్సులో ఐనా సరే యతి నియమం తప్పని సరి.  ఒక వితాళచతుష్పద అన్న పద్యంలో మాత్రం యతి నియమం లేదు.  తెలుగులో యతి నియమం లేనిది ఒక్క వితాళచతుష్పద పద్యమే.  దానికి కారణం వితాళచతుష్పదలో పాదం బాగా కురచగా ఉండటమే.  మన సరసపదలో పాదాలు తగినంత దీర్ఘంగానే ఉంటాయి కాబట్టి యతిస్థానం ఖచ్చితంగా నియమించాలి.   ఈ  సరసపద పద్యానికి 5వ గణం మొదటి అక్షరం యతిస్థానం.  ఈ పద్యానికి ప్రాస నియమం లేదు కాబట్టి ప్రాసయతి వాడవచ్చును.

ఈ సరసపద అనేది రెండు పాదాల పద్యం అని చెప్పుకున్నాం కదా. వీలుంటే అంత్యప్రాస వాడితే మరింత శోభగా ఉంటాయి.

పాదాంత విరామం పాటించాలి.  సరసపదలో మొదటి పాదం నుంచి రెండవ దానిలోకి పదం కొనసాగ కూడదు.  ప్రతిపాదం చివరా మాట పూర్తి అవాలి.

సరసపదలో పంచమాత్రాగణాల లోని జల (IUII) మాత్రం వాడకూడదు. ఆ గణం అంతగా నడకకు పనికిరాదు. 

ఈ‌ సరసపద ఛందస్సులో కవిత్వం ద్విపదల్లాగా గానం చేయటానికి చాలా అనువుగా ఉంటుంది. పాదాంతంలో సూర్యగణం ఉండటం వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు గేయలక్షణానికి.  గేయాల్లో చివరి లఘువుని సాగదీసి పాడటం కొత్త విషయం కాదు కదా.  ఈ సరసపదలో ప్రతిపాదమూ నాలుగు కాలఖండాలుగా విడుతుంది. పం-సూ । పం-సూ । పం-సూ। సూ ।  అని.  ఇక్కడ మొదటి మూడు కాలఖండాల్లో‌ ప్రతిదానికీ  5+3 మాత్రల చొప్పున 8 మాత్రలు. చివరి ముక్తాయింపు కాలఖండానికి మాత్రం 3మాత్రలు.  ఇలా వీలున్నంత వరకూ కాలఖండాలుగా పాదం విరిగితే చాలా సొగసుగా ఉంటుంది.  గణానికి ఒక పదం చొప్పున పడినా ప్రాస నియతి లేని దేశి ఛందాల్లో చాలా బాగుంటుంది.


ఒక  ఉదాహరణ చూదాం.



శ్రీరామచంద్రమూర్తిగా హరియు సీతమ్మ యగుచు సిరియు
ధర్మావతారులై దివ్యలీల నిర్మించినారు కరుణ

ఈ  ఉదాహరణలో అంత్యప్రాస పాటించలేదు. నియతంగా పాదాంత విరామం ఉంది గమనించండి.  మొదటి పాదంలో సారూప్యాక్షర యతి ఉంది, రెండవపాదంలో ప్రాసయతి ఉంది.  నడక విషయానికి వస్తే పై పద్యంలో  కాలఖండాలు  క్రింద పట్టికలో చూపినట్లు ఉన్నాయి. ఇంకొక విశేషం ఏమిటంటే మొదటి పాదంలో యతి వద్ద విరిస్తే వచ్చే రెండు ఖండాలకూ అంత్యప్రాస పొసగింది.



 శ్రీరామ చంద్ర
మూర్తిగా హరియు
సీతమ్మ యగుచు
సిరియు
ర్మావతారు
లై దివ్య లీల
నిర్మించి నారు
కరుణ


 
సాధారణంగా గేయంగా ప్రయోగించినప్పుడు, చివరిదైన కాలఖండం తగినంత దీర్ఘంగా మారుతుంది.  పై పద్యంలోని పాదాల్లో సిరియు, కరుణ అన్నవి ఉఛ్ఛారణలో  'సిరియూ ఊ ఊ' అనీ 'కరుణా ఆ ఆ' అనీ దీర్ఘాలుగా పలుకుతారు.  అప్పుడు ప్రతిపాదం లోనూ చివరి దైన సూర్యగణం మరొక 5 మాత్రలు దీర్ఘాన్ని కలుపుకుని ముందున్న కాలఖండాల్లాగే  మాత్రల ప్రమాణం పొందుతుంది.  అప్పుడు పాదం మొత్తం 27+5 =  32 మాత్రల ఉఛ్ఛారణ కాలప్రమాణం కలిగి ఉంటుంది.  యతిస్థానం 16  మాత్రల తరువాత వస్తుంది కాబట్టి పాదం యతిస్థానం వద్ద సమద్విఖండనం అవుతుందన్న మాట.  ఇలా నాలుగు అష్టమాత్రా కాలఖండాలుగా గానయోగ్యత కలిగిన ఈ ఉపజాతి పద్యం చతురస్రగతిలో ఆదితాళాని అనువుగా ఉంటుంది.

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జాతిపద్యాలలో మాత్రాసమకంగా ఉన్నది కందం ఒకటే. ప్రతి పద్యానికీ సరిగ్గా 12 + 20 + 12 + 20 = 64 మాత్రలు.  అలాగే, ఉపజాతిపద్యాల్లో మాత్రాసమకంగా ఉన్నది ఈ సరసపద ఒక్కటే - ప్రతి పద్యానికి సరిగ్గా 27 + 27 = 54 మాత్రలు.

ఈ సరసపద లక్షణం సింహావలోకనం:
 1. గణాలు:   పంచమాత్రాగణాలూ, సూర్యగణాలూ
 2. పద్యంలో పాదాలు:    2.
 3. పాదంలో గణవిభజన:    పం   సూ   పం   సూ   పం   సూ   సూ
 4. ప్రాసనియమం:    లేదు.
 5 యతిస్థానం:   5వగణం మొదటి అక్షరం.
 6. ప్రాసయతి:    వాడవచ్చును.
 7. పాదాంతవిఛ్ఛేదం:   తప్పనిసరి.
 8. నిషిధ్ధగణం:    జల (IUII)

 9.  విభాగం:      ఉపజాతి.
10. మాత్రాసమత: ప్రతిపాదానికి  27 మాత్రలు.
11.  నడగ:  చతురస్రగతి.
12. తాళం:  ఆదితాళం. 

 

3, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఈ దేశం ఎటు పోతోంది?

దురదృష్టవశాత్తు మన ప్రియతమ భారత దేశంలోని వ్యవస్థలు అన్నీ మున్నెన్నడూ‌ లేనంతగా పతనం అంచున దిగులుగా కూర్చున్నట్లు అనిపిస్తోంది.

ఈ దేశంలోని వ్యవస్థలు రాజకీయవ్యవస్థ అనండీ ఆర్థికవ్యవస్థ అనండీ, రక్షణవ్యవస్థ అనండీ, నైతికవ్యవస్థ అనండీ పారిశ్రామికవ్యవస్థ అనండీ అన్నీ కళాకాంతీ కోల్పోయి దయనీయమైన స్థితిలో ఉండటం మనస్సుని కలచి వేస్తుంది.

ఒకప్పుడు మనదేశాన్ని రెండువందల యేళ్ళు ఏలిన తెల్లదొరలు అరవైఏడేళ్ళ క్రిందట చక్కాపోయారు.  వారి పోకడకు మన అహింసాయుత స్వాతంత్ర్యపోరాటం కారణమా లేక రెండవ ప్రపంచయుధ్ధంలో బ్రిటన్ చావు దెబ్బతిని చేతులెత్తేయటమా అన్నది ఇప్పటికీ ఒక చర్చనీయాంశమే.  ఐతే,  ఆభిజాత్యంకల మన భారత జాతీయులం గాంధీగారే పోరాడి స్వాతంత్ర్యం సాధించుకుని వచ్చారని చదువుకుంటాం, బాలల చేత చదివిస్తాం అన్నది నిజం. అప్పట్లో బ్రిటన్ ప్రధానిగా ఉన్న చర్చిల్ మహాశయుడు భారత దేశవాసులకు తమను తాము పరిపాలించుకుందుకు తగిన సమర్థత లేదని వాదించటం ముమ్మాటికీ‌ భారతీయుల్ని అవమానించే ఉద్దేశంతో అన్న మాటలే అన్నది నిర్వివాదాంశం.

కాని ఇన్నేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏం చేస్తున్నాం?  మనని మనం సమర్థంగా పాలించుకోలేమూ, దేశవ్యవస్థల్ని చక్కగా నిర్వహించుకోలేమూ అని ప్రపంచానికి ముక్తకంఠంతో చెబుతున్నట్లుగా ప్రవర్తిస్తున్నాం అని అనుమానం వస్తోంది నాకు.

స్వాతంత్ర్యం సాధించుకున్న కొత్తలో మహాత్మాగాంధీగారు కాంగ్రెసు సంస్థను రాజకీయ పార్టీగా మలచటాన్ని వ్యతిరేకించారని వింటూ ఉంటాం. మరి మన నాయకులకు అప్పటికీ ఇప్పటికీ ఆయన మార్గదర్శకుడూ స్ఫూర్తిప్రదాతా ఐనప్పుడు కాంగ్రెసు సంస్థకు అతిపెద్ద దిక్కు ఆయన ఆయన మాట ఎందుకు చెల్లలేదూ? కాంగ్రెసు సంస్థ కాస్తా, ఒక పెద్ద రాజకీయ పార్టీగా ఎందుకు తయారయిందీ? గాంధీగారి పేరు చెప్పుకునీ, నెహ్రూగారి పరపతి చూపించీ, జాతీయపతాకానికి అతిదగ్గర నమూనాగా పార్టీజండా పెట్టి జనాన్ని ఎందుకు భ్రమపెట్టిందీ కాంగ్రసుపార్టీ?  ఓట్ల కోసం విలువల్ని కొద్దో గొప్పో దిగజార్చటం కాదా? ఒకసారి దిగజారటం మొదలు పెట్టాక దానికి అంతం అంటూ ఉంటుందా?

కాంగ్రెసు పార్టీ తరపున భారత ప్రధానిగ పధ్ధెనిమిదేళ్ళు పాలించిన నెహ్రూగారు ఒకప్పుడు తన సోదరి కృష్ణహతీ సింగ్‌కు కూడా రాజకీయపదవి ఇవ్వాలని యోచించి అందరూ వ్యతిరేకిస్తే వ్యక్తిగతప్రతిష్ట తగ్గుతుందని భావించి ఊరుకున్నారని కథనాలు చదివాను. ఆయన కుమార్తె కావటం మినహా ఇందిరకు ప్రధాని కావటానికి అర్హతలు ఏ అర్హతలు ఉన్నాయో అవి ఎక్కడినుండి ఎలా వచ్చాయో చెప్పండి? కాలం గడచిన కొద్దీ‌ ఇందిర ఒక నియంత అని తేలింది. ఇక ఆవిడ తరువాత ఆవిడ కుటుంబం రాజ్యం చేస్తోంది. రాజీవ్ గాంధీ పైలట్ ఉద్యోగానికి రాజీనామా చేయగానే ఏఐసిసి ప్రధానకార్యదర్శి ఐపోయాడు. ఆ పదవికి ఇంక సీనియర్లు ఎవరూ లేరన్న మాట. ఉన్నా పనికిరారన్న మాట.  ప్రజాస్వామ్యంలో కుటుంబపాలనకు పరోక్షంగా నెహ్రూగారూ, ప్రత్యక్షంగా ఇందిరమ్మా కారణం. ఇదేం ప్రజాస్వామ్యం?

నెహ్రూ తరువాత ఏణ్ణర్థం పాటు లాల్ బహదూర్ శాస్త్రిగారు ప్రధానిగా ఉన్నారు, ఆయన తాష్కెంట్‌లో హఠాన్మరణం చెందేదాకా.  ఆయన మరణం ఒక మిష్టరీ అని నమ్మేవాళ్ళకి కొరతలేదు. నిజానికి శ్రీమతి లలితాశాస్త్రి మాటల్తో పత్రికలలో వచ్చిన కథనాల ప్రకారం, ఆ అనుమానాలకు ఆథారాలు ఉండవచ్చును. శాస్త్రిగారు మచ్చలేని నిజాయితీ ఉన్న వ్యక్తి. అప్పట్లో ఆయన జీవిత చరిత్ర పాఠ్యాంశంగా ఉండేది. శ్రీమతి ఇందిర శాస్త్రిపట్ల చులకన భావం కలిగి ఉండేవారని ఒక అభిప్రాయం ఉంది.  ఆవిడ శాస్త్రిగారికి ఎందుకంత గౌరవం ఇస్తారూ ఆయనేమంత గొప్పవాడూ అని విసుక్కున్న సందర్భం ఒకటి పత్రికలలో చదివాను.

కాంగ్రెసు తరపునే శాస్త్రిగారు ప్రధానిగా చేసారు.  అంతకుముందు కాలంలో ఆయన రైల్వేమంత్రి గానూ చేసారు.బీహార్లో కాబోలు ఒకరైలు ప్రమాదం జరిగినప్పుడు నైతికబాధ్యత వహించి ఆయన రైల్వేమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసారు.

ఈ రోజున ఆర్థికశాస్త్రవేత్తగా పేరుబడ్డ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. ఆయన హయాంలో తొమ్మిదేళ్ళు గడిచాయి. అనేక ఆర్థిక కుంభకోణాలు దేశప్రజలను నివ్వెరపోయేలా చేసాయి కూడా. ఆయన వాటికి ఏమాత్రం‌ బాధ్యతతోనూ స్పందిచిన దాఖలాలు లేవు వేటికీ. బొగ్గుగనుల కుంభకోణం అనే అతిపెద్ద వ్యవహారంలో ఆయన ఆధీనంలో ఉన్న ఆ శాఖకు సంబంధించిన ఫైళ్ళు కాలి బూడిదైపోయాయట - లేదా ఏమై పోయాయో కనబడటం లేదు. మన ఘనత వహించిన ప్రధానిగారి తాజా వ్యాఖ్య చూడండి, నాకేమీ బాధ్యత లేదని అట. ఇదా ప్రధాని కుర్చీలో ఉన్న వ్యక్తి నుంచి ఆశించే బాధ్యతాయుత మైన పదవీ‌ నిర్వహణ?

రక్షణవ్యవస్థలో లోపాల గురించి బహుదీర్ఘకాలంగా ఆరోపణ లున్నాయి. బోఫార్స్ కుంభకోణాన్ని పట్టుకున్నదీ, వెలుగులోకి తెచ్చిందీ స్వీడిష్ రేడియోవాళ్ళు. దాన్ని మన వ్యవస్థ ఎంతా బాగా పరిశోధించిందో మనకందరికీ తెలుసు. నిజాల్ని వేయి నిలువుల గోతిలో పాతారు.

నైతికవ్యవస్థ గురించి ఏం చెప్పి ఏం లాభం?  ఈ రోజున చట్టసభల్లో నేరారోపణలూ, కేసులూ ఉన్నవాళ్ళు చాలా పెద్ద శాతంలో ఉన్నారన్నది పచ్చినిజం. శిక్షలు పడ్డ వాళ్ళూ అప్పీళ్ళు చేసుకుని వాటి విచారణ అతీగతీ లేకుండా చూసుకుంటూ, కేంద్రంలో మంత్రి పదవులు సైతం వెలిగిస్తున్నారు. ఈ వ్యవహారాలకు ఇటివలి సుప్రీంకోర్టు తీర్పు చరమగీతం పాడితే, దొరలంతా నిస్సిగ్గుగా తగినట్లుగా చట్టసవరణకు సిధ్దం అవుతున్నారు. అలాగే సమాచార చట్టం క్రిందికి వస్తాం అని తేలగానే అన్ని రాజకీయ పార్టీలూ అధికార ప్రతిపక్ష పార్టీలన్న తేడా లేకుండా, సమాచార చట్టాన్ని సవరించి బయట పడటానికి సిధ్దంగా ఉన్నారు. చిన్నా చితకా ఎన్నికలలో కూడా కోట్లు ఖర్చు పెట్టే పెద్దమనుషులు ప్రజలకోసం పనిచేస్తారని ఎవరైనా నమ్ముతారా? చట్ట ప్రకారం ఎవరైనా పోటీ చేయచ్చును ఎన్నికల్లో కాని, కోట్లు ఖర్చు పెట్టలేని వాళ్ళు సోదిలోకి కూడా మిగలని తంతులో సామాన్యుడికి చట్టసభకు పోటీ చేసే అవకాశం ఉందా?  వెనుకటి కాలంలో పాఠ్యాంశాల్లో నైతిక ప్రవర్తన గురించిన బోధనకూ స్థానం ఉండేది. ఈ‌ రోజుల్లో రాముడి గురించో కృష్ణుడి గురించో పాఠం ఉంటుందా బడి పుస్తకాల్లో, ఉంటే ఎన్నెన్ని గొడవలౌతాయో!

పారిశ్రామికరంగంలో సంస్కరణల పేర తలుపులు బార్లా తెరిచేస్తున్నాం.  దేశీయ పారిశ్రామిక వేత్తల్లో పెద్ద చేపలకే విదేశాల నుండి పోటీ వచ్చే రోజులు.  చిన్నచిన్న దేశవాళీ పారిశ్రామిక వేత్తల పరిస్థితి అయోమయమే. దేశంలోని కొన్ని పారిశ్రామిక పవర్‌హౌస్‌లు ఎదిగిన క్రమం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నిజాయితీగా ఆలోచించే వాడికి.  అంబానీగారు అక్షరాలా పదివేల రూపాయల అప్పు తీసుకున్నారు స్టేట్‌బ్యాంక్ నుంచి. అచిర కాలం లోనే ఆయన వందలకోట్లకూ, చూస్తుండగానే లక్షల కోట్లకూ పడగలెత్తిన సంస్థలకు అధిపతి అయ్యాడంటే నా దృష్టిలో అది కేవలం మహామాయాజాలమే. నాకు తెలిసిన ఒక వ్యక్తి సైకిల్ మీద చీరలు అవీ‌ తెచ్చి అమ్మే వాడు.  ఉన్నట్లుండి పెద్ద బట్టల షాపు తెరిచాడు. అచిరకాలంలో అది పెద్ద చెయిన్ షాపు అయింది. ఇదంతా చాల కొద్ది కాలంలో‌ ఎలా సాధ్యమైనదో తెలియదు.  ఎక్కడా అవినీతి జరగటం లేదూ అనుకోవటం కళ్ళు మూసుకోవటమే.

న్యాయవ్యవస్థ మీదా ఇందిర కాలంలోనే‌ దాడి మొదలయింది. సీనియారిటీని కాదని ఆవిడ, తనకు అనుకూలంగాఉండే వ్యక్తికి భారతప్రధానన్యాయమూర్తి పదవి కట్టబెట్టారన్నది చాల మంది దృష్టిలో పచ్చి నిజం.

విద్యావ్యవస్థను రాజకీయాలకు ఉపయోగించుకోవటం గాంధీగారి కాలంలోనే మొదలైందీ అనుకోవచ్చు నేమో. ఈ రోజున ప్రతి చిన్న పెద్ద రాజకీయమైన అలజడులకీ విద్యార్థులను రాజకీయులు ముందుకు తోస్తున్నారు. ఎలిమెంటరీ స్కూలు పిల్లల్నీ వదలరు. ఆచార్యులూ, అధ్యాపకులూ కూడా స్వయంగా రాజకీయ పార్టీలతోనూ రాజకీయ ఉద్యమాలతోనూ మమేకం అవుతారు. ఎవరికీ సర్వీస్ రూల్స్ అనేవి వర్తించవని అనుకోవాలి.

వైద్యవ్యవస్థ అనేది ఎంత అవ్యవస్థితంగా ఉందంటే ప్రభుత్వవైద్యశాలలు నాశనం ఐపోయాయి. అందరికీ కార్పొరేట్ వైద్యమూ దాని దోపిడీ తప్ప దిక్కులేదు. ప్రభుత్వ పథకాలు ప్రజల వైద్యం కోసం వచ్చినా వాటి ప్రయోజనం మాత్రం ఎక్కువగా కార్పొరేట్ రంగానికే. కాకపోతే అలాంటి పధకాలు ప్రభుత్వాలూ ప్రకటించవని అందరికీ అనుమానమే!

ఫోర్త్ ఎస్టేట్ అని ప్రశంసించబడే పత్రికా రంగం ఎంతఘోరంగా ఉందో చర్చించటం కూడా అనవసరం. దాదాపు అన్ని పత్రికలూ కేవలం పార్టీ కరపత్రాల స్థాయిలో నడుస్తూ ప్రజల విశ్వాసం దాదాపు కోల్పోయాయి. ఈ‌ మాట ఎలక్ట్రానిక్ మీడియాకూ వర్తిస్తుంది నిర్మొగమాటంగా.

1948లో ప్రచురించబడిన భారతి రజతోత్సవ సంచికలోనే అవినీతికి సంబంధించిన  కథలూ గట్రా ఉన్నాయి. ఈ రోజున ఎటు చూసినా అవినీతి అరాజకత్వం తప్ప ఏమీ కనిపించటం లేదు. చాలా  కాలం  క్రిందటే ఆ  పుస్తకాన్ని నా దగ్గ రనుండి ఎవరో తస్కరించారనుకోండి, అది వేరే విషయం.

ఇక్కడ ఈ‌ టపాలో మనం చేసింది కేవలం కొన్ని కొన్ని రంగాల మీద ఉపరిస్పర్శ మాత్రమే. వివరంగా అన్ని రంగాల గురించీ, అన్ని విషయాల గురించీ చర్చిస్తూ పోతుంటే ఎంత పెద్ద గ్రంథం ఐనా ఆశ్చర్యం లేదు.

ఇలా అన్ని రంగాల్లోనూ దేశవ్యవస్థలు భ్రష్టుపట్టి పోతుంటే మనం అంతా ఏం చేస్తున్నాం?  అసలు మనం ఏం చెయ్యగలం?  ఈ దేశం అసలు ఎటు పోతోంది? ఇవి ఆలోచించ వలసిన విషయాలు.