9, ఆగస్టు 2013, శుక్రవారం

ఏ మయ్యా ఓ రామజోగీ ఏ ఊరయ్యా నీది

ఏ మయ్యా ఓ రామజోగీ 
    ఏ ఊరయ్యా నీదీ
ఏమో నిన్ను ఎరిగిన వారు 
    ఎవరూ‌ లేరనిపిస్తోందీ

బైరాగి వలే వేషం‌ కట్టీ
    భేషుగ్గానే‌ ఉన్నావూ
దూరం నుండీ వచ్చావేమో
    ఊరి కోవెలలొ విడిసేవా ॥ఏ మయ్యా॥    

దిక్కుమాలిన సంసారమనే
    టక్కరి జబ్బు తగులుకుని
ఇక్కడి ప్రజలు వైద్యం లేక
    చిక్కులు పడుతున్నారయ్యా ॥ఏ మయ్యా॥

ఘన వైద్యులు  బైరాగుల్లోనే
     కనబడతారని అంటారే
మనకేమైనా వైద్యపు గీద్యపు
      పనితనముందా చెప్పండీ ॥ఏ‌ మయ్యా॥

ఎవరికి అంతు చిక్కని జబ్బు
    ఇక్కడ ఎంతో‌ ముదిరింది
భవవైద్యానికి మందులు నీకు
    బాగా తెలుసా చెప్పు మరి  ॥ఏ మయ్యా॥