31, జులై 2013, బుధవారం

పాహి రామప్రభో - 184

శ్రీరామచంద్రులకు పంచామృతస్నానం చేయించాక మనం చేయవలసిన ఉపచారం శుధ్ధోదకస్నానం.

శుధ్ధోదకస్నానం

క. జనకసుతావర  రఘునం
దన  హరి సద్భక్తిజల ముదారంబగు నా
మనసే మంచి తటాకము
తనివారగ జలకమాడ దయచేయగదే



తాత్పర్యం: ఓ రఘునందనా, సీతాపతీ, మీరు శుధ్ధోదకాలతో స్నానం చేయటానికి నా యొక్క సద్భక్తి అనే ఎంతో స్వాదువైన జలంతో చక్కగా పూర్తిగా నిండి ఉన్న నా మనస్సనే తటాకం తమ కోసం ఎదురుచూస్తూ‌ సిధ్ధంగా ఉంది.  మీకు తృప్తి కలిగే టట్లుగా హాయిగా జలకాలాడి ఆనందించండి.

(జూలై 2013)

తెలుగుజాతిపరువు గంగ కలసిపోయెరా

తెలుగుజాతిపరువు గంగ 
   కలసిపోయెరా రామ
కలతపడిన మనసుతోడ 
   తలచుచుంటిరా రామ

కుటిల మాయె రాజనీతి
గుటుకుమనెను తెలుగుఖ్యాతి
చిటపటల మధ్యక్రాంతి
ఎటుల గల్గు నింక శాంతి  ॥తెలుగు॥

ఒక్కటగుట పాపమేల
ముక్క చెక్కలాయె నేల
అక్కటా అభివృధ్ధి లీల
పక్కదారి పట్టనేల  ॥తెలుగు॥

తెలుగుజాతి కలహాలకు
కలుగునట్టి ఫలితాలకు
కలగునట్టి హృదయాలకు
కలత దీరు టెన్నాళ్ళకు  ॥తెలుగు॥

(జూలై 31, 2013)

30, జులై 2013, మంగళవారం

బెత్తాల వాళ్ళెవ్వరూ మిమ్ము మొత్తరు

బెత్తాల వాళ్ళెవ్వరూ మిమ్ము మొత్తరు లోనికి రండు
ఉత్తుత్తి భయమేలను రామ భక్తులందరు రండు  

శ్రీరామచంద్రులు సీతమ్మతల్లితో
పేరోలగంబుండి పిలువనంపిరి గాన
మీరెల్ల వారలు మిగుల ముదము తోడ
పారిషదులౌట పరమోత్సవము గాన  ॥ బెత్తాల ॥

కనకాసనము మీద కారుణ్యమూర్తులు
జనకసుతా రామచంద్రులు కూర్చుండి
కనులపండువ సేయ గలరంత కంటెను
మనకేమి వలయును మహితాత్ములార ॥బెత్తాల ॥

కలనైన రాముని తిలకించి మురిసేరు
తిలకించ రమ్మని దేవుడే పిలిచేను
తిలకించు వారికి తిరిగి జన్మము లేదు
బిలబిల రండయ్య విష్ణుభక్తులార  ॥ బెత్తాల ॥

(జూలై 2013)

పాహి రామప్రభో - 183

శ్రీరామచంద్రులవారికి ఆచమనీయం సమర్పించుకున్న తరువాత మనం చేయవలసిన ఉపచారం పంచామృతాలతో స్నానం‌ పరికల్పించటం.

పంచామృతాలంటే అవి పాలు, పెరుగు, తేనె, నేయి మరియు ఫలరసం. ఇందులో ఫలరసం, తేనెలు వృక్షసంబంధమైనవి. మినహా మిగతా మూడూ గోసంబంధమైన ద్రవ్యాలు.

పంచామృతస్నానం

ఆ.వె. పాలు పెరుగు నేయి ఫలరసంబులు  తేనె
శ్రవణమననదాస్యసఖ్యసేవ
నముల నాదు భక్తి  సమకూర్చె రామ పం
చామృతముల స్నాన మాడవయ్య

తాత్పర్యం: శ్రీరామచంద్రా, పంచామృతలైన పాలూ, పెరుగూ, నేయీ, తేనే, ఫలరసాలను  శ్రవణమూ, మననమూ, దాస్యమూ, సఖ్యమూ, సేవనమూ అనే నా భక్తి విశేషాలు సమకూర్చుతున్నాయి స్వామీ. చక్కగా ఈ పచామృతాలతో స్నానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

29, జులై 2013, సోమవారం

ఇంతోటి రాతలని గొప్ప పోతన పద్యాల్లా చదివి తరించాలి కాబోలు..!

నిన్న (జూలై 28) సాయంత్రం 5:30ని॥లకు ఒక అజ్ఞాతగారు ఈ‌ శ్యామలీయం బ్లాగులోని నా టపా  ముఖ్య గమనిక: శ్యామలీయం నుండి భాగవతం కోసం ప్రత్యేకంగా కొత్త బ్లాగు. పైన వ్యాఖ్యానిస్తూ "ఇంతోటి రాతలని గొప్ప పోతన పద్యాల్లా చదివి తరించాలి కాబోలు..!"అని ఎత్తిపొడిచారు.

వారు ఒక ప్రశ్నకూడా వేశారు. యేం ఎందుకు చూపించాలి మీ బ్లాగుని..వాళ్ళ badge ని పెట్టుకోవడానికి మీకు స్థలం వుండదు తమ బ్లాగులో? అని. 

ఈ‌ అజ్ఞాతగారి వ్యాఖ్యకు నేను గతరాత్రే స్పందించటం‌ జరిగింది. కాని ఆ స్పందన అసమగ్రం అనిపించటం వలన, నేను చెప్పదలచుకున్నది నా పాఠకులకు ఒక టపా ద్వారా వివరంగా చెప్పటం సముచితంగా ఉంటుందని భావించి వ్రాస్తున్నాను.

ముందుగా అజ్ఞాతగారి ప్రశ్నకు సంబంధించి నేను తీసుకున్న చర్య వివరిస్తాను.  నా స్పందనలో తెలియజేసినట్లే కొంత శ్రమ తీసుకుని ప్రస్తుతం ఈ శ్యామలీయం బ్లాగును చూపిస్తున్న సంకలినుల తాలూకూ‌ బేనర్లను ఒక పధ్ధతిలో అమర్చి ప్రదర్శించటం‌మొదలు పెట్టాను. ఇదివరలో కూడా ఈ బేనర్లన్నీ కనిపించేవి శ్యామలీయంలో - కాని అవన్నీ అడ్డదిడ్డంగా ఉండి కంటికి నదరుగా లేకపోవటంతో తొలగించాను. సరిగ్గా అమర్చటానికి కొంచెం‌ శ్రమతీసుకోవటానికి బధ్ధకించాను. సరే అజ్ఞాతగారు వాత పెట్టిన తరువాత, కొంచెం‌ కదిలి, సరిజేసానన్నమాట. కదలిక తెచ్చినందుకు అజ్ఞాతగారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

ఇప్పుడు మొదటిది, అతిముఖ్యమైనదీ అయిన అజ్ఞాతగారి ఎత్తిపొడుపు "ఇంతోటి రాతలని గొప్ప పోతన పద్యాల్లా చదివి తరించాలి కాబోలు..!" అన్న దానిని గురించి కొంచెం వివరణాత్మకంగా నా అభిప్రాయాలు వెల్లడించవలసి ఉందని భావిస్తున్నాను.  ముఖ్యంగా ఈ టపా ఉద్దేశం‌ అదే.

ఈ యెత్తిపొడుపు నాకు చాలా విచారం కలిగించిందని ఈ‌ టపా ముఖంగా చదువరులందరికీ మనవి చేసుకుంటున్నాను. 

ఎన్నడూ నేను అన్నమయ్య అంతటివాడిననో పోతన అంతటివాడినో‌ అని గొప్పలు చెప్పుకున్నది లేదు.  నేను ఎన్నడైనా అలా చెప్పుకునే వాడినని ఈ అజ్ఞాతగారు కాని మరొకరు కాని భావించవద్దు.  అలా జరిగే అవకాశం లేదు.  నా ఉపాధి యొక్క పరిమితులపైన నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకు భగవంతుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

అజ్ఞాత గారు ఇంతోటి రాతలు అన్నారు.  నా వ్రాతలు గొప్పగా ఉన్నాయనో ఉంటాయనో కూడా నేను ఎన్నడూ అనలేదే? నా భాషాజ్ఞానం యొక్క పరిమితులగురించీ, నా వ్యాకరణజ్ఞానం యొక్క పరిమితుల గురించీ నాకు తెలుసు. ఏదో‌కొంచెం తెలుగు తెలిసిన వాడిని. నన్ను మించిన వారు అన్ని కాలాల్లోనూ కోకొల్లలు. అసలు నా లోకజ్ఞానం గురించి కూడా నాకు పెద్దగా నమ్మకం లేదు.  అందుచేత నావి సాదాసీదా వ్రాతలనే స్పష్టమైన విషయం నాకు తెలుసు.

అందుచేత, నా చదువరులు నా బ్లాగు చదివేటప్పడు వారికి నా వ్రాతలు నచ్చవచ్చు - నచ్చకపోవచ్చును. ఏదైన టపా, నచ్చిన వారు మెచ్చి మరొక సారి నా వ్రాతలను చదివేందుకు ఇష్టపడవచ్చును. నచ్చనివారు నా బ్లాగును దూరం పెట్టవచ్చును.  ఈ‌ విషయంలో పాఠకులకు పూర్తి స్వేఛ్ఛ ఉంది కదా? నా బ్లాగు ఎవరికీ‌ పాఠ్యపుస్తకం లాంటిది కాదే? అందుచేత నచ్చని వారు, దూరం జరగవచ్చును గాని ఎద్దేవా చేయటం‌ అవసరమా?  అలా ఎద్దేవా చేయటం‌ సభ్యత అనిపించు కుంటుందా?  విజ్ఞులే‌ నిర్ణయించాలి.

అజ్ఞాతగారి ఆక్రోశం‌ బహుశః అల్పజ్ఞుడూ చిల్లరవ్రాయసకాడూ అయిన నా బోటి వాడూ భాగవతం గురించి వ్రాయటానికి సాహసించటమా అని అయి ఉండవచ్చునని భావిస్తున్నాను.  అలా గయితే, అజ్ఞాతగారి ఆక్రోశంలో కొంత అర్థం‌ ఉంది.  తప్పుపట్ట నవుసరం లేదు దానికి వారిని. 

అటువంటప్పుడు, అసలు శ్యామలీయం భాగవతం అని ఒక బ్లాగు తెరచి పోతన గారి భాగవతం గురించి టపాలు వ్రాయటానికి సాహసం ఎందుకు చేస్తున్నానూ అన్నది అందరికీ మరొక సారి చెప్పుకోవలసిన అవసరం నాకు చాలా ఉంది.

భగవత్కథలకు సంబథించిన విషయాలతో కొన్ని టపాలు వ్రాయాలన్న సంకల్పం కలిగింది కొన్నాళ్ళ క్రిందట.  ఈ విషయమై నేను చదువరుల అభిప్రాయాలను కూడా కోరటం జరిగింది.  వివరాలకు భగవత్కథలు - కొత్త శీర్థిక - మీ స్పందన తెలియ జేయండి!   అనే టపా చూడండి. అలాగే ఆ టపాతో పాటు దానికి వచ్చిన స్పందన కూడా చూడండి. ఈ విధంగా నేను పోతనగారి భాగవతం టపాల రూపంలో పునఃపరిచయం చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నదీ‌ అవగతం అవుతుంది.  నాబోటి అల్పసత్వుడు ఇలాంటి బృహత్కార్యక్రమం తలపెట్టటంపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే అప్పుడే వెల్లడించవలసింది కదా?  ఈ‌ రోజున నన్ను ఆక్షేపించిన అజ్ఞాతగారు అప్పుడు ఎందుకు తన అభ్యంతరాలతో ముందుకు రాలేదో తెలియదు!  నిజానికి ఆ భగవత్కథలు - కొత్త శీర్థిక - మీ స్పందన తెలియ జేయండి!   అనే టపాకు స్పందనగా కాయ గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఆ ప్రశ్నలకు నేను తదుపరి టపాలలో సవిస్తరంగా జవాబిచ్చాను. వాటిలో  తెలుగు పద్యం‌ అంటే జనం ఎందుకు పారిపోతున్నారు?   అన్న ప్రశ్నకు జవాబు ఇంకా కొనసాగుతూనే ఉంది. బహుశః మరి రెండు మూడు టపాలు రావచ్చు ఆ జవాబులో.

సరే, నా  శ్యామలీయం భాగవతం బ్లాగులో నేను వ్రాసే భాగవతం టపాలు చదివి తరించమని నేను చెప్పటానికి సాహసించను. నాకు సాధ్యమైనంత చక్కగా పోతనగారి భాగవతాన్ని నేటి తరాల తెలుగువాళ్ళకు మరొకసారి పరిచయం చేయాలన్నదే నా ఆకాంక్ష.

స్వయంగా పోతన్నగారిని చదువుకుని తరించగలిగే అదృష్టం ఉన్నవాళ్ళు తప్పకుండా అలా చేయవలసిందిగా కూడా నా విజ్ఞప్తి.

ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ప్రశ్నించటం‌ తప్పు కాదు. ప్రశ్నించి జవాబులు తెలుసుకోవటం సముచితమే.  కాని ప్రశ్నించే తీరు సభామర్యాదలను అతిక్రమించకుండా ఉంటే బాగుంటుంది.

పాహి రామప్రభో - 182

మనం‌ శ్రీరామచంద్రస్వామికి అర్ఘ్యపాద్యాలు సమర్పించుకున్నాం.

ఒక చిన్న మాట. పలుకుబడిలో అర్ఘ్యపాద్యాలు అన్నది స్థిరపడింది.  కాని పాద్యం, అర్ఘ్యం‌ అనే క్రమంలో మనం ఆ ఉపచారాలను చేయాలి. గమనించండి.

ఇలా అర్ఘ్యపాద్యాలు ఇచ్చి స్వామివారిని సంతోష పరచిన తరువాత, మనం తదుపరి ఉపచారంగా స్వామికి ఆచమనీయం అనే ఉపచారం సమర్పించుకోవాలి.  ఆచమనీయం అంటే స్వామివారు అచమనం చేసుకోవటానికి స్వాదుజలం సమర్పించటం.

ఆచమనీయం

కం. రాకేందు వదన రామా
నీకన్న విశుధ్ధు లెవరు నిక్కంబరయం
గైకొను మాచమనీయము
శ్రీకర నా భక్తికలశశీతాంబువులన్


తాత్పర్యం. ఓ రామచంద్రా, పూర్ణచంద్రుని వంటి ముఖంతో ప్రసన్నంగా ఉండే చల్లని స్వామీ. నీకన్నా నిజానికి పరిశుధ్ధు లెవ్వరయ్యా? ఐనా ఆచారం ప్రకారం నీకు ఆచమనీయం సమర్పించు కుంటున్నాను.  స్వామీ, స్వీకరించండి. ఇవి నా భక్తికలశం అనే పాత్రలో నిండి ఉన్న ఉత్తమ జలాలు. (అంటే నా భక్తియే ఆ కలశంలో ఉదకరూపంగా ఉంది అని భావం) ఈ‌ జలం‌ చక్కగా నిర్మలంగా చల్లగా మీకు చాలా హితకరంగా ఉంటుంది.  దయచేసి మీరు ఈ జలాలు స్వీకరించి ఆచమించండి.

(జూలై 2013)

28, జులై 2013, ఆదివారం

ముఖ్య గమనిక: శ్యామలీయం నుండి భాగవతం కోసం ప్రత్యేకంగా కొత్త బ్లాగు.

శ్యామలీయం‌ పాఠకులకు ముఖ్య గమనిక
భాగవతం ఇకనుండి కొత్త బ్లాగులో దర్శనమిస్తుంది.
వివరాలకు చూడండి:
    శ్యామలీయం భాగవతం

నేడే ప్రకటించిన భాగవతం కొత్త టపా
    
     ప్రధమస్కంధం: 04. శ్రీవేదవ్యాస భగవానులవారి వద్దకు శ్రీనారదులవారు వచ్చుట

గమనిక:

సంకలిని హారం ఈ‌ కొత్త బ్లాగును చూపిస్తోంది.

కూడలి  కూడలి వారు ఇంకా కరుణించలేదు.  వారికి నేను ఇప్పటికే మూడు సార్లు గుర్తు చేసినా ఫలితం కనబడలేదు.

సంకలిని మాలిక వారు నా శ్యామలీయం‌ బ్లాగును చూపటం మానేసారు.  సాంకేతిక కారణాలవలన అంటున్నారు.  కొత్తబ్లాగుకూడా ఇంతవరకు చూపటం లేదు.

ఇకపోతే జల్లెడ వారు ఈ శ్యామలీయం బ్లాగును కూడా చేర్చుకోలేదు, పలు విజ్ఞప్తులు చేసినా కూడా!  
కొత్తగా యీ‌ మధ్య వచ్చిన వేదికలో శ్యామలీయం, కొత్తబ్లాగూ కూడా చూపిస్తున్నారు.

ఒకవేళ ఇంకా యేమన్నా మంచి సంకలినులు ఉంటే వాటిలో నా బ్లాగులు చేర్చటం‌ మంచిదనిపిస్తే దయచేసి తెలియజేయండి.

ధన్యవాదాలు.

పాహి రామప్రభో - 181


శ్రీరామచంద్రులవారికి పాద్యం సమరించుకున్నాం కదా.
ఇప్పుడు మనం చేయవలసిన తదుపరి ఉపచారం పేరు అర్ఘ్యప్రదానం.
అర్ఘ్యం ఇవ్వటం అంటే స్వామికి హస్తప్రక్షాళనం చేసుకుందుకు పరిశుభ్రజలాలను అందించటం అన్నమాట.

ఆర్ఘ్యం

కం.మానసకలశీ‌సంస్థిత
మానందామృతము  నిత్తు  నర్ఘ్యంబుగ వి
జ్ఞానసుగంధముతో రా
మా నా భక్తిశ్రధ్ధలను పూవులతో

తాత్పర్యం: ఓ‌ శ్రీరామచంద్రప్రభూ నా మనస్సనే ఉత్తమమైన కలశంలో ఆనందామృతం అనే మంచి జలం తీసుకుని వచ్చాను.  ఈ‌ జలం, మీ దయ వలన, చక్కగా మీ యందు నాకు కలిగిన విజ్ఞానం అనే దివ్య సుగంధంతో పరిమళిస్తున్నది. స్వామీ మీకు యీ‌ జలాలను నా భక్తీ, శ్రధ్ధా అనే మనోహరమైన పుష్పాలతో‌ పాటు  అర్ఘ్యంగా సమర్పించుకుంటున్నాను.

(జూలై 2013)

27, జులై 2013, శనివారం

పాహి రామప్రభో - 180

భగవంతుడైన శ్రీరామచంద్రుడు సీతమ్మతల్లితో కూడి మనస్సనే దివ్యసింహాసనంలో కూర్చున్నాడు సంతోషంగా.  అలా భావించుకున్న తరువాతి ఉపచారంగా,  మనం దేవుడి పాదాలకు పాద్యం సమర్పించుకోవాలి.  అంటే సంతోషంగా చక్కగా దేవుడి పాదాలను కడగాలి.

పాద్యం

కం. ఏ కాళ్ళు గంగ పుట్టి
ళ్ళా కాళ్ళను కడుగ నెలమి నడిగెద తండ్రీ
నా కీ భాగ్యము నిమ్మా
శ్రీకర కరుణాలవాల సీతారామా


తాత్పర్యం. తండ్రీ సీతారామచంద్ర ప్రభూ. ఏ కాళ్ళనుండి గంగ జన్మించిందో,  అ దివ్య పాదాలను ప్రేమతో కడిగే భాగ్యం ప్రసాదించండి. మీరు ఎంతో దయగల వారు.  మీరు సాక్షాత్తూ మోక్షాన్ని ప్రసాదించేవారు.  అలా అనుగ్రహించి నన్ను ధన్యుడిని చేయండి.  (శ్రీమహావిష్ణువే శ్రీరాములవారు. శ్రీమహావిష్ణువు వామనావతారం ఎత్తినప్పుడు ఆయన పాదం‌ బ్రహ్మలోకాన్ని సమీపించగానే ఆశ్చర్యానందాలతో బ్రహ్మదేవుడు తన తండ్రి పాదాలను, తన కమండలంలోని జలంతో కడిగి ధన్యుడయ్యాడు. ఆ జలమే గంగ అనే పేర దివ్యనది అయింది.)

(జూలై 2013)

26, జులై 2013, శుక్రవారం

ఇది యేమి శ్రీరామచంద్రులవారూ

ఇది యేమి శ్రీరామచంద్రులవారూ
    ఈ‌ వేళలో వచ్చినారూ
ఇది వేళ యని దేవేరి సీతమ్మ
    ఈశ్వరార్చన నున్నారూ

మీ కళ్ళలోనీ మెరుపును జూడా
    మీరేమొ చెప్పాల నొచ్చారూ
సాకేత పురనాథ సమయాని కేమో
    జానకమ్మ పూజ నున్నారూ
శ్రీకంఠునీ పూజ చేసెడు వేళా
    శ్రీవారు దయచేసినారూ
మాకేమో పోయీ మనవి చేసేదీ
    మంచిదా మహరాజు గారూ    ॥ఇది యేమి ॥

జానకమ్మా పూజ ఝాము సేపుండును
    ఆనక జపమంత సేపుండు
భూనాథ భూపుత్రి పూజకు కూర్చుండి
    మూడు ముహూర్తంబు లైయుండు
ఈ నాడు తమరేమో ఏదో విశేషంబు 
    లేనిదె రారే సెలవిండు
తానై దేవేరి దయచేయు నందాక
    తాము విశ్రాంతి గైకొండు  ॥ఇది యేమి ॥

విమలప్రభావులై వెలుగు మీ భక్తులు
    సమవర్తి కైనను వెరచేరో 
తమ భక్తులెవరికి ధరణిజాతను గూడి
    దర్శన మీయగ తలచేరో
తమరిట్లు వచ్చేరు తహతహ లాడుచు
    భామిని దినచర్య మరచేరో
తమరు ధరణిజయు దైవస్వరూపులె
    తమరేమి లీలను తలచేరో  ॥ఇది యేమి ॥
    
(జూలై 2013)    

పాహి రామప్రభో - 179

భగవంతుని ఆహ్మానించిన తరువాత స్వామికి ఆసనం సమపించాలి.  వచ్చిన అతిథిని రండి స్వామీ‌ కూర్చోండి అని మంచి కుర్చీ చూపించాలి కదా.

ఆసనం

కం. మనుజేశ రామ నాదగు
మనమును దయచేసి దివ్యమణిమయ సింహా
సనముగ గైకొన వయ్యా
జనకసుతా సహితముగను సంతోషమునన్


తాత్పర్యం.  ప్రభూ మీకు నా మనస్సు అనేదే మంచి మణిమయ సింహాసనంగా అర్పించుకుంటున్నాను. శ్రీరామచంద్రా, సీతమ్మతల్లితో‌ కలిసి, మీరు సుఖంగా సంతోషంగా ఈ ఆసనం అలంకరించండి.

(జూలై 2013)

25, జులై 2013, గురువారం

రావణుడు యుద్ధంలో మరణించ లేదని కూడా పరిశోధించేసి కనుక్కునారట !!!

ఇప్పుడే  రావణుడు యుధ్ధంలో‌ మరణించలేదా?   అన్న టపా చూసాను.  ఈ‌ టపా  జై జై నాయకా   బ్లాగులో ఈ‌ రోజు (జూలై 25, 2013న) ప్రకటించబడింది.  వారు ఈ‌ టపాను వివాదాస్పదం అని వర్గీకరణం చేయటం ముదావహం.  నా వ్యాఖ్య అందుచేత టపాలోని విషయానికే వర్తిస్తుంది కాని బ్లాగరు గారికి నేనేమీ అభిప్రాయాలూ ఎజెండాలూ అంటగట్టటం లేదని ముందుగానే చదువరు లందరికీ తెలియ జేస్తున్నాను.

ఈ విషయంలో నా వ్యాఖ్య మరీ‌ పెద్దదిగా ఉండటం‌ వలన ఒక టపాగా నా శ్యామలీయం‌ బ్లాగులో ప్రకటిస్తున్నాను.

రామాయణగాధ మీద ఈ మాదిరి కథనాలు రావటం ఇదే మొదలు కాదు.  బహుశః ఇదే తుదీ కాదు!

రామాయణకావ్యం వ్రాసిన మొదటి కవి వాల్మీకి.  ఆ తరువాత వచ్చిన రామాయణాలు రెండు రకాలు.  కొన్ని వాల్మీకాన్ని యథాతథంగా తమతమ భాషల్లోనికి అనువదించినవి.  కొన్ని కొన్ని ప్రాంతీయభాషా రామాయణాలు వివిధ స్థాయిల్లో స్వతంత్రించినవి.  కొన్నికొన్ని కల్పనలు మూలరామాయణానికి అంటే యేవిధంగానూ ఔచితీభంగం కానివిధంగా చిన్నాచితకా కల్పనలు జోడించినవి. ఉదాహరణకు భవభూతి మహాకవి ఉత్తరరామాయణం అనే‌ నాటకం. కొత్త కథనాలున్నాయి.  కాని, పాత్రల స్వభావాలూ ఔన్నత్యాలూ చక్కగా మూలానికి అవిరుధ్దంగా జాగ్రత్త వహించారు భవభూతి.  రంగనాథరామాయణం వంటి ప్రాంతీయరామాయణాల్లో బుధ్దారెడ్డి వంటి కవులు జోడించిన కల్పనలు ఆయన ఉద్దేశించక పోయినా అక్కడక్కడా పాత్రౌచితిని దెబ్బతీశాయి.  కొన్ని కొన్ని రామాయణాల్లో, పై రంగనాథరామాయణం తో‌ సహా, కొన్ని కల్పనలకు మూలం‌ జనశ్రుతిలో చేరి ప్రచారం అయిన కథలు కావచ్చును.

జనశ్రుతి యెంతబలమైన దంటే, అలా వ్యాప్తిలోనికి వచ్చిన కొన్ని కథలు, నేటి పండితలోకం ఆమోదాన్ని కూడా ఆనందిస్తున్నాయి.  ఉదాహరణకు, రాముడు అసలు సీతను అగ్నిహోత్రుడి వద్ద దాచి, మాయాసీతను పర్ణశాలలో ఉంచి లేడి వెంట వెళ్ళాడనీ - ఆ మాయాసీతనే రావణుడు అసలు సీత అన్న భ్రమలో అపహరించి , చివరకు యుధ్దంలో‌ రాముడి చేతిలో మరణించాడనీ ఒక కథ.  ప్రసిథ్థ పౌరాణికులు శ్రీ మల్లాదివారు కూడా ఆ కథను నమ్మి చెబుతున్నారు. 

తెలుగులో‌ రావణకాష్టం అన్న ఒక పలుకుబడి ఉంది.  ఇది జనశ్రుతిలోని ఒక రామాయణగాథ ఆథారంగా వచ్చింది.  రావణుడు కూలాక, మందోదరి బ్రహ్మతో మొరపెట్టుకుందట. బ్రహ్మ సరేననటంతో జరిగిన చిత్రం యేమిటంటే రావణుడి చితి మండుతూనే ఉంటుందట యెప్పటికీ!  అందుచేత రావణుడికి అంత్యక్రియలు పూర్తికానేకాక, రావణపత్ని మందోదరి నుదుటి కుంకుమకు ఢోకాలేదట. అలా ఆవిడ వైధవ్యం నుంచి తప్పించుకుందట.


ఎన్నని మనవి చేయమంటారు? ఇలా అనేకం‌ ఉన్నాయి కథలు!  విజ్ఞులు జాగ్రత్తగా గమనించుకోవాలి. తస్మాత్ జాగ్రత!

చాలా రామాయణాలు మటుకు ఆధునికాలూ, అప్రమాణికాలూ, అభూతకల్పనలూ, ప్రాంతీయ, సమకాలీన మతభావనలతో నిండినవీ‌ కావటం వలన ఏ విధమైన పరిశోధనకైనా కేవలం నిష్ప్రయోజనాలు. అలాంటి నిరుపయుక్త రామాయాణాలు పట్టుకుని పరిశోధనలు చేస్తున్నామని దుష్ప్రచారం చేసే వాళ్ళ అవకతవక కథనాలు సామాన్యుల మనస్స్సులను విషపూరితం చేసే కుట్రలూ, అలాంటి పాత కుట్రల కొనసాగింపులూను.

అసలు ఆర్యులూ - ద్రావిడులూ అంటు విభజన చేసే దరిద్రపు సిధ్ధాంతం అవాస్తవమైన కుట్రపూరితమైన విషప్రచారం. ఆర్యులు ఉత్తరఖండం నుంచి వచ్చారనే వాదం‌ ఎప్పుడో చాలా కాలం క్రిదటే చరిత్రకారులు తిరస్కరించారు.  (మీకు దొరికితే చదవండి శ్రీకోట వేంకటాచలంగారు వ్రాసిన "ఆర్యుల ఉత్తరధృవ నివాస ఖండనము" అనే ప్రామాణిక గ్రంథాన్ని.) ఇలాంటి దరిద్రపు ఊహల్ని మన బుర్రల్లోంచి వదిలించుకోవటం మాని అవే మరింత ప్రచారం చేస్తున్నారు ఈ భారతదేశపు అభారతీయ అపరిపక్వ బుద్దుల వాళ్ళు మేధావులమనే ముసుగులో.  అమాయమమైన విద్యార్థుల మనస్సుల్లోకి ఈ‌ విషం చొప్పించటం అనేదే ఆ ప్రచారాల వెనుక
అసలు ఉద్దేశం అన్నమాట  పరమస్పష్టం.

విషపుబాణాలు వాడే సంస్కృతి మనదేశానిది కాదు. దురాక్రమణదారులైన విదేశీయుల యుధ్ధనీతి అది. అంతఃపురకుట్ర వల్ల రావణుడు కూలటం‌ అనేది మొగలాయి రాచకుటుంబాల కుట్రలను రామరావణయుధ్ధానికి ఆపాదించటం‌ కేవల చవకబారు ఆలోచన.  రావణుడు ఎలా కూలాడు అన్నది నిర్థారణగా చెప్పేది మూల గ్రంథమైన వాల్మీకం‌ కాని తదనంతర సవాలక్ష ఇతర రామాయణ సంబంధమైన రచనలు కావు.  


జాగ్రత్తగా అలోచించండి.  రామాయణం చరిత్ర అనుకుంటే మొదటి మరియు ప్రామాణిక చరిత్రకారుడు వాల్మీకి.  కాదూ,  రామాయణం ఒక అందమైన కావ్యం మాత్రమే అనుకుంటే అది వ్రాసిన వాల్మీకి కథనాన్ని కాదనటం అర్థరహితం. ఒక కవి కల్పనను మరొకరు సరిజేయట మేమిటీ?  అర్థరహితం కాదా?

వాల్మీకుల వారి రామాయణంలో రావణుడు లంకానగర శోభా పటిష్టత వంటి వాటి గురించి వివరంగానే ఉంది - చదువుకోండి. ఎవరూ కొత్తగా పరిశోధించ నవసరం లేదు ఈ‌విషయంలో.

విభీషణడు రామపక్షానికి వెళ్లటం కారణంగా రావణుడి వ్యూహాలు రాముడికి తెలిసిపోయాయని కొత్తగా కనిపెట్టారట?  భలే! యెలా తెలుస్తాయీ?  అతను లంక వదలిపోయాడు కదా? అలా వ్యూహాలు బయటకు పొక్కాయనటం అవివేకం కాదా? అది మరొక నోటితో మీరు చెప్పిన రావణుడి పాలనాసామర్థ్యాన్ని మీరే తప్పుబట్టటం‌కాదా చెప్పండీ?


రావణాసురుడితో పోలిస్తే., రాముడి వానరసైన్యం ఏ మాత్రం సరితూగలేని యెలా చెప్పగలరు?  వాల్మీకి రామాయణంలో ఉభయపక్షాల సైన్య బలాబలాల వివరాలు పరిశీలించండి. ఈ‌ రోజుల్లో సగటు విద్యావంతులు ఎవరూ‌ వాల్మీకి రామాయణం చదివే పరిస్థితి ఉండదు సాధారణంగా .. కాబట్టి, అది అవకాశంగా తీసుకుని,  ఎలాంటి కథలైనా అల్లి, మేం గొప్ప పరిశోధన చేసాం అంటే చెల్లుతుందని భావించటం కేవలం టక్కరితనం,  నైచ్యం.

ఏవేవో‌ తమాషాలు చెప్పి మా చారిత్రకపరిశోధనలు వాటిని రుజువు చేసే పనిలో ఉన్నాయనటం హాస్యస్పదం.  అంటే, అసలు రుజువులు లేనట్లేగా ప్రస్తుతం?  నిజానికి, ఋజువులు దొరికాక కదా ఘనతవహించిన ఈ చారిత్రక పరిశోధకులు మాట్లాడాలీ? జనాన్ని ఇలా మోసం చేయటానికి ప్రయత్నించటం సమాజాన్ని తప్పుదారికి ఈడ్వటానికే గాదా?

ప్రముఖ పరిశోధకుడు మిరాండో ఒబెసిక్రి అయినా మరొక ఏబ్రాసికీ అయినా అడ్దమైన వాడు విదేశీయుడు అయితే చాలు వాడు గొప్పవాడూ, గొప్పగొప్ప విషయాలు కనిపెట్టి చెబుతున్నాడూ అనుకోవటం ఇంకా సగటు భారతీయ విద్యావంతులు ఆంగ్లమానసపుత్రులే‌ అన్న వెర్రి నమ్మకాన్ని తెలియజేస్తోంది - ఆ నమ్మకం తప్పు అని నా అభిప్రాయం. అయితే, ఈ కుహనా పరిశోధకులు ఆశిస్తున్నట్లు తగినంత సంఖలో ఈ‌ ఆంగ్లమానసపుత్రులింకా ఇలాంటి ప్రతివాడినీ‌ నెత్తిన బెట్టుకుందుకు సిధ్ధంగానే ఉన్నారన్నది ఒక విషాదకరం అయిన వాస్తవం.


నేటి శ్రీలంకయే రావణలంక అన్న విశ్వాసం ఒకటి ప్రజల్లో ఉంది.  మనదేశంలో ఉంది, అదే విశ్వాసం శ్రీలంకలోనూ‌ బలంగా ఉంది.  అయితే శ్రీలంక మనకు శతయోజనాల దూరంలో లేదు కదా?  శ్రీమద్రామాయణసారోధ్దారము అనే పుస్తకంలో బహుశః ఛాగస్ ద్వీపం రావణ లంక కావచ్చునని ప్రతిపాదించబడింది! గమనించండి.

అనేక దేశాల్లో‌ వారి వారి ప్రాంతీయ రామాయణకథల్లో‌ మూలం అయిన వాల్మీకానికి ఎంత విరుధ్దంగా ఉండేవి అయినా ఉన్నాయి.  ఒకానొక రామాయణంలో (వివరం గుర్తులేదు, మన్నించాలి), రాముడికి సీత సోదరి అట!

ఇందు మూలంగా, విజ్ఞులందరికీ నా విన్నపం యేమిటంటే, ఇలాంటి డాంబిక పరిశోధనల మూలోద్దేశాలను జాగ్రత్తగా గమనించి జాగ్రతవహించ వలసిందని.

స్వస్తి.

వేదండము నెక్కి మైధిలితో గూడి

వేదండము నెక్కి మైథిలితో గూడి 
  కోదండపండితు డూరేగె
వేదవేద్యుని కీర్తి వేదపండితులెల్ల 
  వేనోళ్ళ పొగడగ నూరేగె

వారిజాక్షిసీత వామాంకమున నొప్ప
    వైభవమొప్పగ నూరేగె 
చేరి మిద్దెలమీద పేరంటాండ్రందరు
   సేసలు జల్లగ నూరేగె
హారతు లెత్తుచు నన్ని ముంగిళుల
   నతివలు పాడగ నూరేగె
కారుణ్యమూర్తుల గనవచ్చు జనులతో
    గడబిడ చెలరేగ నూరేగె  ॥వేదండము నెక్కి॥

పరమశివునివిల్లు పట్టివిరిచిన జోదు
     వరుసగ పురవీధు లూరేగె
సురవైరి మదమెల్ల చూర్ణంబు జేసిన
     శుభ్రయశోరాశి యూరేగె 
సురనాథుడాదిగ సురలంబరము నిండి
     చూడగ చక్కగ నూరేగె
తెరపిలేక నన్ని దిక్కుల జయఘోష
     పరగంగ భగవాను డూరేగె  ॥వేదండము నెక్కి॥

అతివ సీతకు యూరి యందంబు లెఱిగించి
      యానందమును గూర్చ నూరేగె
అతులిత సంపద లందించు తన చూడ్కి
      నందర కందించ నూరేగె
పతితపావను డెల్ల వారికి దర్శన
     భాగ్యంబు కలిగించ నూరేగె
అతనుకోటి  సుందరాకారు డీవేళ
     హాయిగ మనమధ్య నూరేగె ॥వేదండము నెక్కి॥

(జూలై 2013)

పాహి రామప్రభో - 178

భగవంతుణ్ణి చక్కగా తృప్తిగా మనస్సులో ధ్యానించిన తరువాత చేయవలసిన  ఉపచారం ఆవాహనం.   ఆవాహనం అంటే ఇష్టదేవతామూర్తిని మన ఇంటి లోపలికి ఆహ్వానించటం.  మనం చేసేది మానసిక పూజ కాబట్టి ఈ ఆహ్వానం ద్వారా మనం దైవాన్ని మన  మనస్సునే అనేదే ఇల్లుగా భావించి దాని లోపలికి రమ్మని స్వాగతం‌ చెబుతున్నా మన్న మాట

ఆవాహనం
 

కం. భూవర భూమిసుతావర
దేవర శ్రీరామచంద్ర దివ్యప్రభావా
నీవే దిక్కని  నమ్మితి
రావయ్యా పూజలంద రామయ తండ్రీ 


తాత్పర్యం:  ఓ శ్రీరామచంద్రమహారాజా, భూమిపుత్రిక ఐన సీతాదేవికి ప్రాణనాధుడా, అద్భుతం అయిన ప్రభావం‌ కలవాడా! స్వామీ, నీవే నాకు దిక్కు అని నమ్మి ఉన్నాను.  ఓ‌ రాయయ్య తండ్రీ రావయ్యా.  వచ్చి నా పూజలు స్వీకరించు.

(జూలై 2013)

24, జులై 2013, బుధవారం

సుదతి జానకి తోడ సుందరుడు

సుదతి జానకి తోడ సుందరుడు
కదలి వచ్చినాడు సుందరుడు
సుందరుడు శ్యామ సుందరుడు
సుందరుడు రామ సుందరుడు

ప్రజ్ఞానఘనుడైన సుందరుడు
అజ్ఞానవనవహ్ని సుందరుడు
యజ్ఞస్వరూపుడౌ సుందరుడు
యజ్ఞఫలోదయ సుందరుడు

ఇనవంశవర్థన సుందరుడు
మనసిజమోహన సుందరుడు 
మునిరాజభావిత సుందరుడు
ఘనయజ్ఞరక్షణ సుందరుడు

హరచాపవిదళన సుందరుడు
ధరణిజాపతియైన సుందరుడు
సురలకై వనమేగు సుందరుడు
శరణాగతత్రాణ సుందరుడు

మౌనీంద్రకామిత సుందరుడు
దానవవనదహన సుందరుడు
మానవనాధుడీ సుందరుడు
మానక మమ్మేలు సుందరుడు

(జూలై 2013)

పాహి రామప్రభో - 177


పూజలో మొదటి ఉపచారం దైవాన్ని ధ్యానం చేయటం.  మనం భగవంతుణ్ణీ యే దేవతాస్వరూపంగా భావించుకుని పూజించుకుంటున్నామో ఆ భగవత్స్వరూపాన్ని మన మనస్సులో చక్కగా ధ్యానం చేసి సాక్షాత్కరింప చేసుకోవాలి.   అలా చక్కగా ధ్యానం చేసిన తరువాత దేవుడికి మిగతా ఉపచారాల్ని సమర్పించుకోవాలి.  ఒక్క విషయం బాగా గుర్తు పెట్టుకోండి. దేవుదికి చేసే పూజ పూర్తి భక్తి శ్రద్ధలతో చేయాలి.  మన ఇంటికి అతిథిని పిలిచామనుకోండి.  వచ్చిన అతిథిని పట్టించుకోకుండా మనకు తోచిన పనుల్లో‌ మనం కాలక్షేపం చేయటం తప్పు కదా?  అతిథి మర్యాద అనేది ఎలా చాలా శ్రద్ధగా చేస్తామో, దేవుడి పూజ కూడా అలాగే అత్యంత శ్రద్ధతో చేయాలి.

ధ్యానము

కం.  ధ్యానింతును నా యెడదను
మౌనీంద్రార్చితుని సర్వమంగళమూర్తిన్
జ్ఞానానందమయుండగు
భూనాధుని రామచంద్రమూర్తిని కూర్మిన్



తాత్పర్యం.  రామచంద్రమూర్తి జ్ఞానానంద మయుడు.  సార్వభౌముడు. సర్వమంగళమైన స్వరూపం కలవాడు. అటువంటి శ్రీరామచంద్రమూర్తిని నా హృదయంలోఎంతో ప్రేమపూర్వకంగా ధ్యానం చేస్తున్నాను.


(జూలై 2013)

23, జులై 2013, మంగళవారం

మరి యొకసారి మరి యొకసారి

మరి యొకసారి మరి యొకసారి మరి యొకసారి కననీరా
పరమ మనోహరమగు నీ చిరునగవు మనసారా

ఇహపరములకు నిన్నే యేలికగా నెరఱుగనొకో
బహుజన్మంబుల నిన్నే పరమాత్మా కోరనొకో
బహుకష్టంబుల కోర్చి వ్రతములనే సలుపనొకో
అహహా నీ‌ దరిసెనము అరక్షణమే కలిగెనుబో

అకళంకశశివదనా అతిభక్తి నడుగుదురా
సకలము నీ వెఱుగుదువే చయ్యనరా నడుగుదురా
వికచసరోరుహనేత్రా విన్నపము చేయుదురా
ఇక నిన్ను కనలేక ఇహమందెట్లుండుదురా

అదియిది కావలెనని నిన్నడిగితినా రఘువీరా
సుదతిజానకితోడ కదలిరా ముదమారా
హృదయాంభోరుహదివ్య సదనమున విడియుమురా
వదలక నే కొలిచెదరా సదయా విచ్చేయుమురా


పాహి రామప్రభో - 176

శ్రీరామచంద్రులవారి పూజ నిర్విఘ్నముగా జరగాలంటే ముందుగా మనం గణపతిని ప్రార్థించాలి.  ఏ దేవతామూర్తిని పూజించాలన్నా మొట్టమొదట గణపతిని పూజించటం చాలా అవసరం.  అది మన సంప్రదాయం.  శ్రీగణపతి సర్వవిఘ్నాలనీ తొలగించి యిష్టదేవత యొక్క పూజ చక్కగా జరిగేటట్లు తోడ్పడతాడు.

(శ్రీవైష్ణవులు గణపతిపూజకు మారుగా శ్రీవిష్ణుమూర్తులవారి సేనాపతి ఐన విష్వక్సేనుడికి పూజ చేస్తారు.  చిన్న సంప్రదాయ బేధం.  అంతే.)


గణపతి ప్రార్థన

క. పరమకృపామతి గణపతి
పరమేశ్వరుడైన రామభద్రుని పూజన్
జరిపించుము విఘ్నంబులు
దరి జేరగ నీక నీకు దండములయ్యా

(జూలై 2013)

22, జులై 2013, సోమవారం

భాగవతం 1.3: శ్రీవేదవ్యాస భగవానులవారికి కలిగిన విచారం

ఆ సూతపౌరాణికులవారు మహర్షుల ప్రశ్నలకు జవాబులు చెప్పటానికి ఉపక్రమించారు.

మహర్షులారా ద్వాపరయుగం చివరలో శ్రీహరియొక్క దివ్యకళతో శ్రీవేదవ్యాసభగవానులవారు అవతరించారు.  ఒకనాటి సూర్యోదయ సమయం. వ్యాసులవారు బదరికాశ్రమం దగ్గర సరస్వతీ పుణ్యనదీ జలాలలో స్నానం పూర్తిచేసుకున్నారు.  ఒంటరిగా కూర్చుని రాబోయే కలియుగం యెలా ఉంటుందో అందులో మానవజాతి ప్రవర్తన యెలా ఉంటుందో అని అనుకున్నారు. అది ఎంత ఘోరంగా ఉండేదీ వారి మనస్సుకు రాగానే వారికి ఎంతో విచారం కలిగింది.

ఎలా ఈ‌ మానవజాతికి హితం చేకూర్చాలీ‌ అని ఆలోచించారు.  కలియుగంలో మానవుల శక్తి స్వల్పం. బహు విస్తారంగా ఉండే వేదాన్ని అభ్యసించటం కలిలో మనుషులకు శక్తికి మించిన పని.  అందుచేత ఎంతో ఆలోచించి, మానవులకు సులభంగా ఉండటం కోసం ముందుగా వేదరాశిని నాలుగు విభాగాలుగా చేసారు.

వాటిలోఋగ్వేదాన్ని పైలుడనే మహర్షికి ఉపదేశించారు. అలాగే సామవేదాన్ని జైమిని మహర్షికి ఇచ్చారు.  యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చారు. అధర్వవేదాన్ని సుమంతుడికి ఇచ్చారు.

ఇలా వేదవిభాగాల్ని ఆయా ఋషీంద్రులు వ్యాసభగవానుల వలన గ్రహించి తమతమ శిష్యగణంద్వారా వాటిని మానవలోకంలో ప్రవర్తింప జేసారు.

అయితే ఇంకా ఒక చిక్కు మిగిలే ఉందని వ్యాసులవారు అనుకున్నారు.  వేదాలను అధ్యయనం చేసే అధికారం బ్రహ్మవేత్తలుగా ఉండే బ్రాహ్మణులకే తప్ప అన్యులకు లేదు.  అలాగే అబ్రాహ్మణులకే కాక,  స్త్రీలకూ వేదవిధ్యాధికారం లేదు. మరి వారికి ఏదీ అభ్యున్నతి కలిగేదారీ అని కరుణామూర్తులైన వేదవ్యాసులవారు ఆలోచించారు. 

అప్పుడు ఆయన చక్కగా మహాభారతాన్ని మానవులకు అందరికీ ఉపయుక్తం అయ్యేటట్లుగా నిర్మించారు.  ఈ మహాభారతం చెప్పే సందర్భంలో భగవానులు వేదార్థసారం అంతా దానిలో నిక్షేపించారు.  అందుకే, అది పంచమవేదంగా ప్రసిధ్ధి గడించింది. మహాభారతాన్ని అధ్యయనం చతుర్వర్ణాలవారూచేయవచ్చు.  స్త్రీలూ పురుషులూ అనే బేధం లేక అందరూ మహాభారతాన్ని అధ్యయనం చేసి మేలు పొందవచ్చు.

ఇదంతా మానవజాతిలో బుధ్ధిమంతులందరికీ చాలా సంతోషం కలిగించింది. ఋషిగణం అంతా ఆయనను సాక్షాత్తూ విష్ణుస్వరూపంగా గుర్తించి కీర్తించింది.

అయినా వ్యాసులవారికి సంతోషం కలగలేదు.  ఇంకా ఆ భగవానుల మనస్సుకు తృప్తిగా అనిపించలేదు.

మరలా ఒకనాడు ఒంటరిగా సరస్వతీ నదీ‌ తీరాన కూర్చుని తనలో తాను ఈ విషయమై చాలా బాధపడ్డారు.

ఎంతో‌ ఆలోచించగా, ఆయనకు ఒక విషయం బోధపడింది.

తాను ఎంతగా కృషిచేసి వేదవిభాగం చేసీ, మహాభారతం అనే గొప్ప ఇతిహాసం నిర్మాణం చేసీ కూడా, ఈశ్వరుడి మెప్పును మాత్రం ఇంకా పొందలేక పోయాడు.  అయ్యో,  శ్రీహరికీ, మహాయోగులకీ ఎంతో ఇష్టమైన భగవంతుని కథలను చక్కగా చెప్పలేదే నేను!  ఎంత మోసపోయానూ, ఎంత పొరపాటు చేసానూ! నాకు ఇన్నాళ్ళూ ఆ బుధ్ధి ఎందుకు కలగలేదూ అని చాలా చాలా విచారించారు.

ఇప్పుడు తనకు ఏమిటి కర్తవ్యం అని ఆయన ఆలోచిస్తుండగా ఒక అద్భుతం జరిగింది.

అప్పుడు వ్యాసులవారి వద్దకు శ్రీనారదమహర్షులవారు వచ్చారు.  శ్రీనారదులు బ్రహ్మమానసపుత్రులు.  వారు శ్రీహరికి పరమభక్తాగ్రగణ్యులు. సమస్తమూ తెలిసిన వారు.  ఆయన విచ్చేయటంతో వ్యాసభగవానులవారు పరమానంద భరితులయ్యారు.

వచ్చే టపాలో నారదులవారు వ్యాసులవారితో సంభాషించిన విషయాల గురించి తెలుసుకుందాం.

పాహి రామప్రభో - 175

శ్రీరామచంద్రదివ్యపాదపంకేరుహచింతనాతత్పరులైన భక్తమహాశయులారా!

ఈ రోజు నుంచి శ్రీరామచంద్రప్రభువులవారి మానసికపూజ కోసం పద్యాలు చెప్పుకుందాం  .మన వాడుక ప్రకారం ఈ పద్యాల్ని రోజకు ఒకటి చొప్పున చదువుకుందాం.  అందరూ  గమనించ వలసిందిగా నా ప్రార్థన.  

ఈ పద్యాలు సద్భక్తమహాశయు లందరికీ  ఉపయోగంగా ఉండి నిత్యం సంతోషం కలిగిస్తాయని  నా ఆశ.  అన్ని పూజావిధానాల్లోనూ మానసిక పూజావిధానం సర్వశ్రేష్టం.  మానసిక పూజకు భౌతికమైన ద్రవ్యాలతో నిమిత్తం లేదు.  ప్రత్యేకమైన స్థలం, ప్రత్యేకమైన నియమాలూ,  ప్రత్యేకమైన సమయం,  ప్రత్యేకమైన మంత్రతంత్రాల పరిజ్ఞానము, ఆ మంత్రాల అర్థాల యొక్క జ్ఞానం వంటివి ఏమీ అవసరం లేదు.  అలాగని, సంప్రదాయికంగా మనం జరుపుకునే పూజావిధానాన్ని నిరసించటం, తిరస్కరించటం వంటివి చేయకూదదని గమనించండి.  మానసిక పూజ అనేది ఒక విశేషమైన పూజావిధానం. అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉండటం, అనుకూలంగా ఉండటం ఈ మానసిక పూజా విధానం ప్రత్యేకతలు.  

పూజచేయటానికి సంకల్పించుకోవటంతో పూజను ఆరంభించటం జరుగుతుంది. అందుకే దీనికి సంకల్పం అని పేరు.

సంకల్పము

కం. మనసా నిన్నర్చించెద
తనివారగ నిపుడు జనకతనయానాథా
వినతాసుతఘనవాహన
మునిజననుత రామచంద్రమూర్తీ భక్తిన్

తాత్పర్యము: ఓ రామచంద్రమూర్తీ,  జానకీపతీ, వినతాదేవి కుమారుడు గరుత్మంతుణ్ణి ఆదరంగా వాహనం చేసుకున్న వాడా (అనగా నీవే శ్రీమహావిష్ణువూ అని సంబోధిస్తున్నామన్న మాట), జ్ఞానులైన మునులచేత స్తుతించబడేవాడా,  భక్తితో, ఇప్పుడు నిన్ను నా మనస్సులో తనివితీరేటట్లుగా అర్చిస్తున్నాను.

(జూలై 2013)

21, జులై 2013, ఆదివారం

నీ ముందు నే నెంత ఓ హనుమంత

నీ ముందు నే నెంత 
ఓ హనుమంత
నీ దయతో చింత
తీరెను హనుమంత

రాముని చిత్తమెంత
కోరినా ప్రకృతి వింత
మాయలతో చింత
కలిగేను హనుమంత  ॥నీ ముందు ॥

కలి మితిమీరి నంత
కడగండ్లు కొండలంత
కలుగుటేమి వింత
కాదుగా హనుమంత  ॥నీ ముందు ॥

రామపాదముల చెంత
కూర్చుండు హనుమంత
రామభక్తుల కెంత
అండవో హనుమంత  ॥నీ ముందు ॥

రామస్వామిని సుంత
నేను పొగడిన యంత
సంతసము నీ‌ కెంత
కలిగెనో హనుమంత  ॥నీ ముందు ॥

అనుసంధానించుకోండి: 
       హనుమంతులవారిని గుర్తించలేకపోయానే!

(జూలై 2013)

పాహి రామప్రభో - 174

రామభక్తమహాశయిలారా

రేపటి నుండి శ్రీరామచంద్రులవారి మానసిక పూజా విధానమును గురించి పద్యాలు చెప్పుకుందాం.

వీలయినంత సులభంగా ద్రాక్షాపాకంలో ఉండేటట్లుగా కందాది చిన్న పద్యాలలో వ్రాయాలని సంకల్పం.

బహుశః ఈ మానసిక పూజావిధానం పద్యాలతో పాహి రామప్రభో పద్యధారావాహికలో ద్వితీయ శతి సంపన్నం అవుతుందని భావిస్తున్నాను.
 
క. శ్రీరామచంద్రప్రభువుల
నారాధించుటకు మించి యానందము సం
సారుల కుండునె మోక్ష
ద్వారము రామార్చనంబు భక్తజనులకున్

(జూలై 2013)

20, జులై 2013, శనివారం

శ్రీ చాగంటివారిపై వివాదం సమంజసమా?

భాస్కరంగారు ఒక టపా వ్రాసారు ఈ‌ విషయం మీద.  అది చాలా చక్కగా ఉంది. నా మాటగా రాద్దాం అనుకున్న ఈ‌ వ్యాఖ్య పెద్దది అయిపోయింది. అందుకని ఈ టపా.

ధూర్జటిగారి  కాళహస్తి మాహాత్మ్యం ప్రబంధంలో, తిన్నడి కథ ఉంది. అందులో  శివబ్రాహ్నణుడు అనే భక్తుడు, బోయవాడు తిన్నడి మొరటుపూజకు లబలబ లాడుతుంటాడు.  అది చూసి శివుడు, ఆ శివబ్రాహ్మణునితో ఇలా అంటాడు:

క. ఠవఠవపడ నేటికి మది
శివగోచర నీకు, నన్నుఁ జెంచొకఁదు శ్రుతి
వ్యవహారేతర మతమునఁ
దవిలి మహాభక్తిఁ గొలువ దయపుట్టుటయున్

గీ. ఆ కిరాతుని పూజ నంగీకరించి
నాఁడ దద్భక్తి నీవును నేఁడు చూతు
గాని నా వెన్క దిక్కునఁ గానకుండ
నడఁగి యుండుము తడయక యతడు వచ్చు

దీనిని బట్టి శ్రుతివిరుధ్ధం అయిన పూజనూ భగవంతుడు అంగీకరించాడు అని తెలుస్తోంది. అయితే, అది అమాయకత్వం‌ కారణంగానే జరిగిన వ్యవహారం.  అందుకే శివుడు అంగీకరించాడు. వేదధర్మం తెలియని వారూ వేదోక్తంగానే పూజలు చేయాలీ, లేకపోతే పాపం దోషం అనటం సరికాదు కదా! అయితే తెలియని వారు చేస్తే శివానుగ్రహం కలిగిందికదా అని తెలిసిన వారూ వేదధర్మాన్ని విడిచి పెట్టటం మహాదోషం.  అనేకమంది నిరక్షరాస్యులకు వేదోక్త విధానాల గురించి అవగాహన ఉండదు.  కాబట్టి అట్లాంటి గ్రామ్యపూజావిధానాలు దోషభూయిష్ఠం అని వాదించరాదు.


ఉపాధిబేధం చేత అధికారబేధం ఏర్పడుతోంది. అన్ని ఉపాధులకూ వేదప్రామాణ్యం అని ఎవరూ పట్టుబట్టరు కూడా.  

శ్రీకాళహస్తీశ్వరశతకంలో ధూర్జటి ఇలా అంటాడు:

ఏ వేదంబు పఠించె లూత భుజగం బే శాస్త్రముల్ సూచె తా
నే విద్యాభ్యసనం బొనర్చె కరి  చెం చేమంత్ర మూహించె బో
ధావిర్భావ నిదానముల్ చదువు లయ్యా కావు మీ పాద సం
సేవా సక్తియె కాక నిక్కమరయన్ శ్రీకాళహస్తీశ్వరా

అందుచేత విద్యాగంధం లేని బోయని భక్తీ, పూజావిధానాలు ఒకలా, వేద విరుధ్దంగా ఉండటంలో ఏ దోషమూ లేదు. విద్యాగంధమూ, వివేకవిజ్ఞానాలూ ఉన్న వారు, తమతమ స్థితికి తగిన ప్రామాణికమైన విధానాలను తప్పరాదు.

శ్రీ చాగంటివారు తమ ప్రవచనాల్లో చాలా స్పష్టంగా వేదప్రామాణ్యవిధిగా ఉన్న విషయాలనే చెబుతున్నానని అంటారు. శ్రుతి ప్రమాణానికి విరుధ్ధం కానంతవరకూ‌ స్మృతులూ ప్రమాణాలే. సృతి, స్మృతులకు విరుధ్దం కానంత వరకూ పురాణాలు ప్రమాణగ్రంథాలే.  ఇతిహాసాలు పురాణసమానాలు. ఐనా, అవి వేదసమ్మితాలుగా ప్రసిధ్ధికి వచ్చాయి.
"వేదవేద్యే పరే పుంసి జాతే థరథాత్మజే వేదః ప్రాచేతసా దాసీ త్సాక్షాద్రామాయణాత్మనా" అని శ్రీమద్రామాయణమానికీ, పంచమవేదం అని మహాభారతానికీ ప్రశస్తి. వాటియందు శ్రుతిప్రతిపాద్యధర్మవ్యవస్థ ప్రతిఫలించటమే దానికి కారణం.

షోడషోపచారాదిక పూజనాలూ, పారాయణాదికాలూ ఋషి ప్రోక్తాలు. వేదసమ్మత విధానాలు. అటువంటప్పుడు లోకాచారంలో వైదికవిధివిధానాలకు ఈ కాలంవారు కొత్తరూపాలు కలిగించుతూ ఉన్నప్పుడు ఆయా కొత్తవిధానాల ఆర్షతను చాగంటి వారు పరిశీలించి, ప్రశ్నించటంలో‌ తప్పు పట్టవలసింది యేమీ లేదు. ఒకవేళ చాగంటి వారు అనాచారాలనూ, దురాచారాలనూ ప్రశ్నించకపోతేనే ఆశ్చర్యపోవాలి.

పూర్వం శ్రీశంకరభగవత్పాదులవారు అవతరించిన సమయంలో కూడా చదువుకున్న వారిలోనూ, వేదప్రామాణ్యతావిరుధ్ధంగా ఆచారాలు చెడి అనాచారాలుగా ప్రబలిపోయిన పరిస్థితి. అటువంటి దానిని ప్రశ్నించి, అటువంటి వివిధమతశాఖలను సంస్కరించి, అనాచారాలను ఖండించి పరిస్థితిని శంకరాచార్యులవారు చక్కదిద్దారు. 

ఎవరికైన కటువుగా అనిపించవచ్చును గాక, నేడూ అటువంటి అవ్యవస్థ యేర్పడి ప్రబలుతోంది. అందుచేత వేదప్రమాణవిరుధ్ధమైన అనాచారాలను శ్రీచాగంటి వంటి వారు ఖండించవలసిన అవసరం కూడా తప్పకుండా తలెత్తుతోంది. 


ఈ నాడు ఎందరెదరు బాబాలు, స్వామీజీలు, గురువులు, యోగులు - వీధివీధికీ భగవదవతారాలమని పూజలందుకుంటూ వెలిగిపోతున్నారో మీకూ‌ తెలుసు కదా? వీటిలో ప్రతివారికి వేలాది దేశవిదేశీ భక్తగణం.  మా స్వామి మాకు భగవంతుడే, ఆయనే సృష్టిస్థితిలయ కారకుడు, ధూపదీపనైవేద్యాలతో పూజిస్తాం - వారికే పురుషసూక్తంతో పూజిస్తాం అని ఈ‌ భక్తులు ఎంత గొప్పగా హడావుడి చేస్తున్నారో చెప్పనలవి కాకుండా ఉంది. కాదంటారా?

ఈ చాగంటివారి ప్రవచనాలమీద  TV9 వారు వివాదం లేవదీసిన నాడే, ఆ చానెల్ వారికి నేనొక లేఖ రాసాను. దానికి జవాబు యేమీ ఇప్పటికీ రాలేదు.  ఆ లేఖ పాఠం ఆసక్తి గలవారికోసం, ఇప్పుడు ప్రకటిస్తున్నాను.

ఆర్యా,
ఈ రోజు మీ ఛానెల్ చూడటం జరగలేదు,  పని మీద సిటీలో తిరుగుతూ ఉండటం వలన.   కొద్ది సేపటి క్రిందట ఇంటర్నెట్లో చూచాను ఒక విషయం.
తెలుగు బ్లాగుల్లో "పారాయణం లో పిడికల వేట" ప్రోగ్రాం పేరుతో మీ ఛానెల్ వారు శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మీద బురద చల్లే ప్రయత్నం చేసినట్లుగా టపాలు వచ్చాయి.  దయచేసి ఒక విషయం గమనించండి, దేనినైనా వివాదాస్పదం అంటూ చిత్రీకరించి వార్తా ఛానెళ్ళు కార్యక్రమాలు ప్రసారం చేయటం వెనుక  ఉద్దేశం తరచుగా సత్యాసత్యాలగురించి కాక సదరు ఛానెళ్ళ ప్రచార తాపత్రయం హెచ్చుగా ఉంటోంది.  మీ ఛానెలు అటువంటి పనులు చేయదని మీరు అనవచ్చు. అది వేరే సంగతి.  కాని వ్యాపారదృక్పధం కాక జనోధ్దరణకార్యక్రమంగా ఏదైనా ఛానెల్ నడుస్తోందని నమ్మేంత అమాయకత్వంలో ప్రజలు లేరని మీతో‌సహా అన్ని ఛానెళ్ళూ గ్రహించుకోవాలి.

మీతో సహా అన్ని ఛానెళ్ళలోనూ చర్చల పేరుతో‌జరిగేవి కేవలం ప్రహసనాలే అని అందరికీ తెలుసు. వంచనలూ ఆత్మవంచనలూ నిష్ప్రయోజనం.

మీరు చాగంటి వారిమీద నిందలు వేయదలచుకుంటే అలాగే కానివ్వండి. ఎటు ఉండే జనం అటు ఎప్పుడూ ఉంటారు.

ఇంత కాలం మీ ఛానెల్ వారు కొంతలో కొంత నయం అన్న అభిప్రాయంలో‌ ఉన్నాను.  ఒక వేళ ఆ అభిప్రాయాన్ని సమీక్షించుకోవలసి వస్తుందేమో‌ తెలియదు.

చివరికి సగటు తెలుగు వాడి పరిస్థితి?  ఏ వార్తా పత్రికలోని వార్తనూ‌ నమ్మే పరిస్థితి లేదు.  ఏ ఛానెల్ వారి కథనాలనూ నమ్మే‌ పరిస్థితి లేదు.  ఇంటర్నెట్‌లో వచ్చే‌ కథనాలకు ఎలాగూ విశ్వసనీయత తక్కువే.  ఘనత వహించిన దొరతనం వారు అనుగ్రహించే వార్తా ప్రసారాలను ఎలాగూ విశ్వసించలేము కదా?  ఇంకా మిగిలిన దారి అంటూ ఉన్నదా?

ఇలాంటి పరిస్థితి మనదేశంలోనే ఉందో ఇతరదేశాలదీ ఇదే‌ కర్మమో తెలియదు.

విశ్వసనీయత గురించి ఆలోచించవలసిందిగా మీతో సహా తెలుగు వార్తామాధ్యమానికి ఇదే నా విజ్ఞప్తి. పనికిమాలిన వార్తాకథనాలూ నిందాపూర్వకమైన మిడిమిడి విజ్ఞానులతో చర్చాకార్యక్రమాలూ కట్టిపెడితే మంచిది.

భవదీయుడు
తాడిగడప శ్యామలరావు.


ఆ వివాదం బయటకు వచ్చిన తరువాత అనేకమంది అనేకరకాలుగా దానిమీద టపాలూ వ్యాఖ్యలూ వ్రాసారు. 

మనవు అని ఒక బ్లాగులోవ్రాసిన టపాలోని అభిప్రాయాల మీద నా వ్యాఖ్యను జోడించాను కూడా.  ఆ బ్లాగుటపా 'కోర్కేలు లేని సంసారి, కోర్కెలు ఉన్న సన్యాసి, ఇద్దరూ "హిందుత్వ"కు దూరంగా ఉన్న వారే.' అని.  మొత్తం నా వ్యాఖ్య అంతా ఇక్కడ వ్రాయటం అనవసరమైన స్థలకాలహరణోద్యోగం కాబట్టి ఒక ముఖ్యభాగం మాత్రం ఎత్తి రాస్తున్నాను:

విషయానికి వస్తే చాగంటి వారు  దైవాన్ని 'తుఛ్ఛమైన' కోరికలు కోరటం సమంజసం కాదన్నారు కాని ధర్మబధ్దమైన కోరికలు కోరరాదని అనలేదు కదా?  ఆర్తోజిజ్ఞాసురర్థార్ధీ అని భగవానుడే చెప్పాడు.  ఇక్కడ అర్థము అంటే ధర్మబధ్ధమైన అర్థము అనే కాని తదన్యం‌ కానేరదు.  కోర్టుకేసులో ఆవలి పార్టీ ఓడిపోవాలని మ్రొక్కు కోవటం చేసిన యిరుపక్షాల వారిలో ఒకరిదైనా అక్రమమైన కోరిక కాదా?  గుర్రప్పందెంలో గెలవాలనో‌ లాటరీ రావలనో కోరుకోవటమూ తుఛ్ఛమే కదా?  పెద్దల వాక్యాలకు సొంతతెలివితో అర్థాలు తీయక ప్రమాణబుధ్ధితో గ్రహించటం నేర్చుకోవటం హితకారి అయిన ఆలోచన అని నా ఉద్దేశం.  ప్రతివారు మాకు మేమే ప్రమాణం అనుకోవటం సంఘవినాశ హేతువు. నేను అల్పజ్ఞుడనని మీ వివేకం మీకు బోధిస్తే నన్ను మన్నించండి.

ఏది ఏమైన ఒక విషయం స్పష్టం. పెద్దలు మనకు నచ్చినట్లే మాట్లాడాలీ లేకపోతే వారు తప్పుచేసినవారూ అనటం హర్షణీయం కాదు.  వారు ఏమి చెప్పినా మన అభ్యున్నతి కోరి చెబుతున్నారు. ఇష్టమైన పక్షంలో, చేతనైనంతవరకూ ఆ మంచి మాటలను ఆదరించి ఆచరించండి.  లేదా ఊరుకోండి.  పెద్దల జ్ఞానంలో లక్షోవంతుకూడా లేని మనం వారిని ఆక్షేపించి నోరుమూయించాలను కుంటే, అది జాతికి మంచి చేయదు. 

నాన్సెన్స్. మాకు మేమే ప్రమాణం అంటారా?  మంచిది. మిమ్మల్ని జయించే వారు లేరు. ఇంక యెవరూ, మీకు మంచి చెప్పలేరు, చేయలేరు. ఇతరులెవరూ కూడా మీకు చెడు చేయలేరు - ఎందుకంటే ఆ చెడేదో మీకు మీరే స్వయంగా చేసుకుంటున్నారు కాబట్టి.  ఇక మీ యిష్టం. 

స్వస్తి.

పాహి రామప్రభో - 173

కం. ఏ రాముని వనజాసన
గౌరీశులు మిగుల గొప్పగా పొగడెదరో
నోరార నట్టి స్వామిని
మీరిన సద్భక్తి పొగడ మేలగు నాకున్

(వ్రాసిన తేదీ: 2013-7-4)

19, జులై 2013, శుక్రవారం

భాగవతం 1.2: శ్రీమహాభాగవతం కథా ప్రారంభం

శ్రీమహాభాగవత పురాణం  మనకు అందివచ్చిన కథ నైమిశారణ్యంలో ప్రారంభం అవుతుంది. ఇది విష్ణుక్షేత్రం. ఇక్కడకు కలి పురుషుడు ప్రవేశించనే ప్రవేశించడు - అది అతనికి అసాధ్యం.  అందుచేత అక్కడ, శౌనకుడు మొదలయిన మహర్షులు, శ్రీమహావిష్ణువును చేరుకునేటందుకు గాను వేయేళ్ళపాటు సత్రయాగం చేసారు. ఆ యాగాన్ని చూడటానికి సూతుడు అనే గొప్ప ఋషిపుంగవులు వచ్చారు. ఆ సూతుడు గొప్ప పౌరాణికుడు.  అంటే భగవంతుని మాహాత్మ్యం వినసొంపుగా కథలుకథలుగా విపులంగా చెప్పే మహానుభావుడు.

ఒకరోజున మునులంతా ఆరోజుకు అవసరమైన యాగసంబంధమైన కార్యక్రమాలు ముగించుకుని సూతమహర్షి దగ్గరకు వచ్చి ఇలా అడిగారు.

క. భూషణములు వాణికి నఘ
పేషణములు మృత్యుచిత్తభీషణములు హృ
త్తోషణములు కల్యాణ వి
శేషణములు హరిగుణోపచిత భాషణముల్

ఓ సూతమహర్షీ, శ్రీహరి కథలు సరస్వతీదేవికి అలంకారాలు. ఆ కథలు పాపాలను పొడిపొడిగా నూరి పారేస్తాయి. ఆ కథలంటేనే మృత్యుదేవత గుండెలు అదిరిపోతాయి. అవి చెవుల బడగానే హరిభక్తుల గుండెలు ఆనందంతో ఎగిసిపడతాయి. ఆ కథలన్నీ జగత్కల్యాణం కలిగించేవి.

ఆ కథలు అత్యంత అద్భుతమైనవి.

సీ. హరికథాకథన దావానల జ్వాలచేఁ
      కాలవే ఘోరాఘ కాననములు
వైకుంఠదర్శన వాయుసంఘంబుచేఁ
      దొలఁగవే‌ భవదుఃఖ తోయదములు
కమలనాభ ధ్యాన కంఠీరవంబుచేఁ
      గూలవే సంతాప కుంజరములు
నారాయణ స్మరణ ప్రభాకర దీప్తిఁ
      దీఱవే షడ్వర్గ తిమిరతతులు
ఆ. నళిననయన భక్తినావచేఁ గాక సం
సారజలధి దాఁటి చనఁగ రాదు
వేయు నేల మాకు విష్ణుప్రభావంబు
దెలుపవయ్య సూత ధీ సమేత

మహాపాపాలనే‌ భయంకరమైన అరణ్యాలు హరికథలు అనే దావానలంతో‌ కాలిపోవే!
వైకుంఠవాసుని దర్శనం అనే ప్రచండ వాయువుతో జీవుల్ని ఈదులాడించి దుఃఖపెట్టే ఈ భవసముద్రం‌ ఇంకిపోదా?
విష్ణు ధ్యానం అనే‌ మహాసింహం దెబ్బకి ఏనుగు లంతేసి ఉండే రకరకాల కష్టాలూ కూలిపోవా?
నారాయణస్మరణం అనే సూర్యరశ్మికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే చీకట్లు విచ్చిపోవా?
విష్ణుభక్తి అనే‌ నావనెక్కి తప్ప భవసముద్రం దాటలేము గదా.

ఓ సూతమహర్షీ అందుచేత మాకు శ్రీమహావిష్ణువు ప్రభావం గురించి విశరీకరించి చెప్పవయ్యా అని అడిగారు.

ఆ సూతమహర్షికి ఆనందం‌ కలిగింది ఈ‌ పరిప్రశ్నకి.  ఆయన మునులతో ఇలా అన్నారు.


ఆ. అతిరహస్యమైన హరిజన్మ కథనంబు
మనుజుఁ డెవ్వడేఁని  మాపు రేపుఁ
జాల భక్తితోడఁ జదివిన సంసార
దుఃఖరాశిఁ బాసి తొలగి పోవు

చాలా సంతోషం. ఈ విష్ణుకథలున్నాయే అవి చాలా రహస్యమైనవి.  అంటే శ్రథ్తాభక్తులు గలవారు శ్రధ్ధాభక్తులు గలవారిని ఆశ్రయిస్తే కాని తెలుసుకోవటానికి సులువుగా దొరకనివి. సంపూర్ణమైన భక్తితో, ఏ మానవుడైతే, నిత్యమూ వాటిని మనస్సులో అనుసంధానం చేసుకుంటూ ఉంటాడో వాడు ధన్యుడు.  వాడికి ఇక సంసారం అనే దుఃఖం లేకుండా పోతుంది.
 
మహాత్ములారా,  వినండి. సాక్షాత్తూ విష్ణుస్వరూపులే ఐన వ్యాసభగవానులవారు తెలుసు కదా? ఆయన శ్రీమహాభాగవతం అనే పేరుగల అద్భుతపురాణాన్ని నిర్మించారు.  అది సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపమే!  దానిని మొదట వ్యాసులవారు తమ కుమారుడైన శుకయోగీంద్రులచేత చదివించారు.  ఆ‌ శుకమహర్షి దానిని పరీక్షిత్తు అనే మహారాజుకు ఉపదేశం చేసారు. ఆ పరీక్షిత్తు పాండవుల మనుమడు.  ఆయన గంగ ఒడ్డున ప్రాయోపవేశ దీక్షలో ఉండగా శ్రీశుకులు వచ్చి ఆయనకు భాగవతం చెప్పారు. అప్పుడు నేనూ అక్కడ ఉండి అంతా భక్తితో‌ ఆలకించాను.  ఆ భాగవతాన్ని మీకు వినిస్తాను.

ఆ మునిశ్రేష్ఠులందరికీ ఆశ్చర్యం‌ కలిగింది. సూతుణ్ణి ఇలా అడిగారు.

మహాత్మా, ఆ శుకయోగీంద్రులు మహా యోగి అని చెబుతారే.  అయనకు కనీస స్త్రీపురుష బేధ దృష్టీ లేదు కదా!  ఆయనగురించి ఒక కథ విన్నాం.  

ఒకసారి శుకుడు గోచీగుడ్డకూదా లేకుండా దిస్సమొలతో అడవిలో పోతూ ఉంటే వ్యాసులవారు వెనక వెతుకుతూ వెళ్ళారు.

ఆ అరణ్యంలో ఒక కొలనులో‌ దేవకన్యలు జలకా లాడుతున్నారు.

శుకుడు ఆ కొలను గట్టు మీద నుండి పోతూ ఉండగా చూసి ఆ కన్యలంతా ఆ మహానుభావుడికి నీళ్లలో నుండే నమస్కారాలు సమర్పించుకున్నారు.

ఇంతలోనే కుమారుడి వెనకాలే నాయనా నాయనా అని పిలుస్తూ వెతుక్కుంటూ వ్యాసమహర్షులవారు వస్తున్నారు.  వారిని చూసి సిగ్గుపడి గాభరాగా ఆ కన్యలు బట్టలు వేసుకుని కొలను వెలువడి ఆయనకు మ్రొక్కారు.

వ్యాసులవారు అమ్మాయిలూ మీరు మా శుకుణ్ణి గాని చూసారా అని ఆడిగారు.

వారన్నారూ, మహాత్మా శుకులవారు ఇంతకు ముందే ఈ దారిన వెళ్ళటం కొలనిలోనుండి అందరం చూసాం అని.

వ్యాసులవారికి ఆశ్చర్యం కలిగింది. అమ్మాయిలూ, నన్ను చూసి మీరు నీళ్ళల్లోంచి బయటికి వచ్చి బట్టలు వేసుకున్నారు.  ముసలి వాడిని నన్ను చూసి సిగ్గుపడ్డారే!  నవయువకుడు, అందగాడు అయిన మా శుకుడిని,  ఒంటిమీద నూలుపోగు లేకుండా వస్తూ ఉన్నవాడిని చూసి, మీకు సిగ్గువేయలేదా అని వారిని వ్యాసులవారు అడిగారు.

అప్పుడు ఆ దేవకన్యలు వ్యాసమహర్షితో,  ఇలా అన్నారు. మహాత్మా,  అతడు నిర్వికల్పుడయ్యా. అతడికి స్త్రీలూ పురుషులూ‌ అన్న బేధం కూడా ఏ మాత్రం లేదు.  అందుచేత అతడి కంట మేము పడినా మేము స్త్రీలమూ తాను పురుషుడనూ అన్న భావన లేశమూ లేని వాడైన ఆ శుకుణ్ణి చూసి సిగ్గు పడవలసింది యేమీ‌లేదు. మీకూ వారికీ‌ చాలా పెద్ద బేధం ఉంది.  అతడు కేవలం పరబ్రహ్మ స్వరూపుడు. 

ఎంత అద్భుతమైన విషయం. ఆహా, ఆ శుకయోగీంద్రులు మహాయోగి, సమదర్శనుడు, మాయను జయించినవాడు, ఆనందస్వరూపుడూ‌ కదా!

అలాంటిది, ఆ శుకయోగీంద్రులు హస్తినాపురం వెళ్ళారా? ఎక్కడా కూడా, అవుపాలు పితికేటంత సమయం ఐనా నిలువని ఆ  మహాత్ముడు పరీక్షిత్తుకి పురాణం వినిపించారా రోజుల తరబడి? ఆ పరీక్షిత్తుకూడా మహాధర్మాత్ముడని విన్నాం. ఆయనకు ఏమి కష్టం వచ్చింది స్వామీ‌, రాజ్యంగీజ్యం వదిలేసి గంగ ఒడ్డున కూర్చుని ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదలటానికి?

సూతపౌరాణికులవారు చిరునవ్వుతో, అంతా చెబుతాను వినండి, అన్నారు.

పాహి రామప్రభో - 172

కం. తెలివిడి విటపపు కొమ్మన
చిలుకలజతవోలె నున్న సీతారాముల్
తలిదండ్రు లఖిలసృష్టికి
కొలువుడు జనులార వారి కూరిమితోడన్

(వ్రాసిన తేదీ: 1-7-2013)

18, జులై 2013, గురువారం

పాహి రామప్రభో - 171

కం. శ్రీరామ పరబ్రహ్మము
నారాధన చేయువార లతి ధన్యులు సం
సారపరాణ్ముఖజీవులు
వారు తుదిన్ హరిని జేరువారు ముదమునన్

(వ్రాసిన తేదీ: 1-7-2013)

17, జులై 2013, బుధవారం

కథ: పెళ్ళిచూపులు

"ఏమిటమ్మా నీ సోది" రవళి చిరాకు పడింది.

రోజూ లాగే ఉదయమే తయారై రవళి ఆఫీసుకు బయలుదేరే ముందు బ్రేక్‌ఫాస్ట్ చేస్తోంది.  ఆమె బ్రేక్‌ఫాస్ట్ అంటే కార్న్‌ఫ్లేక్స్ అండ్ టీ. అంతే.

ఈ లోగా తులసమ్మ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర మరో కుర్చీ‌లో కూర్చుని మొదలు పెట్టింది. "ఈ రోజు హాఫ్‌డే లీవ్ పెట్టి వచ్చేయి.  మధ్యాహ్నం రెండింటికే వాళ్ళు చూపులకు వస్తామన్నారు" అంది కూతురి ముఖంలోకి చూస్తూ. ఆమెకు కూతురితో యేం‌మాట్లాడాలన్నా కొంచెం బెరుకే.

ఈ రోజు మధ్యాహ్నం రెండున్నరకు ప్రాజెక్ట్ రివ్యూ మీటింగ్ ఉంది.  అసలే ప్రకాష్ లీడర్‌షిప్‌లో ఈ‌ ప్రాజెక్ట్ సరిగా నడవటం లేదని తనకి మంటగా ఉంది.  మొన్న క్లైంట్‌ను కన్విన్స్ చేసే సరికి తాతలు దిగొచ్చారు. ఈ రోజు రివ్యూలో కాస్త స్ట్రిక్ట్‌గా ఉండాలి అనుకుంటోందా? వాళ్ళెవరో పళ్ళికిలించుకుంటూ‌ వస్తారట. నాన్సెన్స్ అని రవళికి తిక్కరేగింది.
తల్లితో గొడవకు దిగేదే, కాని యింతలో నాన్నగారొచ్చారు.

మళ్ళీ ఈయన మొదలెడతారు అని విసుక్కుంది మనస్సులో.  కాని నాన్న అంటే భయం కాకపోయినా ఆయన ముందు రవళి యెక్కువగా మాట్లాడదు.  గొడవపడటం లాంటిది ఎప్పుడు అమ్మ తోనే.

వస్తూనే ఆయనకు తల్లీకూతుళ్ళ మూడ్ అర్థమైపోయింది.

"ఈ సంబంధం చూద్దాం‌ అనుకున్నాంగా. నిన్న సాయంత్రం వాళ్ళు ఫోన్ చేసారు. అబ్బాయిని తీసుకుని ఈవేళే వస్తున్నారట. మనం ఆదివారం అనుకున్నాం కాని ఆదివారం అబ్బాయికి వీలవటం లేదట. ఏం చేస్తాం బాగుండదు కదా అని సరే అన్నాను" అన్నారు రాఘవరావు గారు కూతురితో‌ నిదానంగా.

"నాన్నగారూ, ఇవేళ చాలా ముఖ్యం అయిన మీటింగుంది మరి" అంది రవళి తండ్రి ముఖంలోకి చూస్తూ.

"వీలు చేసుకో‌ అమ్మా,  పోనీ ఓ గంట వచ్చి వెళ్ళు మీ‌ అఫీసు దగ్గరేగా ఇక్కడికి" అని సలహా వచ్చింది.

"ఏం చోద్యమండీ.  అమ్మాయిని ముస్తాబు చెయ్యాలా? అలాగే జిడ్డుముఖంతో చూపిస్తారా?" అంది తల్లి కోపంగా.
తండ్రి మాట్లాడకుండా కూతురి ముఖంలోకి చూడసాగాడు.

"అలాగే నాన్నా, ఎలాగో మేనేజ్ చేస్తాను. కాని గంటే. మేకప్ గీకప్ ఏమీ వద్దు. ఎలా ఉన్న దాన్ని అలాగే చూడమనండి. "అన్నట్లు ఆ అబ్బాయి సెల్ నెంబరు తీసుకోమన్నాను కదా ఏంచేసారు డాడీ" అంది  రవళి.

"తీసుకున్నానమ్మా" అంటూ తండ్రి నంబరు ఇచ్చాడు.
"అలా ఫోన్‌లు చేస్తే బాగుండదే" అని తల్లి ప్రాధేయ పడింది. "అయినా ఈ వేళే చూడబోతూ ఫోన్ యెందుకే" అంది ఆశగా

*   *   *

మూడో సారి ట్రై చేయగా ఆదిత్య నంబరు కలిసింది. పరిచయాలయ్యాక రవళికి కలిగిన అభిప్రాయం మర్యాదగానే మాట్లాడుతున్నాడు ఫరవాలేదు అని. 

"రెండు గంటలకు మా యింటికి రావటం సంగతి సరే నండీ. మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి మీరు లంచ్‌కి రాగలిగితే మనం పరస్పరం చర్చించుకోవచ్చును. నాకు పెళ్ళిచూపుల పట్ల వ్యతిరేకత యేమీ లేదు కాని మీతో ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉండదు. ఏదో పర్మిషన్ ఇచ్చి పదినిముషాలు మాట్లాడుకోండి లాంటివి నాకు గిట్టవు. ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోకండి" అని రవళి ఆదిత్యతో‌ నిర్మొగమాటంగా చెప్పింది.

"నాకు ఆ టైమ్‌లో వేరే అప్పాయింట్‌మెంట్ ఉందనుకోండి అయినా మీ కన్నా ముఖ్యం అయింది కాదు, చెప్పండి ఎక్కడ కలుద్దాం.  బైదివే, మీ ఫ్రాంక్‌నెస్ నాకు నచ్చింది" అన్నాడు ఆదిత్య.

లంచ్‌మీట్‌లో రవళి దూకుడికి ఆదిత్య చాలా ఆశ్చర్య పడిపోయాడు. ఇంత చిన్న వయసులోనే ఆమె ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి హోదాలో ఉందని తెలిసి మరో సారి ఆశ్చర్యపోయాడు.

ఆదివారం తన రిటర్న్ జర్నీకి దగ్గర అవటంతో పనుల వత్తిడి వల్ల తీరటం లేదని అందుకే ఈ రోజే చూపులకు రావలసి వస్తోందనీ అతడిచ్చిన సంజాయిషీ విని రవళి ఏమీ వ్యాఖ్యానించలేదు.

ఇద్దరూ ఒకరి అలవాట్లూ అభిరుచులూ ఉద్యోగబాధ్యతలూ వగైరా పరస్పరం విపులంగా చర్చించుకున్నారు.  అంతా బాగుంది అని ఆదిత్య అనుకుటూ ఉండగా రవళి ఒక బాంబు పేల్చింది.

"మీరేమీ అనుకోవద్దు. మీరూ మీ వాళ్ళు మాగురించి వాకబు చేసుకున్నాకే వస్తున్నారని స్పష్టమే.  కాని మీ వాళ్ళేం చెప్పినా మీ గురించి నేనూ వాకబు చేసుకున్నాక గాని ఒక నిర్ణయానికి రావటం కష్టం."

ఆదిత్యకు యేం‌ ఏం చెప్పాలో తోచలేదు.

"నా యెరుకలోనే ఎన్ఆరై సంబంధాలు చేసుకుని దెబ్బతిన్న అమ్మాయిలున్నారు." అందుకని అలా చెప్పవలసి వస్తోంది.

"మీకు ఇంకా వివరాలు యేమన్నా కావాలా? నా వరకైతే ఓకే" అన్నాడు ఆదిత్య.  ఇంత ముందు చూపూ కచ్చితంగా మాట్లాడగలిగే తెగువా ఉన్న అమ్మాయిని వదులుకోవటం అతడికి సుతరామూ ఇష్టం లేదు మరి.

తనకు ఏమేమి వివరాలు కావాలో ఆమె చెప్పినపుడు ఆదిత్య యేమీ ఆశ్చర్య పోలేదు.

*    *    *

సరిగ్గా పెళ్ళిచూపులు పావుగంటలో అనగా రవళి ఇంటికి వచ్చింది. తల్లి కంగారు చూసి చిరాకు పడింది యధావిధిగా.  తల్లి ఏర్పాట్ల హదావుడిలో ఉంది కాబట్టి తండ్రితో ఏకాంతం సులభంగానే చిక్కింది ఆమెకు.  కూతురి మాటలకు తండ్రి ఆశ్చర్య పోలేదు.

అయినా అడిగాడు. "అబ్బాయి ఏమన్నా అనుకున్నాడేమో గమనించావా? " అని

రవళి నవ్వింది సన్నగా.  "అదేం లేదు నాన్నా నేను గమనిస్తూనే ఉన్నాను."

పెళ్ళిచూఫులు జరిగి పెళ్ళివారు వెళ్ళబోయే ముందు అబ్బాయి రవళికి ఒక కవరు ఇచ్చాడు.  "ఏమిటే అది" అంది తులసమ్మ ఆశ్చర్యంగా.

"అబ్బాయి గురించి నేను భోగట్టా చేసుకోవటానికి వివరాలమ్మా" అంది రవళి.
తలసమ్మ బుగ్గలు నొక్కుకుంది.

*    *    *

కొడుకు మధ్యాహ్నం చేసిన నిర్వాకం గురించి సాయంత్రం పుత్రరత్నం నోటి వెంట విని ఆదిత్య తల్లిదండ్రులు నెవ్వెరబోయారు. ఎదిగిన కొడుకు, అమెరికాలో నాలుగేళ్ళుగా ఉంటున్న వాడితో ఈ విషయమై ఏం మాట్లాడాలో వాళ్ళకు అర్థం కాలేదు.

అమ్మానాన్నల దగ్గర ఏ విషయమూ దాచే అలవాటు లేని ఆదిత్య మాత్రం దృఢంగా అన్నాడు.  "ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఆమెకూ‌ నచ్చితే నేను లక్కీ ఫెలోనే"

"నచ్చవలసింది నీకా ఆ అమ్మాయికా?" అంది వర్థనమ్మ ఒళ్ళు మండి.
దామోదరంగారు ఒక నవ్వు నవ్వి ఊరకున్నారు.

*    *    *

దామోదరం గారికి ఆ రాత్రి ఒక పట్టాన నిద్రపట్టలేదు.  కొడుకు చెప్పిన మాటలలో ఎంత నిజం ఉందీ?
తన పెళ్ళిరోజులు గుర్తుకు వచ్చాయి.  తన తండ్రి చండశాసనుడు.

"ఏమిటీ‌ నసుగుతున్నావూ? నాకా మాత్రం తెలియదా మంచి సంబధం అయిందీ‌ కాందీ?  అమ్మాయి లక్షణంగా ఉంటుంది.  మంచి సాంప్రదాయం‌ గల కుటుంబం.  ఇంకేం‌ కావాలోయ్?  నువ్వేడుస్తావని ఫోటో జాతకం తెప్పించాను.  జాతకం లక్షణంగా ఉంది - భేషుగ్గా నప్పుతుంది నీకు. నోర్మూసుకుని చేసుకో బాగుపడతావు" అని హుంకరించాడు.

తనవి ఆధునిక భావాలు. మంచి అమ్మాయిని చూసి ప్రేమించి కానీ‌ పెళ్ళి చేసుకునేది లేదని కాలేజీ రోజుల్లోనుండే ఘట్టిగా తీర్మానించేసుకున్నాడు.  ఉద్యోగం రావటం ఆలస్యం పెళ్ళి సంబంధాలు రావటం మొదలయ్యాయి.  చాలా వరకూ‌ తండ్రి చేసే స్తనశల్యపరీక్షల కారణంగా తనదాకా రాకుండానే సంబంధాలు గుమ్మం నుండే తిరిగిపోయాయి.

ఈ‌లోగా తానూ బాగా ఆలోచించుకుని ఓ‌ నలుగురు అమ్మాయిలని సెలక్ట్ చేసుకున్నాడు కాండిడేట్లుగా.  తీరా వీళ్లల్లో ఎవర్ని ప్రేమించాలో నిర్ణయించుకునే లోగానే ఈ‌ సంబంధం‌ ఆకాశం‌నుంచి అన్నట్లు ఉరుము లేని పిడుగులాగా ఊడి పడింది. తండ్రి సరాసరి డిక్లేర్ చేసేసాడు "ఈ సంబంధం నిశ్చయం చేస్తున్నానూ" అని.

తల్లికి తన గోడు చెప్పుకుని లాభం లేదని తెలుసు.  ఆవిడకు మొగుడంటే చచ్చే భయం.  ఎదురాడటం నచ్చజెప్పటం లాంటి భయంకరమైన పొరపాట్లు ఆవిడ యెన్నడూ చేయదు.  అయినా ఆశ చావక తల్లి దగ్గర కొంచెం రహస్యంగానే తన గోడు చెప్పుకున్నాడు.  తండ్రివి పాము చెవులు.  ఆ మాటలు ఆయనగారి చెవిని పడటమేమిటి అగ్గిరాముడై పోయాడు

"ఇంకా ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాడే నీ సుపుత్రుడూ? ఇప్పటికే వెధవకి ఇరవై ఏడు వెళ్ళొచ్చాయి. లక్షణమైన కుటుంబం. లక్షణమైన అమ్మాయి, లక్షణమైన జాతకం చాలవా? వెధవన్నర వెధవకి ఇంకా ఏం‌ తక్కువౌతున్నాయీ లక్షణాలూ? " అని గర్జించాడు.

తనకి నోరు తడారి పోయింది.

"ఫోటో చూసి తగలడ్డావా లేదా? పిల్ల నీ‌ కంటికి ఎందుకు బాగా లేదూ " అని నిలదీసాడు.

అమ్మాయి ఓ‌ మోస్తరు అందకత్తె అన్న మాట నిజమే‌ కావచ్చు.  తన ముందు కొంచెం చిన్నపిల్లలా ఉంటుందేమో.  కాని తండ్రి ముందు నోరెత్తి అక్షంతలు వేయించుకునే ధైర్యం లేక నీళ్ళు నమిలాడు.

పెళ్ళి చూపులు చాలా చప్పగా జరిగాయి.  అమ్మాయి మౌనంగా కూర్చుంది.  పెద్దవాళ్ళే ప్రశ్నలు వేసారు అమ్మాయిని. తనూ విడిగా మాట్లాడిద్దామనుకున్నా తల్లి "చాల్లే, మీ‌ నాన్నగారికి ఇలాంటి వేషాలు నచ్చవు" అనేసింది.

తన పెళ్ళిచూపుల్లో అమ్మయిలాగా తానూ‌ ఒక బొమ్మలాగా కూర్చున్నాదంతే. అంతా పెద్దవాళ్ళే చూసుకున్నారు. నోర్మూసుకుని చూసి వచ్చాడు.  నోర్మూసుకుని తాళి కట్టి అమ్మాయిని ఇంటికి తెచ్చుకున్నాడు.
ఈ రోజున తామిద్దరం ఆదిత్య యిష్టానికే వదిలేస్తున్నాం!

*    *    *

వర్థనమ్మకు చాలా వింతగా అనిపించి కొడుకు గురించే ఆలోచిస్తోంది.  ఇంత నిక్కచ్చి అమ్మాయిని పెళ్ళాన్ని చేసుకుని వీడు వేగగలడా అని ఆందోళనతో ఆవిడకు ఒక పట్టాన నిద్రపట్టలేదు.

ఆ మాటకు వస్తే తాను మాత్రం నిక్కచ్చి కాదూ. "పెళ్ళిమీద ఏ అభిప్రాయమూ లేదు. డిగ్రీ పూర్తయ్యే దాకా పెళ్ళి మాట తలపెట్టకండి అని అమ్మానాన్నలతో‌ డైరెక్టుగా చెప్పేసింది.

"అవ్వ అవ్వ, ఏం‌ పిదప కాలమే తల్లీ" అని బామ్మ ఒకటే గోల చేసింది.
"ఏరా నా ఘటం వెళ్ళిపోయే లోగా దీని పెళ్ళి చేస్తావా లేదా" అని కొడుకు మీద యెగిరింది.
"అంతా నీ‌ పెంపకం మహిమ తల్లీ, బిడ్డల్ని బాగానే తయారు చేసావూ" అని కోడలి మీద నిప్పులు చెరిగింది.
"ఎంత సాంప్రదాయం ఉన్న కుటుంబం‌ మనదీ, చివరికి అంతా ఇలా అఘోరిస్తున్నారు" అని సణిగిసణిగి వదిలింది.

అమ్మా నాన్నా నచ్చజెప్పిన కొద్దీ తాను కొర్రెక్కి కూర్చుంది.

కాని తన పంతం నెగ్గలేదు. పెళ్ళివారిని మావయ్య స్వయంగా వెంటబెట్టుకుని వచ్చాడు. పెళ్ళికొడుకు బాబాయికి మావయ్యకీ‌ మా చెడ్డ స్నేహంట. తన జాతకమూ ఫోటోనూ‌ మావయ్యే స్వయంగా పెళ్ళికొడుకు తండ్రికి ఇచ్చి వచ్చాడట.  మావయ్యలు ఇలా కూడా కొంపలు ముంచుతారు కాబోలు.

చేసేది లేక ముఖానికి లేనినవ్వు పులుముకుని పెళ్ళిచూపులకు కూర్చుంది. అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చింది. పెళ్ళికొడుకు బాగానే ఉన్నాడు.  కాని తనతో ఒక్క ముక్కా మాట్లాడకుండా ముంగిలా కూర్చుని టిపిన్ చేసి చక్కాబోయాడు. తనతో యేమన్నా మాట్లాడతాడేమో నని ఆశపడితే ఆ ఊసే తేలేదు.  ఉసూరు మంది.  బోడి సంబంధం ఇది కాకపోతే మరొకటి అనుకుంది.

తనని ఒక్క ముక్కా అడక్కుండానే ఆ సంబంధమే నిశ్చయం చేసేసారు.  ఇదికూడా మావయ్య నిర్వాకమేనట. పీకల్లోతు కోపం వచ్చింది.

*    *    *

కూతురు చేసిన నిర్వాకం విన్న తులసమ్మగారికి అంతా వింతగా అని పించింది.  ఈ రోజుల్లో పిల్లలకి ఎంత తెగువా?  అమ్మాయిని చూస్తే ఎంత ఆశ్చర్యం - సరాసరి పెళ్ళికొడుకుని పెళ్ళిచూపులకు ముందే ఇంటర్వ్యూ చేసిపారేసింది!

తనకో డజను సంబంధాలు వచ్చాయి. ఎవరికీ‌ తను నచ్చలేదు. ఎవరికీ‌ జాతకం‌ నప్పట్లేదుట. భలే వంక అందరికీ.  నాన్న దగ్గర దండిగా డబ్బుంటే తన జాతకం మొదట వచ్చిన వాడితో‌ సహా అందరికీ దివ్యంగా నప్పేది మరి. అష్టకష్టాలు పడి చిన్నాన్న ఒక సంబంధం తెచ్చాడు.

వీళ్ళ కేమిటో తన జాతకం బహుచక్కగా నప్పిందట.  నప్పకేం జేస్తుందీ? రెండో పెళ్ళివాడికీ జాతకాల పట్టింపా మరి!

అమ్మ దగ్గర వాపోయింది "నాకీ రెండోపెళ్ళివాడు వద్దమ్మా, నాన్నకు చెప్పూ" అని. తల్లి కళ్ళొత్తుకుంది.  "ఏం చేస్తాం తల్లీ మనదృష్టం అంతే. ఇద్దరక్కల పెళ్ళీ అయ్యేసరికి మా చేతులు వట్టిపోయాయి.  మీ అన్న వెధవ యేదో ఉధ్ధరిస్తాడనుకుంటే వాడికి ఇప్పటికీ సరైన ఉద్యోగం సద్యోగం లేదు. అక్కడికీ‌ మీ‌ నాన్నగారు బాగా వాకబు చేసారు. మంచి సంబంధమే. నువ్వేం దిగులు పెట్టుకోకు" అని నచ్చజెప్పింది.

దేవుడికి ఎన్ని దణ్ణాలు పెట్టుకుందీ తాను, ఆ రెండో పెళ్ళి సంబంధం తప్పిపోవాలీ అనీ? అమ్మానాన్నా విచారించినా తనకు మాత్రం సంబంధం తప్పిపోగానే గంతులు వేయాలనిపించింది.

"ఇంకే చేస్తామండీ" అంది అమ్మ దిగాలుగా ఒక రోజున.  ఆ రోజునే తన అప్రయోజకత్వపు అన్నగారు ఒక సంబంధం తెచ్చాడు.

నూతులో దూకుదాం అనుకుంది తను ఆ దరిద్రపు సంబంధం వివరాల్ని విని. ఆ రెండో పెళ్ళివాడే చాలా బెటర్ అని విచారించింది.

ఆశ్చర్యంగా అ రెండో పెళ్ళి సంబంధం నిశ్చయమై పోయింది. నూతులో దూకవలసిన అగత్యం లేకపోయింది. 

*   *   *

రాఘవరావుకు రెండో పెళ్ళి చేసుకోవటం సుతరామూ ఇష్టం లేదు. నచ్చజెప్పీ నచ్చజెప్పీ లాభం లేక తల్లి బ్రహ్మాస్త్రం ప్రయోగించింది ఉరేసుకుంటానూ అని. చేసేదేమీ‌ లేక సరే నని తులసిని చూడటానికి వెళ్ళాడు.

ఆ అమ్మాయికి తనని చేసుకోవటం ఇష్టం కాదేమో.  అడిగిన వాటికి ముక్త సరిగా సమాధానాలు చెప్పింది.  తనకు వయసు మించిపోక పోయినా రెండో పెళ్ళి రెండో పెళ్ళే కదా. బాధపడుతున్నట్టుంది అనుకున్నాడు.

మెల్లగా తల్లిని ప్రసన్నం చేసుకుని మనసులో మాట చెప్పాడు.  "అమ్మా, తప్పకుండా పెళ్ళి చేసుకుంటాను.  కాని నాక్కొంచెం‌ గడువు ఇవ్వాలి నువ్వు. నువ్వన్నట్లు నాకేమీ వయసు మీరి పోలేదు కదా? నీ‌కెందుకు బెంగ" అని నచ్చజెప్పాడు.

తల్లికి నిజమే అనిపించింది. కొడుకు ఇంకా తాజాగానే ఉన్న పోయిన కోడలి జ్ఞాపకాలను మరువలేక పోతున్నాడని అర్థం చేసుకుంది. "అలాగే నాన్నా" అని సమాశ్వాసించింది. "ఆ అమ్మాయి కూడా చాలా ముభావంగా ఉంది.  పోనీలే వేరే సంబంధం చేసుకుందువు గానిలే అంది"

ఇదంతా రాఘవరావు జ్ఞాపకం చేసుకున్నాడు.

ఒకరోజు అనుకోకుండా తల్లికి తులసీ వాళ్ళమ్మగారు గుడిలో తారసపడ్డారు.  ఏం మాట్లాడుకున్నారో‌ ఏమో.

"తులసి చాలా మంచి పిల్ల నాయనా,  నువ్వు చేసుకుంటే బాగుంటుంది.  మళ్ళీ ఆలోచించు బాబూ" అంది ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర.

రాఘవరావుకు ఏం చెప్పాలో తోచలేదు.  ఈ‌ మధ్య తులసి గురించి ఒకటి రెండు సార్లు ఆమె గుర్తుకు వచ్చి సానుభూతి కలిగింది. ఎందుకో తనకూ స్పష్టంగా తెలియదు.  అదే చెప్పాడు. "సరే నమ్మా, వాళ్ళకు కబురు పెట్టు" అన్నాడు.

ఈ‌ రోజు రాత్రి తనకూ‌ తులసికీ‌ జరిగిన పెళ్ళి చూపులు గుర్తుకు వచ్చాయి రాఘవరావుకు.  ఆ రోజుల్లో తల్లి పోరు పెట్టింది తనను మళ్ళీ పెళ్ళి చేసుకోమని.  ఈ రోజున ఎంతో‌ పోరుబెడితే‌ కాని రవళి పెళ్ళి చూపులకు ఒప్పుకోలేదు. దానికి కెరీర్ పిచ్చి.  తులసికేమో దీనికి యేళ్ళు మీద పడిపోతున్నాయని ఒకటే ఆదుర్దా.

*   *   *


ఉదయమే రవళి టిపిన్ చేస్తుండగా తులసమ్మ టీ తీసుకుని వచ్చింది కూతురికి.
"‌ఈ సంబంధం చేసుకోవే. అనవసరంగా వంకలు పెట్టకు. అబ్బాయి చక్కగా ఉన్నాడు" అంది నచ్చ జెప్పుతున్నట్లుగా.

"ఏ సంబంధం?" అంది రవళి యధాలాపంగా. ఆమె బుర్రనిండా నిన్న సాయంత్రం జరిగిన ప్రాజెక్ట్ మీట్ చర్చ గురించిన ఆలోచనలు. "లాభం లేదు. ప్రకాష్ ఈ‌ ప్రాజెక్టును సరిగా హేండిల్ చేయటం లేదు. దీనిని ఈశ్వర్‌కు అప్పగించాలి. ఈశ్వర్ అంత సుముఖంగా లేడు మరొక ప్రాజెక్ట్ కూడా తీసుకుందుకు. జిఎం గారితో కూర్చుని డిసైడ్ చెయ్యాలి." ఇలా సాగుతున్నాయి ఆమె ఆలోచనలు.  తల్లి వచ్చి డిష్టర్బ్ చేసింది.

తులసమ్మ తెల్లబోయింది. చదవేస్తే ఉన్న మతీ‌పోయిందట.  నిన్నే చూసి వెళ్ళారా? అప్పుడే ఎవరూ అంటా వేమిటే" అంది కోపంగా

"ఓ‌ అదా. సరేలే‌ అమ్మా, నిన్ననేగా ఆదిత్య వివరాలు ఇచ్చాడూ.  చూద్దాం నన్ను వెరిఫై చేసుకోనీ" అంది తాపీగా.

తల్లి మరో మాట అనే లోగా "వెళ్ళొస్తానమ్మా, బై"‌ అనేసి ఆఫీసుకు వెళ్ళిపోయింది.

భాగవతం 1.1: పోతనగారు భాగవత రచనకు పూనుకోవటం

శ్రీమధ్బాగవత పురాణాన్ని మనకు అందించిన మహానుభావులు వేదవ్యాసమునీంద్రులు. వేదవ్యాసులవారు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని అవతారమూర్తులలో ఒకరు.  ఈ‌ విషయం భాగవతంలోనే స్పష్టంగా ఉంది.

సంస్కృతభాషలో ఉన్న భాగవతాన్ని తెలుగులో అందించిన భాగవతోత్తములు పోతనామాత్యుల వారు. ఆపాతమధురమైన కవితాధార పోతన్నగారి సొత్తు. ఆయనది సహజపాండిత్యం.  శ్రీవిశ్వనాథ సత్యనారాయణగారు పోతన్న తెలుఁగుల పుణ్య పేటి అన్నారు. పోతనగారి ఆంద్రమహాభాగవతగ్రంధం ప్రతి తెలుగు యింటనూ తప్పక ఉండవలసిన పుణ్యగ్రంధం.  ఆ మహర్దివ్యగ్రంథాన్ని ఇంట నుంచు కున్న అదృష్టవంతులకు భగవత్కృప అపారంగా లభిస్తుంది.  పారాయణం చేస్తే అది సాక్షాన్ముక్తి ప్రదాయకమే.

భగవంతుని దివ్యలీలావిలాసాలను సంపూర్ణంగా తెలుసుకోగలగటం కేవలం‌ అసాధ్యం.  భగవంతుని తెలియగలవాడు వేరొకడు ఎవ్వడూ ఉండడు.  పోతన్నగారు అందుకే ఇలా అన్నారు

ఆ. భాగవతముఁ దెలిసి పలుకుట శక్యమే
శూలికైనఁ తమ్మి చూలికైన
విబుధవరుల వలన విన్నంత కన్నంత
దెలియ వచ్చినంత తేట పఱతు

సాక్షాత్తూ బ్రహ్మశివులకైన సంపూర్ణంగా భగవత్తత్వం‌ అవగాహన కాదే‌ అంటే నేనెంత? ఏదో‌ పెద్దలవలన తెలుసుకున్నది నాకు అర్థమైనది అయినట్లుగా తెలియజేస్తాను అన్నారీ‌ పద్యంలో పోతనగారు.  

ఆయన గురించి కొంచెం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

పోతనామాత్యుడను అని చెప్పుకున్నారు కాబట్టి ఆయన నియోగి బ్రాహ్మణులు.  వారిది కౌండిన్య గోత్రం, ఆపస్తంబ సూత్రం. భీమన మంత్రి,  కుమారుడు అన్నయ మంత్రి.  అన్నయ, గౌరమాంబల పుత్రుడు సోమన. సోమన, మల్లమ్మల కుమారుడు ఎల్లన.  ఎల్లన మాచమ్మల కుమారుడు పోతనగారి తండ్రిగారు కేతన

ఆ. లలితమూర్తి బహుకళానిధి కేతన
దాన మాన నీతిధనుడు ఘనుఁడు
దనకు లక్కమాంబ ధర్మగేహిని గాఁగ
మనియె శైవశాస్త్రమతముఁ గనియె

కేతనగారు సౌమ్యులు. మంచి విద్యావంతులు. నీతిపరులు, దానశీలురు. ఆయనభార్య లక్కమాంబ. (వారి కుమారుడే పోతనామాత్యుడు)

పెద్దల పేర్లను బట్టి చూసినా, పై పద్యాన్ని గమనించినా పోతన్నగారి వంశీకులు శివారాధనా తత్పరులని అర్థం‌ అవుతోంది గదా?  శివారాధనాతత్పరులైన పోతనగారు తనది పరమేశ్వర కరుణా కలిత కవిత అని చెప్పుకున్నారు వినయంగా.  వారికి శివకేశవలు ఇద్దరూ సమానమే. ఆయన హరిహరుల చరణారవిందాలకు సమంగా మ్రొక్కే విబుధులు.

తన వేయి జన్మల తపస్సు ఫలితంగా తనకు శ్రీమన్నారాయణుడి కథాప్రపంచం అయిన శ్రీమధ్బాగవతం ఆంద్రీకరించాలనే కోరిక పుట్టింది.  అది ఆంద్రుల అదృష్టం. ఆంద్రజాతి చేసుకున్న పుణ్యఫలం.


ఒకరోజున పోతనగారు నదీస్నానం చేసి, మహేశ్వర ధ్యానం చేసుకుంటున్నారు. ఆయన కన్నులు అరమోడ్పుగా ఉన్నాయి. శివధ్యానంలో మైమరచి ఉన్న పోతనామాత్యులకు ఒక అద్భుతమైన దర్శనం కలిగింది.

సీ. మెఱుఁగు చెంగటనున్న మేఘంబు కైవడి
      నువిద చెంగట నుండ నొప్పువాఁడు
చంద్రమండలసుధాసారంబు పోలిక
      ముఖమునఁ జిరునవ్వు మొలుచువాఁడు
వల్లీయుత తమాల వసుమతీజము భంగి
      బలువిల్లు మూఁపున బరగువాఁడు
నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి
      ఘన కిరీటము దలఁ గలుగువాఁడు

ఆ. పుండరీక యుగముఁ బోలు కన్నుల వాఁడు
వెడఁద యురమువాఁడు విపులభద్ర
మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా
కన్నుఁ‌గవకు నెదురఁ‌ గానఁబడియె

ఆ కనిపించిన మహారాజ మూర్తి యెలా ఉంది? మేఘంలా తానూ మెరుపులా తన పత్నీ ప్రకాశిస్తున్నారట.  అంటే సీతమ్మతో కూడి రామభద్రులు విచ్చేసారన్న మాట. ఆయన ముఖ చంద్రమండలం నుండి చిరునవ్వు అనే‌ అమృతం వర్షిస్తోంది.  ఒక పెద్ద నల్లని కానుగ చెట్టును అంటి ఉన్న లతలాగా ఒక పెద్దవిల్లు ధరించి ఉన్నాడు.  పెద్ద నల్లని కొండశిఖరం మీద ఉన్న సూర్యబింబంలా ఆయన నెత్తిన పెద్ద అందకిరీటం.  తామరరేకుల వంటి అందమైన కళ్ళు. వెడల్పైన వక్షస్థలం.  ఎంతో మంగళకరమైన స్వరూపం.

పోతన్నా, నేను శ్రీరామచంద్రుడి నోయీ. శ్రీమహాభాగవతం తెలుగు చేయి. నాకు అంకితం ఇవ్వు. నీకు మోక్షం కలుగుతుంది అని అనుగ్రహభాషణం చేసి ఆ దివ్యమూర్తి అదృశ్యు డయాడు.

పోతన్నగారి పరవశం వర్ణనాతీతం. సాక్షాత్తూ శ్రీరామచంద్రులవారే అనుజ్ఞ దయచేసారు. ఇంకేమి కావాలి తనకు?
అందుకే ఆయన అన్నారిలా

క. పలికెడిది భాగవత మట
పలికించు విభుండు రామభద్రుండట నేఁ
బలికిన భవహర మగు నఁట
పలికెద వేఱొండుగాథ పలికఁగ నేలా

పలికేది భాగవతంట. అది నా నోట పలికించే ప్రభువు రామభదుడే నట! పైగా భాగవతం చెబితే ఇంక చావుపుట్టుకలు లేక మోక్షమే‌ నట.  ఇంక వేరే చెప్పాలా, భాగవతం కాక?

ఆ భాగవతాన్ని తాను ఎలా తన కవిత్వంలో చెప్పదలచుకున్నదీ పోతనగారు సెలవిస్తున్నారు

క. కొందఱకు దెనుఁగు గుణమగుఁ
గొందఱకును సంస్కృతంబు గుణమగు రెండుం
గొందఱకు గుణములగు నే
నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్

కొందరికి తెలుగు కవిత్వం ఇష్టం. కొందరికి సంస్కృతంలో ఉంటే బాగా నచ్చుతుంది. కొందరికి  రెండూ యిష్టమే. సందర్భాన్ని బట్టి నా కవిత్వంతో‌ అందరినీ మెప్పిస్తాను.

భాగవతాన్ని తెనిగించే అదృష్టం సామాన్యమైనది కాదూ, నన్నయ తిక్కన వంటి మహాకవులు దీనిని నాకు వదిలి పెట్టటం నా పూర్వ జన్మల పుణ్యఫలమేనూ‌ అనుకున్నారు.  ఇది చేస్తాను, ఇంక పునర్జన్మ లేకుండా తరిస్తానూ అని సంతోషం వెలిబుచ్చారు.

ఆ భాగవత ప్రశస్తి ఎట్లాంటిదో పోతనగారి మధురపద్యంలో ఇలా పలికింది

మ. లలితస్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం
జులతాశోభితమున్ సువర్ణసుమస్సుజ్ఞేయమున్ సుందరో
జ్వలవృత్తంబు మహాఫలంబు విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్విజ శ్రేయమై

ఈ భాగవతం ఒక కల్పవృక్షం. దీని శాఖలు ఎంతో‌ అందంగా ఉన్నాయి. మహాభాగవతులనే చిలకలు ఈ చెట్టుని ఆశ్రయించుకొని ఆలాపనలు చేస్తున్నాయి. అందమైన లతలకు ఆశ్రయమైనది. అందమైన దేవతలు దీని మాహాత్మ్యం తెలిసి ఆశ్రయిస్తున్నారు. అద్భుత మైన చరిత కలది.  దీని ఫలాలు అద్బుతాలు. ఎంతో విశాలమైన మొదలు కలది. ఇలా ఒక వృక్షంగా అన్వయం.  మరొకరకంగా చూస్తే, ఈ‌ భాగవత గ్రంధంలో విభాగాలైన స్కందాలు చాలా పసందుగా ఉంటాయి - వివిధ శాస్త్రశాఖలను బాగా సమన్వయం చేస్తూ‌ ఉంటాయి. ఈ‌భాగవతానికి మూలమైనది శ్రీకృష్ణతత్వం. ఈ తత్వా న్ని హాయిగా వినిపించినది శ్రీశుకయోగీంద్రులు. ఎందరో‌భగవధ్బక్తుల చరిత్రలు ఈ‌భాగవతవృక్షాన్ని లతల్లాగా ఆశ్రయించి తరించాయి.  మంచి మనస్సు గలవారికి చక్కగా బోధపడే లక్షణం గలది భాగవతం. దీనిని ఆశ్రయించిన వారికి ఫలం మోక్షమే. ఈ భాగవత పురాణానికి పాదు వ్యాసమునీంద్రులు. 

ఎంత అందమైన పద్యం!

పాహి రామప్రభో - 170

మ. నిగమాంతప్రతిపాద్యతత్వవిషయానీకంబు మాబోంట్లు చ
క్కగ నేమాత్ర మెఱుంగలేక చెడి వీకం ఘోరసంసార చ
క్రగతిం జొచ్చి షడూర్ములం బడుచు నీ కారుణ్యలేశంబుచే
నగచాట్లం దరియింప నేర్చెదరు రామా భక్తచింతామణీ

(వ్రాసిన తేదీ: 2013-6-14)