7, మే 2013, మంగళవారం

ఇదింకా బాగుంది

ఇదింకా బాగుంది
      అందరికీ నువ్వేల సమస్యవో తెలియదు
ఇంత పెద్ద సృష్టికి
      యెందుకు పూనుకున్నావో తెలియదు
అంతులేని సమస్యల
      వింతప్రకృతి మాయగోలేమిటో తెలియదు
అంతు తెలుసుకో
      చెంత చేరమనే పంతమెందుకో తెలియదు

నన్నడిగి నువ్వు
      నన్ను సృష్టించలేదనేది బాగా తెలుసును
నిన్ను నిలదీసినా
      యెన్నడూ జవాబు రాదని కూడా తెలుసును
ఎన్నడూ నీ‌ జాడ
      మన్నూ‌ మిన్నుల మధ్య దొరకదని తెలుసును
అన్నీ తెలిసినా
       నిన్ను వెదకటం‌ నేను మాన లేననీ తెలుసును

ఇదింకా బాగుంది
      వదలకుండా నీ కోసం వెదుకుతూనే ఉన్నా
పదిలంగా యెక్కడో
      మెదలకుండా నువ్వు మౌనం గానే దాగున్నా
అదంతే లెమ్మని
       హృదయంలో నిత్యం సరిపెట్టుకుంటునే ఉన్నా
అదోమిటో మరి
       వదలకుండా నిన్ను అనుక్షణం ప్రేమిస్తూనే ఉన్నా

ఇదింకా బాగుంది!

3 వ్యాఖ్యలు:

 1. చాలా బాగుంది. మీ కవితకు పొడిగింపుగా...
  -అంతేమరి, నీకూ నాకూ అభేదమని అనుభవమయ్యేంత వరకూ అన్వేషించడం ఇంకా బాగుంది

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఇదేమి విష్ణు మాయో,

  ఉన్నాడో లేదో, (ఉన్నదో లేదో!) తెలియని వాణ్ణి (ఆవిడని ) పట్టుకుని 'నువ్వెందుకు ఇట్లా చేసేవ్ అంటే ఎట్లా అండీ ! ప్చ్ !


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మీ పద్యాలు చాలా బాగున్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.