17, మే 2013, శుక్రవారం

పాహి రామప్రభో - 109

చం. కలిమియు లేమియుం గలవు కష్టసుఖంబులు మంచిచెడ్డలుం
గలవు వెలుంగు చీకటులు గౌరవలభ్యత మానహానులుం
గల విటువంటి ద్వంద్వముల కన్నిటి కాకరమైన సృష్టి కా
వల గల డెల్ల ద్వంద్వముల భావన మాన్పెడు రామచంద్రుడున్

(వ్రాసిన తేదీ: 2013-5-9)

2 వ్యాఖ్యలు:

 1. ఈ పద్యం చాలా బాగుంది శ్యామలీయం గారు. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ శాక్షి భూతం అనేదీ, పెంజీకటికవ్వల నేకాకృతి వెలుగు నేనతడినే సేవింతున్ అనే రెండూ.. గుర్తుకు తెప్పించారు. కొనసాగించండి.

  ప్రయాణం వలన వచ్చే ఆరు వారాల్లో మళ్ళీ మీ బ్లాగ్ ఎప్పుడు చూస్తానో తెలియదు. చూసినప్పుడు మళ్ళీ కామెంటుతాను. రాయడం మానవద్దు దయచేసి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సంతోషం డిజీగారూ. మీ రుటంకించిన స్తుతిరత్నాలు:

   గురుస్తుతి నుండి:
   బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం
   ద్వంద్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాదిలక్ష్యమ్
   ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం
   భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి

   భాగవతం నుండి:
   లోకంబులు లోకేశులు
   లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం
   జీకటి కవ్వల నెవ్వం
   డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్

   ఆరువారాల మీ ప్రయాణం సుఖప్రదం కావాలని ఆశిస్తున్నాను. ఈ లోగా మరొక 42 పద్యాలు వస్తాయి ఈ శ్రేణిలో. మధ్యమద్యలో చూడటం కుదరక పోతే, తిరిగి వచ్చాక అవన్నీ తీరిగ్గా చదువుకుందురు గాని.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.