21, ఏప్రిల్ 2013, ఆదివారం

కొలను

కాలమేఘవృష్టికల్లోలితం నా మనస్సరోవరం
కోలుకోవటానికి తప్పక కావాలి నీ‌ సహాయ
బాలార్కకోటిసుందతరమైన నీ దరహాసం
నాలో ప్రతిఫలించటం లేదే అని నా విచారం
  
నాలుగుమూలలా నాలుగుపురుషార్థాల ఒడ్లు
కాలం చేసిన దెబ్బలకు చాలా గండ్లు పడ్డాయి
చాలా ఆశాశోకమోహాలచ్చు బురద వచ్చి
నాలో పేరుకుపోయిందనే నా కున్న విచారం

నీ‌ మనసైన నా మనసు కొలను పాడుబడిందే
ఏమని చెప్పేది దాని ఉనికి మొత్తంగా చెడిందే
నా మనవిని యిప్పటికైన నువ్వు వినిపించుకో
ఈ మురికి కొలనికి గట్లు కొట్టి పుణ్యం‌కట్టుకో

నీ దయతో నాల్గు దిక్కులూ కొత్త ఒడ్లు కానీ
ప్రోది చేసుకొని మనస్సరసి జ్ఞానామృతవర్షాన్ని
నీ దరహాసచంద్రికలను ప్రతిఫలించి మురవనీ
నీదైన నా మనసుకొలను నీకే అంకితం కానీ

ఈ కవిత నీలహంస బ్లాగులో ప్రచురించబడింది. చూడండి: నీలహంస బ్లాగులో నా కొలను కవిత

గమనిక:
ఈ కవిత నీలహంస బ్లాగువారి స్థాయికి తగిన రచన కాలేకపోయినందుకు గాను వారిని దయచేసి దీనిని తొలగించవలసినదిగా వారిని యీ రోజున (2013-4-21) ప్రార్థించటం  జరిగింది.