21, ఏప్రిల్ 2013, ఆదివారం

మాయమైన ఊరి కొలను

ఊరి మధ్యన కొలనొక టుంది
కొలని గట్టున కోవెల ఉంది
కోవెల వెనుక తోటొక టుంది
తోట నిండుగా సందడి ఉంది

దగ్గరలోనే బడి ఒక టుంది
బడి పిల్లల సందడి ఉంది
సందడి చేసే పిల్లలందరికి
కోవెలతోట విడిదే నండి

చెట్ల మీద పలు చిలకల కిలకిల
చెట్ల కింద మన పిల్లల కిలకిల
బాలల పరుగుల కటునిటు చెదరి
ఎండుటాకుల గలగల గలగల

మధురఫలాలూ పరీమళాలు
సీతాకోకచిలుకల తళుకులు
ఆటల పాటల ఆనందాలు
బాలలస్వర్గం ముచ్చటలు

ఆటలు ఆడి పాటలు పాడి
కోనేటను జలకాలాడి
గుడి దేవుడితో‌ ముచ్చటలాడి
పెరిగే పిల్లల పల్లె అది

నవనాగరికత నడచి వచ్చినది
వ్యవసాయం నామోషి ఐనది
పిల్లలు పెరిగి ఊరు విడచిరి
పల్లె పెరిగి తన ఉనికి మరచెను

కోవెల దేవుని కైంకర్యానికి
పూలిచ్చే ఆ తోట పోయినది
కోవెల దేవుని నైవేద్యానికి
పళ్ళిచ్చే ఆ తోట పోయినది

ఆ జాగాలో‌ అపార్టుమెంటు
కాంప్లెక్సొకటి వెలసినది
షాపింగ్ కాంప్లెక్స్ క్లబ్బుహౌసులకు
స్వాహా అయినది కోనేరు

ఒకనాడెవరో యెక్కడివారో
నలుగురు గుడికి వచ్చారు
ఊరుమారిన తీరును చూసి
ఆవేదనతో‌ తలచారు

ఊరి మధ్య నొక కొలనుండేది
గట్టున యీ కోవెల ఉండేది
కోవెల వెనుక తోటుండేది
నిత్యం సందడిగా ఉండేది 

కొలనూ‌లేదు నీరూ‌లేదు
బిలబిలాక్షుల పిలుపులు లేవు
పిల్లల సందడి లేనే లేదు
ఊరు ఊరులా లేనే లేదు

కొలని నీటిలో కాళ్ళు కడుగుకొని
దేవుని చూడగ పోలేము
కోవెలతోట చెట్ల నీడలో
కూర్చుని మురిసి పోలేము

ఊహల స్వర్గం చెదరింది
ఊరు పట్నమై పోయింది
ఊరు వదలి పోలేక దేవుడు
ఉసూరుమంటూ ఉన్నాడు


ఈ కవిత నీలహంస బ్లాగులో ప్రచురించబడింది.  చూడండి:  మాయమైన ఊరి కొలను

మనిక:
ఈ‌ కవిత నీలహంస బ్లాగు వారి స్థాయికి తగినట్టిది కానందుకు గాను వారిని దయతో దీనిని వారి బ్లాగు నుండి తొలగించ వలసినదిగా యీ రోజున (2013-4-21) ప్రార్థించటం‌ జరిగింది.