10, ఏప్రిల్ 2013, బుధవారం

నినుగూర్చి పలికితే విను వారు లేరే

నినుగూర్చి పలికితే విను వారు లేరే
ను చింత వినవయ్య మనసంత నిండెనే

జనులకు చవులూరు స్వల్పవిషయములపై
పనిగొని పలుకుట నా వలన కానే కాదు
యను నిత్యమును నిన్ను గొనియాడు వాడ నే
మునుకొని దుర్విషయముల నెట్లు తవుదు

పదిమంది మధ్యన నిలచి పరమాప్త నినుగూర్చి
ముదమున పలికేను ముందు చూపే లేక
మదిలోన శ్రద్ధ లేని మనుజుల కాధ్యాత్మ
విదులకు హితమైన విషయము లెటు సొక్కు  

జగ మొల్లని విషయసంచయ మేమని నేను
తగునని వివరింప తహతహ లాడేను
మొగము మొత్తెను లోక ముండు తీరును చూచి
జగమేలు రామయ్య తగు దారి చూపవయ్య

8 వ్యాఖ్యలు:

 1. ఉన్నామండీ! లేరని దిగులుపడద్దు, కొద్దిగా ఆలస్యమేమో తప్పించి.
  మీకు మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభకామనలు

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శర్మగారు,
   ఎందుచేతనో గత కొద్ది కాలంగా వ్రాయాలనే ఆసక్తి సన్నగిల్లుతోంది.
   ఈ మధ్య 4వ తారీఖు నుండి పూతన అని ఒక ఖండకావ్యం బ్లాగులో నేరుగా వ్రాస్తున్నాను.
   జనులకేమీ‌ ఆసక్తి కలుగలేదు.
   అరసికాయ కవిత్వ నివేదనం‌ శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ అని కవులు మొత్తుకుంటారని కళాశాలలో మా తెలుగు అధ్యాపకులవారు ఒకసారి నాతో‌ అన్నారు. ఇప్పుడు అనుభవం లోనికి వస్తున్నది సుమండీ.
   అలాగే ఈ మధ్యకాలంలోనే పులిహోర అని ఒక కొత్తవృత్తం ఒకటి అంతర్జాల అష్టావధానం సందర్భంగా ప్రతిపాదించాను. దాని గురించి యీ భ్లాగులో వ్రాస్తే పులిహోర అన్ని పేరువల్ల కాబోలు మంచి స్పందన వచ్చింది!

   తొలగించు

 2. శ్యామలీయం గారు ,

  పైకి చెప్పగలిగినా , చెప్పలేకపోయినా ఈ నాడు అందరి మనసుల్లో ఇదే ఉన్నదండి .
  చక్కగా చెప్పారు.

  శర్మ ఝీ ఎస్
  నా ఆలోచనల పరంపర బ్లాగు

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మిత్రులు శ్యామలీయం వారు,
  దీనికి నేనొక చిట్కా కనిపెట్టేనోచ్! టపాలో రాస్తున్నా వేచి చూడండి, నాదీ అదే మనఃస్థితి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. శ్యామలీయా ,నా కథ పదుగురి కోసమయా ! కాని ఆ పదుగురు ఏక కాలం లో లేరయా అంటున్నా రండీ స్వామి వారు ! - హరి కథ, హరిత కథ ! ఎల్ల కాలం ఉండేది దాన్ని రాయటం లో చింత వలదు శ్యామలీయం వారు, పదుగురు ఇప్పుడు చూడ లేదే అని.


  జిలేబి.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. శ్యామలీయం గారూ! ఉగాది శుభాకాంక్షలు. మీరు, మేము,మనము కోరుకున్న విధంగా ఈ ఏడాది నేటి జనులలో, నెటిజనులలో మార్పు రావాలని ఆశిద్దాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. శ్రీ గురుభ్యోనమః
  అయ్యా మీరు ఇలా మాకు రామరసామృతపానము చేయిస్తూనే ఉండాలనీ ఆ రామనామామృతపు మత్తులో మేమెప్పుడూ ఓలలాడాలని కాంక్షిస్తూ.. ఈ విజయ నామ నూతన సంవత్సర ఉగాది మీకు మీకుటుంబీకులకు సకల శుభప్రదమైన విజయాలను అందించాలని ఆ పరాదేవతను ప్రార్థిస్తూ శుభాకాంక్షలతో

  శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.