18, అక్టోబర్ 2012, గురువారం

ఇంతదాక నాతో నీవు యెన్ని సుద్దు లాడితివి

ఇంతదాక నాతో నీవు యెన్ని సుద్దు లాడితివి
యంతలోనె నే మాయెర యలిగి కూరుచుంటివి

నీవు పలుకు సరసోక్తులకు నేను నవ్వ మరచితినో
నీవు తెలుపు జయగాధలను నేను పరవశించి విననో
నీవు పలుకులాడుచు నుండ నేను పలుకదొడగి నానో
నీవు కులుకులుడిగి యిటుల నేల యలుగ వలసె నయ్య

అంతరములు మరచి నేను అధికములు పలికి నానో
వింతవింత చేష్టలతో విసువుబుట్ట జేసినానో
అంతుపొంతు లేక పలికి యలుపు కలుగ జేసినానో
యింత యలుక నీకు కలుగ నేని తప్పు చేసితి నయ్య

పెక్కుడు తప్పులను నేను వీరిడితనమొప్ప జేసి
మ్రొక్కినంత నవ్వుట నీకు మొదటినుండి పరిపాటి కద
నిక్కువముగ నీవు నేను నొక్క టన్నది నిజమై తేను
చక్కగాను కోపముడిగి సాదరముగ పలుక వయ్య

 

1 వ్యాఖ్య:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.