8, సెప్టెంబర్ 2012, శనివారం

తప్పో ఒప్పో చేసితి తనువిచ్చి త్రోసితివి అప్పటికీ నాకెంతో చనువిచ్చి బ్రోచితివి

తప్పో ఒప్పో చేసితి తనువిచ్చి త్రోసితివి 
అప్పటికీ నాకెంతో చనువిచ్చి బ్రోచితివి


అందు చేత నా వాడ వని నమ్ముకొంటి నీ
యందు నమ్మకముంచి యవనిపై నుంటి నా
బందుగుల యందు నిన్నెపరమాప్తు డంటి నిం
కెందుకురా అంటిముట్ట కుందువురా యంటి

మింటి మీది చందురుని మించిన చల్లని వాడ
జంట బాసి యుందువిది జంకించును నన్ను
వెంటనే యలుక మాని వెనుకటి తీరుగను
కంటికి తోచగదయ్య కరువు తీర్చవయ్య


హృదయమందు స్థిరవాసము నేర్పరచితి నీకు
సదయ యింకేల జాగు సరగున దయచేసి
ముదము  మీర తొల్లిటి వలె పదిలంబు గాను
వదలక నా చెలిమి నుండ వయ్య నా స్వామి

1 వ్యాఖ్య:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.