20, జులై 2012, శుక్రవారం

మహాభాగవతాంతర్గతసృష్టిక్రమం వివరణము - 3

(వివరణము యొక్క లంకెలతో సహా సృష్టిక్రమం పూర్తి పాఠం ఇక్కడ చూడండి.)

మూలము: నారాయణచరణకమలభక్తిపరాయణత్వంబునం జనినవారు నిజేఛ్ఛావశంబున నిరర్గళగమనులై బ్రహ్మాండంబు భేదించి మహోన్నతవైష్ణవపదారూఢులై తేజరిల్లుదురు. 

వివరణము: బ్రహ్మను సేవించి పొందేది ఆకల్పాంతబ్రహ్మలోకనివాసం అని తెలుసుకున్నాం కదా.  తరువాత వాక్యంలో నారాయణ భక్తునికి లభించేది యేమిటో చెప్పుతున్నారు.

శ్రీమన్నారాయణుని సేవించేవారికి బ్రహ్మను సేవించే వారికన్న ఉన్నతమైన స్థితి కలుగుతుంది నిస్సందేహంగా.  అటువంటి విష్ణుభక్తులు బ్రహ్మాండాన్ని అక్షరాలా బ్రద్దలు కొట్టుకుని ఆవలకు వెళ్ళగలుగుతారు!  ఎందుకు అలా వెళ్ళటం? బ్రహ్మాండమంటే సృష్టి.  సమస్తమూ యీ సృష్టి లోనికే వస్తుంది.   సమస్త  చరాచరాలలూ అందులోనివే.  సురగరుడోరగయక్షకిన్నరనరాది సమస్తజీవులూ సృష్టిలోని వారే.   ఇంద్రాది  దేవముఖ్యులేమి, చివరకు బ్రహ్మకూడా.  అయితే విష్ణువు సృష్టికే అధినాధుడు, దానికి ఆవలి వాడు.

సాధారణ సృష్టి చేసేవాడు బ్రహ్మ అయినా, అసలు బ్రహ్మాండాన్నే సృజించేవాడు విష్ణువు.   విష్ణువు బ్రహ్మకే తండ్రి అని తెలుసు కదా! ఈ గీతా శ్లోకం (విభూతియోగం లోనిది) చిత్తగించండి.

న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః

ఈ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ స్పష్టంగా  అందరికంటే, దేవతలు మునులూ  అందరి కంటే కూడా తానే ప్రధముడనని తన పుట్టువు వీరెవరికీ తెలియదనీ చెబుతున్నారు.

అలాగే
సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్
 కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్

 కల్పం అంతమైనప్పుడు సమస్త భూతములూ  నా యొక్క ప్రకృతిలో లీనమై పోతున్నాయి. తిరిగి వాటిని  మరల కల్పం ప్రారంభంలో నేను సృష్టిస్తున్నాని అని శ్రీకృష్ణపరమాత్మ ఇక్కడ చెప్తున్నారు.

ఈ ప్రమాణాలు చాలు. శ్రీవిష్ణుదేవుడే సమస్తమైన సృష్టికీ మూలాధారం అని తెలుసుకోవటానికి. ఆయన ఈ సృష్టికి ఆవలి వాడే కాని మనలాగా బ్రహ్మాదులలాగా సృష్టిలోని వాడు కాదు.

విష్ణుపదం అంటే విష్ణులోకం (వైకుంఠం) సృష్టికి వెలుపలిది. బ్రహ్మాండంలో చిక్కుకున్న వారికి అందనిది.  విష్ణుభక్తులు బ్రహ్మాండాన్ని పగులకొట్టుకొని ఆ వైకుంఠాన్ని చేరుకుంటారు.    అంతే కాదు వారికి అలా వైకుంఠాన్ని చేరుకుందుకు  ఏ విధమైన అర్గళమూ (అడ్డంకి) ఉండదు.  విష్ణు భక్తులకు ఏ విషయంలోనూ అడ్డంకీ, మరొకరి  అనుమతీ అవసరం లేదు ఏ విషయంలోనూ.  అంతా వారి  ఇఛ్ఛప్రకారమే (యిష్టం మేరకే). అందుచేత శ్రీమన్నారాయణుని చరణకమలాలను సంపూర్ణమైన భక్తితో సేవించి శరీరత్యాగం చేసిన వారు సంతోషంగా యిష్టపూర్వకంగా, యే అడ్డంకీ లేకుండా నారాయణుని నిజధామం అయిన వైకుంఠం చేరుకుంటారు.   ఇదే పరమోన్నతమైన ప్రాప్తిస్థానం - దీనికి మించినది యేదీ లేదు.  అటువంటి పుణ్యధామం చేరుకున్న విష్ణుభక్తులు  ఇతరేతరములైన ఉపాసలచేత తక్కువ స్థాయి లోకాలకు చేరుకున్నవారికి,   అలాగే సృష్టి లోని అన్యులందరికీ తేరి చూడరాని తేజస్సును పొందుతారు.

ఇక్కడ బ్రహ్మపదం చేరుకున్న వాళ్ళకూ విష్ణుపదం చేరుకున్నవాళ్ళకూ తారతమ్యం చూడండి.   బ్రహ్మపదం చేరుకున్న వాళ్ళకు బ్రహ్మతోనే అవసానం.  ఆతరువాత మళ్ళీ సృష్టిచక్రంలోనికి రాక తప్పదు.  కాని  విష్ణుపదం చేరుకున్నవాళ్ళది మహోన్నతమైన స్థితి. శ్రీ మహావిష్ణువుకు చ్యుతి లేదు.  ఆయన అచ్యుతుడని కదా  ప్రతీతి.  అందుచేత ఆయనను చేరుకున్న వాళ్ళకూ చ్యుతి లేదు.  వారికి యీ సృష్టిలోనికి వచ్చే పనే లేదు.   అదే పరమపదం. అదే మోక్షం.  అంటే సృష్టి చక్రం నుండి విడుదల పొందటం.  అంతకు మించి యేమీ లేదు -ఉండే అవకాశమే లేదు.

ఈ వాక్యంలో బ్రహ్మాండం అన్న మాట వాడబడింది. విష్ణుభక్తులు బ్రహ్మాండాన్ని పగులగొట్టుకొని మరీ మోక్షం సాధిస్తారని ప్రతిపాదించబడింది.  అయితే ఈ బ్రహ్మాండం అనేది యెలా ఏర్పడిందనే విషయాన్ని ముందు రాబోయే వాక్యాల్లో వివరించటం జరుగుతుంది.  అందుకే బ్రహ్మాండం అనే మాటకు పెద్దగా వ్యాఖ్యానించటం చేయ లేదు.