24, అక్టోబర్ 2011, సోమవారం

తెలియగ నా కేల తెలిసినదే చాలు

తులలేని  యీ సృష్టి యేరీతి గలిగెనో
    తెలియగ  నా కేల తెలిసినదే చాలు
కలిగిన యీ సృష్టి యే రీతి నిలచునో
    తెలియగ  నా కేల తెలిసినదే చాలు
విలయమీ సృష్టికే విధముగా గలుగునో
    తెలియగ  నా కేల తెలిసినదే చాలు

తెలిసిన దొక్కటే తెలియగ తలపోసి
   తెలియ నేరక చాల విలవిల లాడక
తెలిసిన కొలదియు తెలియరానిది చాల
   గలదని తెలియచు గిలగి లాడక
కలిగిన తెలివేదొ కలిగె నిదియే చాలు
   కలవు నీ వన్నిటి కని మిన్నకుంటిని

ఒకవేళ నీవునే నొకటిగా లేకున్న
    నిను గూర్చి తెలియగా వలెనయ్య నాకు
 సకలాత్మరూప  నా స్వస్వరూపము చూడ
    నది నీకు ప్రతిబింబ  మై యుండు నన్న
అకళంక సత్యమే నా యాత్మ నిండినది
    యదియె చాలని తృప్తి పడి మిన్నకుంటిని