31, అక్టోబర్ 2011, సోమవారం

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యనగా శుధ్ధ పరబ్రహ్మమే.

శ్రీ  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యనగా శుధ్ధ పరబ్రహ్మమే.  ఇది యెట్లో యిచ్చట క్రమనిరూపణము సేయబడును.

మొదటగా నొక వైచిత్రిని గూర్చి ప్రస్తావించవలసి యున్నది.  అదియును శివకుటుంబమును గూర్చి.  శ్రీ  మన్మహాగణపతి  యనగా యమ్మవారి మానసపుత్రుడు. ఇది యందరకును తెలిసిన కధయే.   గణపతి స్వామివారి జన్మ వ్యవహారమందు సదాశివుని ప్రమేయము లేదు.  ఆయన జగన్మాతృస్వరూపమైన దివ్యచైతన్యమునకు శిశువుగా తత్ప్రతీకగా నవతరింనాడు.  శ్రీ  సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి  జన్మకథ కూడ జగత్ప్రసిధ్ధమైనదే.  తారకాసురసంహారమునకు జగత్పితరుల సంతానము యొక్క సముధ్భవమునకు సమస్త దేవలోకమును ప్రతీక్షించుచుండిన సమయము.  శివపార్వతుల కబేధము.  శివుడు శుధ్ధపరబ్రహ్మస్వరూపము కాగా జగన్మాత తఛ్ఛైతన్యమూర్తి.  శుధ్ధపరబ్రహ్మము ఉదాశీనము. దానికి కర్తృత్వాదులు లేవు. కాని తారకాసురవధ కొరకు శివుని కుమారుడు కావలెను.  ప్రపంచము యొక్క స్థితిని పరిరక్షించుటకు సదాశివుడు స్వాత్మారాముడైయుండి సంకల్పము చేసినాడు.   చైతన్యమును పొందినాడు.  దీనినే శివపార్వతులు దివ్యశృంగారముగా నభివ్యక్తీకరించుచున్నాము.  ప్రకృతిపురుషులసమాగమముగా నేర్పడునది సృష్టి. కాని సాధారణసృష్టివలన తారక సంహారము సిధ్ధించదు.  స్వయముగా  పరబ్రహ్మమే దానికి కర్త గావలసియున్నది.  ఇచ్చట పురుషుడు, అనగా  పరబ్రహ్మమైన శివుని ప్రచోదనము చేయుట వరకే ప్రకృతి  యొక్కయనగా పార్వతి యొక్క చైతన్య శక్తి నిర్వహించవలసిన పాత్ర యగుచున్నది.

శృతి ప్రకారము 'ఆదౌ మహత్' అనగా నోం ప్రధమముగా నుండునది మహత్తు.  అదియే శివస్వరూపము.  పిదప దివ్య సృష్టిక్రమమున్నది.  మహదాకాశః.  అనగా మహత్తునుండి యాకాశ మేర్పడుచున్నది.   ఆకాశమనగా విస్తరించుట.  అనగా యేవిధమైన వ్యక్త వికారములును లేని పరబ్రహ్మము ఒకానొక స్వరూపముగా విస్తరించి బహిర్వక్తమగుట.   ఆత్మావై పుత్రనామాసి యను శృతి ననుసరించి శివుడే తనను తాను క్రియారూపుడై విస్తరించుటకుగాను చేసిన సంకల్పమే ఆకాశ శబ్దముచేత నిచ్చట ధ్వనించును.  ఇప్పుడు, 'ఆకాశా ద్వాయుః' అనునది అనుసంధానము చేసికొనవలయును.  సంకల్పమునుండి పదార్ధముగా బ్రహ్మము మూర్తిమంతమగుట నిది సూవించును. ఇచ్చట వాయువనగా శివ తేజమే.  పౌరాణికముగా జూచినచో శివతేజ మగ్ని యందు ప్రవేశించినది.  తత్వార్ధమేమనగా శివతేజమే యగ్ని స్వరూపమైనది.  పురాణము ప్రకారము శివతేజము అగ్ని ముఖముగా జలములందు ప్రవేశించినది.  అనగా,  శివతేజము జలము యొక్క స్వరూపమును స్వీకరించినది.  పిదప జలస్వరూపమునుండి పృధ్వీ స్వరూపమును బొదుట తటస్థిచుటను మనము గ్రహించ వచ్చును.  పౌరాణిక కధప్రకారము గంగనుండి శివతేజము శరవణముద్వారా ఒడ్డు చేరినది కదా.  ఆ శిశువే శ్రీ  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ శరవణమనునది మరల మంత్రశాస్త్రరహస్యమై యున్నది. అది మనము వేఱుగా చర్చించ వచ్చును.  కధలో ఆరుగురు మాతృకలు శిశుస్వరూపమును గ్రహించిన శివతేజమునకు తల్లులై సాకుట యున్నది.  ఇచ్చట షణ్మాతృకలనగా మంత్రరాజమయిన గాయత్రియొక్క స్వరూపము నందు చెప్పబడిన షట్కుక్షులే.  గాయత్రి దివ్యచైతన్యము యొక్క మంత్రస్వరూపము.   కారణార్ధముగా రూపధారణము చేసిన పరబ్రహ్మములోనికి షణ్ముఖముగా దివ్యచైతన్యము ప్రసారమగుటయే మాతృకలు సుబ్రహ్మణ్యుని పోషణచేయుట.   మరియొక విధముగా  చెప్పవలెనన్న పరబ్రహ్మము రూపధారణము చేసిన పిదప తత్సరూపమును  పరబ్రహ్మము యొక్క దివ్యచైతన్యము  షట్చక్రముల రూపములో ప్రవేశంచి శక్తికూటమియై పోషించుట.  భూమియే అన్నమని యుపనిషద్వాక్యము.  యీవిధముగా శుధ్ధచైతన్యము పంచభూతములను ఉపాధులుగా గొనుచు దివ్యావతారస్వీకారము చేయుట నిరూపితమగుచున్నది.  శివపార్వతుల కబేధము. ఇదియే ప్రకృతి పురుషుల యొక్క అబేధ తత్వమును.  మున్నే చెప్పిన యటుల ఆత్మా వై పుత్ర నామాసి యని శివుడే  లోక సంగ్రహార్ధము సుబ్రహ్మణ్యనిగా నవతరించుట తటస్థించినది.  సాక్షాఛ్ఛివ స్వరూపుడగు శ్రీ సుబ్రహ్మణ్యమూర్తి కేవల పరబ్రహ్మ స్వరూపమే యని యిట్లు యెఱుక యగుచున్నది.

శ్రీ  సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి వల్లీ దేవసేనలను పత్నులిర్వురు గలరని చెప్పుదురు.  ఇట్లు చెప్పుటలో సాంకేతికమైన వ్యవహారము చాల గలదు.  వల్లి యనగా సామన్యార్ధము  లత.  ఇచ్చట యీ వల్లీ శబ్దము చేత చెప్పబడుచున్నది యొకవిధముగా చూచినచో సుషుమ్న యను నాడి. మరియొక విధముగా  వల్లీనాధుడనినప్పు డొకటి గాక సమస్త వల్లీ సమూహమునకు నాధుడని స్ఫురించును. అనగా దేహమందున్న సమస్త నాడీ మండచమునకును అధిపతియని. రెండవ భార్య పేరు దేవసేన యని గదా.  ఇచ్చట దేవ శబ్దము నందు ద్యుః అనగా చేత కాంతి యని యర్ధము ప్రకాశించుచుండగా దేవ శబ్దార్ధముగా కాంతిమంతమైన మూర్తులు చెప్ప బడుచున్నవి.  అనగా నవి యన్నియును తేజోవంతములైన మంత్రములయొక్క స్వరూపములు.  దేవసేన యనగా నట్టి మంత్రముల సమూహము.  వాడుక యందు కూడ దేవతలు  మంత్రస్వరూపులును, మంత్రములకు వశులనుటలోను గల భావ మిదియే.  వల్లీనాధుడని చెప్పబడు దైవ స్వరూపమనగా వివధములైన యంత్రముల యందు సుష్టువుగా సుప్రతిష్టితమైన శక్తులయొక్క సమాహారమని చెప్పుటయే.  ఇచ్చట సమయమతము ననుసరించి శ్రీచక్రాది దివ్య యంత్రములయొక్క శక్తులచేత తెలియబడు భగవత్స్వరూపమని గ్రహింపవలయును.   దేవసేనా నాధస్వరూపమనగా సమస్త మంత్రాధిష్టాన దైవతముల యొక్క స్వరూపని చెప్పుటయే.  ఈ విధముగా శ్రీ  సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారనగా సమస్త యంత్ర మంత్రాధిష్టాతృ స్వరూపమైన పరబ్రహమమే యని రూడిపడుచున్నది.

శ్రీ  సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని సర్పరూపముగా తరచు  భావించుట గలదు. దీని భావము గూడ విచారించవలసి యున్నది.  తత్వమసి మొదలయిన శృతివాక్యములచేత జీవ బ్రహ్మముల కైక్యత నిరూపితమై యున్నది.  జీవుని యందు శరీరమును నాడులు నియంత్రించుచుండగా నట్టి నాడీ మండలము షట్చక్రములచేత పరిపాలించబడుచున్నది.  పరబ్రహ్మముయొక్క ప్రతీకయైన కుండలిని యను శక్తి తొలి చక్రమైన మూలాధారమునందు సర్పమువలె చుట్టుకొనియుండును.  ఆర్షమైన యోగముచేత దానిని  మేల్కొలిపి క్రమముగా నొక్కొక చక్రమునుండి తుట్టతుది చక్రమైన సహస్రారమునకు గొనిపోవలయును.  సహస్రారమునందు చేరుట యనగా దివ్యత్వమును పొందుట.  అనగా ఆత్మసాక్షాత్కారమును పొంది 'అహం బ్రహ్మాస్మి' అను యెఱుకను బొంది తరించుట.  ఇదియే  భారతీయమైన  యోగసాధనా క్రమము.  స్వామివారి యందు ఆపాదించబడు సర్పస్వరూపము యీ కుండలినీ ప్రతీకయే. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి  చెప్ప బడు ముఖములారునూ శరీరంలోని షట్చక్రములకు ప్రతీకలు. స్వామి యారాధనమును కుండలినీ యోగసాధనముగా గ్రహించుటయే శ్రీ  సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని సర్పరూపముగా పూజించుట యందలి రహస్యము.  

ఈ విధముగా శ్రీ  సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి తత్వమును గ్రహించుట యనగా శ్రీ స్వామివారిని కేవల శుధ్ధబ్రహ్మస్వరూపులుగా గ్రహించి అద్వైత సిధ్దికై యోగసాధనము చేయుట యని తెలియబడుచున్నది.   ఇది నిరూపిత మగు మోక్షమార్గము.

24, అక్టోబర్ 2011, సోమవారం

తెలియగ నా కేల తెలిసినదే చాలు

తులలేని  యీ సృష్టి యేరీతి గలిగెనో
    తెలియగ  నా కేల తెలిసినదే చాలు
కలిగిన యీ సృష్టి యే రీతి నిలచునో
    తెలియగ  నా కేల తెలిసినదే చాలు
విలయమీ సృష్టికే విధముగా గలుగునో
    తెలియగ  నా కేల తెలిసినదే చాలు

తెలిసిన దొక్కటే తెలియగ తలపోసి
   తెలియ నేరక చాల విలవిల లాడక
తెలిసిన కొలదియు తెలియరానిది చాల
   గలదని తెలియచు గిలగి లాడక
కలిగిన తెలివేదొ కలిగె నిదియే చాలు
   కలవు నీ వన్నిటి కని మిన్నకుంటిని

ఒకవేళ నీవునే నొకటిగా లేకున్న
    నిను గూర్చి తెలియగా వలెనయ్య నాకు
 సకలాత్మరూప  నా స్వస్వరూపము చూడ
    నది నీకు ప్రతిబింబ  మై యుండు నన్న
అకళంక సత్యమే నా యాత్మ నిండినది
    యదియె చాలని తృప్తి పడి మిన్నకుంటిని

19, అక్టోబర్ 2011, బుధవారం

నీకూ నాకూ మధ్యన అడ్డంకు లెందుకయా

నీకూ నాకూ మధ్యన
అడ్డంకు లెందుకయా
అవితొలగే దెట్లాగో
నువు తెలిపే దెప్పుడయా

నీకూ నాకూ మధ్యన
యీలోక మనే దొకటుంది
తానే నిజమని అంటుంది 
నను పోనీయనని అంటుంది

నీకూ నాకూ మధ్యన
యీకాల మనే దొకటుంది
తరచుగ కాటేస్తున్నది
నిను మరచేలా చేస్తున్నది

నీకూ నాకూ మధ్యన
యీ జ్ణాన మనే దొకటుంది
అది ఉందా నేనే లేనుగా
అది లేదా నీవే లేవుగా

16, అక్టోబర్ 2011, ఆదివారం

మనసున తోచిన మహితమూర్తి

మనసున తోచిన మహితమూర్తి
యే మనుకో నిను పోనీయను

లోలో నిండిన నీ మూర్తిని నే
చక్కగ పదిలం చేయాలంటే
ఒక బొమ్మ చెక్కటం రాదు
ఒక బొమ్మ గీయటం రాదు

లోలో నిండిన నీ మూర్తిని నే
హాయిగ గానం చేయాలంటే
ఒక పాట వ్రాయటం రాదు
ఒక పాట పాడటం రాదు

లోలో నిండిన నీ మూర్తిని నే
తృప్తిగ ఆరాధించాలంటే
ఒక మంత్రం నోటికి రాదు
ఒక పూజ చేయటం రాదు

లోలో నిండిన నీ మూర్తిని నే
అందుకనే కదలనీయక
తలపులతో బంధిస్తాను నా
మనుసులోనె బంధిస్తాను

10, అక్టోబర్ 2011, సోమవారం

ధ్యానం అనే మందు నూరటం

నిన్ను ధ్యానిస్తున్నాననుకొంటూ చాలా  పొరబడ్డాను సుమా
నిన్ను ధ్యానవిషయంగా  గ్రహించలేక పోతున్నాను కదా నేను
తెలియని విషయంపై తిప్పలు పడటం ధ్యానం కానే కాదుగదా
ఎలా యీ ధ్యానం చేయాలో యెంతకీ సరిగ్గా తెలియదాయెను

పుస్తకాల్లో నియమాలూ వ్యాఖ్యానాలూ పుష్కలంగా ఉన్నాయి
ధ్యానం గురించి అవి చెప్పేదంతా నాకు డొంకతిరుగుడుగా ఉంది
గురుపీఠాలెక్కిన వాళ్ళంతా గోలగోలగా చాలా చెబుతున్నారు
ధ్యానం గురించి  వారు వెప్పేది అంతా నాకు డొల్లడొల్లగానే ఉంది

నీకొక రూపం లేదే నిన్నెలా నేను ధ్యానం చేయాలో తెలియట్లేదు
నీకొక నామం లేదే నిన్నెలా నేను ధ్యానం చేయాలో తెలియట్లేదు
నీకొక గుణమూ లేదే నిన్నెలా నేను ధ్యానం చేయాలో తెలియట్లేదు
నీకొక చోటని లేదే  నిన్నెలా నేను ధ్యానం చేయాలో తెలియట్లేదు

స్థలకాలగుణనామరూపవికారాలు లేని నిన్నెలా ధ్యానం చేయాలి
కనురెప్పులు మూసుకున్నంతనే కనుమరుగవుతుందా యీ లోకం
మనసు కందని నిన్ను ధ్యానం చేస్తున్నానను కుంటే సరిపోతుందా
అటువంటి దొంగధ్యానం నీకు తృప్తి నిస్తుందా నాకు తృప్తి నిస్తుందా

నిజం నేనొప్పుకుంటున్నానని నువ్వు సంతోషపడితే సరిపోతుందా
నిజమైన ధ్యానం నాచేత నువ్వు చేయించుకొనేదేమన్నా అసలుందా
నాకెంత యిష్టమైనా నాకు చేతగాని యీ ధ్యానం నేనెలా చేయగలను
కాస్తంత నీ సహాయం గనక ఉంటే కావలసినంతగా చేయగలను గాని

లోకరుగ్మతలన్నింటికీ యీ ధ్యానం నిశ్వయంగా మంచి మందైతే
నీకు తెలిసిన ఆ మందు నూరటం నాక్కూడా కాస్త నేర్పించ కూడదా
దాని పుణ్యమా అని నేను లోకానికే దూరమై పోతానంటావా నువ్వు
అదే నాకు చాలనీ  అసలందుకే నా ధ్యానమనీ నే మొత్తుకుంటున్నా

6, అక్టోబర్ 2011, గురువారం

వెలుగులకే వెలుగు

వెలుగులకే వెలుగనగా వెలుగు వెలుగు యేది ఆ
వెలుగు తాను కొలువు  తీరు నిలయము పేరేది

మిలమిల తారకలు వెలవెల బోయేను
   ఆ వెలుగు ముందు నిలవ జాలలేక పోయేను
తళతళల చందమామ కళదప్పి నిలచేను
   ఆ వెలుగు ముందు నిలవ జాలలేక పోయేను
ధగధగల  సూర్యుడే తక్కువై తోచేను
   ఆ వెలుగు ముందు నిలవ జాలలేక పోయేను

అఖిలాండకోటి  బ్రహ్మాండములకు వెలుగు
   అంతులేని వెలుగు అది అసలు సిసలు వెలుగు
సరి సాటిలేని వెలుగు  అది పరంజ్యోతి వెలుగు
   అంతులేని వెలుగు అది అసలు సిసలు వెలుగు
జీవుని హృత్పద్మమున చేరి యుండు వెలుగు
   అంతులేని వెలుగు అది అసలు సిసలు వెలుగు

5, అక్టోబర్ 2011, బుధవారం

ఎఱుగ లేక

ఎఱుగ  లేక నిన్ను తుదకు శరణుజొచ్చినవి
పరమాత్యుని యింద్రియములు పట్టగల్గునే

కన్ను లేరీతి నిన్ను కనుగొన గలవు
నీ వెలుగుల వలన కాంచ నేర్చు నీ కనులు

వాక్కు లేరీతి నిన్ను వర్ణించ గలవు
ఓంకార జలధి తరగ లైన వీ  వాక్కులు

మనసు యేరీతి నిన్ను భావించ గలదు
నీవు నడిపించు నటుల నడచు నీ మనసు

4, అక్టోబర్ 2011, మంగళవారం

ఏ మన వలె?

నీవు చాల ఘనుడవని నే నెఱుగుదు నయ్య
నీ వింత వింత పనులు నే నెఱుగుదు నయ్య

అందమైన చందురుని అమరించి యాకసమున
అందు పెద్ద మచ్చను  వదలి నందు కేమన వలె

ఉర్వి మూడు వంతులు ఉప్పు సముద్రమును జేసి
తీయని నదులందు కలియ తోలినందు కేమన వలె

నీకు ప్రతిరూపులుగా నేలమీద నరుల నుంచి
మాయదారి త్రిగుణములు పట్టించితి వేమన వలె

3, అక్టోబర్ 2011, సోమవారం

దొంగా నిన్ను

దొంగా నిన్ను నేను తిరిగి పట్టుకున్నాను
విశ్వమెల్ల తిప్పి నా హృదయమందె దాగితివా
    దొంగా నిన్ను నేను తిరిగి పట్టుకున్నాను

మబ్బుల్లో కొంత తడవు మసలితివా వాటికి నీ
మెరుపులబ్బె గాని నిన్ను దాచలేక పోయినవా

తారలలో కొంత తడవు దాగితివా  వాటికి నీ
తళుకులభ్బె   గాని నిన్ను దాచ లేక  పోయినవా

నదులలోన కొంత తడవు నక్కితివా  వాటికి నీ
నడకలబ్బె  గాని నిన్ను దాచలేక పోయినవా

తరువులందు కొంత తడవు  దాగితివా వాటికి నీ
ధృడతగల్గె గాని నిన్ను దాచలేక పోయినవా

ఎందుపోయి దాగగలవు నీవే నేనైతి గాన
చిందులింక మాని నా చిత్తమందె  చేరకుండ

ఆడేమయా

ఇరువుర మొకటని నేను నీవును గాక
పరమాప్త యీ లోక మే మెఱుగు నయ్య
పరమ కృపాకర భావించి నీ లీల
నరవేషమును నేను నడిపింతునయ్య

వెచ్చని సూరీడు పచ్చని ప్రకృతి
ముచ్చట గొలొపే చందురుడు నీ
విచ్చట బహుదేహములలోన క్రీడింప
మెచ్చుచు గమనించుచున్నారయా
  నచ్చిన రీతుల నాడేమయా
  విచ్చిలవిడి మన మాడేమయా

నీపె కల్పింతువు నిఖిల జగములను
నీవె విధింతువు నియమములు
నీవె యాడించెడు నీవె యాడెడు నట్టి
భావించ తులలేని యాటలకు
  భవసాగరమున  నాడేమయా
  అవలీలగ మన మాడే మయా