21, సెప్టెంబర్ 2011, బుధవారం

తపస్సు

ఎక్కడికో పోయి తపస్సు చేసుకోవాలని యెప్పుడూ అనుకోలేదు
ఎక్కడికి పోయి కళ్ళూ ముక్కూ మూసుకోవడం నిరుపయోగం
బంధుమిత్రుల నుండి యెక్కడికైనా పారిపోవచ్చునేమో
బంధించి బాధించే పంచేంద్రియాలనుండి పారిపోగలనా
ఈ జన్మ చాలించి నేనెగిరి చక్కాపోయినా యివి మాత్రం
పై జన్మలోనూ నా మీద పడి పెత్తనం చేస్తాయి వదలక
ఈ మాయా ప్రపంచం నిజానికి ఒక పెద్ద చిలకల బోను
యేమూలకు పోయి కూర్చున్నా పంజరంలో చిలక బందీయే
ఆ మాత్రానికి అక్కడికీ ఇక్కడికీ పరుగెత్తి సాధించేది లేదు
యేమీ లాభంలేదు గాభరా పడినా యెగిరి గంతులేసినా
ఈ యింద్రియాలని  చితగ్గొట్టి యేమీ కార్యం లేదు యెప్పటికీ
మాయల దెయ్యంలాంటి మనస్సును లొంగదీసుకోవాలి తప్పక
అది కాస్తా దగ్ధబీజం లాగా మాడేటట్లు చెయ్యటమే తపస్సు
అదేదో అడివికిపోయి కాదు అందరి మధ్యనుండే చేయవచ్చు